కుమారి (కథ)
-దర్పణం శ్రీనివాస్
“ఇంగెంత కష్టమొస్చే ఇంగెంత నష్టం జరిగితే ఆ దేవుడొస్చాడో! మనది సిన్న కులమైతే! ఇట్టా మన పెండ్లాం బిడ్డల్ని ఆని పాల్జెయ్యాల్సిందేనా? మనమేం ఖర్మ సేసుకున్యామని ? పుట్టినాల్నుంచి మనట్టాటోళ్ళ కోసరం ఆ మాలోల నర్సిమ్మసామి రాకపోతాడా అని ఎదురు సూచ్చాండా! రాల్యా! అయినా ఎందుకొస్చాడులే! మనట్టా బీదోళ్ళ కోసరం ఎందుకు పుడ్తాడు? నాకు కష్టమొచ్చే ఆయప్ప వస్చాడనుకోవడం నా యెర్రి! నా మనవరాలి కష్టాన్ని తీరుస్చాడనుకోవడం అంతకన్నా యెర్రి ! పాపం ఆ బిడ్డకు పెద్దదయ్యిందన్యే సంతోషమే ల్యాకుండాపాయ! ఇంగా యెన్నాళ్ళు భరిచ్చాల యీడ్ని? యీనికి రోజులెప్పుడు దెగ్గెర పడ్తాయో? అమ్మా! చౌడమ్మ తల్లీ! నువ్వన్నా నా మనవరాల్ని కాపాడ్నికి రామ్మా! యీనికి నూకలు సెల్లేలా సూడమ్మా ! పుట్టి బుద్దెరిగి నాల్నుంచి స్యానా మందికి మానాన్ని కాపాడే గుడ్డల్ని ఈ సేతుల్తోనే నేను నేసిఇచ్చింటా! సివరాఖరికి పోయిన దసరాక్కు నీకు గట్టింది గూడా నేను నేసినే సీరే గదమ్మా! నా మనవరాలి మానాన్ని కాపాడ్నీకి నువ్వైనా రామ్మా తల్లీ!” అని కండ్లనిండా నీళ్ళతో, డొక్కల్లేకి ఆనుకున్యే పొట్టతో, మనిసంతా కుంగిపోతా అందరు దేవుళ్ళను యేడుకుంటాం డాడు మున్సామి.
కానీ, యా దేవుడూ రాల్యా! అంతకన్నా ముందే ఆ ఊరి ఆడోళ్ళ ఉసురుబోస్కుండే జగదేక వచ్చినాడు.
పున్నమికి ముందు ఊరంతా యెన్నెల కురిపిచ్చాల్సిన సెందమామ ఇదంతా సూడ్ల్యాక కోప్పడి ఎర్రంగా మారి మోడాల యెనక్కిపోయి దాసిపెట్టుకున్యాడు. ఇంగే ముంది! ఆ రేత్తిరి సీకట్లో మగ్గిపోయింది.
ఆ మర్సట్రోజు తెల్లారగట్ల కోళ్ళు కూచ్చాంటే కాంటమయ్య కొత్త కోళ్ళి కుమారి ఇంటి ముందర ప్యాడతో అలుకుతాంది. అప్పుడే ఆ దావలో పోతాండే జగదేక కండ్లు ఆయమ్మీ మింద పడ్న్యాయ్. కానీ, యేదో పనిమింద బెరబెరా ఇంటికి పోయినాడు.
ఆ పొద్దు ఊర్లో యాడ సూసినా ఇండ్లన్నీ సుట్టాలతో నిండుకోని సందడిగాఉండాయ్. యాల్నంటే ఆ రేత్తిరికి ఊర్లో జోతులెత్తుతాండారు.
కానీ, మున్సామి ఇండ్లు మాత్రం యా సందడి లేకుండా మోడుబోయింది. జోతుల కని దెచ్చినే మ్యాకపోతు మటుకు ఇంటి బయటుండే యాపసెట్టుకు కట్టేసుంది. అది ఆ సెట్టుకే అల్లుకున్యే తుప్పతీగను తింటావుంది.
మున్సామి ఇండ్లు అట్టాగుంటే అదే ఊర్లో ఉండే కాంటమయ్య ఇండ్లు మాత్రం కొత్త సుట్టాల్తో కలకలలాడ్తాంది.
పొద్దన్యే నట్టిట్లో కలసెం పెట్టి దీపమెలిగిచ్చి ఇంటోళ్ళంతా ఒక్కపొద్దుకు పూను కున్యారు. సుట్టాలకు మటుకు పులగం, పచ్చడి సేసి పెట్టినారు.
పైటాలైతానే కాంటమయ్య మ్యాలగాళ్లను దీస్కొని, కలసెం బిందెలను నిత్తిన బెట్టుకోని, మందినెంటేస్కోని పెన్నేటికి పోయినాడు.
ఆడ కలస్యాలలో ఏటి నీళ్ళు ఒడిసి పట్టినారు. కలస్యాలకు బిందెస్యావ పూజ సేసినారు. పొద్దుగూకుతాండంగా మెరవణి మొదలుబెట్టి తాళాలేస్కుంటా ఇంటి కొచ్చినారు.
ఇంట్లో ఒక్కపొద్దుండేటోళ్ళంతా జోతిని తయారు సేయనీకి పూనుకున్యారు. యేటి కాడ్నుంచి దెచ్చినే కలసెం నీళ్ళు బోసి, బెల్లం పాకంబట్టి, గోదమ్పిండిలో కలిపి ముద్దగా సేసినారు. ఆ ముద్దను నెత్తిమింద బెట్టుకోనీకి యీలుగా ఉండేటట్టు మూకటి మాదిరి తయారు సేసినారు. దాన్ని దీపపు సెమ్మెలో పెట్టినారు.
రెండు బార్ల పంచెను పెనేసి, వొత్తి మాదిరి తయారు సేసి నెయ్యిలో నానబెట్టి బాగా నానినాంక దాన్ని గోదమ్ముద్ద మూకట్లో కుదమట్టంగా పెట్టినారు.
అట్టా సేసిన జోతి ఇంగా టెక్కుగా అగుపడాలని దీపపు సిమ్మె సుట్టూరా టెక్కాయ అట్టలు గట్టి తళుకులద్దినారు.
ఇట్టా మొత్తం మూడు జోతులను తయారు సేసినారు.
పొద్దుగూకుతానే జోతుల్ని యెలిగిచ్చేకి ముందు నట్టింట్లో రతి బోసినారు.
రతంటే ముగ్గెయ్యడం. చౌడమ్మ తల్లి బొమ్మని ముగ్గు పిండితో యేసి పసుపు కుంకమల్తో , రంగుల్తో సొంపులద్దినారు.
సివరాఖరిన ఆయమ్మ నుదుటన బొట్టు పెట్టేటప్పుడు కుంకమ తక్కువయ్యింది. కుంకమదెమ్మని కోడలు కుమారి సెప్తే కాంటమయ్య అంగడికి బోయినాడు.
రతేసేది అయిపోయింది. అంగడికి బోయినే మామ ఇంగా రాల్యా! దాంతో కుంకమ సరింగ బెట్టకపోతే చౌడమ్మ తల్లికి యాడ కోపమొస్చాదోనని కుంకమ దెచ్చుకోనికి కుమారే అంగడి దారి పట్టినాది.
ఆయమ్మీ అట్ట పోతానే కాంటమయ్య ఉత్త సేతుల్తో ఊగలాడుకుంటా ఇంటి కొచ్చినాడు. కుంకమ కతే మర్సిపోయినాడు.
రతి పోయడం అయిపోయిందనుకోని గురువుతో పాటి, కొడుకు ఓబయ్యతో కల్సి జోతుల్ని రతి ముందరబెట్టి యెలిగిచ్చినారు.
అట్టా యెలిగిస్చానే, స్యానా తరాల కాడ్నుంచి జోతిని ఎత్తుకుంటాండే గుంపు గోసె సెక్కోని, కాళ్ళకు గజ్జెలు గట్టుకోని, నడుముకు ఎర్రగుడ్డ సుట్టుకోని, మెడలో దండలే స్కోని, నుదురుమింద బండారు బొట్టు పెట్టుకోని, ఉత్త పైన అంగీ ల్యాకుండా వచ్చి నిలబడ్న్యారు.
గురువుతో పాటి కాంటమయ్య, ఓబయ్యలు కడవల్తో నీళ్ళు నెత్తిన పోస్కోని గుడ్డను కుదూరుగా సేసుకోని జోతిని తలపైకి యెత్తుకున్యారు.
మిగిల్నోళ్ళు గూడా నిండుబిందె నీళ్ళు బోస్కోనొచ్చి ఆనంద యేయనీకి జోతుల్నెత్తుకున్యే ముగ్గరి సుట్టకారం గుండ్రంగా నిలబడ్న్యారు.
ఒకరు పాడ్తాంటే మిగిలినోళ్ళంతా వంత పాడ్తా సుట్టూరూ తిరుగుతా తాళాలు, కంజీరాలు, డప్పులు వాయిస్చాండారు.
ఇంటికాడ అట్టాగుంటే కుంకమద్యానీకి పోయినే కుమారికి దారిలో జగదేక అదాటు పన్యాడు.
ఆని సూపు వంకరగా అనిపిచ్చాల్కు ఆయమ్మీ భయపడి పోయి బెరబెరా అంగడి దిక్కు నడ్సబట్టింది. జగదేక ఆయమ్మీని యెంబడిచ్చుకున్యాడు.
ఆయమ్మీ అంగట్లేకి పోతానే అదే అంగడి బైటుండే అరుగు మింద కూకున్యాడు.
ఆడ అరుగు మింద ముందే కూకోనుండే నర్సిమ్మ ఇదంతా సూసి “ఏంది బావా ఇదీ? నీకెప్పుడు అదే యావేనా! పండగ పూట గూడా మానంగా మట్టసనంగా ఉండేడ్ది తెల్దా?” అని అన్యాడు.
దాంతో సిర్రెత్తిపోయిన జగదేక “నీకేం దెల్సులేవోయ్! దాంట్లో ఉండే రంజు. ఉత్త సప్పిడిగానివి. ఇప్పుడు లోపలికి పోయింది సూడు! ఏముందివై అది! దాన్నెట్టయినా ఈ పూట పట్టాల. ఈ పొద్దుకది నాకు కావాల. యిన్యావు గదా! ఇంగ నీ సొద్ది యినే ఓపిక నాకు లేదు గానీ మూసుకో!” అన్యాడు .
“నువ్వు మారవు. ఇట్టనే సేచ్చానే ఉండు. యాదో ఒక పొద్దు నీ కొంపే కాదు; నిన్ను నమ్ముకున్యే మా అట్టా అందరి కొంపలు అంటుకోకపోతే నా మెట్టుతోగొట్టు.” అని యిసిగిపోయిన మొగమేస్కోని ఇంటిదారి పట్టినాడు నర్సిమ్మ.
ఇయేం పట్టని జగదేక ఆయమ్మీ బైటికి ఎప్పుడొస్చాదో అని ఎదురుసూచ్చాండాడు. అది గమనిచ్చినే కుమారి కుంకమ తీసుకున్యాగాని స్యానాసేపు అంగట్లో నుండి బయటికి రాల్యా!
కాంటమయ్య ఇంటి కాడ జోతి నెత్తుకున్నోళ్ళు ముగ్గరూ పాటకు తగినట్టు అడుగులేస్చా సిన్నంగా ఇంటి లోపల్నుంచి ఇంటి బయటకొచ్చి ఆడ్తాండారు.
ఇంటి ముందర జోతి ఆడ్తాంటే, ఆ జ్యోతికి బలియ్యనీకి మేకపోతులు తయారుగా వుండాయి గానీ దాన్లకు నీళ్లుబోసి బొట్టు పెట్టి దండెయ్యనీకి కుమారే లేదు. సుట్టాలంతా కుమారి కోసం యెతుకుతాండారు.
ఇంగోదిక్కు ఎంతసేపని ఈడ్నే ఉండాల? ఎట్టయితే అట్టయితాదని, తెగిచ్చి అంగట్లో నుండి బైటికొచ్చింది కుమారి.
అయమ్మీ బైటికొచ్చి ఇంటిదారి పట్టింటే యెనకమల్లే పోయి పట్టుకోబోయినాడు జగదేక.
ఆనికి సిక్కకుండా తప్పిచ్చుకోని “ఎవడ్రా నువ్వు? నా యెంట పడ్న్యావంటే నీకుంటాది సెప్తాండా!” అంటా ఆయమ్మీ కాలికుండే సెప్పును సూపిచ్చినాది.
దాంతో ఆడు ఇంగా ఉడికిపోయినాడు. “ఊరందరికీ నేనంటే ఉచ్చపడ్తాంటే ఇది నాకే సెప్పు సూపిస్చాద్యా? అని, పంచ పైకి గట్టి; మీసం దిప్పుతా ఆగుమ్యే ముండా!” అంటా మళ్ళా యెంటబడ్న్యాడు.
కుమారి గుండె నిబ్బరం దెచ్చుకోని ఇంటిదిక్కు బిస్సగా పరిగెత్తింది.
ఆడు గూడా ఆయమ్మీ యెనకాల్నే పరిగెడ్తాంటే అది సూసినే ఆ ఊరికొచ్చినే సుట్టాలంతా నోటిమీద యేలేస్కున్యారే గానీ, యెవ్వరేగానీ అడ్డం పడల్యా!
పరిగెత్తుకుంటా ఇంటి సందులేకొస్చానే కుమారికి మొగుడు, మామా ఇంటి ముందర జోతులాడ్తా కనపడ్న్యారు.
పంచలో సంబానికి కట్టేసినే మ్యాకపోతులేమో ఇంగా అట్టనే ఉండాయ్. అంటే, ఆ యాటలు గొట్టేవరకు వాళ్ళు ఎత్తిన జోతులు యేరేవాళ్ళకియ్యనీకి లేదని కుమారికి తెల్సు.
కుమారి పరిగెత్తుకుంటా వచ్చి ఏమ్ మాట్లాడకుండా సెప్పులిడిసి ఇంట్లోకిపోయింది. సుట్టాలంతా ఏంది మే అట్టా పరిగెడ్తాండావ్? అంటాన్యాగానీ ఏం మాట్టాడకుండానే లోపల్కిబోయింది.
ఆయమ్మీ అట్టా ఎందుకు పరిగెడ్తాందో ఇంటికాడ ఉండే వాళ్ళెవ్వరికీ అర్థం కాల్యా!
ఆ యెనకాల్నే “నేను పట్టుకుంటే సెప్పు సూపిచ్చావా ముండా!” అని అడ్సు కుంటా ఇంటిదిక్కు వచ్చే జగదేకను సూచ్చానే కాంటమయ్యకూ, సుబ్బయ్యకూ గుండెల్లో పదురెత్తుకున్యాది.
సుట్టాలందరి ముందర ఇదేం పీడరా అని మనసులో అనుకున్యారే గానీ, అడికి ఎదురు పోనీకి ఆళ్ళకు గుండెల్లేవ్.
అసలే అమ్మనాయనా లేన్ది. ఇన్నాళ్ళూ యెట్టా బతికిండాల! ఇట్టాంటోళ్ళను ఎందర్ని సూసిండాలా! ఏమంటే యీడింగా బరిదెగిచ్చినోడు. అంతా చౌడమ్మ తల్లే సూసుకుంటాదని నమ్మి గుండెల్నిండా ఊపిరి నిల్పుకోని తెచ్చిన కుంకంతో రతిబోసిన చౌడమ్మకు బొట్టు పెట్టింది కుమారి.
అడ్డంబోయేటోడేల్యాక మదమెక్కిన జగదేక సెప్పుకాళ్ళతోనే ఇంట్లేకి దూరినాడు.
సుట్టాలంతా సూచ్చాండంగా రతిపక్కనే కూకోనుండే కుమారిని పట్టుకోబోయినాడు. ఎవ్వరేగానీ ఆయమ్మీని ఆదుకుండేటోళ్ళే ల్యాకుండా పోయినారు.
ఆయమ్మీ ఒక పారి రతిదిక్కు సూసింది. వొంటింట్లేకి బోయి వాకిళ్ళేస్కోబోయింది.
ఆరడుగులోడు అర నిమిసెంలో వాకిళ్ళను తోసేసినాడు. ఆయమ్మీని పట్టుకొనీకి ముందుకు సెయ్యి సాంచినాడు.
ఆడి నుండి యెట్ట తప్పిచ్చుకోవాల్నో దిక్కుదెలీక తారాడ్తాంటే ఆయమ్మీ సేతికొక ఈలకత్తి సిక్కింది. దాన్ని దీస్కోని ఆని సేతిమింద మాంచి యేటేసింది. అయినా ఆడు ముందు ముందు కొస్చాంటే జబ్బల మింద ఇంగో యేటేసింది. అయితే యీల కత్తి ఆని జబ్బల్లౌనే సీక్కబోయింది.
“ఎంతేటేసినావే నీ.. యమ్మ!” అంటా వంటింట్లో నుంచి బైటకొచ్చి పురసేత్తో ఈలకత్తి పీకి యిస్సిరేసినాడు.
అట్టా ఈలకత్తిని పీకేసరికి అని జబ్బల్నుంచి నెత్తర జిమ్మి రతిమింద పడింది. అది సరింగా చౌడమ్మ నుదురుమింద బలిబొట్టుమాదిరి కనిపిచ్చేసరికి సూసినోళ్ళంతా నోరెళ్ళ బెట్టినారు. నెత్తర కార్సుకుంటానే ఇంట్లో నుండి బయటకు పోయినాడు.
ఆడట్టా పోతానే పొయ్యింట్లో నుంచి బైటికొచ్చినే కుమారి దిక్కు అందరూ అదో రకంగా సూచ్చాంటే ఆయమ్మీకి యాడన్న దుంకి సవాలనిపిచ్చింది. కానీ, తమాయిచ్చు కున్యాది. ఒకరిద్దరు సుట్టాలు ఎకసెక్కెంగా నగినట్టు కనపడేసరికి సిన్నబోయింది.అందరి ముందర అట్టా మానం దీసిన జగదేకగాని మింద యాడలేని కోపం ముంచుకొచ్చినాది.
ఒక వల్ల కోపంతో, ఇంగోవల్ల భయంతో కుమారి మొగం ఎర్రబారింది. మనిషంతా కాళ్ళకాడ్నుంచి తలకాయ వరకు పదిరిపోయింది. ఆయమ్మీ కండ్లు గుండంలో నిప్పుల మాదిరి కణకణలాడినాయి. సూచ్చాండంగనే ఉడుకు పెరిగిపోయి, మనిసంతా ఊగిపో యి. అమైన ఇంట్లో నుంచి బయటకొచ్చి పంచలో అరుగు మింద పెట్టినే యాట కొడేలిని సేతిలో పట్టుకుండేసరికి జగదేకతో పాటి ఆడుండేటోళ్ళంతా జడ్సుకున్యారు.
చౌడమ్మే కుమారిలో పూనింద్యా అని తత్తరబిత్తర పడ్న్యారు.
అది సూసినే జగదేకకు సావు కండ్ల ముందుకొచ్చినట్లు అనిపిచ్చినాది. నర్సిమ్మ సెప్పిన మాటలు మళ్ళా సెలవుల్లో యినపడ్న్యాయి. ఆ దెబ్బకు “ఏయ్! నా యెంట రావాకే! పో ఈడ్నుంచి…” అంటా బిత్తరబోయిన ద్యావర దున్నపోతు మాదిరి వచ్చిన దారే పట్టినాడు.
అయినా ఆయమ్మీ ఇడ్సల్యా! ఆని యెనకల్నే అడుగులేస్చాంటే సూసి జోతులాడేటోళ్ళంతా నిలబడిపోయినారు.
కాంటమయ్య కోడల్కి అమ్మయ్యే బూనిందో యేమో! ఆ జగదేకగాడ్ని సంపేటట్టుం దంట అని ఊరు ఊరంతా గుప్పుమన్యాది.
ఆ యేడుక సూడ్నీకి అందరూ ఇండ్లల్లో నుండి బయటకొచ్చినారు. మున్సామి మనవరాలు మున్సామితో కల్సి ఇంటి బయట నిలబడినాది .
సేతి నుండి, జబ్బల్నుండి దావెంటా నెత్తరగార్తాంటే, ఆ నొప్పి తట్టుకోల్యాక మూల్గుతాండాడు జగదేక. యాడ ఇంగో యేటేస్చాదో అని బేరుక్కోని దాన్ని ఆపండ్రా అని పొలికేకలు పెడ్తాంటే ఆయమ్మీని ఆపనీకి యవ్వ్వరూ రాల్యా. ఆ పైన ముందే జోతుల జాతర మొదలైనట్టు అనిపిచ్చి రెప్పార్పకుండా సూచ్చాండారు.
సరింగా మున్సామి ఇంటి కాడికొచ్చేసరికి యాట కొడేల్తో బలంగా ఇంగో యేటేసింది కుమారి. ఆ దెబ్బకు ఆని రక్తం ఎగిరొచ్చి పాప కాళ్ళ మింద పడ్న్యాది. మున్సామి కండ్లు పాప కాళ్ళను అబ్బరిచ్చుకోని అదేపనిగా సూసినాయ్.
నాల్గడుగులేసేతలికి జగదేక యీపంతా నెత్తర ముద్దయ్యినాది. ఆగకుండా నెత్తర కార్తానే ఉండేసరికి సూచ్చాండంగనే ఆని ఒంట్లో సత్తవ తగ్గిపోయినాది. సరింగ చౌడమ్మ దేలం కాడికి వచ్చేతలికి అసినేరై వొతికిలబడి పోయినాడు.
కండ్లల్లో అగ్గి ఇంగా సల్లారని కుమారి ఆని దొమ్మల మింద కాలేసి ఆమైన యాట కొడేలితో ఒక్క యేటేసింది. అయినా, పాణం బిగబట్టుకోని ఆయమ్మీ కాడ్నుంచి తప్పిచ్చు కొనీకి పాక్కుంటాబోయి తడబాట్లో గుండంలో పడిపోయి తగలబడి పోయినాడు. అప్పుడు గాని ఆయమ్మీ కండ్లల్లో అగ్గి సల్లారల్యా!
అది సూసిన దేలం తరపున జోతులోళ్ళు తొమ్మిది మందీ జ్యోతుల్ను నెత్తినెత్తుకోని గుండంలో వుండే నిప్పుల్ను తొక్కుకుంటా వచ్చి కుమారి యెనకమల్ల నిలబడ్న్యారు. ఆయమ్మీ ఇంటిదావ పట్టింటే ఆయమ్మీ యెనకమల్లే ఆడ్తా ఊర్లోకొచ్చినారు.
లోపలుండే జోతి యెలుగులో టెక్కాయ తళుకులు ఎంత మెరుస్చాన్యా ఊరోళ్ళె వ్వరూ ఆ తలుకుల దిక్కు సూడనే సూడల్యా!
ఊరికి పట్టినే పీడను ఈడ్సి అవతల పారేసిన కుమారి దిక్కే సూచ్చాండారు. అమ్మయ్యే మెరవణై వస్చాన్నెట్టు అనిపిచ్చిందో యేమో ఆళ్ళకు. ఆళ్ళ మొగాల్లో భయమూ, భక్తీ రెండూ గనపడ్న్యాయి.
అట్టా నడ్సుకుంటా కుమారి మున్సామి ఇంటి కాడికొస్చానే మమ్మల్ని కాపాడానికి వచ్చిన నిజమైన చౌడమ్మవు నువ్వేనమ్మా! తల్లీ! నిప్పుల గక్కే నా కండ్లను నువ్వే సల్లబరిసినావమ్మా! ఇద్దో తల్లీ! మాట నిలబెట్టుకుంటాండా నీ మొక్కుబడీ తీసుకోమ్మా!అంటా యాపసెట్టుకు కట్టినే తలుగు యిప్పి మ్యాకపోతును ఆయమ్మీ ముందుకు తీస్కోనొచ్చి బలి ఇచ్చి బలి బొట్టు పెట్టినాడు మున్సామి.
అంతే! ఆపైన ఆయమ్మీ నడ్సుకుంటా ఎవరి ఇంటి ముందుకొస్చే వాళ్ళు నిండు బిందె నీళ్ళుబోసి, ఆరతులిచ్చి, టెంకాయలు కొట్టి, యాటలు గొట్టి, , బలిబొట్టు పెట్టి, కాపాడినావమ్మా చౌడమ్మ తల్లీ అంటా కాళ్ళమింద పడబట్టినారు.
సివరాఖరిన ఆయమ్మీ ఇంటికి సేరుకున్యాది. యాటలు గొట్టే తిరిప్యాలు ఆయమ్మీ ముందర్నే ఇంటి యాట గొట్టినాడు. మామ కాంటమయ్య, మొగుడు ఓబ్బయ్య జోతులు యేరే వాళ్ళకిచ్చి, ఆయమ్మీకి ఎదురుబోయి చౌడమ్మ తల్లే ఇదంతా జేసిందని నువ్వేమీ భయపడగాకు అని కుమారి మెడలో నిమ్మకాయలు దండేసి ఎర్రనీళ్ళజిట్టి దీసినారు.
ఊర్లో యెవరో జగదేక ఇంటికి అగ్గి పెట్టినారు. దాంతో భయపడిపోయిన జగదేక సుట్టాలంతా ఇండ్లకు వాకిండ్లేసి ఎట్టనో పోయినారు. అయినా రేత్తిరంతా ఇంగా ఊపుగా జోతులాడ్తానే ఉండాయ్.
తెల్లార్తాండంగా జోతులన్నీ దేలం కాడికి పోయి దీపం కొండెక్కించి ఆగం సెల్లిచ్చి నాయి. కానీ, జగదేక ఇండ్లు మాత్రం ఆగం సెల్లిచ్చాల్కు మద్యానమైంది.
పయిట్యాలకు ఊరంతా గొడుగులు తిప్పినారు. ఆ గొడుగుల కింద కుమారి కూడా మెరవణయ్యినాది.
*****
దర్పణం శ్రీనివాస్ అసలు పేరు తిరుపతి శ్రీనివాస ప్రసాద్ బాబు. కడప జిల్లా జమ్మలమడుగు వాస్తవ్యులు. తన మొదటి రచన “దర్పణం 60” పేరునే ఇంటి పేరుగా మార్చుకొని రచనలు చేస్తున్నారు. ఆయన రాసిన “అలుగోగు కథలు” అనే మాండలిక కథలు కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యురాలు డాక్టర్ ఎం ఎం వినోదిని గారు మరియు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత అయిన వేంపల్లి షరీఫ్ గారి ప్రశంసలు పొందాయి.
రాయలసీమ మాండలికంలో ముఖ్యంగా కడప మాండలికంలో దర్పణం శ్రీనివాస్ వ్రాసిన కథ చాలా బాగుంది. పల్లెటూరి లో జరిగిన సంఘటనె మన కళ్ల ఎదురుగా దర్పణం లో కనబడేలా వ్రాసిన దర్పణం వారికి అభినందనలు