కొత్త అడుగులు – 44
ధిక్కార స్వరం – సుధా మురళి
– శిలాలోలిత
ఈ సారి మరో కొత్త కవయిత్రి సుధామురళి పరిచయం. ఫేస్బుక్ మిత్రులందరికీ పరిచితురాలు. ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా ఉన్న సుధ ఇప్పుడే మండే సూర్యుని వేడిని, వెలుగును వెళ్ళగక్కుతోంది.
ఇప్పటి వరకు దాదాపు 300 కవితలు, 10 వరకు కథలు, కొన్ని సమీక్షలు రాశారు.
వృత్తిరీత్యా గణిత అధ్యాపకురాలు. నివాసం ప్రస్తుతం తిరుపతి జిల్లా ‘నాయుడుపేట’.
తన గురించి తానిలా వ్యక్తీకరిస్తోందొక చోట-
‘వెన్నెల చుట్టుకున్న
రాతిపూలు కావు నా వాక్యాలు
అందుకే కొన్ని మెదళ్ళకు
కనిపించవు’
‘తీపి గంధాలను పులుముకున్న విస్పష్ట కోరలు కావు నా పదాలు. అందుకే కొన్ని హృదయాలకు వినిపించవు.
‘అవి చీకటి చెలమలు, కన్నీటి ఋతువులు, మౌనపు లాంతర్లు , అపహాస్య చలనాలు, రుధిర లావాలు, అవర్ణ వర్ణాలు, నిశ్శబ్ద నాదాలు’ అంటూ తనకు తాను అక్షరాల్లో వ్యక్తీకరించుకుంది.
ఇటీవల కాలంలోని స్త్రీల కవిత్వంలో బలమైన స్వరం ఈమెది. ఎక్కడా అబద్ధాలు లేవు. నిజాయితీ పంచనే ఆమె. నేటి సమాజపు తీరు పట్ల విపరీతమైన ఆగ్రహం వుంది. తనను తాను సంభాళించుకోలేక, ఆవేశం, ఆవేదన, తపన ఎదురైనప్పుడల్లా ఆమె మనసు అక్షరాయుధాన్ని చేత పట్టుకొని ఒక్కసారిగా దూసుకొస్తుంది.
సుధామురళి కవిత్వంలో ప్రవాహ శైలి కనిపిస్తుంది. ఎక్కడా ఆగదు. తడబాట్లులేవు. తప్పించుకోవడాలు లేవు. ధైర్యంగా, నిర్భీతితో తాను రాయదలుచుకున్న వాక్యాలను పదును పెట్టటంలో నేర్పరి. ఎంత మంది స్త్రీలిలా తమలోని రచనా శక్తిని ప్రకటించకుండా నిశ్శబ్దంగా ఉండటం నాకెప్పటికీ మదనపడే అంశమే. ఇలా అప్పుడప్పుడు తారాజువ్వలా ఒక్కసారిగా కవిత్వాకాశంలో వెలుగుతుందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు.
ఇన్ని కవితలు, కథలు రాసిన ఈమె పుస్తకం ఎందుకు ఇంకా వేయలేదన్నదే నా
ప్రశ్న. తమ గురించి తాము ప్రయారిటీలు ఎంచుకోవడంలో ఇంకా వెనకబడుతుంటే
వెనకబడుతూనే ఉంటారనేది సత్యం. అందుకే సుధామురళి త్వరలో పుస్తకంగా మన ముందుకు రావాలనేదే నా ఆకాంక్ష.
ఆమె ఎవరు, ఏం రాసింది అని ప్రశ్నించిన వాళ్ళకు అన్నీ చదవాలని ఆశ పడుతున్న వారికి ఒక బహుమతిగా అందించాలన్నదే నా తపన. మనను మనం గుర్తింపు చేసుకునే ఐడెంటిటీని, గుర్తింపును పొందగలటం ఉనికిని సాధించుకోవడమే.
ఇక సుధామురళి కవిత్వంలోకి అడుగిడితే ‘ఆఖరి వాక్యం, శాపస్త అభలస్య,
అస్పటోచ్చారణ.., విరాగిని, వలయం. నిర్వాణ, ఎవరివి… నువ్వు.., దేవా..,మా శీలాలు మేమే రద్దు చేసుకుటాం’ —లాంటి కవితలు మచ్చుకి కొన్ని మాత్రమే.
భాష విషయానికి వస్తే, కొంచెం ఆధునికంగా మారాల్సిన స్థితి కొంత కనబడుతోంది ప్రాచీన పదాల వ్యామోహపు పరంపరలో పడిపోక ఇప్పుడు ఆధునికమైన కవిత్వ భాషను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
దేవా..
కలం కన్నీరు కార్చలేకుంది
వేదనా.. సంవేదనల మధ్య
చిక్కుకున్న మనస్సు
కొత్త అక్షరాలను రాయలేకుంది
…
అలాగే ‘ఆఖరి వాక్యం’ – కవితలో
బుల్లెట్ బట్టలు తొడుగుకుంటుందా
శూలం
చీరలు చుట్టుకుంటుందా
ఇప్పుడు నువ్వు వివస్త్రగా
ఊరేగించిన నేనూ అంతే
మందు పాతరనై
నీ మతోన్మాదాన్ని
కూకటి వేళ్ళతో సహా
పెకిలిస్తాను
నిప్పులు చిమ్మే ఈటనై
నీ రాజ్యాధికార కోరికను
తునాతునకలు చేసేస్తాను
అనుకుంటున్నావు కానీ
నువ్వు ఊరేగించినది
వినగ్న దేహాలనని
అవి పూర్తిగా నీ కుళ్ళూ
కుతంత్రాల గుర్తులు
భ్రమ పడుతున్నావ్ కానీ
నువ్వు చిత్రించి పంచి పెట్టింది
నా వివశత్వాలని
అవి నీ పైశాచికత్వపు
ఆనవాళ్ళు
గో టు హెల్
పురుషుడా గో టు హెల్
మీరు విధించిన
సిగ్గూ మానాల చట్టం చుట్టూ
తిరగలేక
ఏకపక్ష నీతి న్యాయాల
ఈలల్ని భరించలేక
తరాలుగా అలసిపోయాం
కమాన్
మగువా కమాన్
— అంటూ నేడు ఎటువంటి భయానక స్థితిలో ఉన్నామో ఎంతటి సంక్షోభంలో స్త్రీలు నలిగిపోతున్నారో, ధీరోదాతులై వెలుగు స్వప్నాల దారి వెంట నడుస్తూ తమను తాము ఎలా రక్షించుకుంటున్నారోనన్న విషయాలు ఎన్నో ఆమె కవితల నిండా ఉన్నాయి.
సుధామురళి కవిత్వంలో పదునైన రెక్కల్ని, విజయాల్ని , స్త్రీలను మాత్రమే కాక చరిత్ర నిర్మించిన దొంగనీతులను బట్టబయలు చేసింది.
*****