దక్షిణ దేశ యాత్ర
(భాగం – 2)
(నవగ్రహ క్షేత్రాలు + పంచభూ
-అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
కన్యాకుమారి- ఇక్కడ చూడవలసినవి. ” సూర్యోదయ- సూర్యస్తమయ దృశ్యాలు,
వివేకనంద రాక్ మెమోరియల్ ఫోర్ట్, కన్యాకుమారి అమ్మవారి దేవాలయం.
కన్యాకుమారి సముద్రపు అందాలతో పర్యాటకులను కట్టి పడేస్తుంది. బంగాళా
ఖాతం, అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రము …ఈ మూడింటి సౌంద
ర్యాలను ఒకే చోట చూడాలంటే ఇక్కడకు రావాలి. ఇక్కడ సాయం సంధ్యలో సముద్రపు అందాలు పర్యాటకులకు మధురానుభూతులు కలిగిస్తాయి. ఉదయం సూర్యుడు బంగాళాఖాతం నుండి ఉదయించడం, సాయంత్రం అరేబియా సముద్రములో అస్తమించడం చూడటం ఒత అద్భుతమైన ఆనందం.
అమ్మవారి ఆలయంలోని విగ్రహాన్ని పరుశురాముడు ప్రతిష్టించారని అంటారు. మూడు సముద్రాల నీరు అమ్మ వారి పాదాలు కడుగుతాయని భక్తుల నమ్మకం. అమ్మ వారు పరమశివుని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని, ఆ వివరము శివునకు తెలుప గా ఆయన అందులకు అంగీకరించెను. కానీ ఒక కన్య వలన రాక్షస రాజు మరణస్తాడని తెలుసుకున్న నారదుడు ఆ పెళ్ళిని ఆపు చేయదలచి అర్దరాత్రి సమయమున కోడి కూసినట్ల కూసి తెల్లవారై పోయిందని భ్రమింపజేసెను. బ్రహ్మీ ముహూర్తములో పెళ్ళి. ముహూర్తము దాటి పోయిందని పరమశివుడు వెళ్ళలేదు. అప్పటి నుంచి అమ్మవారు అన్నపానీయాలు వదిలివేసి సన్యాసినిగా మారిపోయింది. అందుకే కన్యాకుమారి అను పేరు వచ్చినది.
వివేకానందరాక్‌మెమోరియల్- ఇది ఒక స్మారకచిహ్నం. వావతురై ప్రధాన భూబాగంలో ఐదువందల మీటర్లున్న రెండురాళ్ళలో ఒకదాని పై స్మారకచిహ్నం ఉంది. ఇది 1970 లో స్వామి వివేకానంద గౌరవార్థం నిర్మితమైంది. అతను రాతి పై జ్ఞానోదయం పొందారని చెబుతారు. కన్యాకుమారీ దేవీ కూడా శివుని గురించి ఇచ్చటనే భక్తితో తపస్సు చేసింది. ధ్యానం చేసుకోవడానికి మెమోరియల్ హాల్ ఒకటి ఉంది. సుందరమైన దృశ్యం. మూడు సముద్రాలు కలిసే లక్షద్వీప్ సముద్రం చుట్టూ రాళ్ళు ఉన్నాయి.
“అస్సలు ఈ ప్రయాణంలో చాలా మందిమి సీనియర్ సిటిజన్స్ మే. కానీ అందరమూ వయస్సులు మరచి హాయిగా కేరింతలు కొడుతూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరిగాము.” బీపీ, కొల్లెస్ట్రాల్, మధుమేహము మా దరిదాపులలోకి రాలేదు. అందరూ యువకుల మాదిరి గంతులు వేశారు. పద్యాలు, పాటలు, ఇష్టాగోష్టిగా భగవత్ సంబందిత ప్రసంగాలుతో కాలము తెలియకుండా సాగింది. అందుకు టీమ్ కుర్రాళ్ళు ఎంతో దగ్గరుండి అందరికీ సపర్యలు చేయడంలో మన కన్నపిల్లలు కూడా వాళ్ళ ముందు తీసికట్టే. ఆ విధంగా మా టీమ్ కో ఆర్డినేటర్ సాయిరామ్ గారు పిల్లలకు మంచి
తర్ఫీదు ఇచ్చారు.
“ఇప్పటికి ఎనిమిది రోజుల ప్రయాణం జరిగింది. ఆదివారం మధ్యాహ్నము కన్యాకుమారి నుంచి త్రివేండ్రము బయలుదేరాము. అనగా తమిళనాడు వదిలి పెట్టి కేరళ వైపు పయనం. తొమ్మిదవ రోజు పద్మనాభపురమునకు బయలు దేరాము. అనంత పద్మనాభస్వామి దర్శనమునకు.
అనంత పద్మనాభస్వామి- ఈ ఆలయం తిరువనంతపురములో కలదు. అనంత
అనగా అనంతమైన, సర్పం పై ఉండే స్వామి కాబట్టి తిరువనంతపురము అనే పేరు
వచ్చినది. 108 పవిత్ర విష్ణుదేవాలయాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ దేవా
లయంలో పూజలు అందుకునే స్వామి విష్ణుమూర్తి , పాము పడగల పై పవళిస్తూ ఉంటారు. ఏడు పరుశురామ క్షేత్రాల్లో భాసిల్లే ప్రదేశంలో స్వామి భూమి దేవాలయాన్ని
ఉన్నట్లుగా విస్వశిస్తారు. ఈ దేవాలయం ప్రసిద్ద కోనేరు – పద్మపాదానికి దగ్గరలో ఉంటుంది.
విగ్రహం- ఈ స్వామి విగ్రహం యొక్క కూర్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది
12008 సాలగ్రామాలతో రూపొందించబడినది. వీటిని నేపాల్‌లోని గంఢకీ నదీతీరం
నుంచి తీసుకొచ్చారు. గర్భగుడి ఒక రాతి పలక పై ఉంటుంది. ప్రధాన విగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుంది. మూడు విభిన్న ద్వారాల ద్వారా స్వామిని వీక్షించాము.
తల మరియు ఛాతీని ప్రధాన ద్వారం ద్వారా చూడవచ్చు. తలను రెండో ద్వారం ద్వారా మరియు పాదాలని మూడో ద్వారం ద్వారా చూడవచ్చు. సంప్రదాయ దుస్తులతోనే ఆలయ ప్రవేశం. మగవారు దోవతీ, ఆడవారు చీరకట్టుకోవాలీ. ఈ ఆచారాన్ని చాలా కట్టుదిట్టంగా పాటిస్తారు.
దర్శనం దగ్గర మాత్రం చాలా చీకటిగా ఉంటుంది. తక్కువ వెలుతురు. వరుస క్రమాలు లేవు. అంతా మాబ్ క్రింద తయారవుతుంది. ఓ రెండువందల మందికి ఒకే సారి దర్శనంకు వస్తారు. స్వామి దర్శనం దగ్గర మాత్రం బాగా రద్దీగా ఉంటుంది. చాలా చాలా అసౌకర్యానికి గురి అయ్యాము. మన దగ్గరలా కాక దర్శన సమయాలు చాలా విచిత్రంగా ఉంటాయి.
దేవాలయం యెక్క ధ్వజస్తంభం 80 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ భక్తుల
మదినిదోచే అనేక నిర్మాణాలు, శిల్పాలు, దేవతా విగ్రహాలు కలవు. తూర్పువైపు నుంచి గర్భగుడిలోకి వెళ్ళే నడవా ( కారిడార్) విశాలమైనది. అద్భుతముగా చెక్కబడ్డ 365 కు పైగా గ్రానైట్ రాతి స్తంభాలుంటాయి.
ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాళిగళ్ళో ఆరు
రహస్య గదులు ఉన్నాయి. వీటిలో రాశుల కొద్ది బంగారు, వజ్రవైఢూర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. ఎన్ని లక్షలకోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఈ
ఆలయ భాద్యత మళ్ళీ తిరిగి ట్రావెన్కూరు రాజ కుటుంబనికి అప్పగించమని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఇక్కడ నుండి గురువయ్యూరు బయలుదేరాము. మార్గమధ్యములోనే ‘ కలాఢీ’ కలదు. ఆదిశంకరులు జన్మించిన స్థలము. సనాతన ధర్మాన్ని సమున్నత స్థానానికి నిలిపిన మహానీయుడు. కలాడీ పూర్ణానదీ తీరమున ఈ గ్రామము కలదు.
ఒక దినము స్నానమునకు తల్లి పూర్ణానదికి బయలు దేరింది. కానీ మార్గము సుగమముగా లేక నడవ లేక పోయింది. అది చూచి శంకరులు తన యోగశక్తిచే ఆ నదిని తన ఇంటి కడకు తీసుకొని వచ్చెను. ఆ ఇంటిని, ఆ పరిసర ప్రదేశాలను, శంకరులు పూజించిన అమ్మవారు మొదలగు వాటిని చూశాము.
తల్లి చనిపోయిన నాటికి శంకరులు సన్యాసము స్వీకరించారు. అప్పుడు తన జ్ఞాన
నేత్రమతో అగ్నిని పుట్టించి అంత్యక్రియలు నిర్వహించెను. ఒక బీదరాలి దుస్థితి చూసి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వర్షము కురిపించెను. ఆ స్తోత్రములే కనకధారా స్తవము. ఆయన రచించిన గ్రంథాలే నేటి మానవులకు దిక్సూచి అయ్యాయి. గణేశ పంచరత్నం, భజగోవిందం, లక్ష్మీకరావలంబ స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఉపయుక్తమవుతు న్నాయి. శంకరులు ఇలా చాలా జ్ఞాన , వైరాగ్య, భక్తి గ్రంథాలు రచించిరి. ఆ సేతుహిమాచ ల పర్యంతము కాలినడకన రెండు పర్యాయములు చుట్టి వచ్చిరి. ఆయన తన ముప్పై రెండవ ఏట కైలాసమునకు ఏగిరి పిన్నవయసులోనే. వారు తిరుగాడిన చోట మేము నాలుగు గంటలు గడిపితిమి.
కలాడీ నుంచి ” గురువయ్యూరు” పయనం
” గురువయ్యూరు” – త్రిసూర్ జిల్లాలోని గురువయ్యూరులో శ్రీకృష్ణ దేవాలయం ఉంది. ఈ ఆలయం ఐదువేల ఏళ్ళ నాటిదని అంచనా. ప్రస్తుతం ఉన్న గర్భాలయం 1638 లో పునర్నిర్మాణానికి నోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.
సాక్షాత్తు పరమశివుడు మహావిష్ణువు గురించి ఇక్కడ ఘోరతపస్సు చేశారని ప్రతీతి.
ఈ గుడిని భూలోక వైకుంఠం అందురు. ఈ దేవాలయంలో దేముడు బాలగోపాలన్
కృష్షుడు శిశువుగా దర్శనమిస్తాడు.
శ్రీగురువాయురప్పన్ ( శ్రీకృష్ణిడు) విగ్రహాన్ని బృహస్పతి ( దేవతల గురువు) , వాయుదేవుడు కలిసి ప్రతిష్టించారని, ఆ కారణంగానే ‘ గురువాయ్యూరు’ అనే పేరు వచ్చింది.
ఏనుగుల శిబిరం- మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సుమారు అరవై ఏనుగులకు ఈ శిబిరం ఆశ్రయమిస్తోంది. దేవాలయం నిర్వహించే పందేలలో ఈ ఏనుగులు
పాల్గొంటాయి. గెలిచిన ఏనుగును స్వామివారి విగ్రహాన్ని మోయటానికి వినియోగిస్తారు. స్వామివారి దర్శనం చేసుకుని శిబిరాన్ని కూడా చూసి అక్కడ నుండి బయలుదేరి భోజనాదికాలు ముగించుకుని ” అరుణాచలం” పయనమైతిమి.
అరుణాచలం- పరమేశ్వరుడు అగ్నిలింగ రూపములో వెలసిన అతిమహిమాన్విత
క్షేత్రం. ఈ అరుణాచల గిరిని ప్రదక్షిణ చేస్తే అనేక శుభఫలితాలు చేకూరుతాయి. నడక
దారిన ప్రదక్షిణ చేయలేని వారు ఆటోలలో తిరిగి దండం పెట్టుకుంటారు. మేము కూడా ఆ విధంగానే చేశాము. కొంత మంది మాత్రము తెల్లవారు జామునే లేచి గిరి ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేసిన పిదప స్నానము కాని, పడుకోవడము కానీ చేయరాదు. అగ్ని లింగం ఉండుట వలన ఇచ్చట వేడిగా ఉంటుంది. స్వామి స్తంభాకారములో ఉండును. అణ్ణాల్ అంటే అగ్ని. మలై అంటే పర్వతము. ఈ రెండూ కలిసి అణ్ణామలై అయింది. తిరుయనగా శ్రీ. అరుణ-ఎర్రని, చలము-కొండ. అ-రుణ యనగా పాపములను హరించు నది యని యర్థము.’ అపితకుచళాంబిక ఇక్కడి అమ్మ వారి పేరు.
ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టమని రాత్రిపూట లేక తెల్లవారు జామున గిరిప్రదక్షిణం చేస్తారు. ఇక్కడ నుండి రమణాశ్రమము రెండు
కిలోమీటర్ల దూరం. అక్కడకు వెళ్ళాము. ఎంతో ప్రశాంతముగానున్నది. అంతా ఆశ్రమ వాతావరణం. ఆకులు పడితే వచ్చే శబ్దమే కానీ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. రమణా శ్రమమునకు దారిలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి. అరుణాచలంను చూస్తే నంది లాగా కనబడుతుంది.
1.చిదంబరంలో శివ దర్శనం అంత సులువు కాదు.
2.కాశీలో చావడానికి వెళ్ళినా, అక్కడకు వెళ్ళిన వారందరూ చావరు.
3.తిరువళ్ళూరులో జన్మించడం మన చేతిలో లేదు. ఈ అరుణాచలాన్ని స్మరించడం మాత్రం మన చేతిలో ఉంది.
అరుణాచలం నుంచి ఉపాహారాలు సేవించి ఆంధ్రా వైపు పయనం. పన్నెండవ
రోజు. మార్గమధ్యంలో కంచికి వెళ్ళాము.
కంచి- కంచిలో మూడు ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలకు వెళ్ళాము.
- శివకంచి-ఏకాంబరేశ్వరస్వామి
- విష్ణుకంచి- వరదరాజస్వామి మరియు కామాక్షి అమ్మవారు.
కంచి అనగా మొలచూల వడ్డాణం అని పేరు. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో
ఒకటి. అమ్మ వారి నాభీభాగం ఇక్కడ పడిందని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు పద్మాసనం లో యోగముద్రలో ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ దేవాలయం ఐదు ఎకరాల స్థలంలో, నాలుగు విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకముతో విస్తరించబడింది. అమ్మ వారి విగ్రహం ముందు ఉగ్రరూపం వుండి శాంతిపరచటానికి, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీ చక్రం ఉంది.
అమ్మవారి చేతిలోన చెరుకుగడ, చిలుకను తన కుడి చేతిలో పట్టుకుంది. మరి రెండు చేతులలో పాశ, అంకుశాన్ని ధరించి ఉంటుంది.
విష్ణుకంచి- నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి వరదరాజస్వామి దేవాలయం. నూట ఎనిమిదిలో పదునాలుగు కంచిలోనే ఉన్నాయి. ఇక్కడే రామానుజాచార్యులు నివసించా రు. సుమారు నూటఇరవై అయిదు ఎకరాల స్థలంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయం మొత్తం మూడు ప్రాకారాలతో, ముప్పైరెండు ఉపాలయాలు, పంతొమ్మిది విమాన గోపురాలు, మూడువందల పై చిలుకు మండపాలతో శోభాయమానంగా విలసిల్లు తోంది. స్వామి దర్శనానంతరం వెలుపలికి వచ్చేటప్పుడు పై కప్పుకు ఒక రాతి దూలం పైన చెక్కిన బంగారు బల్లి మరియి వెండి బల్లిని తాకాలి.
మేమందరమూ దర్శనం చేసుకుని బల్లులను తాకి వచ్చాము. వాటిని తాకిన వారు
సమస్తదోషాలు, పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని చెబుతారు.
కంచిగరుడసేవ– ఈ ఆలయంలో భారీ ఇత్తడి గరుడవిగ్రహం ఉంది. ఈ విగ్రహం పైనే
స్వామివారి ఉత్సవ మూర్తిని పెట్టి ఊరేగిస్తారు. స్వామి విగ్రహం కంటే గరుడవిగ్రహం
పెద్దదిగా ఉంటుంది. ఆ గరుడవిగ్రహానికి సేవ చేయడమనే మాటనే కంచిగరుడసేవ అను పేరు వచ్చింది. త్యాగయ్యగారు స్వామివారి మీద చక్కని కీర్తన రచించారు.” కంచి వరదరాజ నిన్నే కోరి వచ్చితిరా, మ్రొక్కేదా”
శివకంచి-” ఏకాంబరేశ్వరుడు- పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఏకామ్ర. ఆమ్ర-మామిడి. అంబర- వస్త్రం., ఆకాశం అని నానార్థాలు. ఏకామ్రేశ్వర స్వామియంటే ఒక్క మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామియని యర్థము. భూమిని సూచిస్తాడు. అనగా పృథ్వీలింగం. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలిగోపురం 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యిస్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1008 శివలింగాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల మామిడి వృక్షములోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి.
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీముత్తుస్వామి దీక్షితులు, ఈ క్షేత్రాన్ని దర్శించి ‘పూర్వకళ్యాణి రాగంలో’ “ఏకామ్రనాథం భజేహం” మరియు భైరవి రాగంలో ‘చింతయమా కంద మూల కందం’ అను కృతులను రచించిరి.
ఈ పట్టణాన్ని వేయి ఆలయాలనగరంగా పిలుస్తారు. సాంస్కృతిపరంగా ఎంతో
పేరు ప్రఖ్యాతలు కలిగిన నగరం. హిందువులకు మోక్షప్రధానమైన ఏడునగరాల్లో
ఒకటి. కంచి పట్టుచీరలు ప్రపంచ ప్రఖ్యాతి వహించినవి.
కంచి నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకున్నాము. రాత్రి క్రింద తిరుపతిలో బస.
అక్కడ శ్రీ కాళహస్తి, కళ్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాము.
శ్రీకాళహస్తి- ప్రొద్దున్నే బయలుదేరి శ్రీకాళహస్తికి వెళ్ళాము. పదమూడవ రోజు.
గురువారము. ( 21.07.2022) పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ది చెందిన వాయు లింగం. స్వయంభూనాథుడు.ఈ లింగానికి ప్రాణం ఉందని అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అద్భుతమైన వాస్తుకళకు ఈ నిర్మాణశైలి అద్దం పడుతుంది. చెక్కుచెదరని రీతిలో కనిపించే వేయికాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణ. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండజ్యోతి మాత్రము ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగం గా కొలువైన స్వామివారి ఉచ్వాసనిశ్వాస గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడు తుందని నమ్ముతారు. మరొక విషయమేమిటంటే ఇక్కడ శివలింగాన్ని అర్చకులతో సహా ఎవరూ ముట్టుకోరు. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ. స్వామివారు పశ్చిమాభి ముఖంగా దర్శనమిస్తారు. దేశంలోని అతిపురాతన దేవాలయాల్లో ఒకటి.
ధూర్జటి మహాకవి స్వామివారి మీద కాళహస్తీశ్వర శతకం రచించెను. ఇచ్చట స్వామి
వారికుండే నవగ్రహకవచం ద్వారా రాహుకేతువులతో బాటు గ్రహాలన్నీ స్వామిఅదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక అమ్మవారికి కూడా కేతువు వడ్డాణంగా ఉంటాడు. అందు వలన రాహుకేతు శాంతి పూజలు ప్రముఖంగా రోజూ జరుగుతుంటాయి. సాధారణంగా శైవక్షేత్రాల్లో నవగ్రహమండపం విడిగా ఉంటుంది. కానీ, ఇక్కడ నవగ్రహాలన్నిటికి కాకుండా శనీశ్వరుడికి మాత్రమే మంటంపం ఉంది. అక్కడ దర్శనాలు పూర్తి చేసుకుని తిరుపతికి బయలుదేరాము.
కళ్యాణవేంకటేశ్వర స్వామి- కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి కొలువైన క్షేత్రం
తిరుపతి. భక్తుల పాలిటి కొంగు బంగారంగా ప్రఖ్యాతిగాంచినది. అయితే తిరుమలలో
శ్రీవారి ఆలయంతో పాటు శ్రీనివాసమంగాపురం ఆలయం కూడా అంతే ప్రసిద్ది చెందినది. ఈ ఆలయంలో స్వామివారు శ్రీకళ్యాణవేంకటేశ్వర స్వామిగా పూజలందు కుంటూ భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు? స్వామివారు నిలువెత్తు విగ్రహం చూడువార లకు చూచిన కొద్దీ చూడాలనిపించే నయనానందకర రూపము.
ఈ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల సౌఖ్యాలు,పెళ్ళికాని వారికి కళ్యాణసౌభా
గ్యాన్ని వరంగా తిరుమలేశుడు ఇచ్చాడని పురాణ కథనం.
” కళ్యాణవేంకటేశ్వర స్వామి దర్శనంతో మా యాత్ర కళ్యాణవంతంగా ముగిసినది.
మన ఆలయాల శిల్పకళానైపుణ్యము ఎంత రాసినా, ఎంత చెప్పినా తక్కువే.
మహాకవి యన్నట్లు ” శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు, సృష్టికే అందాలు
చెక్కినారు” లా ఉన్నాయి కళాఖండాలు. శిల్పుల చేతిలో శిల్పాలు ఒకవెన్నముద్ద వలె
అమిరిపోయేవట. ఆ నాడు వారు సోప్‌స్టోన్ వాడేవారట. అది చెక్కిన పిదప గట్టి
పడిపోతుందట.”21 నాడు తిరుపతిలో బయలుదేరి 22 నాటికి సికింద్రాబాద్” చేరు కున్నాము.
*****
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యముగారు సాంఘిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక మరియు ఆధ్యాత్మిక రచనలు, వ్యాసాలు, కవితలు, కథలు, నవలలు రచించారు. వీరి రచనలు తెలుగువెలుగు, జాగృతి,ఆంధ్రభూమి, శ్రీవెంకటేశం, ప్రజాడైరీ, నెలవంక-నెమలీక, సాహితీకిరణం,హిందూధర్మం, సహరి, సినీవాలీ, మన తెలుగు కథలు.కామ్, దేశభక్తిసాహిత్య ‘ఈ’ పత్రిక, తెలుగుసొగసు, తెలుగుఇజమ్ మరియు అంతర్జాల పత్రికలులో ప్రచురించబడ్డాయి. ‘కలహంస’ అని – నెలవంక- నెమలీక.
‘సాహిత్య విక్రమార్క’ అని – దేశభక్తి సాహిత్య ‘ఈ’ పత్రికల నుండి ప్రశింసించబడ్డారు. ఇంటర్మీడియట్ వరకూ మెదక్ లో, ఉన్నత విధ్య హైదరాబాద్ లోను అభ్యసించారు. ప్రైవేట్ సర్వీసులో 36ఏళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.