నా జీవన యానంలో- రెండవభాగం- 32
-కె.వరలక్ష్మి
2003లో హైదరాబాదులో ఉన్నప్పుడు రంగనాయకమ్మ గార్ని కలవడానికి వెళ్ళడం
ఒక మరిచిపోలేని జ్ఞాపకం. నా బాల్యం నుంచీ నేను ఆవిడ రచనలకు అభిమానిని, వారి ఎడ్రస్ కి ఎలా వెళ్ళాలో తెలీక జగదీశ్వర్రెడ్డిని అడిగితే తను తీసుకెళ్ళేడు. మాతో అతని భార్య రోజా కూడా వచ్చింది. అప్పటికి వారి ఇంట్లో రంగనాయకమ్మ గారి చెల్లెళ్ళు కమల నాయకమ్మ, అమల నాయకమ్మ కూడా ఉన్నారు. “మీ జీవరాగం, మట్టి బంగారం పుస్తకాల లోని కథలు చదివి మా ఇంట్లో అందరూ మీ అభిమానులు అయిపోయేరు” అంటూ ఆహ్వానించేరు రంగాజీ. మేము అక్కడున్నంత సేపు మాతోనే స్పెండ్ చేశారు. ఇల్లంతా తిప్పి చూపించేరు. కమల గారు, అమల గారు అయితే “మీ కథలు చదువుతుంటే మన ప్రాంతంలో మన మనుషులతో ఉన్నట్టే ఉంటుంది” అంటూ అవ్యాజ్యమైన అనురాగాన్ని కురిపించేరు.
వెంటవెంటనే ఉప్మా, పుచ్చకాయల ముక్కలు, సపోటా పళ్ళు, బొప్పాయి పండ్లు
గేప్ లేకుండా పెడుతూనే ఉన్నారు. రోజాను “మీ ఆయన పేరు చివర రెడ్డి అని పెట్టుకున్నాడు కదా, నువ్వు రెడ్డమ్మవా” అంటూ ఆట పట్టించారు.
సాయంకాలం గాంధీ కోడలు నళిని వచ్చాక వాళ్ళను చూసి మాట్లాడి తిరిగి వచ్చాం.
వచ్చే ముందు ఒక రచయిత్రి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించి, “ఆమె కథలకన్నా మీ కథలు ఎంతో గొప్పవి” అన్నారు.
హైదరాబాద్ నుంచి ఇంటికొచ్చాక అతని పనుల బిజీలో పడి చూసుకోలేదు కానీ అతనికి పెన్షన్ రావడం లేదు. దాని కోసం ఓ ఫైల్ తయారు చేయించి పంపించాలని తెలిసింది. GIS గురించి లెటర్ వచ్చింది. నాకు ఏమీ అర్థం కాక ఏలేశ్వరం వెళ్ళి H.M కుసుమ కుమారిని కలిస్తే S.R. తెస్తే చేస్తానంది. DEO ఆఫీస్ కి వెళ్ళమంది. కాకినాడ DEO ఆఫీసుకి వెళ్తే వాళ్ళేమో డిప్యూటీ DEO ఆఫీస్ కి పిఠాపురం వెళ్ళమన్నారు. వెళ్తే వాళ్ళేమో నా ఫోన్ నెంబర్ తీసుకుని మేము హైదరాబాద్ కి ఫోన్ చేసి చేయించాలి “అయ్యాక చెప్తాంలెండి” అని పంపించేశారు.
2003 జూలై 30 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తను పుట్టి పెరిగిన ఊరు. ఊళ్ళో గోదావరి. మోహన్ కి ఆ ఊరు రాజమండ్రితో విడదీయలేని అనుబంధం. తనకి బాగాలేక గాని, తన వారాంతాలన్నీ అక్కడే గడిచేవి. ఇక రెండు రోజుల్లో పుష్కరాలు ముగుస్తాయి అనగా తనని రాజమండ్రి తీసుకెళ్ళి పుష్కరాలు చూపించమని అడిగేడు. ఆగస్టు 9 ఉదయాన్నే టాక్సీలో తీసుకెళ్ళేను.
ఆర్ట్స్ కాలేజ్ దగ్గరే ఆపేస్తున్నారు మా వైపు నుంచి వెళ్ళిన వెహికల్స్ ని. ముందు రోజే ఫోన్ చేసి చెప్పడం వలన G.V.B. వాళ్ళ కజిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్న మధుసూదన రావు గారు వచ్చి మా కారులో ఎక్కేరు. ఎక్కడా అభ్యంతరం చెప్పనీయకుండా మాతోనే ఉండి అన్నీ తిప్పి చూపించేరు.
ముందుగా దేవిచౌక్ లోంచి పుష్కరాలరేవులోకి వెళ్ళి గోదావరి స్టేషన్ కాంపౌండ్ లో కారు ఆపి, పుష్కరాల కోసం కొత్తగా తయారు చేసిన అతి పెద్ద శివలింగాన్ని, షవర్ పూల్ ని చూసాం. స్నాన ఘట్టంలో ఇసుక వేస్తే రాలనంత జనం. రోడ్ల పైన గొప్ప జన ప్రవాహం. తిరిగి వెనక్కి వచ్చి అటు చర్చి రోడ్డు నుంచి ఇటు ధవళేశ్వరం వరకు దొరికిన రోడ్డల్లా పట్టుకుని ఊరంతా చూసాం. మధ్యలో దొరికినదేదో తింటూ, కాఫీలు తాగుతూ. విమెన్స్ కాలేజ్ కాంపౌండ్ లో టెంపరరీగా కట్టిన ఆలయాల సముదాయాన్ని చూసాం. పొద్దు వాలుతున్న వేళకి గౌతమి ఘాట్ లోని VVIP ప్రదేశానికి వెళ్లేం. వాలంటీర్లు చక్రాల కుర్చీ తెచ్చి మోహన్ ని తీసుకొచ్చారు. ఉరకలెత్తి అంచుల్ని ఒరిసి ప్రవహిస్తున్న నిండు గోదావరి పైన వెన్నెల కురిపిస్తున్న శుక్ల ద్వాదశి చందమామ. ఏదో తెలియని తాత్వికమైన అనుభూతికి లోనయ్యాను నేను. థర్డ్ పేజ్ లైట్లతో కిరణాల్తో అలంకరించబడి పట్టపగల్లా వెలిగిపోతున్న రాజమండ్రినీ, గోదావరినీ వదలలేక వదిలి వెనుతిరిగాం. ఆర్ట్స్ కాలేజీ దగ్గర దిగి వీడ్కోలు తీసుకున్న మధుసూదన్రావు గారికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆగస్టు 10 అర్ధరాత్రికి పుష్కరాలు ముగిసాయి.
నా పెళ్లైన మొదటి సంవత్సరం వచ్చిన పుష్కరాల్లో స్టూడెంట్స్ గా నేను, మోహన్ స్టేడియంలో జరిగిన మెడికల్ కేంపులో వాలంటీర్లుగా పని చేశాం. 36 ఏళ్ళకు తిరిగి ఆ వైభవాన్ని అలా కళ్ళల్లో నింపుకొన్నాం.
మా ఇల్లు కట్టుకునేటప్పుడు L.I.C లోన్ కి అప్లై చేయడానికి నా పేరున, మోహన్ పేరున రెండు పాలసీలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రీమియం డబ్బులు నేనే కడుతూ ఉండేదాన్ని. అప్పు తీరిపోయాక కట్టడం ఆపేసాను. ఏదో కాయితాలు చూస్తూ ఉంటే ఆ పాలసీ పేపర్లు దొరికాయి. అయిదారేళ్ళ పైనే కట్టాను కాబట్టి, కట్టిన డబ్బులు రావాలి. వెంటనే పెద్దాపురం L.I.C ఆఫీస్ కి వెళ్ళి కనుక్కుంటే అక్కడ ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. రెండు మూడు రోజులు తిరగ్గా, టైం అవగానే మీ పాత అడ్రస్ కి లెటర్ పంపించాం, మీరు రాలేదు, ఇప్పుడేం చేయలేం అన్నాడు మేనేజరు. పోనీ అని వదిలేద్దాం అనుకుంటే ఒక్కొక్కళ్ళ పేరునా 26 వేలు పైనే కట్టాను. ఏం చేయాలో తోచక మా వారి కజిన్, పత్రికా విలేఖరి మొల్లి సూర్యనారాయణ గారికి చెప్పాను. ఆయన ఏం చేశారో, ఎలా చేశారో గానీ ఫోన్ చేసి పిలిచి పది రోజుల్లో డబ్బులు ఇచ్చేశాడు మేనేజరు.
కథ2002 ఆవిష్కరణ నవంబర్ 9న రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో జరిగింది. దాంతో పాటు వి. చంద్రశేఖర రావు ‘మాయాలాంతరు’, శివారెడ్డి గారి ‘మోహనా మోహనా’ కూడా. చాలా మంది రచయితలు వస్తారని తెలుసు. మోహన్ ని వదిలి వెళ్ళటం వీలుపడటం లేదు. అందుకని మా ఇంటి వెనుక ఎయిర్టెల్ టవర్ లో పనిచేసే భాస్కర్ అనే అబ్బాయిని అడిగాను. రోజుకి 400 ఇమ్మన్నాడు. సరే అని మోహన్ కి కావల్సిన ఫుడ్ మొత్తం వండి పెట్టేసి వెళ్ళేను.
ఇక అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిన ఆ అబ్బాయికి అప్పగించి వెళ్ళే దాన్ని. 2003 నవంబర్ 25న కాకినాడలో చెట్టుకవి ఇస్మాయిల్ కాలం చేశారు. మోహన్ పెన్షన్ పని కాలేదు. డిసెంబర్ 8న మళ్ళీ పిఠాపురం వెళ్ళేను. ఈ సారి డిప్యూటీ DEO ఆఫీసులో UDC షరీఫ్ నా చేత హామీ లెటర్ రాయించుకుని మోహన్ సర్వీస్ రికార్డు ఇచ్చి ఏమేం చేయాలో చెప్పాడు. ఆ సర్వీసు రికార్డు చూడగానే దాన్ని తయారు చేయించడానికి నేను పడిన పాట్లు, ఖర్చు చేసిన డబ్బు గుర్తుకొచ్చాయి. ప్రత్తిపాడు ట్రెజరీలో అడిగిన లంచం (మోహన్ రిటైర్ అయింది ఏలేశ్వరంలో కాబట్టి) గుర్తుకొచ్చింది.
సరే ఆ ఫైల్ పట్టుకెళ్ళి మోహన్ పని చేసిన కాలేజెస్ లో ప్రిన్సిపాల్ చేత GIS సంతకాలు తీసుకోవాలి. మొదటగా ఆలమూరు వెళ్ళేను రెండు బస్సులు, ఒక ఆటోలో ప్రయాణించి. అక్కడ స్టాఫ్ ఎంతో గౌరవంగా పలకరించి కావలసిన లెటర్స్ సంతకాలు చేయించి ఇచ్చారు. రెండవ రోజు కోరుకొండ వెళ్లేను. ప్రిన్సిపాల్ సూర్యకాంతం ఏ పని లేకపోయినా చాలా బిజీగా ఉన్నట్టు ఫోజు కొడుతూ సాయంకాలం ఆరు వరకు బయట కారిడార్ లో కూర్చోబెట్టేసింది. బాక్స్ తో కాస్త తిండి, మంచినీళ్ళు పట్టుకెళ్ళేను కాబట్టి బతికి పోయాను. కొంత డబ్బులు తీసుకుని, స్టాఫ్ అంతా వెళ్ళిపోయాక చేసి ఇచ్చింది.
వచ్చేటప్పుడు స్మైల్ గారిని (కథా రచయిత) చూడడానికి రాజమండ్రి సురక్ష హాస్పిటల్ కి వెళ్ళేను. రెండు రోజులు ముందు స్మైల్ సడన్ గా సిక్ అయ్యి కోమాలోకి వెళ్ళి పోయారని తెలిసింది. అక్కడ కృష్ణాబాయి గారు, వేణు గారు, హేమగారు ఉన్నారు. నా చేతిలో ఫైల్స్, అలసిన నా వాలకం చూసి కృష్ణాబాయి గారు అడిగితే జరిగింది చెప్పేను. “ఆడవాళ్ళంతా మంచి వాళ్ళని, తోటి స్త్రీల కోసం ఏమైనా చేస్తారనే భ్రమలో ఉంటాం మనం. కొందరు ఇదిగో ఇలాగే ప్రవర్తిస్తారు అన్నారావిడ. ICU లోకి ఎవర్ని ఎలౌ చేయక యాస్మిన్ గారినీ, అబ్బాయిని పలకరించి బస్సు పట్టుకుని ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి కావచ్చింది.
ఇంకో రోజు గోకవరం మీదుగా మారేడుమిల్లి M.D.O ఆఫీసుకెళ్లేను. M.D.O రంపచోడవరం ఆఫీసులో ఉంటారు అంటూ క్లర్క్ కుమార్ కావాల్సిన లెటర్స్ రాసి, స్టాంప్స్ వేసి ఇచ్చాడు. రంపచోడవరంలోనూ M.D.O లేరు. ఆయన కాకినాడ నుంచి వెళ్ళి వస్తారట. ఫోన్ చేస్తే “జగ్గంపేట మీదుగానే రోజూ వెళ్తాను నేను వచ్చి చేస్తాను” అంటూ నిజంగానే అలా వచ్చి చేసి ఇచ్చారు. తర్వాత ఏలేశ్వరం, జగ్గంపేటలో కూడా సంతకాలు తీసుకుని పిఠాపురం పట్టుకెళ్ళి డిప్యూటీ DEO ఆఫీసులో ఇచ్చి స్థిమితపడ్డాను. ఎలాగూ పిఠాపురం వెళ్ళేను కదా అని పెద్దాయన ఆవంత్స సోమసుందర్ గారి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చాను. చాసో అవార్డు కోసం జడ్జిమెంట్ కి నా ‘మట్టి-బంగారం’ బుక్కు సెలెక్ట్ చేశారట. కానీ ఆయన ప్రతిమ పుస్తకం సెలెక్ట్ చేశారట. నేను ఆయన ట్రస్ట్ కి చందా ఇవ్వలేదట. ప్రతిమ ఇచ్చిందట. “పోనీలెండి” అని నవ్వేసి వచ్చేసాను. కానీ మిగిలిన ఇద్దరు సెలెక్ట్ చేసినట్టున్నారు ‘మట్టి-బంగారం’ కే చాసో అవార్డు ఇస్తున్నామని నాకు లెటర్ వచ్చింది.
ఇన్ని గందరగోళాల మధ్య నా సాహిత్య వ్యాసంగం కొనసాగుతోంది. ఆ సంవత్సరం సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ వారు మొదటి పుస్తకానికి ఇచ్చే ఆర్థిక సాయం నా పోయెట్రీ బుక్ ‘ఆమె’కి ఇచ్చారు. డిసెంబర్ 30న జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ‘ఆమె’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మా మాస్టారు శ్రీ నూజిళ్ళ లక్ష్మీనరసింహంగారిని నా శక్తి మేరకు సత్కరించుకున్నాను.
జనవరి 2003 విపుల మాసపత్రికలో ‘రానిక నీ కోసం’ కథ; 19 సెప్టెంబర్ 2003
ఆంధ్రప్రభ వీక్లీలో ‘గమనం’ కథ, 2003 తానా విశేష సంచికలో ‘అతడు-నేను’ కథ,
నవంబర్ 23 రచన మంత్లీ లో ‘అనుకోని అతిధి’ కవిత ప్రచురింపబడ్డాయి.
‘ప్రేరణ కోసం నిరీక్షిస్తూ కాలం వృథా చేయొద్దు. రచనా కార్యక్రమం నిరంతరంగా సాగాలి. ప్రపంచాన్ని పరిశీలించి, స్పందించి వీలైనంత జ్ఞానాన్ని ఆర్జించడానికి ప్రయత్నించు. అలా చేయడం వల్లే ‘జీవిత దృక్పథం’ అనేది ఏర్పడుతుంది. ఎవరు నీ రచనల్ని తిరస్కరించినా, విమర్శించినా ఫరవాలేదు. నీకు నీ రచనల్లో అచంచలమైన నమ్మకం ఉంటే చాలు’ అంటాడు జాక్ లండన్.
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.