జీవితం అంచున -8 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          భయభక్తులతో బాల్యం, కఠిన నిబంధనల్లో కౌమార్యం, ప్రేమకు అర్ధం తెలియని అయోమయంలో యవ్వనం గడిచిపోయాయి. యవ్వనపు మావి చిగుర్లు చిగురించీ చిగురించకనే దాంపత్యంలో బంధింపబడ్డాను. ప్రేమ ఊసులు, ప్రియ సరాగాలు తెలియ కుండానే తల్లినై పోయాను. నవరసాల్లో జీవితంలో మానసికోల్లాసానికి ఎరువులైన రసాల కరువులోనే రెండొంతుల జీవితం గడిచిపోయింది. ఇప్పుడు అమ్మమ్మను కూడా అయ్యాక ఆరు పదుల నేను టేఫ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ నర్సింగ్ విద్యార్థిగా ప్రవేశం పొందాను.

          చిత్రంగా నాలో చిత్రమైన ఉద్వేగాలు. ఏళ్ళ తరబడిగా పంజరంలో బంధింపబడ్డ పక్షి విడుదలయితే కలిగే తాదాత్మ్యం. ఎన్నేళ్ళగానో బిగుసుకున్న సంకెళ్ళు విడివడి నట్లుగా ఉప్పొంగిన భావం. సమాజపు అదృశ్య ఊచల వెనుక హరించుకుపోయిన స్వేచ్ఛ కొత్త రెక్కలు తొడుక్కుని ఆకాశంలోకి ఎగిరిన ఉల్లాసం. కులగోత్రాల పట్టింపు లేని కొత్త ప్రపంచంలోకి కొంగ్రొత్త ఆశలతో నా పయనం ప్రారంభమయ్యింది.

          తొలిరోజు ఒరియంటేషన్ క్లాసు కోసం బితుకు బితుకుగా వెళ్ళాను. కొత్త ప్రదేశమని అమ్మాయి డ్రాప్ చేసింది. అడ్మిన్ బిల్డింగ్ లోకి వెళ్ళి ఎదురుగా కౌంటర్ లో వున్న అమ్మాయికేసి చూసి కన్రెప్పలు టపటపలాడించాను.

          నాలోని ఉత్కంఠను అంతే ఉత్సాహంగా గ్రహించి “ఐడీ నంబర్ ప్లీజ్” అంది ఆ తెల్ల అమ్మాయి చిరుదర హాసంతో.

          మెయిల్ లో వచ్చిన నా ఐడి నంబరు కంప్యూటరులో కొట్టగానే నా పేరు, కోర్సు వివరాలు చూపించింది. రెండు అడుగులు వెనుకకు వెళ్ళి కెమెరా వంక చూడమంది. కెమెరా క్లిక్కుమన్న మరుక్షణంలో నా పేరు, ఐడి నంబరు, ఫోటోలతో కార్డు బయటకు వచ్చింది. కార్డుని అరక్షణంలో ల్యామినేట్ చేసి యూనివర్సిటీ పేరుతో వున్న కాటన్ బెల్టులో కార్డుని క్లిప్ చేసి ఇచ్చి మూడో అంతస్తులో 303 రూములో మరో పావు గంటలో ప్రారంభమయ్యే ఒరియంటేషన్ క్లాసుకి హాజరు కమ్మని చెప్పింది.

          స్టూడెంట్ ఐడీ కార్డుని ఓసారి తమకంగా స్పృశించి మురిపెంగా మెడలో వేసుకు న్నాను. నా నడకకు ఐడీ కార్డు నా నాభి పైన నర్తిస్తుంటే పరవశిస్తూ 303 లోకి ప్రవేశిం చాను.

          దాదాపు అరవైకి పైగా విద్యార్థులతో హాలంతా నిండి వుంది. అసిస్టెంట్ నర్సింగ్ విద్యార్థులతో పాటు మరో హెల్త్ కోర్సు విద్యార్థులకు కూడా కలిపి నిర్వహిస్తున్న ఒరియం టేషన్ క్లాసు అది. అక్కడక్కడా మధ్య మధ్యలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. అందరూ తెల్ల తోలు విద్యార్థులే. గోధుమ వర్ణం చర్మం కోసం వెతికాను.

          నిజానికి ఆంగ్లేయులు చాలా స్నేహశీలులు. సుతి మెత్తని పలకరింపు, నొప్పించని తియ్యని పిలుపు, అరమరికలు లేని కలగలుపు. అయితే వాళ్ళ భాష యాస వలన నా కున్న ఇబ్బందితో చైనీస్, జపనీస్, ఆఫ్రికన్ విద్యార్థుల కోసం నా కళ్ళు వెతికాయి. ఎందుకో ఆస్ట్రేలియుల ఆంగ్లంకన్నా వీరి ఆంగ్లం నాకు సులువుగా అర్ధం అవుతుంది.

          నేను క్లాసంతా పరికించి చూస్తూ అందరిని ఓరకంట గమనిస్తున్నాను. విద్యార్థులు పదహారేళ్ళ నుండి బహూశా నలభై ఐదేళ్ల వయసు వరకూ వున్నారు. చిత్రవిచిత్రమైన వస్త్రధారణ.

          రెండించీల వెడల్పు పట్టీ ఛాతీకి కట్టుకుని నడుం కింద ఒక అడుగు పొడవు స్కర్ట్ తో ఒకమ్మాయి, చిన్న షార్ట్స్ పైన ఒదులైన లో నెక్ టీ షర్టుతో ఒకమ్మాయి, భుజాల నుండి పాదాల దాకా నిండుగా వున్న డ్రెస్సుకి కింద నుండి పిరుదుల దాకా కత్తిరింపుతో ఒకమ్మాయి, తలకాయ దూరేంత ఆర్మ్ హోల్ తో బనీను, చిరుగుల జీన్ ప్యాంటుతో ఒకమ్మాయి. మెకానిక్ షాప్ నుండి వచ్చినట్టు మాసిన జిడ్డు గుడ్డలతో ఒక అబ్బాయి… నలిగిన బట్టలతో మరో అబ్బాయి. నేను ఉతికి, పలుచగా స్టార్చ్ పెట్టి, ఇస్త్రీ చేసి వేసు కున్న నా షర్టు వంక చూసుకున్నాను.

          బట్టల ఆకర్షణ పట్ల ఏ శ్రద్దాసక్తులూ లేని వాళ్ళలో కొందరిని చూస్తే ఆశ్చర్యమే సింది.

          ఇక్కడ నాకు అబ్బురం కలిగించే విషయం ఏమిటంటే ఎంత రివీలింగ్ బట్టలు వేసుకున్నా శరీర భాగాలు ఎంత ఎక్స్పోజ్ అయినా ఎవరినీ ఎవరూ చూడరు. మన దేశంలో ఛాతీ మధ్య అర ఇంచీ క్లీవేజ్ వున్నా అందరి చూపూ అక్కడే తట్టుకుంటుంది. పైగా ఒళ్ళు బహిర్గత పరిచే వస్త్రాల వలననే మగాళ్ళ ప్రవర్తన పక్కదారి పడుతుందని ఉవాచ.

          వస్త్రధారణను మించిన చిత్రమైన కేశాలంకరణ వీరిది. ఒక్కో తలమీద వెంట్రుకలు ఎన్నేసి రంగుల కలపోతలో… మరీ విడ్డూరంగా నీలం, పసుపు, పర్పుల్ లాంటి అతి శయాన్ని గొలిపే ఫ్లోరేసెంట్ రంగులు. కొందరికైతే తల చుట్టూ గుండు, నడి నెత్తిన పిచ్చుక గూడు.

          ఇరవై శాతం మంది చిత్రవిచిత్ర వేషాలు వేసినా నేను గమనించినది ఏమిటంటే చాలా మటుకు వయసులో వున్న అమ్మాయిలు అలంకరణకి అస్సలు ప్రాధాన్యతను ఇవ్వరు. ఏవో వెలిసిన రంగు సాదా చొక్కాలు, జీన్ ప్యాంటులు వేసుకుని, జుత్తు పోనీలా కట్టుకుని, మామూలు స్నీకర్స్ లేదా హవాయి చెప్పులతో అతిసహజంగా కేర్ ఫ్రీగా వుంటారు. తలకు నూనె రాసిన దాఖలాలు, మొహాన పౌడర్ అద్దిన గురుతులు, కళ్ళకు కాటుక దిద్దిన ఆనవాళ్ళు వుండవు. మెడలో గాని, చేతులకు, చెవులకు, ముక్కుకి ఏ నగ సాధారణంగా పెట్టుకోరు. అసలు మ్యాచింగ్ ముచ్చటే వుండదు.

          ఎవరయినా ఆడాళ్ళు బాగా తయారయ్యారంటే, బట్టలు, హ్యాండ్ బ్యాగు, చెప్పుల మ్యాచింగ్  పట్ల శ్రద్ధ వహించారంటే వాళ్ళు యాభై దాటి వుంటారు. చాలా మటుకుఇక్కడి స్త్రీలు మిడిల్ ఏజ్ క్రైసిస్ వచ్చాకే అందం పట్ల, అలంకరణ పట్ల మోజు చూపిస్తారు. ఎంతటి శ్రద్ధ వహిస్తారంటే నుదుటి పైన గీతలు, జారిన కనుబొమలు, చంపల సవరింపు కై  కాస్మెటిక్ సర్జరీలను సైతం ఆశ్రయిస్తారు. వారి సంపాదనలో సగం పైగా బొటాక్స్, ఫిల్లర్స్ వంటి ట్రీట్మెంట్ లకు వెచ్చిస్తారు.

          నేను ఒక్కొక్కరినీ గమనిస్తూ వాళ్ళ వయసును అంచనా వేస్తూ పరికించి చూస్తూండ గా ఓ అమ్మాయి బ్లాక్ బోర్డుకి ఎదురుగా నిలబడి తనను యూనివర్సిటీ ఇన్స్ట్రక్టర్ గా పరిచయం చేసుకుంది. కాలేజీలో వున్న  లైబ్రరీ సదుపాయాలు, Xerox, ప్రింటింగ్ సదుపాయాలు, కాలేజీ ఇంటర్నెట్ వసతి, వైఫై పాస్ వర్డ్, మా కోర్సులకు సంబంధించిన టీచర్ల వివరాలు, కోర్సు పాఠ్యాంశాలు విపులంగా చెప్పింది. స్పష్టంగా అర్ధం అవుతున్న ఏ యాస లేని ఆమె ఆంగ్ల ఉచ్ఛారణ నాకెంతో ఆనందాన్ని, నాపై నాకు నమ్మకాన్ని కలుగ చేసింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.