బతుకు చిత్రం-32
– రావుల కిరణ్మయి
జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత
***
ఆ రోజు ఉదయాన్నే దేవత వచ్చింది. కమలను హాస్పిటల్కు తీసుకురావాలని గుర్తు చేయడానికి. జాజులమ్మ పై కోపం చేసింది. ఊర్లో పెట్టిన ఉచిత వైద్య శిబిరానికి ఎవరూ రానందుకు.
జాజులమ్మ శాంతింపజేసింది. తానూ విడిగా వచ్చి కలుస్తానని చెప్పింది. కమలకు సీమంతం చెయ్య బోతున్నామని తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పింది.
దేవత కూడా ఆసుపత్రిలో గర్భిణులకు సామూహిక సీమంతాలు ఉంటాయని నేను ముందుగానే తెలియజేస్తానని ఆ రోజు మాత్రం రాకుండా ఉండకూడదని చెప్పి వెళ్ళింది.
***
కమలను తీసుకొని సైదులు ఆసుపత్రికి బయలుదేరాడు. ఆ రోజు ఊరి బస్సు రావడం లేదని తెలిసి బండి అడుక్కొని బయలుదేరాడు.
ఊరు దాటుతుండగా డప్పు చప్పుళ్ళతో అమ్మోరి బోనం ఎదురయింది. పెళ్ళి బోనం లా ఉంది. అందరూ పట్టుచీరల తళతళలతో పసుపు, కుంకుమలతో మెడతిరుగని నగలతో ఎదురచ్చేసరికి చాలా ఆనందించి, ఆ ఆనందంతోనే మనమూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని అడిగింది.
ఇలా ఉన్నప్పుడు గుడికి పోరాదంటరు కదా !అన్నడు.
అందుకా? లేకుంటే నాతో రావడం నచ్చుతలేదా?
నచ్చక పోవడమేమిటి? నచ్చనిదే నేను తీస్కపోతన్నా? అన్నాడు.
నిజానికి జాజులుతో ఎన్నడూ సరిగ్గా గుడికి పోనోడు కమలతో పోవడానికి కొంచెం ఇష్టంగా కూడా లేక అలా చెప్పి, రద్దీగా ఉండడంతో తానె వెళ్ళి బొట్టు తీసుకొని వచ్చి పెట్టాడు.
కమల మాట్లాడలేదు. బయట నుండే దండం పెట్టుకొన్నది.
ఆసుపత్రి చేరుకున్నారు.
పరీక్షలు పూర్తయ్యాక సైదులుతో డాక్టరమ్మ, చాలా నీరసంగా ఉన్నదని, పాలు, చేపలు, గుడ్లు, ఆకుపచ్చని కూరగాయలు లాంటి బలమయిన పోషకాహారం తినిపించం డి, బాగా విశ్రాంతి ఇవ్వండి అని చెప్పింది.
అన్నిటికీ తల ఊపి బయటికి వచ్చాడు.
జాజులమ్మను తానెప్పుడు ఇలా తీసుకురాలేదు. అంతా అమ్మనే చూసుకుంది. కమల ఆశ పడినట్టుగానే తను కూడా ఆశ పడి ఉంటుందా? అని ఎన్నో ప్రశ్నలు తనలో కలిగినా, అన్నిటికీ ఒక్కటే సమాధానం తానెప్పుడూ ఆమె పట్ల శ్రద్ధ చూపించలేదనేది పాపం! అయినా ఏనాడూ ఆ వెలితిని కనపడనీయలేదు. పైగా మామూలు మనిషికి మల్లే అన్ని పనులూ చక్క బెట్టింది. ఇప్పటికయినా తనను చూసుకోవాలి తన మనిషిగా అమ్మకు మల్లే అనుకున్నాడు లో లోపల.
ఉచితంగా ఇస్తున్న మందులు తీసుకున్నారు.
అప్పుడే అక్కడికి దేవత వచ్చింది. కమలను పలకరించింది.
అక్కడ ఉన్న మరొక సిస్టర్ ను పిలిచి, తన గది చూపించమని చెప్పి, నువ్వు కాసేపు అందులో రెస్ట్ తీసుకో! నేను మీ ఆయనతో మాట్లాడాలి అని పంపించింది.
ఇలా రా! అని ఆసుపత్రిలో విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన చిన్నపాటి తోటలోకి తీసుకెళ్ళింది.
చాయ్ ఏమైనా తాగుతావా? అడిగింది.
అవసరం లేదు. చెప్పండి, కమలను గురించేనా?
కాదు,
మరి, ఏదైనా ఎగిరంగా చెప్పుండ్రి. నేను బండి అడుక్కొని వచ్చిన, వాళ్ళు ఎదురు చూస్తుంటారు.
నేను దీని గురించి ముందుగాల జాజులుతోనే మాట్లాడుదామనుకున్న. కానీ, ధైర్యం చాల్తలేదు.
ఎందుకు? అంత కానిపనా?
కానిదో, అయ్యేదో నువ్వే చెప్పు. ఇంతకు ముందు కమలను చూసిన డాక్టరమ్మకు పిల్లలు లేరు. తాను ఒకమ్మాయిని పెంచుకోవాలని చూస్తున్నది. ఇష్టపూర్తిగా ఇస్తే వారికి తగిన సహాయం కూడా చేయాలని అనుకుంటున్నది.
అయితే,
అయితే అమ్మకు పాణం మంచిగుంత లేదు కదా! అదేదో మీ బిడ్డను ఒగరిని ఈమెకు ఇస్తే పెంపకం తీసుకొని తన బిడ్డలాగ చేసుకొని మంచిగా సదువు, తిండి, బట్ట పెడుతది గదా? అని …
ఆమె మాటలు పూర్తిగాక ముందే,
సైదులు చివ్వున లేచి, నీ బిడ్డయితే ఇచ్చేదానివా? నా బిడ్డలు దప్పితే నీకుఎవ్వలు కండ్ల వడలేదా? మమ్మల్ని చూత్తే పిల్లలను అమ్ముకునేటొళ్ళ లెక్కన కనవడుతున్నమా? మా పొలగాండ్లు అంత ఎట్టికి ఉన్నరనుకుంటానవా? నా తోని అన్నావు గని మా జాజులు తోని గ్గిన అనకు. గుండాగుతది.
నువ్వు దేవతవని పేరుకు తగ్గ మనిషివని మురుస్తాండ్రు, వాళ్ళ నమ్మకం వమ్ము చేసుకోకు. రెక్కలు ముక్కలు చేసుకొని నా మీద ఆశలు వేట్టుకోక వాళ్ళను సాదుకుంటు న్నరు మల్లగిన మాట్లాడేవు, అని కోపంతో ఊగి పోసాగాడు.
దేవత నిదానంగా,
పిల్లల మీద పావురంతో నువ్విట్ల మాట్లాడుడు కరెక్టే! నువన్నావు జూడు నీ పిల్లల యితే ఇద్దువాని? ఖచ్చితంగా ఇద్దును. నా తరుపున మా సుట్టాలల్ల ఉన్నోల్ల నియ్యడానికే ప్రయత్నం జేసిన. గని, ఆయమ్మ మొన్న మనూరికి ఉచిత పరీక్షలు చెయ్యడానికి వచ్చినప్పుడు నీ బిడ్డను దీసుకొని అవ్వ వస్తే చూసినప్పటి నుండి చాన కాయిషు పడిం ది. ముత్యమోలె ఉన్నగా బిడ్డను అడుగుమని నాకు చెప్పింది. నాకు సుత మొదలు నచ్చలే, కని ఆలోచించిన కొద్ది మంచి రాత ఉంటది గదా అని అనిపించసాగింది, గని మనూర్లె ఆ వసంత కథ లెక్కన నన్ను కూడ అయితదాని? ఎనుక ముందు ఆడుతాన.
మీకు ఇప్పటికే మ్ముగ్గురు బిడ్డలు. ఇప్పుడు కమలకు కూడా ఆడ పిల్లలే పుడితే సంగతేమిటి? వాళ్ళందరినీ ఎలా సాదుతారు. మహా అయితే ఆకలి తీర్చగలరేమో కాని మిగతా అవసరాల మాటేమిటి? కమల ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటుందా? అనేది కూడా ప్రశ్నే? ఆ పరిస్థితుల్లో ఇలా చేయడంలో తప్పేమిటి? అనిపించి చెప్పాను.
నువ్వెలా చెప్పినా నాకు ఆ యావ లేదు. ఇక వదిలేయి……
బిడ్డలెంత ముఖ్యమో తల్లి కూడా అంతే కదా!……
కావచ్చు, కానీ అలా చేయడం మా అమ్మ గూడా ఒప్పుకోదు ఇగ వదిలేయ్ అంటూ అక్కడి నుండి కదిలాడు.
దేవత అతడినే చూస్తూ ఉండి పోయింది.
సైదులు కమలను పిలుచుకు రమ్మన్నాట్టుగా ఇంతకు ముందు ఆమెను తీసు కెళ్ళిన ఆమె కనిపిస్తే చెప్పాడు.
అతను అక్కడే కూర్చుండిపోయాడు.
తలంతా భారంగా అనిపించసాగింది.
అమ్మ ప్రాణం కాపాడుకోవాలి. కానీ ఎట్లా?
బిడ్డా! మంచిగున్నవా? మొన్నోపారి వత్తనంటివిగదాని సూసిన. రాలేదా?
***
అట్నా! ఆడ యుద్ధాలు ఇంకా జరుగుతానయా? ఎప్పుడో రాజుల కాలంల మొన్న మొన్న దాన్క మా నాయన, తాతలు రజాకార్లతోని, తెల్లోల్లతోని కొట్లాడింది ఇన్న గని, మల్ల నువ్వనంగనే ఇంటానా. సరేతీ! ఈ తాప అచ్చినప్పుడు మాత్రం తప్పకుండ కల్సిపో. మీ చేల్లెండ్లు, తమ్ముడు ఓ పారి చూడాలే అంటున్నారు.
***
ఆ ….ఆ …మందులా?… సరిగా ఇంవడుతలేదు బిడ్డా?
***
ఆ ..ఆ …ఎసుకుంటానా! మంచిగనే ఉంటాంది. నిన్ను అమ్ముకొని బతుకుతాన. నాకు ఇంతనన్న చీము నెత్తురు ఉన్నదంటవా? బిడ్డా?
***
అతను ఏడుస్తూ నువ్వు ఇచ్చే దేయిర్నమే అట్ల అనుకోకుండా చేత్తాంది.
***
సరే ఇగుండు! బిడ్డా! అట్నే కానియ్యి.
సయిదులు అతనినే చూస్తుండడంతో,
అయ్యో! గట్టిగా మాట్లాడి నీకు కష్టం కలిగించిన్నా అయ్యా! అన్నడు.
లేదన్నట్టుగా తలూపాడు.
ఏమో నయ్య దేశామవుతల ఉన్న నా బిడ్డ ఫోన్ జేత్తే పాణం గిట్నే తల్లడ మల్లడ మయితది. గిట్నే ఒళ్ళు మర్సి పొంటెలు పొంటెలు మాట్లాడుతా. అన్నాడు.
అయినా సయిదులు అర్థంకాక చూస్తుండగా,
అయ్యో! నీకు అంతా ఎరుకైనట్టే చెప్తానగదా! అసలు సంగతెందంటే నాకు నలుగు రు ఆడోల్లు ముగ్గురు మగోళ్ళు. అయితే వాళ్ళమ్మకు తిరుగని భీమారి అచ్చి ఆయే ..పాయె అన్నట్టు చేస్తుండంగ దావఖానకు ఎసుకపోయిన.
అప్పుడు ఆడ సూసిన డాక్టరు నా బిడ్డలను నన్ను సూసి జాలి పడి నా ప్రయత్నం నేను జేత్తగని పైసలు బాగయితయ్ అన్నడు.
గవిలేకనే గద సారూ! పాణం మీదికి తెచ్చుకున్నదని బాగేడ్సిన. నేనేడువంగ నా అయ్యవ్వలు, పొలగాండ్లు సుత ఏడవంగ డాక్టర్ కోపం చేసి మమ్ముల బయటికి తోలిచ్చి నాకు ఏం చెప్పకుండ నా భార్యను పత్యేకమయిన ఓ అర్రలకు తొలక పోయి వారం పది దినాలు ఎవ్వర్నీ కలువనియ్యకుండా వైద్యం చేసిండు.
మధ్య మద్యల పొయ్యి అడుగేటోన్ని ఎట్లున్నది? నేను సూడాలే. అని.
నేను బాగయినంక పిలుస్తగని, నువ్వు ఇట్లా రాకు అని పంపెటోడు.
ఒక్కోపారి ఆయన మీద కోపమచ్చేది, ఒక్కోపారి ఆశ పుట్టేది బాగయితే మంచిదేగదా అని.
ఆళ్ళను, ఈళ్ళను గూడ ఆగక పోతుంటి.
ఎట్లాగు పాడే ఎక్కేదాన్నే తెచ్చిన, ఓ రెండు దినాలు అటో ..ఇటో .., గుడిసెల ఏస్కోని చూసుకోనికి కూడ నాకు తాహతు లేదు. ఎట్లనన్న గాని అనుకోని దేవునికి దండం బెట్టి ఊకున్న.
ఆయనే దేవుడో ..! మరేమో గని నా భార్య ఇరవయి దినాలళ్ళ లేచి మల్ల నా ఇంటికి నడిసచ్చింది.
అందరు చిత్ర పొయ్యిండ్రు. ఇదేం మాయ? ఆయన దేవుడే అని, నాది, నా పిల్లల అదృష్టం కొద్ది దొరికిండని అనవట్టిండ్రు.
అంతా మంచిగయినంక ఓపారి పొయి
అయ్యా! నేను ఒక్క పైస గట్టింది లేదాయే, ఇంత పెద్ద బీమారి బాగు జేత్తివి. నా తోలుదీసి నీకు చెప్పులు కుట్టిత్తనయ్య అని బాగ ఏడ్సిన.
అన్నిటికీ పైసలే దారి చూపెట్టవయ్య. గవి నాకాడ బాగున్నయ్, గని పాయిదా ఏమున్నది? నేను గోడ్దొన్ని. నాకు పిల్లలే లేక పాయె! పైసలన్న అడుక్కుంటే బిచ్చం ఎత్తారు గావచ్చుగని, పొలగాండ్లను ఎత్తరానయ్య? ఆ పొద్దు నీ పిల్లల మొఖాలు సూసి నంక ఆళ్ళను తల్లి లేనోళ్ళను చేయ్యదనిపించి నా సొంత పైసలతోని బయటి దేశం నుండి మందులు తెప్పించి నీ భార్యకు నయం చేసిన నాకు గూడ తృప్తిగున్నది, అన్నాడు.
అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. ఇంటికచ్చి నా ఒళ్లతోని మాట్లాడాలని అనుకుని ఇంటికచ్చిన.
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.