వ్యాధితో పోరాటం-18
–కనకదుర్గ
“ఇపుడు ఇన్ని సమస్యలు, ఇన్ని ట్రీట్మెంట్లు వచ్చాయి. మా సమయంలో అయితే కాన్పు కాగానే పిల్లగానీ, పిల్లవాడ్ని గానీ ఇంట్లో వున్న పెద్ద వారికి అంటే అత్తగారికి అప్ప చెప్పి పొలంకి వెళ్ళి పని చేసే వాళ్ళం తెలుసా?” అంది.
నేను ఇలాంటి కథలు వినే వున్నాను. చైతన్య కడుపులో వున్నపుడు అత్తగారింట్లోనే వుండేవారం. శ్రీనివాస్ అమ్మమ్మ వుండేవారు. ఆమె చాలా జాగ్రత్తగా మా మామగారు, శ్రీనివాస్ ఆఫీస్ లకు వెళ్ళిపోయాక నన్ను నానా మాటలు అనేది. కట్నం లేకుండా చేసు కోవడానికి నేనేమి అంత అందగత్తెని కాదు, పెద్ద చదువు లేదు, సంపాదన లేదు అని ఊరికే అంటుండేది. నాలో ఓపిక నశించి ఒకరోజు, “నేను మీ మనవడికి సరైన జోడి కాదను కుంటే, డబ్బులు కుమ్మరించలేదనే బాధ మీకుంటే నేను వెళ్ళిపోతాను, మీ ఇష్టంవచ్చిన వారితో, లక్షల కట్నం తీసుకొని మళ్ళీ పెళ్ళి చేసేయండి. నాకేం అభ్యంతరం లేదు. ” అనిఖరాఖండిగా చెప్పేసాను.
దాంతో దిమ్మ తిరిగింది అమ్మమ్మ గారికి. మర్నాటి వరకు ఏం మాట్లాడలేదు. శ్రీని ఆఫీస్ కి వెళ్ళగానే, “నన్ను ఎన్ని మాటలన్నదే నీ కోడలు రంగమ్మా? నేనేమన్నా కిరసనాయిల్ పోసి తగలపెడదామన్ననా? అట్లా చేసే వాళ్ళంటే ఎంత అసహ్యం మనకు. ఏదో పెద్దదాన్నినోరూరుకోక చిన్న మాటంటే తనెళ్ళిపోతే మరో పెళ్ళి చేసుకొండి మీ మనవడికి అని అన్నది. మా దూరపు చుట్టం పిల్ల ఎంత అందంగా వుండేది, మంచి ఉద్యోగం, మంచి, మర్యాద, నన్ను, నిన్ను కూర్చోబెట్టి సేవలు చేస్తుండే ఆ పిల్ల అని అన్న అంతే కానీ అయిన పెళ్ళిని పెటాకులు చేయమంటనానే నేను. నీ కోడలెపుడు పుస్తకాలు చదువుకోడం, చిన్న చిన్న పనులు చేయడం మనతో సరిగ్గ మాట్లాడనే మాట్లాడ దు,” అని కూతురితో మొర పెట్టుకుంది. నేను వినీ విననట్టు వూరుకున్నాను.
నేను ప్రెగ్నెంట్ అయినపుడు ఒకరోజు మిక్సీలో పచ్చడి చేస్తున్నాను, కళ్ళు తిరిగి పడిపోయాను.
డాక్టర్ దగ్గరకు వెళితే మందలించింది. “దుర్గా, నువ్వు చాలా వీక్ గా వున్నావు. నువ్వింకా చిన్నపిల్లవి కావు, యూ ఆర్ ఏన్ అడల్ట్ నవ్. నీ గురించి నువ్వు కేర్ తీసుకో వాలి. నువ్వు సరిగ్గా తినకపోతే ఎలకంత పాప పుడ్తుంది, హెల్ధీ బేబీ కావాలంటే హెల్ధీ ఫుడ్ తినాలి. తెలిసిందా?” అని శ్రీని వైపు తిరిగి, “ఈ రోజు నుండి యూ ఆర్ రెస్పాన్సెబుల్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్,” అని చెప్పింది.
ఇంటికి రాగానే న్యూడుల్స్ లో ఎగ్స్ వేసి వేడి వేడిగా చేసి పెట్టాడు. మర్నాడు ఆఫీస్ కి వెళ్ళేపుడు పండ్ల రసం తీసి ఇవ్వమని చెప్పాడు.
ఇవన్నీ చూడలేక పోయింది అమ్మమ్మగారు,” ఇదేం విడ్డూరమే, మా కాలంలో అయితే ఇవన్నీ లేవు. పండ్లంట, పండ్ల రసాలంట, ఆకుకూరలట, వేడి వేడిగ ఫ్రెష్ గా టిఫిన్లంట. వున్నదేదో తినడం, కనడం అంతే కానీ, మాకు ఈ సుకుమారాలన్నీ తెలియ వమ్మా!” అని దీర్ఘాలు తీసేది.
ఒకరోజు నాన్న నన్ను చూడడానికి వచ్చారు. ఆ సమయంలో నేను భారతీయ విధ్యా భవన్ లో జర్నలిజం కోర్స్ చేయడానికి వెళ్ళాను. నాన్న నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు.
శ్రీని ఆఫీస్ నుండి నన్ను తీసుకుని రావడానికి వచ్చేవాడు.
ఇంట్లో అత్తగారు, మామగారు, అమ్మమ్మగారు, శైలు వున్నారు.
అత్తగారు నాన్నకి కాఫీ, టిఫిన్ చేసి పెట్టినట్టున్నారు. మేము రాగానే నాన్న సంతోషంగా మాట్లాడి, వెళ్ళెపుడు నా తల మీద చెయ్యేసి,” జాగ్రత్తగా ఉండమ్మా! ఈ సమయంలో సంతోషంగా ఉండాలి.,” అని అంటుంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
“నేను బాగానే వున్నాను నాన్న, నువ్వేం బాధ పడకు.” అన్నాను గేట్ వరకు వెళ్ళి.
కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్ళినపుడు నాన్న అక్క దగ్గరకి వెళ్ళాడు. అమ్మతో మాట్లాడుతుంటే, “కడుపు నిండా తింటున్నావా? ఇపుడు ఇద్దరికి సరిపడా తినాలి. నీ కిష్టమైనవి తినాలనిపిస్తే నాకు చెప్పు నేను చేసి తీసుకు వస్తాను, ఊళ్ళోనే కదా!” అన్నది.
నేను వచ్చేస్తుంటే అమ్మ ఏదో చెప్పాలని, చెప్పలేక పోతుందని అర్ధం అయ్యింది నాకు.
“ఏమ్మా ఏమయింది?” అని అడిగా.
“మనింట్లో మనమేమి కొనకుండా పళ్ళుండేవి, జామ పండ్లు, దానిమ్మ పండ్లు, మామిడి పండ్లు, కూరలు కూడా ఫ్రెష్ కూరలు ఇంటి చుట్టు పెరుగుతుండేవి. మిద్దెమీద కెక్కి సొరకాయలు, నేతి బీరకాయలు కోసేవాళ్ళు మీరు, నిమ్మకాయలు, పచ్చడి పెట్టేదాన్ని, అరటి పండ్లు రోజు ఇంటి ముందర కొనేవాళ్ళం. చిన్నపుడు నాన్న మీకు ఫ్రెష్ పాలు కావాలని గేదెలను తీసుకొచ్చి వాటి పని తనే చేసేవాడు. మీకన్నీ గుర్తుండే వుంటుంది కదా….”
“అన్నీ గుర్తున్నాయమ్మ. ఏమైంది అసలు చెప్పు?” అని చేతులు పట్టుకుని అడిగాను.
“ఏం లేదు, మొన్న నాన్న నిన్ను చూడటానికి వచ్చినపుడు….” అని ఆగిపోయింది.
“అవును వచ్చేసేపుడు నాన్న ఎందుకో బాధ పడ్తూ కనిపించాడు, ఏమైంది?”
“ఎవరేమన్నా నువ్వు పెద్దగా పట్టించుకోకు….నీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా వుండు…”
“అమ్మ! ఏమైందో చెప్పు ప్లీజ్..”
“ఆ కాలం వాళ్ళు అట్లానే అనుకుంటారు గానీ నువ్వు పట్టించుకోవద్దు… నువ్వు కోపం వస్తే తిండి మానేస్తావు, ఇపుడు అలా చేయకూడదు…”
“అమ్మా..” అని గట్టిగా అరిచాను.
“నువ్వు వీక్ గా వున్నావని డాక్టర్ ఆరోగ్యమైన ఆహారం తినాలని చెప్పిందని…ఆమె కాలంలో అట్లావుండేది కాదని, మనవడికి చాలా ఖర్చవుతుందని….ఏదో పెద్దావిడ కదా! నీకు కొద్దిగా ఏదైనా అల్లాడిపోయే వాళ్ళం కదా, ఆమె అట్లా అంటుంటే నాన్న తట్టుకోలేక పోయాడు అంతే.”
నాకు చాలా బాధనిపించింది. నాన్నతో అలా మాట్లాడతారా?
“ఆమె ఆరోగ్యమైన ఆహారం తినలేదు, ఇప్పట్లా డాక్టర్లు చెప్పేవారు లేరు కదా అపుడు అందుకే ఎంతో మంది పిల్లలని పుట్టక ముందే కోల్పోయింది, ఒక్క కూతురు బ్రతికింది, మా అత్తగారు. నాన్నకి చెప్పు ఆమె తీరే అంత, అలాగే మాట్లాడుతుంది. నేనేం చిన్న పిల్లని కాను ఇంకా, నా ఆరోగ్యం గురించి నేను పట్టించుకుంటానని. నువ్వు కూడా ఏం బాధ పడకమ్మా.” అని ధైర్యం చెప్పి వచ్చేసాను.
అందుకే నాకు పంజాబీ ఆవిడ అలా అంటే శ్రీని అమ్మమ్మగారి మాటలే గుర్తోచ్చా యి.
“దుర్గా! తుమ్హే మైనే మేరే షాదీ కే దిన్ క్యాహువాథాబతాయాక్యా?”
“నహీ. ఆప్ నే కభీబతాయానహీ, క్యాహువా?” అని అడిగాను.
“నన్ను పెళ్ళికూతురిని చేసారు, పెళ్ళి కొడుకు వాళ్ళు బయల్దేరారని చెప్పారు. పెళ్ళికి అన్నీ రెడీ చేస్తున్నారు. ఒక గంటయ్యాకపెళ్ళిబారాత్ ఇంకా రాలేదని అందరూ ఎదురు చూస్తుండగా వాళ్ళ స్నేహితుల్లో ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి పెళ్ళికొడుకు ఎక్కిన కారుకి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే పెళ్ళికొడుకు చనిపోయాడని….”
“అయ్యయో! అపుడు మీ వయసెంత ఆంటీ,” అని అడిగాను.
“పదహారేళ్ళు…పెళ్ళి ఆగిపోయింది. కానీ నాకెవ్వరూ ఏమి చెప్పలేదు. నేను బారాత్ రావడం లేటయ్యిందేమో అనుకున్నాను. ఎవ్వరిని అడిగినా చెప్పటం లేదు. మా అమ్మ కాసేపయ్యాక ఏడ్చుకుంటూ వచ్చింది. ‘నీకింక ఇపుడు పెళ్ళెట్లా అవుతుందే? ఇట్లా జరిగిం తర్వాత ఇక నిన్నెవరు పెళ్ళి చేసుకుంటారు,’ అని ఏడవసాగింది. నాకేం అర్ధం కాలేదు. ‘అమ్మా, ఏమయ్యిందమ్మా? ఎందుకట్లా అంటున్నావు,’ అని అడిగా. అపుడు మెల్లిగా అమ్మ చెప్పింది ఏం జరిగిందో. నా ప్రపంచం తల్లకిందులయి పోయింది. మేమిద్దరం ఏడుస్తూ కూర్చున్నాం. చాలాసేపయ్యాక మా నాన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. ‘ఏడుపులు ఆపి అమ్మాయిని తీసుకుని క్రిందకి పెళ్ళి మండపంలోకి తీసుకుని రా,’ అంటే మేమిద్దరం ఆయనకి మతి చలించిందనుకున్నాము. ఆయన అమ్మ ప్రక్కన కూర్చొని, ‘పిల్ల మామగారు, ఆయన రెండో కొడుకుని ఒప్పించాడు మనమ్మాయిని చేసుకోవడానికి. పిల్ల జీవితం పాడవుతుంది, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతే. పిల్లవాడు అమ్మాయికంటే కొంచెం చిన్నవాడు, పెళ్ళికి, ముందు ఒప్పుకోలేదు, నేనింకా చదువుకోవాలి, ఇపుడే పెళ్ళి చేసుకోను అన్నాడు, కానీ తండ్రి మాటకెదురు చెప్పే ధైర్యం లేదు, అందుకే ఒప్పుకున్నాడు. త్వరగా పిల్లని తీసుకుని రా!”
“ఇపుడేనా, అక్కడ పెద్దకొడుకు అంత్యక్రియలు కూడా కాలేదు…”
“వీళ్ళు ఇక్కడి నుండి వెళ్ళారంటే మన పిల్ల బ్రతుకు గంగపాలవుతుంది. అందుకే ఆ పెద్దాయన ఆడపిల్లలున్నాయన, మన పిల్లకి అన్యాయం చేయడం ఇష్టం లేదు. తొందరగా రా తల్లీ! తల్లీ, నీకిది పునర్జన్మ, వాళ్ళు నీకు జీవితానిస్తున్నారు, వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి. నీ జీవితం వాళ్ళ మంచి కోసం అంకితం చేసేయాలి,” అని చెప్పాడు.
“అట్లా జరిగింది పెళ్ళి. పెళ్ళయ్యాక నా భర్త చదువుకోవడానికి సిటీకి వెళ్ళిపోయాడు. నేను అత్తగారింటికి వెళ్ళాను. పొద్దున్నే లేచి ఇంట్లో వాళ్ళకిఛాయ్, నాష్తా అందరికీ చేసి పెట్టి, నేను ఛాయ్ తాగి ఇంట్లో పనులు కొన్ని చేసి, పొలం వెళ్ళడం, అక్కడ అందరితో పాటు నేనూ పని చేసుకుంటూ అందరూ సరిగ్గా పని చేస్తున్నారా లేదా చూసుకునేదాన్ని. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి జొన్న రొట్టెలు, రాజ్మా చేసి, అందరికీ భోజనం పెట్టి, నేను తిని మళ్ళీ పొలంకి వెళ్ళి సాయంత్రం వచ్చి అందరి బట్టలుతికి, ఆరేసి, వంట చేసి, అందరి భోజనాలయ్యాక అంట్లన్నీ కడిగి, వంటిల్లంతా క్లీన్ చేసుకుని పడుకునే దాన్ని. మా ఆయన చదువు అయ్యి వచ్చాక కాపురం మొదలు పెట్టాము. ముగ్గురు పిల్లలు పుట్టారు. మూడు కానుపులు మా ఇంట్లో కానుపులకి ఒక చిన్న రూమ్ వుండేది అక్కడే అయ్యాయి. నా పెద్ద కొడుకు పుట్టినపుడు కాన్పు కష్టం అయ్యింది. కానీ నేను ఓర్చుకున్నాను, అప్పటిదాక పొలంలో పని చేసొచ్చాను. మొత్తానికి కాన్పు అయ్యింది, కానీ పిల్లాడు చాలా వీక్ గా పుట్టాడు. చనిపోతాడను కున్నాము. కాన్పుఅయినా నేను పని చేయడం మానలేదు. పిల్లవాడికి పాలిచ్చి వెళ్ళేదాన్ని, మళ్ళీ వచ్చి పాలిచ్చే దాన్ని. నా అదృష్టం కొద్ది మూడో రోజు తర్వాత పిల్లవాడు కోలుకోసాగాడు. మా కాలంలో అలా వుండేది. ఇక్కడ మా కోడలి కాన్పు ఎంత సుకుమారంగా జరిగిందో! ఇప్పటి పిల్లలు మాలాగా కష్టపడటం లేదు, సున్నితంగా పెరుగుతారు, అన్నీ సున్నితంగానే చేస్తారు. కాలం మారింది.” అని ఆగింది ఆంటీ.
నన్ను కూడా అలాగే అనుకుంటుందేమో! ఏం అనుకున్నా నేనేం చేయలేను.
“అందుకే నువ్వు ఎక్కువ ఆలోచించకు బాధ పడకు. ఎందుకంటే ఇక్కడ హాస్పిట ల్స్ చాలా బాగున్నాయి, బాగా చూసుకుంటారు. మీ కుటుంబం ఇక్కడ లేరని ఏం బాధ పడకు. మేము వున్నాము కదా!” అని చెప్పింది.
కాసేపు కూర్చొని ఇంకా ఏవో కబుర్లు చెబుతూనే వుంది. ఇలాగే రోజు వచ్చేది ఆవిడ.
*****
(సశేషం)
నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.