చేస్తున్న పనిలో మనసు నిమగ్నం చేయాలని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఆమె వశం కావడం లేదు. కూతురు నిష్కల పదేపదే కళ్ళముందు నిలిచి కలవర పరుస్తున్నది.
అది కూతురు మీద బెంగ నా? లేక ఆమె ఎంచుకున్న జీవన మార్గం పైన ఉన్న అనేకానేక అనుమానాలు, భయాల వల్లనా? కళ్ళ నిండుగా ఒక సారి బిడ్డను చూస్తే, ఆమె సహచరుడిని కలిస్తే ఆ బెంగ తీరుతుందేమో!
అక్కడ వేల మైళ్ళ దూరంలో ఉన్న నిష్కల కూడా తల్లి ఆత్మీయ స్పర్శ కోసం తపించిపోతోంది. అందుకే తల్లిని రమ్మని చాలా సార్లు కోరింది. గ్రాడ్యుయేషన్ అప్పుడే వీసాకి అప్లై చేసింది. పది సంవత్సరాల వీసా ఇచ్చారు. కాబట్టి ఎప్పుడైనా తల్లి రావచ్చు పోవచ్చు అని సంతోషపడింది నిష్కల.
కానీ శోభ ఒక్కసారి కూడా కూతురు దగ్గరకు వెళ్ళే ఆలోచన చేయలేదు.
మనిషికీ మనిషికీ మధ్య దృఢమైన సంబంధాలు ఉండాలని భావించే శోభ అత్త సుగుణమ్మని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అని అనడం కంటే జీవితపు తొలిదశలో కలల ప్రపంచంలో విహరించే రోజుల్లో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాల వల్ల వెళ్ళక పోయి ఉండొచ్చు.
నిష్కలను చూడాలన్న బలమైన కోరిక నియంత్రించుకుంటూ ప్రతి రోజూ మాట్లాడుతూ, వారానికో పదిహేను రోజులకో వాట్సాప్ లో చూస్తూ తృప్తి పడుతున్నది.
తల్లి మదిలో చెలరేగి అస్థిరపరిచే సందేహాలు ఆ బిడ్డకు అర్థమవుతూనే ఉన్నాయి. అయితే మనుషులు, మనసులు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఖచ్చితంగా మార్పు వస్తుందని నమ్ముతుంది ఆ బిడ్డ. అదే తల్లితో చాలా సందర్భాల్లో చెప్పింది కూడా. అందుకు ఉదాహరణగా తల్లినే చూపిస్తుంది ఆ బిడ్డ.
నిజమే, నిన్ను నువ్వు చూసుకో .. ఎలా ఉండేదానివి ఎలా మారిపోయావు. ఈ మార్పు నీవు ఊహించావా ఎప్పుడైనా ..అంటుంది శోభ లోపలి మనిషి.
నిషి చెప్పిన దాంట్లో కాదు అనడానికి, వాదించడానికి ఏమీ కనిపించదు శోభకు.
అటు వంటి సమయాల్లో శోభను ఆమె లోపలి మనిషి అనేక ప్రశ్నలు వేసి తికమక పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి మొట్టికాయ వేసి చెబుతూ ఉంటుంది. బావని ఎప్పుడో క్షమించేశావ్. అత్తను దగ్గరకు తీసుకున్నావ్. మరి, అమెరికా వెళితే ఏమవుతుంది. వెళ్ళు. నీ బిడ్డ దగ్గరికి నువ్వు వెళ్ళు. నీ కూతురి కోసం నువ్వెళ్ళు. అత్తగారిని సాకుగా చూపి ఎన్నాళ్లని నిషిని మభ్య పెడతావ్. నీ అత్తకు ఆమె కడుపు చించుకు పుట్టిన కొడుకులు, కూతురు ఉన్నారుగా.. నీవు లేకపోతే ఎవరూ లేనట్టు అతి చేస్తున్నావ్ అంటూ చివాట్లు వేసింది అంతరాత్మ.
రేపు మనవడో మనవరాలో వచ్చే క్షణాలలో కూడా అలాగే మీనమేషాలు లెక్క పెడుతూ ఉంటావా…
లేదు కదా.. ఎగిరి గంతేసి బయలుదేరతావు కదా .. అత్తగారికి ఏదో ఒక ఏర్పాటు చేస్తావు కదా… ఇప్పుడు అదే చెయ్యి అని బోధించింది శోభ లోపలి మనిషి.
నాన్నమ్మ వంక చెప్పావంటే ఊరుకోను. అమ్మా నేను నీ మీద అలుగుతున్నాను. నాన్నమ్మకి ఇచ్చే ప్రాధాన్యత నీ కూతురికి లేదా? అంతేలే.. అంటూ చాలాసార్లు నిష్టూర మాడింది, రెచ్చగొడుతుంది నిషి. ఏ విధంగానైనా తల్లిని అమెరికా రప్పిస్తే దేశమంతా తిప్పి చూపించాలని, క్రూయిజ్ కి వెళ్లాలని, సారాతో కలిసి అమ్మ వచ్చినప్పుడు ట్రెక్కింగ్ కు వెళ్లాలని క్యాంపింగ్ చేయాలనీ ఏవేవో ఊహలు చేసింది నిష్కల. కానీ, ఇప్పటి వరకు తల్లిలో కదలిక లేదు. ఎంత కోపగించుకున్నా చాలా సంయమనంతో మాట్లాడుతూ నన్ను మాయ చేసేస్తుంది అమ్మ.
గతంలో ఉన్న వీసా సమస్యలు ఇప్పుడు లేవు. నేనే వెళ్ళాలి. అమ్మ దగ్గరకు వెళ్ళాలి. అంకిత్ తో వెళ్ళాలి. వీలైతే అంకిత్ వాళ్ళ అమ్మ నాన్నలను కూడా తీసుకు పోవాలి. అమ్మకు ముందుచెప్పకుండా వెళితే..
సారా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తల్లి పట్ల ఎంతో సన్నిహితత్వం ఏర్పడిం ది. ఆవిడ ఇప్పటి వరకు ఎవరినీ చూడకపోయినప్పటికీ తన అత్తింటి కుటుంబాన్ని తలుస్తూ ఉన్నది. వాళ్ళని చూడాలని ఆత్రుత పడుతున్నది. లోన తప్పు చేసిన భావన గూడు కట్టుకుని రోజు రోజుకి పెరిగిపోతున్న భారం మోస్తున్నది. ఆ భారం దించే బాధ్యత నేనే తీసుకోవాలి.
సారాకి కూడా తన తండ్రి కుటుంబంతో సంబంధ బాంధవ్యాల కోసం తహతహ లాడుతున్నది. తన తండ్రి రక్త సంబంధీకులందరిని కలవాలని, వారితో తండ్రి గురించిన జ్ఞాపకాలు పోగేసుకోవాలని ఆరాట పడుతున్నది.
సారా, వాంగ్ లను కూడా తీసికెళ్ళి కుటుంబాన్ని పరిచయం చెయ్యాలి. లేదంటే వాళ్ళు ఎప్పటికీ దూరంగా, పరాయి వారిగానే మిగిలిపోతారు.
బాబాయ్ వాళ్ళని కూడా రమ్మని చెప్పడానికి ఒక అకేషన్ కావాలి. అంటే అంకిత్ తో తన రిలేషన్ తెలుపుతూ గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో .. ఆ విధంగా కుటుంబం అంతా వచ్చిన తర్వాత సారా, వాంగ్ ల విషయం చెప్పొచ్చేమో .. అమ్మకు తెలియకుండా సర్ప్రైజ్ చేస్తూ ప్లాన్ చేయాలి అనుకుంది నిష్కల.
మామూలుగా కుటుంబం స్త్రీని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. మామూలు కంటికి కనిపించని హద్దులు సరిహద్దులు చుట్టూ.. ఇష్టం లేకున్నా కలిసి జీవించేటట్లు చేస్తుంది. తన పని తాను చేసుకోకుండా చేస్తుంది. కానీ నన్ను ఏ విషయంలో నియంత్రిం చే వారెవరూ లేరు.
నిజమే, నిషి చెప్పినట్టు సాగే ప్రవాహంలా జీవించాలి. కొన్నింటిని కలుపుకుంటూ కొన్నింటిని వదిలేస్తూ ముందుకు సాగాలి. . పారిన జీవితంలో జీవనానుభూతుల్ని మూట కట్టుకోవాలి. నేర్చుకున్న అనుభవాలను, పోగేసుకున్న జ్ఞాపకాలు పదిల పరుచుకుంటూ సాగిపోవాలి. రేపు నిషితో మాట్లాడి తన నిర్ణయం చెబితే ఎగిరి గంతేస్తుందని ఆలోచిస్తూ నిద్ర ఉపక్రమించింది శోభ.