My Son’s Inheritance

పుస్తకాలమ్’ – 22

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

 

భారత సమాజపు చిత్రవధల, రక్తదాహాల చరిత్ర

మిత్రులారా, కోల్ కతా ప్రజాసాహిత్య ఉత్సవం గురించీ, కాకినాడ ప్రయాణ అనుభవాల గురించీ, ఇటీవల చదివిన మూడు నాలుగు పుస్తకాల గురించీ పంచుకోవలసిన సంగతు లెన్నో ఉన్నాయి గాని కాలక్రమాన్ని పక్కనపెట్టి అన్నిటికన్న ముందు తప్పనిసరిగా మీకు ఒక పుస్తకం గురించి చెప్పాలి. అందరూ తప్పనిసరిగా చదవాలని సిఫారసు చేయవలసిన పుస్తకం అది.

          కోల్ కతా ప్రజాసాహిత్య ఉత్సవం 2020లో పాల్గొనడానికి అల్లం రాజయ్యా నేనూ ఫిబ్రవరి 27 సాయంకాలం బయల్దేరాం. సెక్యూరిటీ చెక్ అయిపోయాక, విమానం ఎక్కేలోపు దొరికే అరగంటో గంటో ఎయిర్ పోర్ట్ పుస్తకాల దుకాణంలో గడపడం ఎప్పుడైనా బాగుంటుంది. కొత్తగా ఏ పుస్తకాలు వస్తున్నాయో, ఏ పుస్తకాలు కొనడానికి మధ్యతరగతి ఆసక్తి చూపుతున్నదో తెలిపే సూచికలు ఎయిర్ పోర్ట్ పుస్తకాల దుకాణాలు. ఆ పుస్తకాలు కొనడానికి ఇబ్బంది పడేంత ధరల్లో ఉంటాయి గాని పుస్తకాలు చూడడమూ, తిరగెయ్య డమూ దానికదే నయనానందం కదా. అలా మొన్న కూడ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డబ్ల్యు ఎచ్ స్మిత్ పుస్తకాల దుకాణంలో చూపులు తిప్పుతుండగా నా దృష్టిని ఒక పుస్తకం శీర్షిక, అంతకన్న ఎక్కువగా ఉపశీర్షిక ఆకర్షించాయి. My Son’s Inheritance – A Secret History of Lynching and Blood Justice in India. నా కొడుకుకు అందే వారసత్వం – చిత్రవధల, రక్తదాహాల రహస్య భారత చరిత్ర. రచయిత అపర్ణా వైదిక్ అనే చరిత్రకారిణి. ప్రచురణకర్తలు అలెఫ్ బుక్ కంపనీ. దాదాపు రెండు వందల పేజీల పుస్తకం. ముందు మాట, వివరణలు, కృతజ్ఞతలు, ఉపయుక్త గ్రంథసూచి వంటివన్నీ తీసేస్తే 140 పేజీల లోపే. తిరగేసి, అక్కడో వాక్యం ఇక్కడో వాక్యం చూసి, ఆసక్తి పెరిగి, కొనేసి, కోల్ కతా చేరేలోపు దాదాపు సగం చదివేశాను. తెలుగు సమాజ మేధో సంప్రదాయంలో చాలా వరకు తెలిసినవే, చాలా రోజులుగా చదువుతున్నవే, మాట్లాడుతున్నవే, చర్చిస్తున్నవే అయినా ఒక కొత్త చూపుతో, ఒక కొత్త పద్ధతిలో, ఒక్కచోట సంకలనం చేసిన అద్భుతమైన ఆలోచనా పరంపర అది. భారత సమాజం తనను తాను అహింసాత్మక సమాజాన్ననీ, సహిష్ణుత ఉన్న సమాజాన్ననీ గొప్పలు చెప్పుకుంటుంది గదా, ఈ సమాజ చరిత్ర గర్భంలో రహస్యంగా ఎంత హింస ఉన్నదో, ఎంత అసహనం ఉన్నదో అద్భుతంగా విశదీకరించిన పుస్తకం ఇది.

          నిజానికి ఇది ఒక చరిత్ర పుస్తకమే గాని, చరిత్రను శాస్త్రంగా కాక, తన కొడుకుకు ఉత్తరంగా రాశారు అపర్ణా వైదిక్. తన దేశాన్ని అర్థం చేసుకోవడానికి తన కొడుకుకు ఉపయోగపడాలనే కోరికతో రాసిన ఈ పుస్తకాన్ని “కనుక బాబూ, నీ తల్లిదండ్రుల కథ ఒక వర్ణసంకరపు కథ. భర్మాల్, బర్బరీకుడు ఇద్దరూ కూడ నీ పూర్వీకులు. మీ నాన్నా నేనూ వాళ్ళను మూర్తీభవించుకున్నాం. ఇప్పుడు నువ్వూ వాళ్ళను మూర్తీభవించుకున్నావు. ఇదే నీ వారసత్వం. నిర్వచనం ప్రకారమే వారసత్వం అంటేనే నువ్వుకోరి తెచ్చుకున్నది కాదు. కాని నీకు ఆ వారసత్వపు పగ్గం కట్టబడి ఉండగా, అది నిన్నేమీ నిర్బంధించదు. వారసత్వంలోని ఏ అంశాలను సొంతం చేసుకోవాలో, ఏ అంశాలను వదిలేయాలో, ఏ అంశాలను ఉత్సవం చేసుకోవాలో, ఏ అంశాల పట్ల దూరంగా ఉండాలో, చివరికి ఎదిరించి పోరాడాలో నువ్వు స్వేచ్చగా ఎంచుకోవచ్చు. నీ వారసత్వానికి నువ్వు ఏ అర్థం ఇస్తే ఆ అర్థాన్ని అది సంతరించుకుంటుంది” అని ముగించారు అపర్ణా వైదిక్.

          ఈ విప్లవాత్మక ముగింపుకు ముందు 140 పేజీల్లో ఎనిమిది అధ్యాయాల్లో ఆమె తన తాత ముత్తాతల గాథలు వివరించారు. గోరక్షణ కోసం ప్రాణాలిచ్చాడని ఐతిహ్యం ఉన్న తన పూర్వీకుడిని పరిచయం చేశారు. అక్కడి నుంచి ఆర్యుల వలస దాకా తవ్వుకుంటూ వెళ్ళారు. ఆర్యసమాజంతో ప్రభావితుడై, గోరక్షణ ఉద్యమంలో నాయకుడై, చివరికి తన ఇంటిపేరు వదులుకుని తనకు తాను “వైదిక్” అనే ఇంటిపేరు తెచ్చుకున్న తాత కథ చెప్పే క్రమంలో గోరక్షా ఉద్యమ రాజకీయాలు వివరించారు. ఆ వరుసలోనే ఎట్లా హింసా సంప్రదాయాలు ఒక సమూహాన్ని నిర్మించి బలోపేతం చేస్తాయో వివరించారు. ఆ క్రమంలో సమాజంలో, సమాజపు ఆలోచనల్లో హింస ఎట్లా అదృశ్యంగా, అంతర్లీనంగా మారిపోతుందో వివరించారు. గోరక్షణ పేరిట సాగిన ఈ హింసా సంప్రదాయానికి భిన్న మైన ఆర్యేతర ఊహాస్వర్గాలను కూడ వివరించారు. బర్బరీకుడు, శంభూకుడు, శూర్పణఖ, బలి వంటి ఉదాహరణల ద్వారా చరిత్ర పొడవునా ఏయే వర్గాలు, వర్ణాలు బాధితులుగా, బలిపశువులుగా మిగిలిపోయాయో వివరించారు. బహుశా మూడు వేల సంవత్సరాల ఈ సుదీర్ఘ ఘర్షణల, చిత్రవధల, రక్తదాహాల గతం ఇవాళ్టి వర్తమానంగా ఎలా పరిణమించిందో చూపారు. (ఇందులో గోగు శ్యామల కవిత ఒకటి ఉటంకించడం తెలుగువారికి గర్వకారణం!)

          ఈ విషయాలూ, ఇటు వంటి విషయాలూ ఎన్నోసార్లు చదివాను, స్వయంగా రాశాను, మాట్లాడాను. కాని ఇంత అద్భుతంగా, హృదయానికీ మేధకూ హత్తుకునేట్టుగా, క్లుప్తంగా, వ్యక్తిగత చరిత్రలాగ, ఒక శిశువుకు రాసిన ఉత్తరం లాగ చెప్పవచ్చునని ఇప్పుడే తెలుసు కున్నాను.

వీలైతే తప్పకుండా చదవండి.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.