బొమ్మల్కతలు-11

-గిరిధర్ పొట్టేపాళెం

నీ నును పైటను తాకిన చాలు…గాలికి గిలిగింత కలుగునులే…”
 
          ఈ తెలుగు పాటలోని సి.నా.రె. గారి పదాలతో అప్పుడు నేను చదువుతున్న “విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి లిటరసీ క్లబ్ బోర్డ్” లో రెండు రోజులు మెరిసి మురిసిన ఈ పెయింటింగ్ నా బొమ్మల్లో ఓ ప్రత్యేకం.
 
          ఈ పెయింటింగ్ లో కనిపించే నలుపుతెలుపుల్లోకి తొంగి చూస్తే అప్పుడే 34 యేళ్ళ జీవితం గిర్రున తిరిగిపోయిందా అనిపిస్తూ అప్పటి కాలేజీ రోజుల స్మృతుల్నీ, గడచిన కాలం రంగుల పరిమళాల్నీ గుర్తుకి తెస్తూ సుతిమెత్తగా మనసుని తాకి వెళ్తుంది.
 
          పెయింటింగ్ వెయ్యాలన్న తపన ఉన్నా, ఎలా వెయ్యాలి, ఏ మెటీరియల్ కావాలి, అవెక్కడ దొరుకుతాయి అని తెలుసుకోవాలంటే ఎంతో “స్వయంకృషి” చెయ్యాల్సిన రోజులు. ఎవరైనా ఆర్టిస్ట్ లు వేసిన బొమ్మలు చూడాలంటే పత్రికలే సులభమైన మార్గం. చిన్న చిన్న టౌనుల్లో ఆర్ట్ గ్యాలరీలుండేవి కాదు, లోకల్ ఆర్టిస్ట్ లు ఎవరికీ తెలిసేది కాదు. ఒకవేళ ప్రయాసపడి తెలుసుకుని కలిసి వివరాలడిగినా సరిగా చెప్పేవాళ్ళు కాదు. ఎందుకు చెప్పేవాళ్ళు కాదో ఆ “ట్రేడ్ సీక్రెట్స్” ఏంటో ఎందుకో అప్పట్లో అర్ధమయ్యేది కాదు. ఇక విజయవాడ లాంటి నగరంలో ఆర్టిస్ట్ ల వివరాలు కనుక్కోవటం ఇంకా కష్టం.
 
          సినిమా కట్ అవుట్ లకి అప్పుడు విజయవాడ పుట్టిల్లు. సినిమాలకెళ్తూ బీసెంట్ రోడ్ దాటి అలంకార్ థియేటర్ వెళ్ళే దారిలో కాలువల పై వంతెనల చుట్టూ పెద్ద పెద్ద కటవుట్లుండేవి. అవి ఎక్కడేస్తారు, అంతంత పెద్దవి ఎలా వేస్తారు తెలుసుకోవాలన్న ఉత్సాహం చాలా ఉండేది. ఒకసారి రైల్వేస్టేషన్ నుంచి ఎప్పుడూ వెళ్ళని ఒక రోడ్ లో వెళ్తుంటే ఆ దారంతా ఒకవైపు సగం వేసిన ఇంకా పూర్తికాని సినిమా కట్ అవుట్ లు చూశాను. ఓహో ఇక్కడనమాట ఇవి సృష్టింపబడేది అని మాత్రం తెలిసింది గానీ సగం పూర్తయిన అవి వేస్తూ అక్కడ ఒక్కరూ కనబడ్లేదు. ఎవరినో అడిగితే వాటి వర్క్ అంతా రాత్రిపూట చేస్తారని తెలిసింది. అర్ధమయ్యింది, విజయవాడ ఎండల్లో పగటిపూట, ఆరుబయట, అదీ రోడ్డు పక్కన అవి వెయ్యటం అసాధ్యం. ఒకసారి మాత్రమే సాయంత్రం చీకటిపడే వేళ ట్రెయిన్ అందుకునే హడావుడిలో రిక్షాలో వెళ్తూ కొంచెం చూడగలిగాను, ఎలా వేస్తారో తెలిసింది.
 
          పెయింటింగ్స్ ఎలా వెయ్యాలి అనే పరిశోధనలో పడి, కనపడిన ప్రతి మార్గమూ అన్వేషించాను. చివరికి కాలేజికి దగ్గర్లో రద్దీగా చాలా చిన్నా పెద్దా షాపులుండే “పటమట” లో నాలుగైదు బుక్ షాపులుండేవి. ఆ షాపుల్లో వదలకుండా అందరినీ అడిగితే ఒకాయన “ఒన్ టవున్” లో ట్రై చెయ్యమని ఇచ్చిన సలహా పట్టుకుని అతిశయం అనుకోకుండా “ఆశ,  ఆశయమే ఆయుధాలు” గా అన్వేషణ అనే యుద్ధం మొదలు పెట్టాను. అక్కడ వాళ్ళనీ వీళ్ళనీ అడిగి చివరికి లోపలికి వెళ్తే బయటికి రావటం కష్టతరం అన్నట్టుండే “పద్మవ్యూహం లాంటి ఒన్ టవున్” ఇరుకు సందుల్లో “అనుభవమే లేని అభిమన్యుడిలా” ప్రవేశించి ఒక ఆరు రంగుల “క్యామెల్ పోస్టర్ కలర్ బాటిల్ సెట్” సంపాదించాను. అదీ చాలా విచిత్రంగా. అక్కడ అన్నీ హోల్ సేల్ షాపులే, అసలవి షాపుల్లా కూడా ఉండవు. ఇరుకు గోడవునుల్లా ఉంటాయి. రీటెయిల్ గా అమ్మరు. ఒక బుక్ మెటీరియల్ హోల్ సేల్ షాపు అక్కడెక్కడో ఉందని ఎవరో చెప్తే వెతికి వెతికి పట్టుకుని వెళ్ళా. ఓనర్, ఇద్దరు వర్కర్లు ఏదో లోడ్ వ్యాన్లోకెక్కిస్తూ ఉన్నారు. అప్పటికే సాయంత్రం, చీకటి పడింది.ఇక్కడ దొరకవులే అని అనిపించినా, “ఇంత కష్టపడి ఇక్కడిదాకా వచ్చి ఇప్పుడు ఉసూరు మంటూ వెనక్కిపోవడమా?” అని మనసు ప్రశ్నిస్తే, సరేలే అని ధైర్యం చేసి, అసలు అడగొచ్చా లేదా అని తపటాయిస్తూనే అడిగా, “ఏమండీ మీదగ్గర క్యామెల్ పోస్టర్ కలర్స్ దొరుకుతాయా” అని. అంతే అడిగీ అడగ్గానే  ఆయన లోపలికెళ్ళాడు. ఒకపక్క ఆశ, దొరుకుతాయేమో అని. మరోపక్క నిరాశ, వచ్చి ఏం చెప్తాడో అని. కొద్ది క్షణాల తర్వాత  ఆయన ఆరు రంగుల బాటిల్స్ ఉండే ఒక సెట్ పట్టుకొచ్చాడు. సరిగ్గా అదే నాకు కావల్సింది. ఆ క్షణం నా ఆనందానికి అవధుల్లేవంతే! తర్వాత ఇంకో రెండుమూడుసార్లు కూడా వెళ్ళి నాకు కావల్సిన సెలెక్టెడ్ రంగులు అడిగి మరీ అక్కడ తెచ్చుకున్నాను. బహుశా ఆ హోల్ సేల్ షాపు కి పోస్టర్ కలర్స్ కోసం వెళ్ళిన ఒకే ఒక్క రీటెయిల్ కస్టమర్ ని నేనే నేమో!
 
          అప్పట్లో వార పత్రికలు విరివిగా చదివేవాళ్ళు, కొన్ని పత్రికలకి చాలా డిమాండ్ ఉండేది. వచ్చిన కొద్ది గంటల్లోనే అన్ని కాపీలూ అమ్ముడయిపోయేవి. ఎందరో రచయిత లూ, ఆర్టిస్ట్ లూ వాటి ద్వారా వెలుగులోకొచ్చిన రోజులవి. అన్నిటిల్లో ఆంధ్రభూమి వార పత్రిక నాకు ప్రత్యేకంగా కనిపించేది. అందులో కథలకీ సీరియల్స్ కీ వేసే ఇల్లుస్ట్రేషన్స్ అన్నీ పెయింటింగ్స్ నే. “ఉత్తమ్ కుమార్” అనే ఆర్టిస్ట్ ఇల్లుస్ట్రేషన్స్ లో పూర్తిస్థాయి పెయింటింగ్ లు వేస్తూ ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. పోస్టర్ కలర్స్, వాటర్ కలర్స్ తో వేసే ఆ పెయింటింగ్స్ చాలా గొప్పగానూ, అందంగానూ ఉండేవి. ఇక అవే నాకు పెయింటింగ్ నేర్చుకునేందుకు మార్గదర్శకాలయ్యాయి. ఆంధ్రభూమిలో అచ్చయిన ఒక్కొక్క ఉత్తమ్ గారి పెయింటింగ్ ఒక పాఠ్యగ్రంధంలా ముందు పెట్టుకుని, శోధించి సాధించి, కనుక్కుని కొనుక్కున్న పోస్టర్ కలర్స్ తో కష్టమైనా కుస్తీ బరిలో దిగి అలాగే వెయ్యాలని దీక్షతో గంటలకొద్దీ కూర్చుని “సాధన” అనే పోరాటం చేసేవాడిని. పట్టు వదలని పోరాటం, పట్టు సడలని ఆరాటంతో వేసిన ప్రతి బొమ్మలోనూ సక్సెస్ అయ్యే వాడిని. అసలు మెళకువలు తెలీదు, రంగుల మిశ్రమం గురించి తెలీదు, ప్రైమరీ-కలర్స్ సెకండరీ-కలర్స్ లాంటి పదలూ తెలీవు, బ్రష్లూ ఒకటో రెండో ఉండేవి. “కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి చేస్తే దక్కనిదంటూ ఉండదు.” అన్న మాటలకి నిదర్శనం నా అనుభవా ల్లో ఇది ఒకటి.
 
          ఈ పెయింటింగ్ కూడా మక్కీకి మక్కీ “ఆంధ్రభూమి వారపత్రిక” లో అచ్చయిన “ఉత్తమ్” గారి పెయింటింగ్ ని చూసి నేర్చుకునే మార్గంలో వేసిందే. కాలేజి రోజుల్లో నేను వేసే బొమ్మలకి కొద్ది మంది ఫ్రెండ్స్, జూనియర్స్ అభిమానులుండేవాళ్ళు. అడిగి నా రూముకి వచ్చి మరీ చూసి పొయ్యేవాళ్ళు.
 
          అలా నా బొమ్మలు చూసి మెచ్చుకునే నా క్లాస్ మేట్, ఒక మంచి ఫ్రెండ్ “కిరణ్”. ఇది చూసి, “నీ పెయింటింగ్ కాలేజి మొత్తం చూడాలి గిరీ” అంటూ “భువనేశ్వరి” అనే తెలుగు సినిమాలో కవి శ్రీ సి.నారాయణ రెడ్డి గారు రాసిన “ఏమని పిలవాలీ, నిన్నేమని పిలవాలి…” అన్న పాటలోని ఈ కింది లైన్స్ రాసి జతచేసి కాలేజి లిటరసీ క్లబ్ బోర్డ్ లో పెట్టించాడు.
 
“నీ చిరునవ్వులు సోకిన చాలు
సూర్యుడు వెన్నెల కాయునులే…
 
నీ నును పైటను తాకిన చాలు
గాలికి గిలిగింత కలుగునులే…
 
నీ పాదాలూ మోపిన చాలు
శిలలైనా విరబూయునులే…”
 
          తర్వాత రెండ్రోజులకి మా జూనియర్ ఎవరో నాకా పెయింటింగ్ ని తెచ్చి ఇస్తూ, ఇది చూసి కొందరు అమ్మాయిలు అభ్యంతరం చెబుతూ ఆ క్లబ్ హెడ్ ఇంగ్లీష్ మాష్టారుకి కంప్లెయింట్ చేశారని అందుకే తీసెయ్యాల్సి వచ్చిందనీ చెప్పాడు. అభ్యంతరం చెప్పేంత కారణాలు ఇందులో లేకున్నా, చూసే కళ్ళు అన్నీ ఒక్కలా ఉండవు అను కున్నాను. అలా కాలేజిలో నా ఈ పెయింటింగ్ ని అందరూ చూడ(లే)క పోయినా ప్రతి సంవత్సరం ప్రింట్ చేసే కాలేజి మ్యాగజైన్లో క్రమం తప్పక ప్రింట్ అయ్యి ఆకట్టుకున్న నా బొమ్మలు అందరూ చూశారు, అందరికీ నేనెవరో తెలిసింది. ఫైనల్ ఇయర్ అయ్యి వెళ్ళేపుడు ఒకరికొకరం ఆటోగ్రాఫ్ బుక్స్ లో అడ్రెస్ తో బాటు రాసుకున్న సందేశాల్లో నా ఆటోగ్రాఫ్ బుక్ నిండా ప్రతి ఒక్కరూ నా బొమ్మలనే ప్రస్తావిస్తూ మెసేజ్ లు రాశారు.
 
          అప్పటి నా పెయింటింగ్ “స్వయం కృషి” సాధన లో “ఉత్తమ్ గారు” కి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయన పెయింటింగ్స్ నాకు పాఠ్యగ్రంధాలు! ఆ సాధనలో వేసిన పెయింటింగ్స్ లో బ్లాక్ అండ్ వైట్ లో వేసిన ఈ పెయింటింగ్ ఫలితం నాకు చాలా తృప్తిని ఇచ్చింది. స్వయం సాధనతో నేర్చుకున్న తపనలోని ఆ తృప్తి ఎప్పటికీ తరగని ఘని.
 
“స్వయంకృషి తో సాధించి ఎక్కిన ప్రతి మెట్టూ ఎవరెస్టు శిఖరమే.”

 

“నీ నును పైటను తాకిన చాలు”
Poster colors & Indian Ink on Paper

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.