పూలమ్మ (కథ)

– ములుగు లక్ష్మీ మైథిలి

          సంధ్యా సమయం. అప్పుడే విచ్చుకుంటున్న మల్లె పూలను దండలుగా కట్టి, అమ్ముకోవడానికి వీధిలోకి వచ్చింది సీతవ్వ. అనారోగ్యంతో మంచం పట్టిన భర్తకు చేదోడు వాదోడుగా ఉండటానికి పూల వ్యాపారం మొదలుపెట్టింది. ప్రతీరోజూ ఇంటి ముందున్న మల్లె, కనకాంబరాలు, చామంతుల మొక్కలకు ప్రతీరోజూ నీరు పోసి, ఎరువు వేసి పెంచుతుంది. సాయంత్రం సమయానికి పూలు మాలలుగా కట్టటం కోసం మధ్యా హ్నం నుంచే  అన్ని రకాల పూలతో మాలల కట్టి పెడుతుంది. అసలే మాఘమాసం ప్రారంభమైంది. పెళ్ళిళ్ళ సీజన్ వల్ల పూల ధరలు అందరూ పెంచేస్తున్నారు. తాను కూడా ఇంకో ఇరవై రూపాయలు ఎక్కువ వస్తాయని, కొన్ని రోజులు మల్లెపూలు మూర యాబై రూపాయలు పెట్టి అమ్ముదామనుకుంది. ఇలాగైనా తన భర్త మందులకు సరిపడా డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంది. 
 
          అప్పుడే బైక్ మీద అటుగా వెళుతున్న ఒక జంట… పూల బుట్ట పట్టుకుని నిలబడి ఉన్న సీతవ్వను చూసి ఆగారు. 
 
          “అవ్వా! మూర ఎంత?” అడిగారు వాళ్ళు.
 
          “మూర యాభై రూపాయలు” మొదటిసారిగా రేటు పెంచినందుకు ఏమనుకుంటారో, అసలు కొనుక్కుంటారో లేదో” అనుకుంటూ చెప్పింది సీతవ్వ.
 
          “యాభై రూపాయలా ? మా కొద్దు మేము వేరే చోట కొనుక్కుంటాం ” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
 
          మరి కొద్దిసేపటికి ఇద్దరు మహిళలు అటుగా వెళుతూ… సీతవ్వను చూసి “మల్లె పూలు మూర ఎంత? ” అని ప్రశ్నించారు.
 
          “యాభై రూపాయలు” 
    
          “అదేంటి? పక్క వీధిలో మూర పదిరూపాయలే. పైగా పూలు బాగా విచ్చుకున్నాయి. ఏం బాగాలేవు.” అంటూ అక్కడి నుంచి ఆ ఆడవాళ్ళు వెళ్లిపోయారు.
   
          ‘భర్తకు అన్నం పెట్టిన తర్వాత తాను కూడా తినకుండా సమయం సరిపోదని మంచి ఎండలో మొగ్గలుగా ఉన్నప్పుడే ఒక్కొక్క పువ్వు జాగ్రత్తగా కోసి, పూలు కట్టి, వాడి పోకుండా తడిగుడ్డతో కప్పి ఇలా సాయంత్రం అయ్యాక తీసుకొస్తాను. మొగ్గలు విచ్చుకో లేదు. ఈ పూల వెనుక ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకేం తెలుస్తుంది. వారు కోరిన రేటుకు ఇవ్వలేదని ఒక్క మాటతో పూలు బాగా లేవని వెళ్లిపోయారు’ అనుకుంటూ బాధపడింది సీతవ్వ.
 
          అలా మరి కొందరు ఏదో వంకతో పూలు కొనకుండా వెళ్ళిపోయే సరికి దిగులు వేసింది సీతవ్వకు.
 
          వారు వెళ్ళి పోగానే ‘అయ్యో. నేను రోజూ అమ్మిన పది రూపాయలకే అమ్మేసినా బాగుండేది. పొద్దు పోతోంది, త్వరగా వెళ్ళి ముసలాయనకి అన్నం తినిపించాలా, ఈసారి ఎవరు అడిగినా పది రూపాయలకే అమ్మేస్తాను, అందరూ వచ్చి కొంటే, పూలు అమ్ముడు పోతాయి’ అనుకుంది సీతవ్వ.
 
          కాసేపటికి ఒక కారు వచ్చి సీతవ్వ ముందు ఆగింది. అందులో నుండి కొత్తగా పెళ్ళయిన జంట కిందికి దిగారు. 
 
          “పూలమ్మా! పూలు మూర ఎంత?” అడిగింది కొత్త పెళ్ళి కూతురు. 
 
          ‘మూర యాభై రూపాయలు అంటే వీళ్ళు కూడా కొనకుండా వెళ్ళి పోతారేమోనని’
 “పది రూపాయలు” అని చెప్పింది పూలమ్మ.
 
          “అదేంటి పూలమ్మా! అందరూ యాభై రూపాయలు చెపుతున్నారు. నువ్వు కూడా అదే ధర పెట్టుకోవచ్చు కదా ” 
 
          “నిజమే కానీ యాభై రూపాయలు అంటే ఎవరూ కొనడం లేదు… అందుకని” అంటూ తన భర్త అనారోగ్యం గురించి, అప్పటి దాకా పూల రేటు గురించి కొందరు మాట్లాడిన మాటలు చెప్పింది సీతవ్వ.
 
          “పూలమ్మా! నువు ఎప్పుడూ అలా ఆలోచించవద్దు. పెద్ద పెద్ద మార్కెట్ లలో ఫిక్స్డ్ రేట్ అంటారు. ఆ రేటుకే ఈ జనాలు ఏ బేరాలు చేయకుండా నోరు మూసుకుని కొను క్కుంటారు. అక్కడ వాళ్ళు ఖరీదు చెప్పరు ఒక స్టిక్కర్ మీద ఆ వస్తువు ధర రాసి అతికి స్తారు. మన వాళ్ళు దానికెంతయినా ఖర్చు పెడతారు. మీ లాంటి వారి దగ్గర మాత్రం గీచి గీచి బేరమాడతారు. అలాంటిది నువు ఇంకా ఇలా అమ్మితే, నీకు ఏం లాభం ఉంటుంది చెప్పు. అందుకే మీలాంటి వాళ్ళు ఇంకా రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళు ఎ.సి గదుల్లో ఉన్నారు. సరే…  నేను ఇక్కడ దగ్గరలోని గుడిలో ఉన్న మా బంధువు పూజారితో మాట్లాడ తాను, ప్రతి రోజూ పూలను ఆ దేవాలయానికి వెళ్ళి అమ్ముకోవచ్చు, నీకు ఇలా వీధుల వెంట తిరిగే పని ఉండదు. ప్రతి నెలా నీకు డబ్బు వచ్చేలా నేను ఏర్పాటు చేస్తాను. నీ భర్తను నువు దగ్గరే ఉండి చూసుకోవచ్చు “అంటూ సీతవ్వ దగ్గర ఉన్న పూలన్నీ కొనేసిం ది పెళ్ళి కూతురు.
 
          సీతవ్వ చాలా సంతోషపడింది. పూలను తీసుకుని, డబ్బు చేతిలో పెట్టిన ఆ కొత్త జంటను మనస్ఫూర్తిగా దీవించింది సీతవ్వ.

*****

Please follow and like us:

One thought on “పూలమ్మ (కథ)”

  1. లక్ష్మీ మైధిలి గారి పూలమ్మ బావుంది.. చిరువ్యాపారులు ఎదగలేక పోవడానికి గల కారణం వారి అమాయకత్వం, నిజాయితీ . అభినందనలు అండి.

Leave a Reply

Your email address will not be published.