దుబాయ్ విశేషాలు-4
-చెంగల్వల కామేశ్వరి
దుబాయ్ నగరంలో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఏవో ఒకటి నిర్మితమవు తోనే ఉంటాయి. 2017 లో నేను వచ్చినపుడు దుబాయ్ ఫ్రేమ్ నిర్మాణదశలో ఉంది. ఇప్పుడు అది పూర్తిగా నిర్మితమై దేశ విదేశీయులు దర్శించే సుందర కట్టడంగా పేరొందింది.
ఇప్పుడు డోనట్ ఆకారంలో ఒక పర్యాటక భవనం నిర్మితమవుతోంది. నేను మళ్ళీ వచ్చేసరికి డోనట్, తయారయిపోతుంది. అబుదాబికి దుబాయ్ కి నడుమ కడ్తున్న స్వామి నారాయణ్ మందిర్ కూడా రెడీ కావొచ్చు.
ఈరోజు దుబాయ్ ఫ్రేమ్ కి సంబంధించిన వివరాలు. తెలియచేస్తాను. దుబాయ్‌లో ప్రముఖ ఎట్రాక్షన్స్‌లో ఒకటైన దుబాయ్ ఫ్రేమ్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ‘పిక్చర్ ఫ్రేమ్‌లో అతి పెద్ద బిల్డింగ్’గా రికార్డు సొంతం చేసుకుంది. 150.24 మీటర్ల ఎత్తుతో ఈ ఘనతను సాధించింది దుబాయ్ ఫ్రేమ్. దుబాయ్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. స్పెక్టాక్యులర్ పనోరమిక్ వ్యూస్ ఈ నిర్మాణం ప్రత్యేకత. దుబాయ్ పాస్ట్, ప్రెజెంట్ మరియు ఫ్యూచర్‌ని ప్రతిబింబించేలా ఈ భవనం నుంచి వ్యూ వుంటుంది. దుబాయ్ ఫ్రేమ్ సందర్శించాలనుకునేవారికి ‘గిన్నీస్ రికార్డ్’ మరో ఆహ్వానించదగ్గ కారణమని అంటున్నారు నిర్వాహకులు. పెద్దలకు 50 దిర్హామ్‌లు, పిల్లలకు 20 దిర్హామ్‌లతో దుబాయ్ ఫ్రేమ్‌లోకి ప్రవేశం లభిస్తుంది. 3 ఏళ్ళలోపు చిన్నారు లకు, 65 ఏళ్ళు పై బడిన వృద్ధులకు అలాగే పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌కీ ఉచితంగానే ఇందులో ప్రవేశం కల్పిస్తున్నారు.
50 ఏళ్ళలో సాధించబోయే ప్రగతికి సంబంధించి ‘దుబాయ్ ఫ్రేమ్’ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారని. దుబాయ్ ఫ్రేమ్‌లో గతం గురించీ, ప్రస్తుతం గురించీ కూడా స్క్రీన్ పైన చూపిస్తారు 50 ఏళ్ళలో దుబాయ్ సాధించబోయే ప్రగతి గురించి కూడా ఇందులో పొందుపర్చారు గతం, ప్రస్తుతం, భవిష్యత్ వంటి అంశాలు అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసేలా దుబాయ్ ఫ్రేమ్‌ని రూపొందించారు. మొదట పాత తరంలో దుబాయ్, తర్వాత ప్రస్తుత తరం, చివరగా రానున్న యాభయ్యేళ్ళలో దుబాయ్‌లో వచ్చే మార్పులు ఉంటాయి. మెజ్జానైన్ ఫ్లోర్ నుంచి ఎలివేటర్ ద్వారా ఎగ్జిట్ అయి, వోర్టెక్స్ టన్నెల్ ద్వారా ప్రయాణిస్తారు. ఇందులో స్పెషల్ లైట్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో సంభ్రమాశ్చర్యాలకు గురి చేయనున్నారు నిర్వాహకులు. 205 మిలియన్ దిర్హామ్‌లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ రెండున్న రేళ్ళ సమయం తీసుకుంది..
దుబాయ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళేందుకు సందర్శకులకి పేపర్‌లెస్ టిక్కెట్లను అందు బాటులోకి తెస్తున్నారు. ఇ-టిక్కెట్స్ ఈ రెండిటికీ వర్తిస్తాయి. యాప్ ద్వారా ఇ-పేమెంట్ విధానంలో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. 160 మిలియన్ దిర్హామ్‌లతో దుబాయ్ ఫ్రేమ్‌ని 150 మీటర్ల ఎత్తు, 93 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఒక్క నిమిషంలో ఎలివేట్ రైడ్ ద్వారా టాప్‌కి చేరుకుని ఓల్డ్ మరియు న్యూ దుబాయ్‌ని వీక్షించవచ్చు.
ఫ్రేమ్ కి అటు ఇటు ఉన్న పిల్లర్స్ నడుమ ఉన్న భాగంలో మీటర్ వెడల్పున ట్రాన్స్ పరెంట్ గ్లాస్ తో నిర్మించబడిన ర్యాంప్ ఉంటుంది. దాని మీద ఎందరు నడిచినా ఏదీకాదు. కాని దానిలో నుండి దిగువనున్న రోడ్స్ కార్లు చెట్లు ఇతర కట్టడాలు కనిపిస్తూ ఉంటే మనకు భయమేసేస్తుంది. నాకు ముందే ఫోబియా! అంత ఎత్తు నుండి క్రింద నున్న రోడ్స్ భవనాలు కన్పిస్తుంటే దాని మీద నడవాలంటే భయపడిపోయాను. మన బరువు ఆపుతుందా అన్న సందేహం నాకు! అలా కాదు అని చెప్పినా నాకు ధైర్యం చాల లేదు. ఆ గ్లాస్ ర్యాంప్ కి దిగువున మరొక గ్లాస్ ర్యాంప్ కూడా ఉంది. అయినా నాకు ధైర్యం కలగ లేదు. నా భయం చూసి చాలా మంది నవ్వారు. చాలా అద్భుతమయిన దుబాయ్ ఫ్రేమ్ పర్యాటకులని బాగా ఆకట్టుకుంటుంది.
*****
(సశేషం)