పేషంట్ చెప్పే కథలు – 16

నీళ్ళు

ఆలూరి విజయలక్ష్మి

          నీళ్ళు! నీళ్ళు! నీళ్ళ కోసం పేట పేటంతా గగ్గోలెత్తిపోతుంది. అప్పుడే రెండు రోజులుగా మంచినీళ్ళ ట్యాంకర్ కోసం చూసిచూసి ప్రాణం కడగట్టిపోతూంది. ఏ హార్న్ వినిపించినా టాంకర్ వస్తూందని ఆశగా చూసి, కాదని నిర్ధారణ కాగానే నిరాశతో తమ దురదృష్టాన్ని తిట్టుకుంటున్నారు. 

          గౌరీ మాటిమాటికి నాలుకతో పేదాన్ని తడుపుకుంటుంది. ఎండి పగిలిన పెదాలు తడి తగలగానే మండుతున్నాయి. రెండు రోజులుగా స్నానం లేక ఒళ్ళంతా చీదరగా వుంది. ఎప్పుడో మధ్యాహ్నం తిన్న నాలుగు మెతుకులు, ఆకలితో నకనకలాడి పోతూంది కడుపు. అత్తా, భర్త తినకుండా తాను తింటే అత్త వడ్డించే తిట్లు, శాపనార్థాలు తలచుకొని కొంచెం మంచినీళ్ళన్నా తాగుదామని కుండ మీద మూతతీసింది. ఒక్క బొట్టుకూడా లేకుండా కడిగిపెట్టినట్లుగా వున్నాకుండను చూడగానే గౌరీ ప్రాణం వుసూరుమంది. గొంతుకార్చుకు పోతోంటే ఓర్చుకోలేక ఎదురింటి నరసమ్మను కాసిన్నీల్లు బదులడిగింది. 

           “పిల్లా జిల్లా లేనిదానివి నీ యింట్లోనే లేకపోతే మా ఇళ్ళల్లో ఎక్కడుంటాయి నీళ్ళు గౌరీ! తెల్లారి లేచిందగ్గర్నుంచి బంగారంలా దాచుకున్నా ఎట్లాగోట్లా పట్టుకుపోయి పారబోస్తారు పిల్లసన్నాసులు.” నరసమ్మ యింకా తన అశక్తతను ఏకరువు పెడుతూ ఉండగానే కాళ్ళీడ్చుకుంటూ యింటికి చేరింది గౌరీ. 

          “ఎక్కడికెళ్ళావే పెత్తనాలకు? నీళ్ళ బొండొస్తుందని అంతా బిందిల్తీసుకుని లగేత్తుతూంటే నువ్వు అక్కడ సొల్లుకబుర్లు చెప్తూ కూర్చున్నావా?” అప్పటిదాకా ఊరిమీద పడి తిరిగొచ్చిన గౌరి అత్త నాంచారమ్మ కోడలివంక గుడ్లురిమి చూసింది. నీరసంతో కాళ్ళు తేలిపోతున్నా నీళ్లబండొస్తోందనే సరికి కొండంత సంబరంతో బిందె తీసుకుని వెళ్ళింది గౌరీ. అప్పటికే కొండవీటి చాంతాడంత వుంది ‘క్యూ’. బలవంతులు వెనకొచ్చినా ‘క్యూ’లో ముందర జొరబడుతున్నారు. కొట్లాటలు, కుమ్ములాటలు, కక్కుర్తి… రోజూ చూస్తున్న భాగోతమే అయినా ఈ రోజు అసహనంగా గమనిస్తూంది గౌరీ. 

          “ఏం బతుకులో! గుక్కెడు మంచి నీళ్ళక్కూడా నోచుకోని దరిద్రపు బ్రతుకులు. ఏ మళ్ళూ మాన్యాలూ, సిరులూ, సంపదలూ, భోగభాగ్యాలూ లేకపోతె మానె. గొంతు తడుపుకొంటానికి నీళ్ళన్నా లేకపోతె యెట్లా ఈడ్చేదీ పాడుబ్రతుకు?…” దుఃఖంతో గౌరీ గొంతు గురగురలాడింది. 

          “ఏదో బావుకు తిందామని నాలుగు కుంచాల చేను కౌలుకు తీసుకున్నాం. అప్పుచేసి నాట్లేస్తే నీళ్ళచుక్క లేక నేల నెర్రిచ్చి పంట మలమల మాడిపోయింది. గొడ్లూ గోదా డొక్కలెండి పోయి నోళ్లు తెరచుకుని చొంగలు కారుస్తున్నాయి. కడుపున పుట్టిన పిల్లల్ని సాకినట్లు సాకినా గొడ్లను ఆటి కర్మానికాటి నొదిలేసి పొట్టపట్టుకునిక్కడికి వచ్చాము. రిక్షాతొక్కి రెండు డబ్బులు తెస్తే పిల్లల్లకు గంజికాచి పొయ్యడం గగనమవుతాంది. ఎప్పటికా వానదేవుడికి దయకలుగుతుందో, ఎప్పటికి మా కష్టాలు గట్టెక్కుతాయో!’ హృదయ విదారకంగా విలపిస్తూ చెపుతూందో ఇల్లాలు. 

          “మనకు తిండిలేక పోయినా, గొంతుకలెండి పోయి చస్తున్నా ఎవడికి పడుతుందండీ? పట్టించుకోవలసిన దొంగరాస్కెల్స్ అందరికీ ఎవడి పదవి వాడికి, ఎవడి సింహాసనం వాడికి చల్లగా ఉంటే చాలు. ఎందరు ప్రభువులు మారినా మన అద్వానపు బ్రతుకులు మాత్రం మారవు.” కడుపు మండిన ఒకతను ఆవేశంగా అంటున్నాడు. 

          “కొంచెం ఖాళీ అయింది. నడవ్వే గౌరీ ముందుకు.” చంకలోంచి జారిపోతున్న బిడ్డను పైకి తీసుకుంటూ గౌరిని అదిలించింది కాంతం. కాంతం చేతిలో బిడ్డను చూడగానే గౌరీ హృదయం మీద వర్షపు చుక్క జారిపడినట్లుగా చిన్ని గిలిగింత కలిగింది. ఈ రోజు సెంటర్ లో డాక్టరమ్మ తన చెవుల్లో అమృతం పోసింది. ఇన్నేళ్ళకు తన కడుపు పండి కష్టాలు తీరబోతున్నాయి. ఇన్నాళ్ళూ పిల్లలు పుట్టలేదని అత్త రాచిరంపాన పెడతాంది. ఈ గొడ్డుమోతుదాన్ని వదిలేసి నా కొడుక్కు మళ్ళీ పెళ్ళిచేస్తానని బెదిరిస్తోంది. అత్తా అట్లా అన్నపుడల్లా తాను భయంతో గజగజ వణికిపోతోంది. తనకు ఓ చిన్నారి పాపాయి పుట్టాకేగాని అమ్మ మాటకు వంతపాడే ఆయనగారెదుట తలెత్తి నిలబడేందుకు శక్తి రాదు. ఆప్యాయంగా పొట్టమీద చేత్తో తడుముకుంది గౌరీ. 

          తాను బిడ్డ నెత్తుకున్నాక నీళ్ళు పుష్కలంగా దొరికే చోటికి పోదామని ఆయనతో చెప్పాలి. కరువుదీరా స్నానం చేసి, కడుపు నిండా నీళ్లు తాగగలిగేచోట యింకా ఏ సుఖాన్నీ కోరుకోకుండానైనా బ్రతుకుదామని చెప్పాలి”- గౌరీ ఆలోచనల్లో ఉండగానే నీళ్ళ ట్యాంకర్ వచ్చింది. ఒక్కసారిగా ‘క్యూ’ చెల్లాచెదరయి, బలాబలాలు చూసుకుంటూ తోసుకుని ముందుకు వెళ్ళి నీళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తోపులాటలు, జుట్టుపట్లు, బిందెలతో యుద్ధం. క్షణంలో బీభత్సంగా మారిపోయింది. ఇటు బయటకు రాలేక, అటు నీళ్ళు పట్టుకోలేక తాపులు, తోపుళ్ళు భరిస్తూ భయంతో, కంగారులో తబ్బిబ్బు పడిపోతూంది గౌరీ: ఇంతలో ఆ తోఫుల్లాటలో అకస్మాత్తుగా ఎవరో వచ్చి గౌరీమీద పడడంతో ముందుకు తూలిపడింది. చేతిలోని బిందె క్రిందపడి దానిమీద గౌరీపోట్ట బలంగా నొక్కుకు పోయింది. 

          రక్తంతో తడిసిన గౌరిని స్పుహలేని స్థితిలో హాస్పిటల్ కు చేర్చారు. గర్బస్రావమయి పోతూంటే పిండాన్ని తీసేసి రక్తం ఎక్కించాక గౌరికి తెలివొచ్చింది. 

          “నాకేమయింది డాక్టరమ్మగారూ? నా బిడ్దకేం కాలేదుగదా?” హీన స్వరంతో ఆతృతగా అడిగింది గౌరీ. 

          “ఏమీ అవలేదు. అంతా బాగానే వుంది. నువ్వు విస్రాంతిగా పడుకోవాలమ్మా!” గౌరీ చూపుల్ని తప్పించు కుంటూ జవాబిచ్చింది డాక్టర్ శృతి. 

          “నిజంగానా అమ్మగారూ!” అపనమ్మకంగా పొట్టను తడుముకుంది గౌరీ. తన బ్రతుకు, భవిష్యత్తు తన బిడ్డమీద ఆధారపడి వున్నాయి. దానికేమన్నా అయితే తన బ్రతుకు కడగండ్ల పాలవుతుందన్న నిజం ఆమెను భయవిహ్వలురాల్ని చేస్తూంది. 

          కూతుర్ని చూచి గొల్లుమన్న తల్లి ఏడుపు విని తృళ్ళిపడ్డా గౌరికి డాక్టరమ్మ తనకు సరైన సమాధానం చెప్పకుండా ఎందుకు తప్పించుకు వెళ్లిపోయిందో అర్థమయింది. గౌరీ కడుపులో నుంచి దుఃఖం కడలి పొంగులా ఉవ్వెత్తున కదిలి వస్తూంది. కన్నీళ్ళకు కరువు లేకుండా జలజలా రాలి ఆమె గుండెల్ని తడుపుతున్నాయి.

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.