పేషంట్ చెప్పే కథలు – 17

పారిజాతాలు

ఆలూరి విజయలక్ష్మి

          గాలి అల వేగంగా వచ్చి తాకింది. మంచు బిందువులు జలజలా రాలాయి. పారిజాతాలు పానుపు మీద మరిన్ని పారిజాతాలు రాలిపడ్డాయి. తెల్లటి రేకలు, ఎర్రటి కాడలు. ఎరుపు తెలుపు కలనేత తివాచీని చెట్టుకింద పరిచినట్లుగా వుంది.

          టెర్రస్ మీద నుంచుని పక్కింట్లోని పారిజాతాలు వంక తదేకంగా చూస్తూంది శృతి. ఇంద్రధనుస్సు లాంటి తన బాల్యం కళ్ళముందు కదిలింది. చీకటి తెరలు విచ్చిపో కుండానే పోటీగా ఒకరికంటే ఒకరు తామే ముందుగా వెళ్ళి అన్ని పువ్వులూ ఒడిలోకి ఏరుకోవాలని ఆత్రుతపడేవారు తన మిత్రబృందమంతా. పువ్వులు, నవ్వులు, గిల్లి కజ్జాలు, చిలికి చిలికి గాలివానై కొట్లాటలు, అంతలోనే కలిసిపోయి, హత్తుకుపోయి కబుర్లు. పారిజాతాల్ని మాలగా కట్టి తలనిండా పెట్టుకున్నన్ని పెట్టుకుని, మిగిలినవి దేవుడికిచ్చి, పూజారి పెట్టిన కొబ్బరి ముక్కలు నములుతూ ఇంటిదారి పట్టడం. ఎక్కడున్నారో ఆనాటి పూలబాలలంతా! పూల పరిమళంలా స్మృతుల సౌరభం చుట్టేసింది.

          తడిజుట్టును టవల్ తో తుడుచుకుంటూ తన్మయంగా చూస్తూంది శృతి. పక్కింటి వారి అమ్మాయి సుమలత పెరట్లోకి వచ్చి పెద్ద మెట్టతామర ఆకు కోసి, దోనేలా చేసి, అందులో పట్టినన్ని పారిజాతాల్ని తీసుకుంది. ఇంటి గుమ్మానికెదురుగా వున్న తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేసి, కళ్ళు అరమోడ్చి, దోసిటిలో పువ్వుల్ని చెట్టుమీద జల్లుతూ, మంద్ర స్వరంతో ఎమో చదువుతూంది. సన్నగా, నాజూగ్గా, అందంగా, విరిసిన పారిజాతం లా వుంది సుమలత. ధ్యానం ముగించి మళ్ళీ ఆకునిండా పారిజాతాల్ని ఏరుతూంది. మరో గాలితెర వచ్చి ఆమె తలమీద పువ్వుల్ని రాల్చింది. ఒత్తుగా ఉన్న ఆమె వెంట్రుకల్లో చిక్కుకున్న పువ్వులు నిశీధి గగనంలో నక్షత్రాల్లా వున్నాయి. పువ్వుల్ని తీసుకుని లేస్తూ శృతి టెర్రేస్ మీద నుంచి చూడటం గమనించి పలకరింపుగా నవ్వి నమస్కారంచేసింది. 

          మరో గంట తర్వాత శృతి కన్సల్టింగ్ రూంలో అడుగు పెట్టింది సుమలత. పావడా లు తొడుక్కుని, పట్టాల్ని ఘల్లుఘల్లున మోగిస్తూ కాళ్ళు నేలమీద ఆనకుండా చెంగు చెంగున గెంతే సుమలత, శృతి కల్లముందే వింత వింత శోభల్ని సంతరించుకుంటూ, కొత్తకొత్త సొంపుల్ని దిద్దుకుంటూ ఎదిగి అందాల బొమ్మలా అయింది. కలలుకనే కళ్ళతో, స్వచ్ఛమైన నవ్వుతో, అమాయకమైన చూపుల్తో, లోకమెరుగని పాపాయిలా తిరిగే సుమలతంటే శృతికి ఆప్యాయత, ఆత్మీయత.

          “కూర్చోమ్మా!” మౌనంగా కూర్చుంది సుమలత. తలంటుపోసుకుని వదులుగా వేసు కున్న జడలో పారిజాతాల మాల, తలమీద అక్షింతలు, నుదుట తిలకం బొట్టు కింద కను బొమ్మల మధ్య కుంకుమ, చేతిలో దేవుడి ప్రసాదం, వాడిన పారిజాతాలు, ముఖంలో అలసట. కళ్ళల్లో నీడలు. 

          “ఏమిటలా వున్నావు? ఒంట్లో బాగాలేదా?” మృదువుగా అడిగింది శృతి. 

          “గుండెల్లో నొప్పిగా వుంది” చెప్తూ ఉండగానే గద్గదమైంది సుమలత కంఠం. కళ్ళెత్తి శృతివంక బేలగా చూసి మళ్ళీ కళ్ళు వాల్చేసింది. 

          సన్నటి జ్వాల లేస్తూంది శృతి హృదయంలో. పక్కింటి శాస్త్రిగారి నాలుగో సంతా నం సుమలత. ఇద్దరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు అయ్యేసరికి మెడలోతు అప్పుల్లో మునిగిపోయాడు శాస్త్రి. సుమలతకు ముందు కుర్రాడు అస్తుబిస్తు చదువుతో అటు ఉద్యోగం దొరక్క యిటు కాయకష్టం చేయడానికి కులం, వంశం, పరువు, ప్రతిష్ట అడ్డొచ్చి ఊరంతా బలాదూర్ తిరుగుతున్నాడు. సుమలత తరువాత మరో ఇద్దరు అమ్మాయిలు.

          సుమలత వ్యక్తురాలవగానే చదువు మానిపించి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. యింట్లో పూటగడిస్తే చాలు బ్రహ్మానంద పడిపోతున్న పరిస్థితిలో పెళ్ళి విషయంలో ఎవరు గొంతెమ్మ కోరికలు కోరుకోవడం లేదు. చూస్తూ చూస్తూ పస్తులతో కాలం వెళ్ళమార్చే సంబంధం చేయలేక పోతున్నారు. రెండు పూటలా కడుపు నింపగల స్థోమత వున్నవాడు వేల కట్నాలడుగుతున్నాడు. చివరకు పెళ్ళిచూపులు, ఆశలు పేర్చుకోవడాలు, తిరస్క రింపులు, కుమిలి పోవడాలు మిగులుతున్నాయి. కొత్తలో తెలిసీ తెలియక సంతోషంగా, ఉత్సాహంగా, ఆశగా పెళ్ళిచూపులకు సిద్దపడే సుమలత ఇప్పుడు వధ్యశిల నెక్కబోయే చిన్నారి మేకపిల్లలా గడగడలాడిపోతూంది. 

          శృతి దగ్గర యివన్నీ చెప్పుకుని ఏడ్చింది సుమలత తల్లి కావేరి. శృతినింకా బాధిం చిన విషయం ఏడాదిగా వారానికి రెండురోజులు సుమలత దేవాలయం చుట్టూ రోజుకు నూటొక్క ప్రదక్షిణాలు చేసి తన పెళ్ళి గురించి దేవుణ్ణి ప్రార్థించడం.

          అప్పుడప్పుడూ నీరసమో, తలనొప్పో కడుపునొప్పో అంటూ శృతి దగ్గరకు వస్తుంది సుమలత. అప్పుడా అమ్మాయిని కదిలించింది శృతి. 

          “రోజంతా ఏం చేస్తావు నువ్వు? ప్రయివేటుగా ఎందుకు చదువుకో కూడదు?”

          “మా యింట్లో ఒప్పుకోరు. పుస్తకాలు, ఫీజులు… డబ్బెక్కడిది?” సంకోచంగా ఆగింది. 

          “పెళ్ళి చూపుల ఫలహారాల ఖర్చుతో చులాగ్గా రెండేళ్ళ చదువయిపోతుంది. ఇంట్లో వాళ్ళ సంగతటుంచు. అసలు నీ బ్రతుకుని చక్కదిద్దుకోవాలనే పట్టుదల నీ కుండాలి. పెళ్ళయితే సరే. కాకపొతే?! నీ భవిష్యత్తేమిటి, ఆలోచించుకోవద్దా?!”

          “ఏమో! అవన్నీ ఆలోచించాలంటే నాకు భయం” అంతా విని ఈ జవాబిచ్చి భీత హరిణంలా పరుగెత్తింది సుమలత. 

          తరువాత చాలాసార్లు ఆ అమ్మాయిని చదువుకోమని ప్రోత్సహించింది శృతి.  ఆ మాటెత్తగానే ఏదో ఉపద్రవం ముంచుకు రాబోతున్నట్లు పారిపోయేది సుమలత. ఇటీవల ఆ అమ్మాయి సాధించిన కొత్త అభివృద్ధి తరచూ గుండెనొప్పి రావడం. ఆ గుండెనొప్పికి కారణం శృతికి తెలుసు. కడుపు నిండని తిండి, మెదడుని తొలిచేసే ఆలోచనలు, గుడి చుట్టూ ప్రదక్షిణాలు, తనచుట్టూ ఉన్న చాంధసత్వాల్ని, మూర్ఖత్వాల్ని ఛేదించుకుని రాలేని పిరికితనం, రవ్వంత సంతోషాన్నీ, సౌఖ్యాన్నీ అనుమతించని పరిస్థితులు, హృదయాన్ని చిత్రవధచేసే ఆశాభంగాలు… ఏ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ సుమలత గుండె నొప్పికి కారణాల్ని తెలుపగలుగుతుంది? యెంత సున్నితమైన స్టెతస్కోప్, యెంత శక్తివంతమైన ఎక్స్-రే మెషీన్ సుమలత గుండెలోని అనారోగ్యాన్ని స్పష్టం చేస్తాయి!

          “లతా!” ఆప్యాయంగా పిలిచింది శృతి. మెల్లగా కళ్ళెత్తింది సుమలత. ఇప్పుడా కళ్ళల్లో భయం, బెదురూ లేవు. ఏదో నిశ్చయం, తెగింపు కనపడుతున్నాయి. 

          “పుస్తకాలు కొనిపెట్టమంటావా?” సుమలత ఎప్పటిలా పారిపోలేదు. ఆమె పెదాల చివర సన్నటి హాసరేఖ మెరిసింది.  

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.