ఇది ఒక అపురూప నీటి రంగుల చిత్రమా? Iceland ఫోటో యా? ఫోటో అయితే, ఎక్కడ తీశారు? స్విట్జర్లాండా? ఇండియాలో ఇలాటి దృశ్యాలు ఉన్నట్టు లేవే! కంగారు పడకండి. ఇది అచ్చంగా ఫోటో యే! ఇండియాలో తీసిందే .. అంతే కాదు, మన కడపలో తీసిందే, తెలుగు గంగ ఫొటోయే! ఇంత అద్భుతమైన ఫోటో ఎవరు తీసారు? ఆగండి, ఆలోచించండి..
ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించడం ఒక పెద్ద పరీక్ష. అదెలా అంటారా? కావాలంటే జయతిని అడగండి, అందులోని కష్టాలను వివరిస్తారు. ఆమె చెట్లనీ ఫోటోలు తీసారు, పంట పోలాలను ఫోటోలు తీసారు, చీమల్నీ సాలీడులనీ కూడా ఫోటో తీశారు. ప్రకృతిలో తనకు నచ్చిన ప్రతి దృశ్యాన్ని ఫోటోలలో శాశ్వితం చేశారు. ఆమె ఎంపిక బాగుంటుంది, ఆమె నేర్పరితనం అంతకన్నా బాగుంటుంది, అన్నిటికన్నా ఆమె దార్శనికత అసామాన్యంగా ఉంటుంది. ఆమె ఫోటోలు చూసి ఆనందించడానికి రెండు కళ్ళు చాలవు, ఆమె తీసిన ఫోటోలలోని ప్రకృతి దృశ్యాల అందాలకు పరవశింపకుండా ఉండలేరు, అవి మనల్ని మధుర భావనలతో ముంచెత్తుతాయి.
అలాంటి ప్రభావాన్ని కలగజేయాలంటే – కేవలం ఆసక్తికరమైన అంశం / వస్తువు చాలదు, సాంకేతిక నైపుణ్యం – షార్ప్ ఫోకస్, పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ – తోడవ్వాలి. సీన్ లోని కంపోజిషన్ ని గుర్తించ గలగాలి, ప్రింట్ లో అదెలా ఉంటుందో ముందుగా ఊహించే నేర్పు ఉండాలి. ఒకలా చెప్పాలంటే – చాయా చిత్రకారుడు తనకు ప్రేరణ కలిగించిన అంశాలను అన్నిటినీ చూపరులచేత దర్శింప చెయ్యాలి. ప్రకృతి చిత్రాల ఫొటోగ్రఫీలో అంతస్సూత్రం : దేన్ని పట్టి చూడాలో గ్రహించడం.. కనిపిస్తున్న ప్రతీ దృశ్యంలో హృదయానుభూతి కలిగించే అంశాలకి స్పందించడం .. దార్శనికతను ఫోటోలలో ప్రతిఫలింప చేయడం..
‘మన చుట్టూ వున్న ప్రకృతి దృశ్యాలని చూస్తూ ఉన్న కొద్దీ, మనకి మరిన్ని కనిపిస్తూ ఉంటాయి, మనం వాటి ఫోటోలను తీస్తూ ఉన్న కొద్దీ, మనకు దేన్ని ఫోటోలు తీయాలో, దేన్ని తీయాలేమో మనకు తెలిసొస్తుంది’ అని ఎలియట్ పోర్టర్ అంటాడు.
జయతి కెమేరాకు లొంగని దృశ్యం అంటూ ఏదీ ఉన్నట్లు లేదు. అన్నట్టు జయతి, ఆమె సహచరుడు లోహితాక్షన్ ఒక రకమైన సంచార జీవులు. far from the madding crowd.. వారి జీవన విధానానికి , కథల్లో మనం చదువుకున్న ఋషుల జీవన విధానం ఇంచు మించు ఒకటే! విధానానికి పోలిక. అయితే ఏ దేవుడు కోసమో తపస్సు చేయటా నికి బదులు , ప్రకృతిని ఆరాధిస్తూ , దానితో మమేకం అయి జీవిస్తున్నారు. అడవి. అడవి మధ్యలో గుట్ట. ఆ గుట్ట పైన ఒక చిన్న కుటీరం. ఆ కుటీరంలో జీవనం! ఈ దంపతలు తమ అనుభవాలను గ్రంథస్థం చేసారు.