కొండపొలం
-పారుపల్లి అజయ్ కుమార్
వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పిన కొండపొలం
నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాభావం చేత గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెలకాపరులు అడవిబాట పడతారు. మళ్ళీ తమ ఊరిలో వానలు పడి గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్లటం అని వ్యవహరిస్తారు.
వంద గొర్రెలున్న పెద్ద మంద గురప్పది. గురప్పకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కొడుకు శంకర్, చిన్న కొడుకు రవి. ఊళ్ళోని యాదవులలో ఇంజనీరింగ్ చదివింది రవి ఒక్కడే. చదువుల్లో ఫస్ట్ అయినా ఉద్యోగం రాలేదు. సూటిగా సమాధానం చెప్పలేని పల్లెటూరి నూన్యతతో వచ్చిన భయం, సిటీలోని పిల్లల ఇంగ్లీష్ పరిజ్ఞానం ముందు నిలవలేకపోవటం, ఇంటర్వ్యూ గదిలోకి పోగానె వచ్చే వణుకు, ప్రశ్నలు ప్రారంభం కాగానే చెమటలు పట్టటం ఇవన్నీ కలసి రవిని ఇంటర్వ్యూలో విజేతగా నిలప లేక పోతున్నాయి.
ఆ సంవత్సరం అన్న పెళ్ళి జరగడంతో అతను కొండపొలం వెళటానికి వీలుకాదు. తండ్రికి తోడుగా, కొండపొలం వెళ్ళమని తాత సలహా ఇస్తాడు. ఈ వనవాసానికి గుండె ధైర్యం ఉండాలి. ఎడగండునీ, చిరుబులినీ గుర్తుపట్టగలగాలి. పెద్దపులి ఆనుపానులు తెలుసుకోగలగాలి. కొండజ్వరం రాకుండా చూసుకోవాలి. నిత్యజీవిత సాహసయాత్ర యిది.
సహజంగా కొంత పిరికివాడయిన రవి కుటుంబానికి సాయపడటం తన బాధ్యతగా భావించి ధైర్యం చేసి కొండపొలానికి బయలుదేరుతాడు తండ్రికి తోడుగా.
తండ్రి దృష్టిలో రవికి పల్ల గొర్రెకు బొల్లి గొర్రెకు తేడా తెలియని వాడు. వానికన్నా ఆడపిల్లలకు గొర్రెల గురించి బాగా తెలుసు అనుకుంటాడు.
అటువంటి రవి తప్పని పరిస్థితులలో గొఱ్ఱెల వెంట బయలుదేరతాడు. దాదాపు ఇరవై కుటుంబాల వాళ్ళు కొండకు పోతున్నారు. ఇరవై మందికి పైగా జనం. వెయ్యి దాకా గొర్లు. సజ్జరొట్టెలు, బెల్లం గడ్డ, పచ్చడి ముద్ద, ఉల్లిగడ్డ, బియ్యం – బత్తెం మూటలు భుజానేసుకుని జీవాలకు మేత వెతుక్కుంటూ నల్లమల కొండల్లోకి…
తప్పని పరిస్థితులలో వనవాసం ప్రారంభించినప్పటికీ కొద్ది రోజులలోనే దాన్ని ఇష్టంగా మలుచుకొన్నాడు. తనకు తెలియకుండానె గొర్రెల మీద మరులు పెంచు కున్నాడు. ఆరు బత్తేల కాలం కొండపొలం చేసాడు.
మొదటిసారి పెద్దపులి ఎదురుపడగానే నిర్ఘాంతపోయి నిలువుగుడ్లేసుకుని నిలుచుండిపోయిన రవికి తండ్రి జ్ఞానబోధ చేస్తాడు.”గొర్ల మందను కొండకు తోలుకొచ్చాక నువ్వు గొర్ల మాసివి. నువ్వు ధైర్యంగా వుంటే మందంతా నిశ్చింతంగా మేత మేస్తది. నీ మెడ నీది కాదు. గొర్రెలది. నీ ఒక్కని మెడ గట్టిగుంటే ఈ గొర్రెల మెడలన్నీ పులి నోటికి చిక్కకుండా వుంటాయి. ” రవికి అర్థమయింది. తను గొర్రెలను కాయటం లేదని, భయాన్ని కాసుకుంటూ ఉన్నానని. బతకాలనుకొన్నప్పుడు భయముండాలి. చావు ఎదురై నప్పుడు భయమెందుకు?
రవిని ఇంటికి వెళ్ళిపోమంటాడు తండ్రి. కానీ, రవి కొండపొలం ముగిసేదాకా ఉండి పోవటానికే నిశ్చయించుకుంటాడు.
ఒకొక్క కాపరిది ఒకొక్క కథ. వ్యథాభరిత జీవితాల ఆవిష్కరణ జరిగిందీ నవలలో. ఒకొక్కరి మాటల వెనుకున్న చెతుర్లు, జీవితపాఠాలు, గుండెలు కరిగించే కన్నీటి బతుకు లు మనలను కొంతకాలం పాటు వెన్నాడుతూనే వుంటాయి.
అల్లుడు గొర్రెలను బేరం పెడుతుంటె ప్రాణం పోయినట్లుగా విలవిలలాడిన పాములేటి, గుండెలను తడిచేసి కన్నీరు కార్పించే అంకయ్య, సుభద్రల ఫోను సంభాషణ లు, అప్పులెక్కువై మందుతాగి చనిపోయిన కొండా నారాయణ, ‘సేద్దె గానికి పిల్లనిచ్చి , వాడు మందు తాగి సత్తే ముండమోసుకుని పుట్టింటికి వచ్చిన కూతుర్ని సాకేంత సత్తువ నాకాడ లేదు’ అని లబ లబలాడే తిరిపేలు, జీవిత పాఠాలను చెప్పే పుల్లయ్య తాత అందరూ సజీవ పాత్రలై మనలను పలకరిస్తారు. వాళ్ళు ఏడుస్తుంటే మనకూ ఏడుపొస్తుంది. వారు కలసిపోతే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. నవల చదవటం ముగించాకా చాలా కాలం మనహృదయాలలో వీరు గుర్తుకు వస్తూనే వుంటారు.
గొర్రెలు మేపుకు నీళ్ళకు అల్లాడిన రోజు గురప్పకు తిండి సయించదు. “వంద పానాలు అర్ధాకలితో దొడ్లో పడుంటే పిడచ నోట్లేకి ఎట్లా పోతది” అని కళ్ళ నీళ్ళు పెట్టు కుంటాడు. గొర్రెలు కడుపు నిండా మేసిన రోజు అతనికి తృప్తిగా వుంటది.
గొర్రెలను ప్రేమించటమే కాదు, తాను ఒక గొర్రెలా మారి వాటితోనే నిరంతరం,
అనుక్షణం సావాసం చేసే గురప్ప కొడుకు రవి చివరికి తాను కూడా వాటితో మమేకమై వాటి మీద మరులుగొంటాడు. తనను గొర్రెలు మరగేసుకొన్నాయి అనుకుంటాడు. వాటి వల్లనే భయాన్ని పోగొట్టుకున్నాడు. పనిపట్ల అంకితభావం సిద్ధింప చేసుకొన్నాడు. శారీరక కష్టంలో ఆనందాన్ని అనుభవించాడు. ఇల్లు ,చదువు, స్నేహితులు, అన్నీ మరచి మనసునిండా ఆలోచనలనిండా గొర్రెలే చోటుచేసుకున్నాయి. ఇక్కడి నుండి జీవిత వికాసానికి దారి ఏర్పడింది.
చివర్లో పులిని ఒంటరిగా ఎదుర్కొనే సన్నివేశం చదువుతుంటె వొళ్ళు గగుర్పొడు స్తుంది.
చావుకేకలేస్తూ వెనక్కు పరిగెత్తి భిల్లు చెట్టు పైకి ఎక్కాడు తోటి నేస్తం భాస్కర్.
గొర్రెల మంద బెదిరింది.
కుక్క ఎక్కడుందో కనిపించలేదు.
రవి ఒక్కడే మిగిలాడు.
మీదికొస్తూ వుంది పులి.
పారిపోయేందుకు కూడా అవకాశంలేదు.
దాని పంజాదెబ్బకు శరీరం చీల్చుకుపోతుంది.
దాని కోరలు మెడను కొరుకుతాయి.
మరణం తధ్యం.
ఇక భయమెందుకు?
భయం ఒక్కసారిగా జల్లున జారిపోయింది.
నేలనున్న గొడ్డలి అందుకున్నాడు…..
ఈ దృశ్యాన్ని ఊహించుకుంటే……
కుక్క సాయంతో పులిని దెబ్బకొట్టాడు.
పులిని చంపే ఉద్దేశ్యం రవికి లేదు. తమ ప్రాణాలను రక్షించుకోటానికే దాన్ని దెబ్బ కొట్టాడు.
భాస్కర్ గాయపడిన పులిని నరికేందుకు వెళుతుంటే వద్దని ఆపాడు.
‘దాని సామ్రాజ్యంలోకి మనం వచ్చి దాని సొమ్ము మనం తింటున్నాం. దానిని చంపే హక్కు మనకు లేదు.’ అని అనుకొంటాడు.
నిజమయిన టీమ్ స్పిరిట్ అక్కడ కనిపిస్తుంది రవికి. కష్టాన్ని ,సుఖాన్ని అందరూ కలసికట్టుగా అనుభవించటం తెలిసివస్తుంది. అందరు ఒక జట్టుగా వుంటే పెద్దపులి అయినా వెనుకకు పరుగులు పెడుతుందని తెలుస్తుంది. ఎన్నో జీవిత పాఠాలు నేర్చు కుంటాడు రవి ఈ కాలంలో.
నిరంతరం నడవటం వల్ల వచ్చిన వళ్ళు నొప్పులు ,పులి భయంతో నిదురరాని రాత్రులతో బాధపడిన రవి, మొదట్లో ఎండు కట్టెను చూసి పామని భయపడి గజగజ వణికి చెమటలు చిందించిన రవి, అడవిలో తిరిగి తిరిగి పెద్దపులిని సైతం ఒంటరిగా ఎదుర్కొ నే సాహసవంతుడిగా పరిణామం చెందే క్రమం మనలను ఉత్తేజితులను చేస్తుంది .
అన్ని రోజులు అడవిలో తిరిగేసరికి రవికి అడవి గురించి, మనుషుల గురించి , జీవాల గురించి, చెట్లు చేమల గురించి, తన గురించి కొన్ని సత్యాలు బోధపడతాయి. ఈ జ్ఞానం రవి జీవితాన్ని మెరుగుపరుస్తుంది. భయం, సంకోచం, నూన్యతా భావం, సిగ్గు, తడబాటు అన్నీ తొలగిపోయి ఎంతో ఆత్మస్థయిర్యాన్ని నింపుకుని సిటీకి వస్తాడు. సాప్ట్ వేర్ రంగాన్ని వదిలి వేస్తాడు.
“నాకు మనుషులు కావాలి. చెట్లు చేమలు, జంతువులు, ప్రాణమున్న ప్రపంచం కావాలి ” అని అటవీ శాఖలో DFO ఉద్యోగాన్ని అలవోకగా సాధిస్తాడు.
అమీర్ పేట ఇరుకిరుకు గదులలో నేర్వలేని వ్యక్తిత్వ పాఠాలు ఈ అడవి, ఈ మనుషులు, ఈ ప్రకృతి నేర్పాయి. కొండపొలంతో నేర్చుకున్న జీవిత పాఠాలు భయం, పిరికితనం కలిగివున్న రవిని ఎర్రచందనం నరికే స్మగ్లర్ల పాలిట యమదూతలా మారే అటవీశాఖ అధికారి రవీంద్ర యాదవ్ గా నిలబెట్టాయి.
ఊళ్లో యువతకు ఆదర్శప్రాయంగా మార్గదర్శిగా నిలుస్తాడు. “అంకిత భావంతో పనిచేసే మీ తండ్రులు, తల్లులు, అన్నలు, అక్కలను మించిన వ్యక్తిత్వ వికాస నిపుణు లు మరెవరు వుండరు. వాళ్ళను చూసి స్పూర్తి పొందమని, వాళ్ళ ఒపిక, తపన, దక్షత లను అధ్యయనం చేసి విజయం సాధించండి” అని ఉద్బోధ చేస్తాడు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో విశదీకరిస్తుందీ నవల.
గొర్రెల కాపరుల నిజ జీవితాలు, అడవులు, కొండలు, కోనలు, క్రూర మృగాలు అన్నీ మన కళ్ళ ముందు సజీవంగా నిలిపిన నవల ఇది…… సుదూరంగా కనిపించే అరణ్యం హరితశోభతో కళకళలాడుతున్నట్లుగా కనిపిస్తుంది కానీ..ఆ అడవి గర్భంలో అడుగడుగు నా ప్రమాదాలు పొంచివుంటాయి.
పురుగులు, పాములు, పులులు ఇవేకాదు. ఎర్రచందనం దొంగలు, యానాదులను ప్రలోభపెట్టి పబ్బం గడుపుకునే దళారులు, వారికి అండగా పొలీసులు, రాజకీయ నాయకులు, అటవీ సిబ్బంది వీళ్ళంతా నవలలో భాగంగా కనపడుతుంటారు. ఈ నవల చదువుతుంటే ఎన్నిసార్లు నా కళ్ళు తడిబారాయో లెక్కించలేదు. నాగరీక లౌక్యం తెలియని స్వచ్చమైన అమాయక పల్లె ప్రజలు వీళ్ళు. కల్లాకపటం లేకుండా అడుగడు గునా మానవత్వంతో మనుగడ సాగించే మెత్తనైనా మనుషులు వీళ్ళు.
‘పులి మనకాడికి రాలే …మనమే దాని తావుకు వచ్చినాము …వేట దాని ధర్మం … ఇన్ని వందల గొఱ్ఱెలలో ఒక జీవిని దానికి రుసుమిచ్చి పోలేమా ‘
(ఈ మధ్య హైదరాబాదులో ఇళ్ళలోకి నీళ్ళు వచ్చాయని గగ్గోలు పెట్టారు ….నిజానికి మనమే నీటికి నెలవైన తావులలో ఇల్లు కట్టుకున్నాం .. నీళ్ళు వాటి స్వంత తావులకు వచ్చాయి. అంతే.)
గొర్రెలకు కాపరులు చేసే సేవలు స్వంతబిడ్డల్లా వాటిని ఆప్యాయంగా చూడటం మనలను అబ్బుర పరుస్తాయి. గొర్రెలకు సేవ చేసేటప్పుడు మనిషికి చేసినట్లే చేయటం, వాటిని స్వంత బిడ్డలా చూసుకోవటం, దాని ప్రతీ అవస్థను జాగ్రత్తగా గమనించటం, అసహ్యించుకోక పోవటం, గొర్రె కాలును పళ్ళతో కరచి ముళ్ళు తీయడం ఇవన్నీ చదువు తుంటే నిజంగా గొర్రెల కాపరులకు చెయ్యెత్తి నమస్కరించాలి అని అనిపిస్తుంది.
అడవుల అందాన్ని, నిశ్శబ్దాన్ని, చల్లదనాన్ని, వయ్యారాన్ని రమణీయంగా వర్ణించిన విధానం చాలా బాగుంటుంది.
నగరాలలో పనిచేస్తున్న యువతకు ఒక సందేశాన్ని ఇస్తాయి.
ఎవరు నీళ్ళు పోయకుండా, ఎరువులు వేయకుండా తమ మానాన తాము పెరుగు తూ ప్రపంచానికి ప్రాణ వాయువులు అందిస్తూ ఉన్న వృక్ష జాతులను కొందరు వ్యక్తులు సమాజానికి తెలియకుండా దొంగతనంగా, పాశవికంగా, క్రూరంగా నరికి చేసిన విధ్యంసా లు ఆపే భాద్యత ప్రతి పౌరుని మీద ఉందని అంటాడు రచయిత.
రాయలసీమ మనుషులను, వారి జీవిత చిత్రణను కనుల ముందు నిలిపారు రచయిత ఈ నవలలో. రాయలసీమ మాండలీకం, పదాలు, మాటలు వినసొంపుగా ఉన్నాయి.
“ఉత్పత్తి కులాల మానవీయతకు నిలువుటద్దం” ఈ నవల అని కాత్యాయనీవిద్మహే ముందుమాటలో అంటారు.
” మనకు ఎక్కువగా పరిచయం లేని ఒక ప్రత్యేక జీవన పోరాటాన్ని మనకళ్ళ ముందు వాస్తవికంగా ఆవిష్కరించారు నన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి యీ నవలలో ” అని అన్నారు చౌదరి జంపాలగారు ముందు మాటలలో.
సినిమా ద్వారా మానవీయ విలువల పరిరక్షణ, సామాజిక సందేశం ఆవిష్కృతం కావాలని తపించే దర్శకుల్లో క్రిష్ ఒకరు. తెలుగు సాహిత్యం పై మమకారం, విస్త్రతమైన అవగాహన కలిగిన ఆయన విశేష పాఠకాదరణ పొందిన రాయలసీమ నేపథ్య కొండపొలం నవలను కథాంశంగా తీసుకొని అదే పేరుతో సినిమాను తెరకెక్కించారు. నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిని సినిమా రచనలో భాగం చేస్తూ సంభాషణలు రాయించారు. దర్శకుడు క్రిష్ అద్భుతంగా తీసాడు. నవలలో లేని ఓబులమ్మ పాత్రను సృష్టించి హీరోయిన్గా సినిమాలో చూపించారు. కానీ ఆశించిన మేరకు సినిమా విజయ వంతం కాలేదు. బహుశ కమ్మర్షియల్ హంగులు లేకపోవటమే కారణం కావచ్చు.
నవల మాత్రం చాలా బాగుంటుంది. మొదలుపెడితే చివరిదాకా చదివించేలా చేస్తుంది. మనకు తెలియని సరిక్రొత్త జీవితాలను మనముందు నిలబెడుతుంది. అడవి లో సంఘటనలు మనల్ని వూపిరి పీల్చుకోనియ్యవు. కష్టాలు, కడగండ్లు, అలకలు , భయాలు, పోరాటాలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి.
సాహిత్యాభిలాషులందరు తప్పక చదవతగిన నవలారాజం ‘కొండపొలం’…
పారుపల్లి అజయ్ కుమార్ … పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని. ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని. సాహిత్యం అంటే ఇష్టం. నవలలు చదవటం మరీ ఇష్టం. పదవి విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మంలో ” పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట – చావా రామారావు మినీ రీడింగ్ హాల్ ” పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగంలో నిర్వహిస్తున్నాను. సుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి. నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు. రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు. ఉచిత లైబ్రరీ. మంచినీరు, కుర్చీలు, రైటింగ్ ప్యాడ్స్, వైఫై, కరెంటు అంతా ఉచితమే. ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు.