పరిశుభ్రతకు పచ్చదనానికి మారుపేరు – సింగపూరు

-డా.కందేపి రాణి ప్రసాద్

          ఏప్రిల్ 28వ తేది రాత్రి 11.20 ని లకు సింగపూర్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో సింగపూర్ బయల్దేరాం. ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ తనిఖీపూర్తయి విమానంలో ఎక్కాం. ఇది సింగపూర్ ఎయిర్ లైన్స్ వారి విమానం కాబట్టి ఎయిర్ హోస్టెస్ ల దుస్తులు భిన్నంగా ఉన్నాయి. ఇందులో 540 మంది ప్రయాణికులు పడతారట. చాలా పెద్దదిగా ఉంది. ఒక్కో వరసకు మూడు సీట్ల చొప్పున మూడు వరుసలు ఉన్నాయి. నేనూ, మావారూ కూర్చున్నా క ఇంకో సీటు ఖాళీగా ఉన్నది. చేతి బరువులు పైన పెట్టేసి సీటు బెల్టులు కట్టుకుంటు న్నాము. ఇంతలో సినిమా ఆర్టిస్ట్ గుమ్మడిగారు వచ్చి మా ప్రక్కసీట్లో కూర్చున్నారు. ఆయనను చూస్తే ఇంత మామూలుగా ఉన్న ఈయనలోనేనా అంత పెద్ద నటుడు దాగి ఉన్నాడు అనిపించింది. తలెత్తి చూస్తే వెనుక, ముందు ప్రక్క సీట్లలో రోజూ వెండితెర, బుల్లితెర మీద కనిపించే సినిమా కళాకారులే ! బహుశా అక్కడేదైనా కళాప్రదర్శన ఇచ్చేందుకు వెళుతున్నారేమో! మొత్తానికి వీళ్ళందరితో కలసి ప్రయాణం చేయడం గమ్మత్తుగా ఉంది. ఇక్కడ నుంచి సింగపూర్ కు ప్రయాణం నాలుగన్నర గంటలు. మనకన్నా సింగపూర్ సమయం రెండున్నర గంటలు ముందుగా ఉంటుంది. కాబట్టి మేము 29వ తేది ఉదయం 6 గంలకు సింగపూర్ లోని ‘చాంగీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు’ చేరుకున్నాం. ఫెరిరా పార్కు దగ్గర్లోని న్యూపార్కు హోటల్లో దిగాం. ఇది 25 అంతస్తుల భవనం. ఈ హోటల్ కు వెనుకే ‘ముస్తఫా సెంటర్’ అనే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది. ఇది ఇరవైనాలుగు గంటలూ తెరిచే ఉంటుంది. ఇది మొత్తం తిరిగి చూడాలంటేనే వారం రోజులు పట్టేటట్లున్నది. దీని వెనకే ‘అన్నపూర్ణ రెస్టారెంట్,’ అని ఒక ఆంధ్రా హోటల్ ఉన్నది. మేం సింగపూర్లో ఉన్నన్ని రోజులు అక్కడే ఉన్నాం.
సింగపూర్లో ప్రధానంగా ఆకర్షించేవి రోడ్లు, రైళ్ళు, ఎత్తైన భవనాలు. ఇక్కడ ఎక్కువ శాతం చైనీయులు నివసిస్తారు. తరువాతి స్థానం తమిళులది. ఇక్కడ మంచినీటి వనరులు, కరెంటు లేదు. అన్నీ ప్రక్కదేశాల నుంచి తెచ్చుకోవడమే. రోడ్లు నున్నగా విశాలంగా, చక్కగా ఉంటాయి. ఈ రోడ్ల అందాన్ని చూస్తూ వాటికి బీట్ కొడుతూ ఆశ్చర్యంగా రోడ్లపక్క కదలక మెదలక నిలబడి పోయినట్లున్నాయి వీధిదీపాలు. వీటి అందాల్ని ఫోటో తీయడానికా అన్నట్లు రోడ్ల మీద కెమెరాలు అమర్చి ఉంటాయి. ఎక్కడా చిన్న కాగితం ముక్క కూడా కనిపించకుండా రోడ్లన్ని పరిశుభ్రంగా ఉంటాయి. అన్నిచోట్లా అందుబాటు లో డస్ట్ బిన్స్ ఉంటాయి. ఎవరైనా రోడ్ల మీద చెత్తను పడేస్తే ఫైన్ వేస్తారు. అన్నింటి కన్నా ముఖ్య విషయం అక్కడి రోడ్లను చిన్న పిల్లవాడైన సులభంగా దాటేయవచ్చు,. మనకు లాగే అక్కడ కూడా రోడ్లు దాటగలుగుతాం. జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. ఇక్కడ జీబ్రా క్రాసింగ్ దగ్గర కూడా కష్టంగా రోడ్డు దాటగలిగితే. అక్కడ జీబ్రా క్రాసింగ్ లేని చోట కూడా దాటాలని ప్రయత్నిస్తే కార్లు ఆపేసి పాదచారులకు సహకరిస్తారు ప్రజలు. ఏదైనా వాహనం రోడ్డుమీద ఆగిపోతే వెనుక వాహనాల డ్రైవర్లు హారన్ కొట్టకుండా నీరీక్షిస్తారు. కనీసం మొహంలో విసుగు, అసహనం కూడా కనిపించవు. ఇలాంటి విషయాలు మనం వాళ్ళ వద్ద నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందనిపించింది. ఇక రైళ్ళ విషయానికి వస్తే రైళ్ళు నిమిషానికొకసారి వస్తాయి. ఇక్కడి రైల్వే స్టేషన్లను ఎం.ఆర్.టి. స్టేషన్లు అంటారు. ఇవన్నీ భూగర్బంలోనే ఉన్నాయి. భూమి నుండి దాదాపు 30, 40 అడుగుల కింద ఉన్నాయి. రైళ్ళు ప్లాట్ ఫారం రెండూ సమానమైన ఎత్తులో ఉండటం వాళ్ళ రైలు ఎక్కుతుంటే ఒక రూము నుండి మరో రూములోనికి వెలుతున్నట్లు అనిపించింది. టికెటింగ్, రైళ్ళు అన్నీ ఆటోమాటిక్. రైలు తలుపులు అవే మూసుకుంటాయి. అవే తెరుచుకుంటాయి. రైల్వే స్టేషన్లో ఎక్కేవాళ్ళు తప్ప సిబ్బంది ఎవరూ కనిపించ లేదు. టికెట్ కౌంటర్ వద్ద సింగపూర్ మ్యాప్ ఉన్నది. అందులో ఎం.ఆర్.టి. స్టేషన్లు గుర్తింపబడి ఉంటాయి. మనం ప్రస్తుతం ఉన్న స్టేషన్, వెళ్లవలసిన స్టేషన్ ప్రెస్ చేస్తే, ఎంత డబ్బులు చెల్లించాలో స్క్రీన్ మీద వస్తుంది. నోట్లు ఒకవైపు, చిల్లర ఒకవైపు వేయాలి. ఇక్కడి కరెన్సీ డాలర్. డబ్బులు చెల్లించిన తరువాత టికెట్ వస్తుంది. మనం ఇక్కడ బరువుతూచే యంత్రం రూపాయి వెయ్యగానే టికెట్ వచ్చినట్లు. ఫ్లాట్ ఫాం మీదకు ఎవరూ వెళ్లకుండా అడ్డంగా ఇనుపకమ్మిలు ఉంటాయి. మనం కొన్న టికెట్ ఇక్కడ పంచ్ చేస్తేనే ఆ ఇనుప కమ్మిలు అడ్డం తొలగి దారి ఇస్తాయి. అందులోంచి వెళ్ళి మనం రైలు ఎక్కాలి. స్టేషన్ రాగానే తలుపులు తెరుచుకుంటాయి. మనుషులు ఎక్కగనే మరలా మూసుకుంటాయి. రైలు ఎక్కిన తరువాత ఇప్పుడున్న స్టేషన్ పేరు, రాబోయే స్టేషన్ పేరు కంప్యూటర్ చెపుతూ ఉంటుంది. తరువాతి స్టేషన్ ఏదో ఈ స్టేషన్ లోనే తెలుస్తుంది. కాబట్టి దిగే వారికి హడావిడి ఉండదు. ఇంకా కొత్తవారికి సమస్య ఉండదు. రైలులో సీట్లు ఆధునికంగా ఉండి ఏదో హోటల్లో కూర్చునట్లు అనిపిస్తుంది. 1965 దాకా బ్రిటిష్ పాలనలో ఉంది స్వాతంత్య్రం పొందిన ఈ దేశం అతి తక్కువ కాలంలో ఇంత అభివృద్ధిని సాధించిందంటే వారి కార్యదీక్షను మెచ్చుకోవలసిందే.
 
          63 చిన్న చిన్న దీవుల ‘సమహారమే సింగపూర్’. సింగపూర్ ద్వీపాల్లోని నాలుగు పెద్ద ద్వీపాల్లో ‘సెంటోసా’ ఒకటి. దీని గురించి తరువాత వివరిస్తాను. సంపన్న దేశమైన సింగపూర్ జనాభా నాలుగు మిలియన్లు. ప్రతిరోజూ సింగపూర్ ను దర్శించే యాత్రికులు లక్ష మందట. అందుకే సింగపూరంతా షాపింగ్ మాల్సే కనిపిస్తాయి. ‘అర్చర్డ్’ ఏరియా అంతా షాపింగ్ కాంప్లెక్స్ ల మయం. అందులో ‘టికషిమాయా’ ‘ప్లాజా’ చాలా ప్రసిద్ది. మరియమ్మన్ దేవాలయం ఇక్కడ ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం. సింగపూర్లో అధికారిక భాషలు నాలుగు ఇంగ్లీషు, మాలే, తమిళ, చైనీస్.
 
          సముద్రం మధ్యలో ‘మెర్ లియాన్’ బొమ్మను పెట్టారు హైదరాబాదులో మన బుద్ధ విగ్రహం పెట్టినట్లు. ‘మెర్ లియాన్’ అంటే సింహం తల, చేపతోక ఉన్న ఆకారం. అసలు సింగపూర్ అన్న పేరు ‘లయన్ సిటీ’ అన్న పేరు నుండి వచ్చిందట. ‘సిఎంగా’ అంటే సింహం, ‘పూర్’ అంటే పురం అనగా సింహాల ఊరు అన్నమాట. అక్కడే పనసకాయ ఆకారంలో ఒక బిల్డింగ్ కనిపించింది. సూర్యగమనాన్ని ఆధారం చేసుకొని నిర్మించారట దాన్ని. ఆ బిల్డింగ్ లోపలకు వెలుతురు వస్తుంది. కానీ ఎండరాదట. అది మనకు పనసకాయలా కనిపించిన దాని పేరు ‘డురియన్’ అట. అది అక్కడ లభించే పండు.
రాఫీల్స్ ఏరియాలో చేతి వేళ్ళలా ఐదు ఎత్తైన భవనాలు ఉన్నాయి. సర్ ధామస్ స్టామ్ ఫర్ట్ రాఫిల్స్ అనే అతను మొదటిసారిగా దీవిని కనుగొన్నాడట. అక్కడే ఒక ఫౌంటెన్ కూడా ఉన్నది. ఈ ఫౌంటెన్ దగ్గర చాలా సినిమా పాటలు షూటింగ్ చేశారట. దానిప్రక్కనే ఉన్న ఒక షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళాం. అందులో మనం ఎప్పుడు చూడని రకరకాల పండ్లు కనిపించాయి. కొన్నిటిని తిని చూడండి అంటూ చేతికిస్తున్నారు. ఇందాకటి డూరియన్ ఫ్రూట్ కనిపించిదిక్కడ. ఆ తరువాత మా మిత్రులతో కలసి చైనీస్ ఆహారం తిన్నాం. ఫ్రై చేసిన వెజిటబుల్స్, క్యాబేజీ సూప్ ఇచ్చారు. బ్రెడ్ తో వందల రకాల చిప్స్ తయారు చేస్తున్నారు. అందులోనే తయారుచేసే విభాగం కూడా ఉన్నది. కొన్నిటిని రుచి చూశాము. చాలా బాగున్నాయి. ఇక్కడ ఆహారం ఆర్డర్ చేస్తే ఆహారం మాత్రమే ఇస్తారు. మంచినీళ్ళు ఇవ్వరు. అక్కడి వాళ్ళు మంచినీళ్ళు తాగరట. సూప్ తో సరిపెట్టుకుంటా రట. మనలాంటి వాళ్ళెవరైనా వెళితే వాటర్ బాటిల్ కొనుక్కోవాలి.
 
          అన్నింటికన్నా ముఖ్యమైనది ‘సెంటోసా’ అనే ఎంటర్ టెయిన్ మెంట్ పార్క్. దీనికి వెళ్ళే దారిలో ‘హార్బర్స్ – ఫంట్’ అని వస్తుంది. రోడ్డు మీద నుంచి చూస్తే పెద్ద పెద్ద ఓడలు సరుకులు నింపుకుంటూ, దింపుతూ గుంపులుగా కనిపిస్తుంటాయి. సెంటోసాలో దిగిన తర్వాత లోపల ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి బ్లూలైన్, రెడ్ లైన్, గ్రీన్ లైన్ అనే బస్సులు ఉంటాయి. ఇవన్నీ కూడా అయిర్ కండిషండే. సెంటోసా లో అండర్ వాటర్ వరల్డ్, డాల్ఫిన్ లాగూన్, బటర్ ఫ్లై అండ్ ఇన్సెక్ట్ పార్కు, ఫ్లవర్స్ క్లాక్ ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి తిరిగి చూడడానికి చాలా సమయం కావాలి. కేబుల్ కార్లో ఒక కొండ మీద నుంచి మరొక కొండ మీదకు వెళ్ళడం అనేది చాలా సరదగానూ ఉంటుంది. అంతే స్థాయిలో భయంగానూ ఉంటుంది. సెంటోసాలో మ్యూజికల్ ఫౌంటెన్. లేజర్ షో చూసితీరవల్సిన అంశం. మామూలుగా సినిమాలో సంగీతానికి అనుగుణంగా హీరో హీరోయిన్లు డ్యాన్సులు చేస్తుంటారు. కానీ ఇక్కడ వచ్చే మ్యూజిక్ కు అనుగుణంగా నీళ్ళు, రంగు రంగుల లైట్ల మేకప్పులతో డ్యాన్సులు చేస్తుంటాయి. ఇది చాలా అద్బుతం వర్ణించశక్యం గాదు.
 
          సింగపూర్ లో టెక్నాలజీ ఎంత ఎక్కువ ఉన్నా వాళ్ళు ప్రకృతిని వదులుకోలేదు. ఆకాశాన్నంటే భవనలతో పాటు ప్రక్కనే వాటితో పోటీ పడుతూ పెరిగిన చెట్లున్నాయి. ఫ్లై ఓవర్లకు కూడా వేలాడుతూ అల్లుకొనేతీగలున్నాయి. ఎక్కడ చూసిన పచ్చదనంతో మెరిసిపోతూ మన బెంగుళూరును గుర్తుకు తెచ్చింది. రోడ్లెమో విశాలంగా, పరిశుభ్రంగా, రోడ్డుకిరువైపులా ఆకుపచ్చ చీరల పై పువ్వుల ఎంబ్రాయిడరీలాగా చెట్లు చూడముచ్చట గా ఉన్నాయి. సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు చాలా మంది ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చుకున్నారు. మీరేంటండీ ఖాళీ సూట్కేసులతో వెళ్తున్నారు అని అడిగారు ఎయిర్ పోర్టులో. మా సూట్కేసులు ఖాళీగానే ఉన్నాయి. కానీ ఆ అనుభూతులతో మనసంతా పట్టక ఉక్కిరిబిక్కిరౌతూ ‘చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు’ నుండి ‘రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు’ లోనికి అడుగుపెట్టాం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.