కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-8

 -డా. సిహెచ్. సుశీల

          తెలుగు కథానిక ఉద్భవించి దాదాపు నూట పాతికేళ్ళు అవుతున్న కాలంలో, ఏ ప్రక్రియలోనూ రానంత విస్తృతంగా, విస్తారంగా “కథ” తన ప్రత్యేకతను ప్రతిభను సంతరించుకుంది. ఎందరో కథకులు వివిధ ఇతివృత్తాలలో, సమాజపు పోకడలను, జీవితాలను, జీవన విధానాలను, సమస్యలను బలంగా చిత్రించారు. 
 
          కొన్ని వేల మంది కథకులు రకరకాల కథావస్తువులను స్వీకరించి వైవిధ్యభరితంగా చిత్రించారు. కానీ రచయిత్రుల సంఖ్య చాలా తక్కువ. తొలినాళ్ళలో చదువుకున్న స్త్రీలే తక్కువ. వారిలో కూడా ‘కలం’ పట్టుకున్నవారు మరీ తక్కువ. వారు కూడా స్త్రీ విద్య, స్త్రీల హక్కులు, స్త్రీ స్వాతంత్య్రం, స్త్రీ పురుషుల సమానత్వం కోరుతూనో, పూజలు వ్రతాలు, అనుకూల దాంపత్యం గురించో ప్రబోధాత్మకంగా ఒకానొక పరిధిలో రచించిన వారే ఎక్కువ. కానీ, కథారచన మొదటి రోజుల్లో పాఠకుల్లో ఆసక్తి ని కలిగించి, వేలంవెర్రిగా చదివింపజేసినవి “సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ” కథలే.
 
          అలాంటి కథలు తొలి నాళ్ళలో రచయిత్రులు రాయలేదు. తర్వాత కాలంలో కూడా వేళ్ళమీద లెక్కించే సంఖ్య మాత్రమే ఉన్నారు.
 
‘తెలుగు లో తొలి హారర్ కథల’ రచయిత్రి ‘స్థానాపతి రుక్మిణమ్మ’
 
          1935లోనే తన 22 ఏళ్ళ వయసులో దెయ్యాల కథలు రాసి సంచలనం సృష్టించిన రచయిత్రి స్థానాపతి రుక్మిణమ్మ. విశాఖ పత్రిక, సత్యవాణి, ఆంధ్రవిద్యార్ధి వంటి పత్రికల్లో ప్రచురింపబడిన ఈ కథలను తర్వాత పుస్తకంగా వేసారు. ఇదొక సంచలనం సృష్టిం చింది. ఆ రోజుల్లో దెయ్యాల భూతాల కథలను రాయడం ఒక సాహసమనే చెప్పాలి.
 
          పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించిన రుక్మిణమ్మకు చిన్ననాటి నుండే కవితలు చదవడం, రాయడం పట్ల ఆసక్తి ఉండేది. 18 ఏళ్ళ వయసులోనే మొదటి కవితా సంపుటి వెలువరించారు. దేవీ భాగవతంను సాధారణ పాఠకులకు అర్ధమయ్యేలా సరళ భాషలో రచించారు. వేదాలు, ఉపనిషత్తుల నుంచి కొన్ని ఋక్కులను ఎంపిక చేసుకుని తాత్పర్య సహితంగా వచనరూపంలో రచించారు.
 
          అడపాదడపా హారర్ కథలను రాయాలనుకుని, తను విన్న సంఘటనలకు కొంత ఊహను జోడించి, స్థలాల పేర్లు పాత్రల పేర్లు మార్చి దెయ్యాల, భూతాల కథలను రాసా రు. దేవుని గురించి, దయ్యాల గురించి దీర్ఘమైన చర్చలు లేకుండా కేవలం వినోదా త్మకంగా సాగాయి. వాటిలో 12 కథలను కలిపి “దయ్యాలు” అని ఒక సంపుటిగా 1936 లో అద్దేపల్లి లక్ష్మణస్వామి, సరస్వతీ గ్రంథ మండలి, రాజమహేంద్రవరం వారు అచ్చు వేసారు.
 
 ఘనాపాఠి
         
          ముగ్గురన్నదమ్ముల్లో కడపటి వాడు సర్వమంగళుడు. నెలల పిల్లవాడిగా ఉన్న ప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో అన్నావదినలే దిక్కయ్యారు. పనీపాటా లేక తినడం, తిరగడమే కాక అక్షరం ముక్క అబ్బలేదు. ఒకరోజు వదినల తిట్లు, అన్నల మౌనంతో నొచ్చుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. తిరిగి తిరిగి కాశీ పట్నం చేరాడు.
 
          “కాశీ మహాపట్నం. కృష్ణ పక్షము. అర్ధరాత్రి. వీధులు కళా విహీనములు. నక్షత్ర కాంతి తప్ప మరి ఏ కాంతి లేదు. ఎక్కడో మినుకు మినుకు మంటూ దీపాలు అవసాన కాలాన్ని తెలుపుతున్నాయి. అంచేత దీపాలు లేనట్టే లెక్క. ఆ వీధి చాలా కాలం నుండి తుడిచినట్టు కూడా లేదు. గబ్బిలాలు కీచు కీచుమంటున్నాయి… గోడలనంటి తిరుగుతూ ఉన్న అదృశ్య వ్యక్తుల సడి… వీధిలో మధ్య మధ్య మహా వృక్షాలు… ఉండి ఉండి నక్కల ఊళలు… గాలి… గంగాభవాని కెరటాల హొరు వినిపిస్తుందప్పుడప్పుడు. ఇరువైపులా మహోన్నత సౌధాలు, మనుషులు లేరు… కానీ ఏదో సడి, నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. శవాల్ని కాలుస్తున్న ధూమం ముక్కంటుతూంది. అట్లాంటి వీధిలో పడి తిరుగుతున్నాడో వ్యక్తి. ఆకలితో తిరుగుతున్నాడు. అన్నం పెట్టే వారు ఎవ్వరూ కనిపించడం లేదు…”
 
          ఇలా భయం కలిగేలా, అదే సమయంలో ఉత్కంఠ కలిగించే వర్ణనతో మొదలౌ తుంది కథ. 
 
          ఆ రాత్రి వేళ ఆకలితో దాదాపు సోలి పోతున్నట్లు ఒక ఇంటి అరుగు పై పడిపోయాడ తను. ఆ ఇంటి యజమాని భోజనం పెట్టి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వ మంగళుడికి చదువుకోవాలని ఉందని తెలుసుకున్నాడు. “గుమ్మం దాటకుండా పన్నెం డేళ్ళు చదువుకుంటే సకల విద్యలు నేర్పుతాను” అన్నాడా పండితుడు ‘ఘనాపాఠి’. 
 
          ఘనాపాఠి ఇంటికి ఆనుకొని ఒక తోట ఉంది. అక్కడ గురుశిష్యులిద్దరే ఉంటారు. రోజంతా దీక్షగా చదువుకోవడమే. కొద్ది సమయం తోట పని చేయడం. 
 
          పాఠం చెబుతున్న గురువు ఒక్కొక్కప్పుడు కనిపించేవాడు కాదు. కానీ పాఠం వినిపించేది. తిరిగి అతను కనిపించే ముందు అపూర్వ సువాసనలు వేసేవి. చూస్తుండగా చెట్లలో కలిసి చెట్టుగా మారిపోయేవాడు గురువు. పడుకున్న గురువు మాయమైపోయే వాడు. మంచం భూమికంటి ఉండేది కాదు. గురువుగారు భోంచేయడం ఎన్నడూ చూడ లేదు. తోటలో మారుమూలక వెళ్ళి గురువు వికృత ధ్వని చేసేవాడు. ఒకసారి అంతరిక్షం అంత పెరిగి వెంటనే మామూలుగా ఉండేవాడు. గురువు మంచం భూమికి తగలకపోవడం చూసి సర్వమంగళుడు మంచాన్ని అణుద్దామని చూశాడు. మంచం తాకేసరికి గురువు ప్రత్యక్షమయ్యేవాడు. చివరికి ఒకసారి “మీరు అలా అవుతారు ఏమిటి” అని అడిగాడు. “యోగ శాస్త్ర మహిమ అదంతా. నీకు మున్ముందు తెలుస్తుంది” అని సమాధానపరిచాడు ఘనాపాఠి.
 
          “రాత్రులు పీడకలలు. మీతో చిత్రవిచిత్ర లోకాలకి వెళుతుండటం, అక్కడ మీరు వికృతాకారులని సౌందర్యవంతులని పిలిచి మాట్లాడటం, ఆ లోకాల్లో నాటకాలు చూడటం, పర్వత శిఖరాల మీద మనం పరిగెత్తమూ, పరిగెత్తి భయంతో పడిపోతుంటే మీరు మోసుకుపోవటమూ, ఇవన్నీ ప్రతిరోజు నిద్రపట్టే సరికి జరుగుతున్నాయి ఎందుకు ” అని అడిగితే, “పైత్యాధికం వల్ల జరుగుతుంది లే” అన్నారు గురువు. 
 
          ఒకరోజు తక్కువ పన్నెండేళ్ళు గడిచాయి. చతుర్వేదాలు, వేదాంగాలు, కళలు, గజకర్ణ గోకర్ణ విద్యలు క్షుణ్ణంగా అభ్యసించాడు సర్వమంగళుడు. ఆ రోజు ఎందుకో పట్నం చూడాలన్న కుతూహలంతో రహస్యంగా తోట పెరటి గుమ్మం దాటి వీథిలోకి వెళ్ళాడు సర్వమంగళుడు. దశాశ్వమేధ ఘట్టానికి చేరుకున్నాడు. వినోదాలు, పురాణ కాలక్షేపాలు చూస్తూ, శాస్త్ర వాదవివాదాలు జరిగే చోటికి వచ్చాడు. ఆ వాదనలో పాల్గొన్నాడు. అతని వాదనా నైపుణ్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదంతా దూరం నుండి డుంఠిశాస్త్రి అనే పండితుడు గమనిస్తున్నాడు. చివరికి సర్వమంగళుడు స్థిరపరచిన సిద్ధాంతాన్ని ఖండించే శక్తి ఎవరికీ లేకపోయింది. “ఎవరు నీ గురువు” అని అడిగారు. “ఈ ఊళ్ళోనే ఘనాపాఠి గారు” అనగానే అందరూ హాహాకారాలు చేసారు.
 
          ” ఆ బ్రహ్మరాక్షసుని దగ్గరా…” అని అందరూ అరిచి కకావికలులైపోయారు. అతడు భయపడిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. అతనికి స్పృహ వచ్చే సరికి చీకటి పడింది. ఎవరూ లేరు… డుంఠిశాస్త్రి తప్ప. కొద్దిగా గంగాజలం నోట్లో పోసి, ముఖం తడిపాక సర్వ మంగళుడు తేరుకుని తన గురువు గురించి వివరాలు అడిగితే శాస్త్రి చెప్పారు. 
 
          పాతికేళ్ళ క్రితం ఘనాపాఠి మరణించాడు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు మణికర్ణికా ఘట్టంలో దహనం చేశారు. పన్నెండు రోజులు కర్మకాండలు చేసారు. పదమూడో నాటి రాత్రి ఇంటి గుమ్మం దగ్గర  ‘ఊగుతున్న కుండలాలు, కాశ్మీర్ శాలువా, నుదుట అరచేయంత ఎర్రని కుంకుమ బొట్టు, విశాలంగా ఉన్న నేత్రాలు, పింజలు పెట్టి కట్టిన ధోవతి’ – వీటన్నిటితో బ్రతికి ఉండగా ఏ వేషంతో ఉండేవాడో అలాగే ప్రత్యక్షమై నాడు ఘనపాటి.
 
          కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. వారికి అభయమిచ్చి తోటలోకి వెళ్ళి పోయాడు. ఆ తర్వాత ఎప్పుడూ ఇంట్లోకి రాలేదు. మనమళ్ళు, వారికి సంతానమూ కలిగారు. అందరూ సుఖంగా ఉన్నారు. ఈ విషయం ఊళ్ళో వారికీ తెలిసింది. ఎవరూ ఆ ఇంటి ఛాయలకే వెళ్ళరు – అని చెప్పాడు డుంఠిశాస్త్రి.
 
          భయంతో వణికిపోయాడు సర్వమంగళుడు. ఇంటికి వెళ్ళాలంటే భయం. వెళ్ళక పోయినా గురువు తనను వదలడు. ధైర్యం కూడగట్టుకుని తిన్నగా తోటలోని మందిరానికి వెళ్ళాడు. గురువు ధ్యానంలో ఉన్నాడు. కాళ్ళ మీద పడి ఏడ్వసాగాడు. ” నాయనా, నిన్నేమీ అనను. నీవు ఎక్కడికి వెళ్ళావో, ఏం జరిగిందో తెలుసు. ఈ రాత్రితో పన్నెండేళ్ళు పూర్తి అయ్యాయి. నీకో రహస్యమంత్రం ఉపదేశిద్దామనుకున్నాను. కానీ ఇక కుదరదు” అన్నాడు ఘనాపాఠి.
 
          ఇంత వరకు కథ ఉత్కంఠతో చదువుతాం. ఒక మామూలు దయ్యం కథే కదా అనుకుంటాం. గురువు గారు శిష్యుడికి ఉపదేశం ఇవ్వలేకపోయినా, రచయిత్రి చివర్లో అద్భుతమైన ఉపదేశం ఇచ్చారు –
 
          “బ్రతికి ఉండగా నాకు వచ్చిన విద్యలు ఎవరికీ చెప్పకపోవడం వల్ల ఈ జన్మ వచ్చింది. ఈ విధంగా నీకు విద్యాదానం చేయడం చేత నాకు ముక్తి కూడా ఇప్పుడే కలిగింది” అంటూ భగ్గున మండి మాయమై పోయినాడు ఘనాపాఠి.
 
          కొందరు గురువులకు ఉండకూడని దుర్లక్షణం ఇది. తనకు వచ్చిన విద్య శిష్యులకు కొంత వరకే చెబుతారు కానీ పూర్తిగా చెప్పరు. తమతో సమానమైపోతారన్న అసూయ కావచ్చు, తమని మించిపోతారనే భయం కావచ్చు. పూర్వ కాలం నుండి నేటి వరకు కొందరు అంతే. బోధించడం వల్ల వారికి పోయేదేమీ లేదు. బావిలోని నీరు ఎంత తోడితే అంతగా ఊరుతుంది. జ్ఞానం కూడా ఎంత పంచితే అంతగా ఉద్దీపన అవుతుంది. కొందరు గురువులలో ఈ స్వార్ధం వల్ల పూర్వీకులు చెప్పిన అమూల్యమైన జ్ఞాన సంపద తర్వాత తరాల వారికి అందకుండా పోయింది. పైగా ఆ నాటి విద్యావిధానం ‘ముఖే ముఖే సరస్వతీ ‘ అన్నట్లు గురు పరంపరగా, తమ వృత్తినే పవిత్రంగా, సాక్షాత్తు దైవ స్వరూపం గా భావించేవారు.
 
          వేదాధ్యయనం, వ్యాకరణం, స్వర శాస్త్రం, దర్శనములు, ధర్మశాస్త్రములు, పురాణ ములు, ఛందోలంకార శాస్త్రములు, వైద్యం, వ్యవసాయశాస్త్రం, సైనిక శిక్షణ వంటివే కాక, అపూర్వమైన ఖగోళ , వృక్ష, తర్క, న్యాయ, క్షేత్ర గణితం, రేఖాగణితం, ద్రవ్యగుణశాస్త్రం, జీవ శాస్త్రం వంటి ఎన్నో శాస్త్రాలను, అందలి రహస్యాలను బోధించేవారు. కానీ కొందరు స్వార్ధపరులైన గురువులు శిష్యులకు కొంత వరకే బోధించడంతో కొన్ని రహస్యాలు వారి తోనే నశించిపోయాయి. ఇది సత్యమే. 1920 ల్లోనే స్థానాపతి రుక్మిణమ్మ సరదాగా కథ చెబుతున్నట్లే ఉండి, ఇలాంటి గురువులకు ముక్తి లభించక బ్రహ్మరాక్షసులై పోతారని అన్యాపదేశంగా నిరసించారు.
 
న చోరహార్యం నచ రాజహార్యం 
న భాతృభాజ్యం నచ బారకారి
వ్యయేకృతే వర్ధత ఏవ నిత్యం
విద్యాదానం సర్వ ధన ప్రదానం
 
(చోరులు దొంగిలించలేనిది, ప్రభువులు స్వాధీనం చేసుకోలేనిది, ఖర్చుచేసిన కొద్దీ దినదిన ప్రవర్ధమానమయ్యేది అయిన విద్యాసంపద సంపదలలో కెల్లా ప్రధానమైనది)
 
          గురుశిష్యుల మధ్య సంబంధం అనిర్వచనీయం. దైవసమానం. మానవాభ్యుదయా నికి మూలమైనది. అవిచ్ఛిన్నంగా కొనసాగిపోయే ప్రవాహశీలి.
 
ఓం సహనావవతు సహనౌభువనక్తు 
సహ వీర్యం కరవావహై 
తేజస్వినా వధీ తమస్తు 
మావిద్విషావహై 
ఓం శాంతి శాంతి శాంతి:
 
అని గురుశిష్యులు పరస్పరం జ్ఞానాన్ని తేజస్సును సాధిద్దాం అని ప్రార్థిస్తారు.
 
          దీని సమగ్ర సారాన్ని ఈ కథలో ఇమిడ్చి చెప్పిన ‌స్థానాపతి రుక్మిణమ్మ అభినంద నీయులు.

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.