నిజమా.. ?
ఈ రోజు సుదినం.
లేచిన దినం మంచిదయింది. లేకుంటే..
తలుచుకుంటే గుండె దడదడ లాడుతున్నది అంటూ ఫోన్ మాట్లాడుతున్న సుగుణమ్మ.
రాత్రి పడుకునే ముందు వార్తలు పెట్టినప్పుడు ఏదో రైలు ప్రమాదం వార్త చూశాను. కానీ ఇంత ఘోరం అనుకోలేదు.
మన టైం, మన పిల్లగాళ్ళ టైం మంచిగున్నది. అందుకే రైలు తప్పిపోయింది అంటున్న సుగుణమ్మ మాటలు శోభకు అర్ధం కాలేదు.
చేస్తున్న పని ఆపి అత్త మాటలు ఆలకిస్తున్నది శోభ.
పొద్దున టీవీ పెట్టగానే ఏ ఛానల్ చూసినా రైలు ప్రమాదం వార్తలే. భీకరంగా ఉన్నది దృశ్యం. చూడ బుద్ది కాలేదు. కళ్ళ ముందు ముక్కలైన దేహాలు, వారు చేసే రోదనలే..
వాళ్ళ బాధ, వేదన అలవికానట్లున్నాయి.
వామ్మో.. ఆ బండిలో మన సరిత వాళ్ళు లేరు. అందుకేనేమో ఏదేమైనా మన మంచికే అంటారు” అన్నది సుగుణమ్మ.
కూరలు కోయడం ఆపి “ఏమైంది అత్తా” అనుకుంటూ అత్త దగ్గరకు వచ్చింది శోభ
మన సరళ ఫోన్.
సరిత, వాళ్ళాయన ఇద్దరూ కలకత్తా పోయినారట. సరిత ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని కలకత్తా నుంచి ఆన్లైన్ ల జాకెట్లు, డ్రెస్సులు తెప్పించి అమ్మిందని నీకు తెలుసు కదా. బిజినెస్ మంచిగున్నది. ఒక్కసారి పోయి చూసి కావాల్సినవి ఆర్డర్ చేసి ఇంకా ఏవో చీరల కోసం ఎక్కడెక్కడో పోయి తీసుకొని వచ్చేవరకు ఆలస్యం అయినదట.
స్టేషన్ కి వచ్చేసరికి కోరమాండల్ ట్రైన్ తప్పిపోయిందట. అయ్యో అని బాధ పడ్డారట. సరిత మొగుడు ఆఫీసుకు పోవాలి. సెలవు లేదని ఎక్కువ ఖర్చు అవుతున్నాయని బాధ పడుతూనే ఫ్లైట్ కి వచ్చారట.
అట్లా పెద్ద గండం తప్పిపోయింది. అదృష్టం మంచిగున్నది అన్నది సుగుణమ్మ.
అవునా ..
పెద్ద గండమే తప్పిపోయింది. లేకపోతే ఎట్లా ఉండేదో పరిస్థితి . తలచుకుంటేనే వళ్ళు గగుర్పొడుస్తున్నది అన్నది శోభ.
ముందు సరదాగా వెళ్ళినప్పుడు సరిత కొన్ని చీరలు తెచ్చింది. అవి చూసి అందరూ చాలా నచ్చాయని, తమకు కూడా కావాలని అడగడంతో ఇప్పుడు బిజినెస్ చేద్దామని భర్తను తీసుకుని కలకత్తా వెళ్ళింది సరిత.
మొన్న సరిత ఫోన్ చేసి అత్తా విష్ణుపురి, ముర్షిదాబాద్, సాంప్రదాయ బెంగాలీ టస్సార్ చీరల పై హ్యాండ్ ప్రింట్స్ , బాతిక్ ప్రింట్స్, బ్లాక్ ప్రింట్స్, డిజిటల్ ప్రింట్స్ , స్క్రీన్ ప్రింట్, కాంతా వర్క్, పెయింటింగ్స్, ప్యూర్ సిల్క్, టస్సార్ సిల్క్ ఏవి కావాలో చెప్పు అని అడిగింది.
నీకు నచ్చినవి తెస్తావు కదా. అందులోంచి నాకు నచ్చినవి నా కోసం ఉంచు అని చెప్పిన విషయం తలచుకుంటూ తన పనుల్లో నిమగ్నమై పోయింది శోభ.
***
సాగే నదీ ప్రవాహం లాంటి జీవితంలో కొన్నింటిని కలుపుకుంటూ కొన్నింటిని వదిలేస్తూ ఉంటాం.
కానీ బాల్యంలో గడిచిన ప్రతి క్షణాన్ని అనుభూతులుగా మార్చుకుంటాం. గోడమీద పటం వేళ్ళాడేసినట్టు గుండె గూటిలో స్నేహబంధాల చిత్రపటం వేలాడుతూనే ఉంటుంది. ఏళ్ళు గడిచినప్పటికీ పోగేసుకున్న జ్ఞాపకాల అనుభూతుల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ నాటి స్వచ్ఛమైన, అరమరికలు లేని స్నేహం అపురూపమైనది. అద్భుతమైనది అనుకుంటున్న శోభ చుట్టూ నవ్వులు మిణుగురులై ఎగురుతూనే… .
ఇప్పటిలాగా మొహాలకు ముసుగులు వేసుకుని, మాటలకు వెన్నపూసి మాట్లాడే కాలం, వయసు కాదది. ఎవరికి వారు వాళ్ళలా ఉన్నాం. ఈ ముప్పై ఏళ్ళ కాలం జీవితాల్లో తెచ్చిన మార్పుల్లో భాగంగా కొందరు ఊళ్ళు, రాష్ట్రాలు, దేశాల సరిహద్దులు దాటి ఉండ వచ్చు. జీవన స్థాయిల్లో, హోదాలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. అయినా కులాలుగా, మతాలుగా, పార్టీలుగా, పేద ధనిక వర్గాలుగా చీలిపోని మరకల్లేని ఆ నాటి స్నేహం కోసం దివిటీతో వెతుక్కుంటూనే… .
అలాంటి స్నేహం సహచరుడిలో/సహచరిలో అందితే.. ఆ జీవితమంతా నిండు పున్నమి జాబిలిలా వెలిగిపోతుందేమో!
సహచరుడు ఈ పదం నాకు కొత్తది. గతంలో ఎప్పుడు విననిది. నిషి అమెరికా వెళ్ళాక పరిచయం చేసిన పదం, ఒట్టి పదమేనా?! నిషి జీవితంలోకి వచ్చిన సహచరుడు ఎలాంటి వాడై ఉంటాడు? మదిలో తెరలు తెరలుగా సాగే ఆలోచనల్లోంచి కూతురు నిషి దగ్గరకొచ్చి ఆగాయి శోభ ఆలోచనలు.
నిషి సహచరుడు ఎలాంటి వాడో? మంచి స్నేహితుడు, మంచి ప్రేమికుడు, మంచి మనసున్న వాడు అయితే సరే.
ఒకవేళ కాకపొతే..?
నిన్న మొన్న అంతకు ముందు సహజీవనం పేరుతో అమ్మాయిలు నిండు జీవితాన్ని ఘోరాతి ఘోరంగా కోల్పోయిన వార్తలు కళ్ళ ముందుకొచ్చి భయకంపితు రాలిని చేశాయి.
సహజీవనంలో ఆనందంగా జీవిస్తున్న జంటల విషయం అసలు బయటి వారికి తెలియదు. ప్రపంచం పట్టించుకోదు. కానీ, చిన్న సమస్య వచ్చినా భూతద్దంలో చూస్తూ డప్పు కొట్టి ఊరువాడ మాత్రమే కాదు ఇంటింటికి చాటింపు వేస్తుంది లోకం. అంతేనా తప్పొప్పులు ఎవరివైనా సహజీవనంలో ఉన్న ఆడపిల్లనే వేలెత్తి చూపుతుంది. తప్పు పడుతుంది లోకం. ఆమెది వివాహేతర సంబంధంగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకిలా? ఏమిటిదంతా?
ఒక ఆడ, ఒక మగ కలిసి సహజీవనంలోకి ప్రవేశిస్తే తప్పంతా ఆడవారి మీదకి తోసేస్తారేంటో .. ఎంత అన్యాయం.
మొన్న శ్రద్దా వాకర్ తో సహజీవనం చేసిన సాహిల్ మతం వేరు కాబట్టి అతన్ని తప్పు పట్టారు. లవ్ జిహాద్ పేరిట అమ్మాయిలను ట్రాప్ చేసి అంతం చేస్తున్నారని అన్నారు. సాహిల్ స్థానంలో సాయి ఉంటే .. ప్రజలు ఎలా స్పందించేవారు వ్యక్తుల కులం, మతం, ప్రాంతం, వర్గం, జెండర్ ఆధారంగా నేరస్థులుగా ముద్రవేయడంలో, నేరస్థులుగా మార్చడంలో సమాజం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా అనిపిస్తున్నది శోభకు.
సహజీవనం అంటే సమాజానికి అంత వ్యతిరేకత ఎందుకో.. ఇతర దేశాల్లో కూడా ఇలాగే ఉంటుందా? మనదేశంలో మాత్రమే ఉంటుందా? కుటుంబ వ్యవస్థలో కొన్ని లోటు పాట్లు ఉన్నట్లే సహజీవనంలోనూ ఉంటే ఉండొచ్చు. అట్లాగని తీసిపారేయ్యాల్సినంత అధ్వాన్నమైన పద్దతిగా అనిపించడం లేదు. నా కూతురు సహజీవనంలో ఉందని ఆ విధంగా ఆలోచిస్తున్నానా .. ఏమో .. !
సహజీవనంలో ఎవరికి మరొకరితో జీవితం నచ్చకపోయినా సులభంగా ఎవరికి వారే జీవించవచ్చని నిషి చెప్పింది. మరి సహజీవనంలో ఉన్న అమ్మాయిని ముక్కలు ముక్కలుగా ఎందుకు నరికేసి కాకులకు గద్దలకు ఎందుకు విసిరేసినట్టు? కుక్కర్ లో ఉడకేసినట్లు? అసలు సమాజం అంత హింసాత్మకంగా ఎందుకు తయారవుతున్నది? నేరపూరితమైన ఆలోచనలు, ప్రవర్తన ప్రజల్లో ఎందుకు పెరిగిపోతున్నాయి? బాధ్యులు ఎవరు? అనేక ప్రశ్నలు… ఆ ప్రశ్నల్లోంచే, ప్రేమలాగే హింస కూడా మానవ స్వభావమే.. కదా అని సమాధానం.
పరిపరివిధాల సాగుతున్న శోభ ఆలోచనలోకి కావేరి చొచ్చుకొచ్చింది. ఈ మధ్య కావేరిలో కొద్దిగా మార్పు వచ్చిందని, పనిమీద వచ్చే రమేష్ తో చనువు కొంత పెరిగిందని, అతను ఆమె అంటే చాలా ఇష్టం చూపుతున్నాడు. ఇద్దరు పెళ్ళి చేసుకుంటే బాగానే ఉంటుంది. పిల్ల తల్లిని పెళ్ళి చేసుకుంటాడో లేదో .. అతని కుటుంబం ఒప్పుకుంటుందో లేదో..
లేదంటే వయసులో ఉన్న ఒంటరి పిల్ల బతుకు ఆగమవుతుందని, ఒక్కసారి కావేరి రమేష్ లతో మాట్లాడమని రామవ్వ చెప్పిన విషయం గుర్తొచ్చింది. వేరే పనుల్లో పడి ఆ విషయం మరచిపోయింది. రేపు తప్పనిసరిగా ఇద్దరితో మాట్లాడాలి. వెంటనే మొబైల్ నోట్ లో రేపు చేయాల్సిన పనుల్లో రాసి పెట్టుకుంది శోభ.
అంతం లేకుండా దశదిశలా సాగుతున్న ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ
“ఇదెక్కడి చోద్యమే తల్లీ.. హంతకుడిని, ప్రేమించిన ఆ పిల్లను ఒక్క గాట కడుతు న్నారు. ఆమెది వివాహేతర బంధం ఎట్ల అవుతుంది. ఆ పిల్లకు మొగుడే లేడు. వాడికి పెండ్లాం పిల్లలు ఉన్నారు. అతనిది కదా వివాహేతర బంధం” అన్నది టీవీలో ఓ సంఘటన చూస్తున్న సుగుణమ్మ
అత్త ఈ మధ్య కొత్తగా కనిపిస్తున్నది. ఆమె మాటలు కొత్తగా వినిపిస్తున్నవి అను కుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నది శోభ.
“ఏం… ఏమైంది అట్లా చూస్తావ్? ఈ టీవీలు, ఫోన్లు కూడా మనుషులను నాశనం పట్టిస్తున్నాయి. కట్టుబాట్లను కాట్లో కలుపుతున్నాయి.
అటు చూడు ఆ తండ్రి ముచ్చట విను.. వివాహేతర సంబంధం పెట్టుకున్న కొడుకు తప్పే చేయడంటున్నాడు. నిత్యం పూజలు, పునస్కారాల్లో ఉండే కొడుకు అన్నదానం చేస్తాడట. చాలా గొప్పవాడట. అన్నదానం చేస్తే మంచోడయిపోతాడా?
కంటికి నదరుగా కనిపించిన ఆడపిల్లను మాటలతో మాయ చేసి గర్భాదానం చేయడ మేనా వాడి మంచి… థూ .. ” అసహ్యంగా చూస్తూ అన్నది సుగుణమ్మ.
హంతకుడి తండ్రి మాత్రమే కాదు అతని కులం, మతం అతన్ని రక్షించుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నది. హత్యని మాత్రం తప్పు పట్టడం లేదు. సమాజం ప్రవర్తన చాలా ఇబ్బందిగా ఉన్నది.
హతుడి తండ్రి మాట్లాడుతున్న మాటలు, భాష వినలేక ఛానెల్ మార్చింది సుగుణమ్మ. అన్ని ఛానెళ్లలో అదే వార్త లైవ్ ఇస్తున్నారు.
ఈ ఛానల్ వాళ్ళు రేటింగ్ పెంచుకోవాలనే తాపత్రయం తప్ప బాధ్యత ఉండదా?
బాధితురాలినే నేరస్థురాలిని చేసి సమాజానికి ఏమి చెబుతున్నాయి ఈ చానెళ్ళు. రేపటి రోజున మగపిల్లల ప్రవర్తన ఎంత దిగజారిపోతుందో. ఆడపిల్ల పై జరిగే దాష్టీకానికి అడ్డు అదుపులేకుండా పోదూ .. సహజీవనంలో ఆడపిల్ల సమస్యలు మరింత ఎక్కువ. పిల్లలు ఉంటే వారికి మరింత ఇబ్బందే కదా. మగాడు సహజీవనం ఇష్టం లేక దులుపుకు పోతే .. మరొకరితో జీవితం పంచుకుంటే .. అప్పుడు వారి పరిస్థితి?
వివాహ వ్యవస్థలో లేని భద్రత సహజీవనంలో ఉంటుందా? అనుకుంటున్న శోభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
పెళ్ళిలో తను బావుకున్నది ఏంటి?
“ప్రేమ పేరుతో ఆ పిల్లతో దేశమంతా ఎట్లా తిరిగొచ్చాడో.. కోరిక తీర్చుకున్నాడు. ఆమె పెండ్లి అనంగనే పొట్టన పెట్టుకున్నాడు. ఆడ, మగ ఎవ్వరూ కట్టుబాట్లకు విలువ ఇవ్వడం లేదు. అడ్డు అదుపులేని విశృఖలత్వం పెరిగిపోతున్నది గొణుక్కుంటూ ఏదో పాటల ఛానల్ పెట్టింది సుగుణమ్మ
పచ్చని సంసారం – చక్కని సంతానం పాట వస్తున్నది. ముందు ముందు పచ్చని సంసారాలు ఉంటాయా.. తలెత్తిన ప్రశ్నను లోపలి మనిషి సవాల్ చేస్తూ మహా తల్లీ .. నువ్వేం చేశావో మర్చిపోయావా?
కొడుకు ప్రేమించిన ఆమెను కాదని అన్న బిడ్డని కోరి కోరి కోడలిగా చేసుకున్నావ్. ఏదీ ఎక్కడ నీ కొడుకు పచ్చని సంసారం? అంటూ చెర్నాకోలతో చెంప మీద చెళ్ళు మనిపించింది.
ఆమె గుండె వేగం పెరిగింది. మొహం మీద చెమటలు.. చీర చెంగుతో తుడుచు కుంటూ కోడలి వైపు చూసింది. డైనింగ్ టేబుల్ సర్ది శుభ్రం చేస్తున్నది. కోడలి పై మమకారం ఆమె గుండె నిండా నిండింది. కోడల్ని చూస్తుంటే తప్పు చేసిన భావన సుగుణమ్మను మెలి పెడుతున్నది. ఇక అక్కడ ఉండలేక నెమ్మదిగా లేచి తన గదిలోకి నడిచింది.
* * * * *