నా అంతరంగ తరంగాలు-7
-మన్నెం శారద
ఈ సారి నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన మా పెదనాన్న గారి గురించి చెబుతాను.
పెదనాన్న పేరు కొమ్మిరెడ్డి కేశవరావు. తెల్లగా, సన్నగా, నాజూకుగా వుండే ఈయన్ని పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరూ నమ్మరు.
ఇది వరకు కొన్ని ఎపిసోడ్స్ లో ఆయన గురించి ప్రస్తావించాను. పెదనాన్న పోలీస్ ఆఫీసర్ గా వున్నా ఆఁ కరకుదనం ఆయనలో ఎక్కడా కనిపించేది కాదు.
పిల్లలలో పిల్లవాడిలా కలిసి ఆడి పాడేవారు. BA (hons ) చేసిన ఈయన మంచి సాహిత్యప్రియులు.
మాకు అర్ధం అయినా కాకపోయినా షేక్స్ పియర్ డ్రామాలు, సత్యజిత్ రాయ్ సినిమాల గురించి కూర్చోబెట్టి చెప్పేవారు. పధేర్పాంచాలి గురించి ఆయన నోటి నుండే విన్నాను.. శాంతారాం సినిమాలు చూపించారు.
ఆయన రేడియోగ్రామ్ నుండే ఎవరో ఏమో సరిగ్గా తెలియకపోయినా సైగల్, పంకజ్ మల్లిక్, రాజేశ్వర రావు, బాలసరస్వతి గారి పాటలు విన్నాం.
ఆయన క్యాంపు నుండి వస్తే మాకు భలే సందడి. మాడగుల నేతి మిఠాయిలు తెచ్చి కూరి కూరి అందరికీ తినిపించేవారు. సాయంత్రం నాలుగు గంటలకు చెగోడీలు, బజ్జీలు, జంతికలు తీసుకుని ఒక తాత వచ్చేవాడు. పెదనాన్న వుంటే అవన్నీ ఇక్కడే అమ్ముడు పోయేవి.
అందరికీ పెట్టడం ఆయనకీ ఆనందం! పిల్లలందర్నీ చేరదీసి మా మండువా ఇంటి ముందు ఉన్న స్థలంలో ఆటల పోటీలు పెట్టేవారు. నెత్తిమీద నీళ్ళ చెంబు పెట్టుకుని కుంటుతూ పరిగెత్తడం, కళ్ళకు గంతలు కట్టుకుని దొంగని పట్టుకోవడం… ఇలా ఏవేవో ఆటలు ఆడించేవారు.
నేను ఆటల్లో ఎప్పుడూ ఓడి పోవడమే!
పైగా నవ్వు!
మా పెదనాన్నగారి మూడో అమ్మాయి సౌదామిని గెలిచేది. పెదనాన్న ఆఁ రోజుల్లోనే 1st ప్రైజ్ పది రూపాయిలు ఇచ్చేవారు. ఓడిపోయినా నాకు కూడ ఇచ్చేవారు. అది చూసి సౌదా గొడవ చేసేది. దాని గొడవ పడలేక తర్వాత తర్వాత రహస్యంగా ఇవ్వడం మొదలు పెట్టేరు.
రెండో కూతురు మణిమాలంటే ఆయనకు చాలా ఇష్టం. కలకత్తా, బాంబె వెళ్ళి నప్పుడు ఖరీదయిన బట్టలు, నగలూ, కాస్మెటిక్స్ తెచ్చేవారు.
మా హేమక్క వాళ్ళింట్లోనే పెరిగింది. తనని కూడా వారి పిల్లలతో పాటు సమానంగా చూసేవారు.
నాకు రాయడం ఇష్టమని తెలిసి చిన్నతనంలోనే ఒక దస్తా తెల్లకాగితలు, ఒక డిక్షనరీ కొనిచ్చారు.
అమలాపురంలో జాబ్ చేసేటప్పుడు మా పిల్లలనందర్నీ కారులో కోటిపల్లి రేవు గుండా అమలాపురం తీసుకెళ్ళేవారు. ఆఁ ప్రయాణం భలే ఉండేది. రేవు రాగానే రెండు నాటుపడవల్ని కలిపి గట్టిగా తాళ్ళతో కట్టి జాయింట్ చేసేవారు. కారు తిన్నగా మాతోసహా బోటుల్లోకి వెళ్లిపోయేది.
మేము కేరింతలు కొడుతూ అందులో ప్రయాణం చేసేవాళ్ళం. ఆపద, భయం తెలియని వయసు! గోదావరిలో అలా సాగిపోతుంటే చేపలు ఎగురుతూ పైకొచ్చి నీళ్ళలో పడుతుండేవి. వాటిని పట్టాలని కొంగలు, ఇంకా ఏవో పేరు తెలియని రకరకాల పక్షులు నీటికి దగ్గరగా ఎగురుతుండేవి.
ఆలా ఓ లంకలో దిగేవాళ్ళం. అక్కడ మా కోసం ఒక టెంట్ వేసి అర్థర్లీలు రెడీగా ఉండేవారు. అక్కడ భోజనాలు చేసి, కొబ్బరి బొండాలు తాగి పెదనాన్న ఈతకొడుతుంటే వడ్డున కూర్చుని చూసే వాళ్ళం.
అలా చీకటి పడేలోపున తిరిగి కారెక్కి అమలా పురం చేరేవాళ్ళం.
అమలాపురంలో పెదనాన్న క్వార్టర్స్ కి SP గారి క్వార్టర్స్ కి మధ్యలో గోదావరి కాలువ ఉండేది. బ్రిడ్జ్ కొంచెం దూరంగా ఉండేది.
అటూ ఇటూ ఫైల్స్ తీసుకెళ్ళడానికి, అవసరమైతే SP ని కలవడానికి మధ్యలో చెక్క గది వున్న బోట్ ఉండేది. అందులో ఒక కాన్స్టేబుల్ ఉండేవాడు. పెదనాన్న వూళ్ళో లేనప్పుడు మేం ఆఁ బోటెక్కడం అటూ ఇటూ నడపమనడం.. ఇదే ఆట!
ఒక శివరాత్రికి పెదనాన్న ముమ్మిడివరం తీసుకెళ్ళి బాలయోగిని చూపించారు.
అతన్నిచూసి నా వళ్ళు జలదరించింది. ఆఁ జడలు కట్టేసి మురికోడుతున్న జుట్టు, పొడుగ్గా పెరిగి, పాలిపోయి విరిగిపోయిన గోళ్ళు, చిన్న గోచీ లాంటి నీటికావి పంచె, మడతేసుకుని చుట్టబెట్టుకుని ఒకదానితో మరొకటిగా అల్లుకుపోయిన కాళ్ళు… ‘వామ్మో ఇలా ఏళ్లతరబడి కూర్చుని ఏం సాధిస్తాడీయన ‘ అనుకున్నా.
జనం చూస్తే తండోపతండాలు!
మా పెద్ద మామయ్య తహసీల్దార్ గా ద్రాక్షారామంలో చేస్తున్నప్పుడు ఆయన ద్రాక్షారామం బాలయోగిని చూపించారు. ఆయనా సేమ్ టు సేమ్ ! “నాకు శివుడి దర్శనం చేయించారు తెలుసా? ” అని మామయ్య చెబితే నేను పకాపకా నవ్వి “నువ్వు పిల్లికిబిచ్చం పెట్టవు, నీకు శివుడు కనిపించాడా?”అని అడిగాను.
ఆమాటకు మా అత్తకు కోపం వచ్చి “నోటికి ఎంతమాటొస్తే అంత మాటా అనేస్తావు. పెద్దాచిన్నా లేదు “అంది కోపంగా.
“ఆ.. పెద్దాచిన్నా, ఎన్నిసార్లు కాళ్ళు పట్టించుకుని డబ్బులిస్తానని ఎగ్గొట్టేడో… పైగా ఇంతంత లావు కాళ్ళు!”అని ఇంటికి పరిగెత్తుకుని వచ్చేసాను.
మా పెదనాన్నాకి చెబితే నవ్వి ఆలా అనకూడదే “అన్నారు.
నర్సీపట్నంలో ఉన్నప్పుడు చింతపల్లి ఫారెస్ట్ చూపించారు. అక్కడే ఏనుగుమీద తిరిగింది!
ఒకసారి పెదనాన్న కోర్ట్ పనిమీద బాపట్ల వెళ్తున్నారట. రైలు కదిలిపోతుంటే గబగబా ఒక కంపార్ట్మెంట్ ఎక్కేసారట. అది కలెక్టర్ ఉన్న స్పెషల్ బోగి అట. అతను బ్రిటిష్ వాడు!
వెంటనే విపరీతంగా ఇరిటేట్ అయిపోయి ” Get out!”అని గట్టిగా అరిచాడట.
పెదనాన్న అర్జెంట్ గా కోర్ట్ కి అటెండ్ అవ్వాలని తొందరలో ఎక్కానని దిగిపోతానని ఎంట్రన్స్ లో నిలబడి చెప్పినా వినకుండా ” bastard, అంటూ ఏవేవో ఇంగ్లీష్ తిట్లు తిట్టేడట.
పెదనాన్న ఓపిక పట్టి స్టేషన్ రీచ్ అవుతుండగా నడుంకున్న బెల్ట్ తీసి అతన్ని నాలుగు ఈడ్చి కొట్టి” బ్రిటిష్ కుక్క “అనితిట్టి ప్లాటఫార్మ్ మీదకు దూకి వెంటనే రైల్వే స్టేషన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ‘డ్యూటీ లో ఉండగా కలెక్టర్ నా మీద చెయ్యి చేసుకున్నాడు’ అని FIR బుక్ చేశారట!
కలెక్టర్ తెల్లబోయి “ఇండియన్ పీపుల్ ఎంత తెలివైన వాళ్ళు!”అన్నాడట ఆశ్చర్య పోతూ .
ఇప్పుడయితే ఉద్యోగాలు తీయించి మర్దర్లు చేయిస్తారు.
పెద నాన్న కొతగూడెంలో పనిచేసేటప్పుడు ఒక తమాషా జరిగింది. అక్కడంతా అడవిలో నక్సలైట్స్ ఉండేవారట.
అప్పట్లో వాళ్ళ చర్యలు అతి కిరాతకంగా ఉండేవి. పెదనాన్న ఒకసారి అడవిలో ఒక పెద్ద రాతిక్రింద బంగారు నగలతో దాచిన పెద్ద ట్రంకు పెట్టె తెచ్చి ట్రెజరీకీ హ్యాండోవర్ చెయ్యడానికి వెళ్ళేలోపున టైం అయిపోయిందని నిరాకరించారట.
చేసేది లేక ఆయన ఆఁ పెట్టెని తెచ్చి ఇంట్లో మంచం క్రింద దాచేరు. అది నాకు గుర్తుంది. ఆ నగలు చూసిన మా దొడ్డమ్మకు, కృష్ణక్కకు మణక్కకు గుండె ఝల్లుమన్న దట. కారణం అవన్నీ చాలా నిర్దాక్షిణ్యంగా నగలతోపాటూ ముక్కు, చెవులు చేతులు, కాళ్ళూ నరికి తెచ్చినవట, మా దొడ్డమ్మా, అక్కలూ ఆఁ పెట్టె ఇంట్లో పెట్టినందుకు ఒకటే ఏడుపు!
ఎక్కడ ఈ విషయం పసిగట్టి వాళ్ళు వచ్చి చంపేస్తారోనని. వాళ్ళ ఏడుపు చూసి అర్ధం కాకపోయినా నేనూ ఏడ్చా.. భయంతో.
పెదనాన్నకు కూడా కొంచెం భయంగానే వుంది కాబోలు… మమ్మలనందరినీ లోపలికి పోయి తలుపేసుకోమని చెప్పి ఆయన డోర్ క్లోజ్ చేసి ఎదురుగా చైర్ వేసుకుని ఫుల్ గా లోడ్ చేసిన రైఫిల్ పట్టుకుని కూర్చున్నారు.
అంతా నిశ్శబ్దం…
భయం… భయం!
ఒక్కసారిగా తలుపు టకటకలాడింది.
మళ్ళీ అందరూ నోరునొక్కుకుని ఏడుస్తున్నారు.
పెద నాన్న డోర్ తెరిచారు.
ఎదురుగా పెదనాన్నవాళ్ళ పెంపుడుకుక్క!!
పెద్ద రిలీఫ్!
మర్నాడు పెట్టెని ట్రెజరీ లో హ్యాండోవర్ చేశారు.
ఎక్కడ పనిచేసినా పెదనాన్నని ఎవరూ ఏమీ చెయ్యలేదు. కారణం పెదనాన్న వాళ్ళను పిలిపించి మంచి మాటలు చెప్పి డిన్నర్స్ ఇచ్చి సామాన్య జనావాళిలో కలిపేవారట.
అలానే స్టూవర్ట్ పురం దొంగలని కూడా.
కొత్తగూడెంలోనే మాకు ఆఫీసర్స్ క్లబ్బులో నాటకం వేస్తున్న వేమూరిగగ్గయ్య గారిని కూడా చూపించి “పిల్లలు ఝడుసుకుంటున్నారయ్యా, నీ విగ్గుతీసి అసలు రూపు చూపించు “అన్నారు. ఆయన అలానే చేసి తను పట్టుకున్న గద నా చేతికిచ్చారు.
అదసలు బరువే లేదు. పేపర్ మెష్ తో చేసిందది!
ఇంట్లో అప్పటి వైశ్రాయ్ ఇచ్చిన బంగారు పతకం, బంగారు రేకు మీద ఆయన తెలిపిన అభినందనల ఫోటో ఫ్రెమ్ చేసింది ఉండేవి కానీ పెదనాన్న వాటి గురించి ఏనాడూ చెప్పేవారు కాదు.
గుంటూరులో నేను కొద్దిరోజులు పని చేసిన ఫామిలి ప్లానింగ్ ట్రైనింగ్ సెంటర్ ఇంటి ఓనర్ ఒక సీనియర్ లాయర్. ఆయన పై అంతస్థులో ఉండేవారు. ఒకసారి ఆయన తనయింటి plinth area కొలిచి చెప్పమని రిక్వెస్ట్ చేశారు. మా మేడం పర్మిషన్ తో. నేను ఔటర్, ఇన్నర్ వాల్స్ తో measure చేసి ఇచ్చాను. ఆయన చాలా సంతోషపడి నా వివరాలు అడిగి “కేశవరావు తోడల్లుడి కూతురివా.. ఎంత మంచివాడో.. అంత తెలివైన వాడు. రోజూ ఎలాగయినా ఈ రోజు కేశవరావుని ఫూల్ చేయాలని క్లబ్బులో ఎదురు చూసేవాళ్ళం., కానీ దొరికేవాడే కాదు. తిరిగి మమ్మల్నే ఫూల్ చేసి నవ్వుతూ వెళ్లి పోయేవాడు “అనిచెప్పి పెదనాన్న చనిపోయారని తెలిసి చాలా విచారించారు. ఎంత చెప్పినా నాకు తనివి తీరని మహామనీషి మా పెదనాన్న…
*****
(సశేషం)
నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.