మా కథ (దొమితిలా చుంగారా)- 47
రచన: దొమితిలా చుంగారా
అనువాదం: ఎన్. వేణుగోపాల్
ప్రవాసంలో ఉన్నవాళ్ళ ఆదరణ
నేను మెక్సికోలో ఉన్న రోజుల్లో అక్కడ ప్రవాసంలో ఉన్న ఎంతో మంది బొలీవియన్లను కలిసి, వారితో గడిపే వీలు కలిగింది. వాళ్ళలో కొందరు 1971లో ఇక్కడికి ప్రవాసానికొచ్చా రు. చాలా మంది బొలీవియాలో ఎంతో కాలం జైళ్ళలో ఉండి, దేశం నుంచి బహిష్కరించ బడి ఇక్కడికొచ్చారు. కొంత మంది పారిపోయి వచ్చారు. మరికొంత మంది దౌత్య కార్యాల యాల్లో ఆశ్రయం కోరి వచ్చారు. అక్కడ నేను కలిసిన వాళ్ళలో నాకు ఒకతను మాత్రమే బొలీవియాలో తెలిసిన వ్యక్తి.
అక్కడ అంత మంది బొలీవియన్లను చూడడం నాకు చాల ఆనందమైంది. అక్కడ కార్మికులుగానీ, రైతులుగానీ ఎవరూ లేరు. కొంత మంది కార్మికులూ, రైతులూ కూడ ప్రవాసం వెళ్ళిన మాట నిజమే గాని ఎక్కువగా ప్రవాసానికి వెళ్ళిన వాళ్ళు ఉద్యోగులే.
ఆ ప్రవాసులకు మంచి ఉద్దేశ్యాలున్నాయి. వాళ్ళింకా తమ ప్రజల్ని మరిచిపోలేదు. బొలీవియా జనంతో వాళ్ళింకా తమ సంఘీభావాన్ని చూపుతూనే ఉన్నారు.
వ్యక్తిగతంగా వాళ్ళు నాకెంతో సాయపడ్డారు. వాళ్ళు నేను అక్కడ సుఖంగా, హాయిగా ఉండేందుకు తగిన పరిస్థితులు కలిపించారు. నా మోకాలుకు ఆపరేషన్ చేయించారు. నేను రెండోసారి అరెస్టయినపుడు విరిగిన పళ్ళు కట్టించారు. అక్కడ ఒక్క మిత్రుడుగానీ, మిత్రురాలుగానీ నన్ను చిన్నచూపు చూడలేదు. వాళ్ళు నేను మెక్సికోలో కలవాల్సిన వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళారు. మెక్సికోలో నాకు సైగ్లో – 20లో లేని సౌకర్యాలన్నీ దొరికాయి. నాకు ప్రత్యేకంగా ఒక పరుపు మంచం ఉండింది. నాకు ప్రత్యేకంగా – ఒక స్నానాల గది ఏర్పాటయింది. నేనున్న చోట నీళ్ళకూ, కరెంటుకూ కొదవలేదు. నాకు చివరికి వంట కూడా ఏర్పాటయింది.
ఐతే ఇన్ని సౌకర్యాల మధ్య కూడ నాకు మెక్సికోలోనే ఉండిపోదామనే ఆలోచన రాలేదు. బొలీవియాలో నా జనం అనుభవిస్తున్న కడగండ్లు నాకు ఈ సౌకర్యాల్లోంచి ముల్లులా గుర్తుకొస్తుండేవి. అక్కడ సుఖ సంతోషాలనుభవించే బదులు నేను గనిలో జనం ఎంతెంత దూరాలు నడవవలసి వచ్చేదీ, గర్భిణులైన స్త్రీలు కూడ ఎంతెంత బరువులు మోసుకుంటూ అంతులేని రోడ్లమీద ఈడ్వవలసి వచ్చేదీ గుర్తుచేసుకునే దాన్ని. సాన్ ఫ్లోరెన్సియో గని కార్మికులు ఏది కొనాలన్నా సైగ్లో-20 దాకా వెళ్ళి రావలసిన దుస్థితి నాకు గుర్తొచ్చేది. ఏదో ఒకటి మార్కెట్లో అమ్మడానికి స్త్రీలు ఎన్ని కిలోమీటర్లు తిరిగొచ్చి మళ్ళీ వంట పనిలో మునిగిపోవలసిందీ గుర్తువచ్చి మనసులో మెరమెరలాడే ది. నా విలాస జీవితంలో ఈ జ్ఞాపకాలు నన్ను పొడిచి బాధ పెట్టాయి. … ..
ఈ విలాసాలన్నీ, ఈ సౌకర్యాలన్నీ ఉండే రోజు రావాలని నేను కలలు కంటుండే మాట నిజమే. ఔను నాకు సౌఖ్యం కావాలి. కాని అది ప్రతి ఒక్కరికీ కావాలని కోరుతాను నేను. నా ప్రజలందరికీ సౌఖ్యం కావాలి. నా ఒక్కదానికే ఈ హాయి వద్దు. ఈ సౌకర్యాలన్నీ అంగీకరించడానికి నాకు చాల ఇష్టంగా ఉంటుంది, కాని నా జనం ఆకలికి మాడి చచ్చి పోతున్నప్పుడు, దారిద్య్రంలో మగ్గిపోతున్నప్పుడు, రెక్కలు ముక్కలు చేసుకుంటున్న ప్పుడు నేనీ సౌకర్యాన్ని అంగీకరించలేను. అందరికీ సౌఖ్యాలు అమరినప్పుడు, అందరూ సుఖంగా జీవించగలిగినప్పుడు మనం సంతోషంగా ఉండగలం. అప్పుడు పొరుగువాడు ఇవాళ తిండికి లేక చచ్చిపోతున్నాడు గదా అనో, రోగంతో తీసుకుంటున్నాడు గదా అనో ఆలోచించే అవకాశం ఉండదు. ఓ కొత్త దుస్తులు వేసుకొని బైటికి వెళ్ళడానికి సిగ్గు పడవల సిన అవసరం ఉండదు.
ఈ కారణం వల్లనే మెక్సికోలో నేను ఇమడలేక పోయాను. నాకు అడుగడుగునా నా జనాన్ని, నా వాతావరణాన్ని పోగొట్టుకున్నాన్న వెలితి కనబడింది. ఇక నేను వెనక్కి వెళ్ళి పోదలచుకున్నాను.
మేం నీళ్ళలో చేపల్లాంటి వాళ్ళమని, నీళ్ళలోంచి బయటికొస్తే చచ్చిపోతామని ఒకాయనన్నాడు. ఔను నిజమే, మేం, నాయకులం, ప్రజా హృదయాలలో ఉండకుండా పోయిననాడు చచ్చిపోయామన్నమాటే. జనం నుంచి దూరమైతే చావడం ఎంత సులభం తెలుసునా? ఎందుకంటే తన జనంతో లేని నాయకుడు అసలు సంతోషాన్ని అనుభవించలేడు. విప్లవకారులుగానీ, విప్లవకారులుగా పిలవబడే వాళ్ళుగానీ ప్రజలతో భుజం కలిపి పోరాడవలసిన బాధ్యతను నిలబెట్టుకోవాలి. వాళ్ళు దేశం నుంచి బైటికి గనుక వచ్చేసి ఉంటే, తమ జనాన్ని మరిచిపోగూడదు. ఇంకా దేశంలో గనుల్లో, పల్లెల్లో, ఫ్యాక్టరీలలో నిర్బంధాన్ని ఎదుర్కొంటూ పోరాటం కొనసాగిస్తున్న జనంతో వాళ్ళు నిలబడాలి. వీలైనంత వరకు వెనక్కి రావడానికీ, జనం తమ పై ఉంచే బాధ్యతల్ని నెరవేర్చడానికీ ప్రయత్నించాలి.
నిశ్శబ్దంగా బైట ఉండి, మేం ఎప్పుడు విజయం సాధిస్తామా అని కాచుకు కూచునే వాళ్ళు నిజమైన ద్రోహులని నేననుకుంటాను. ఔనా?
ఒకవేళ వెనక్కి రాలేకపోయినా చేయడానికెంతో పని ఉంది. విప్లవకారులకి సరిహద్దు లూ, అడ్డుగోడలూ ఏమిటి? ఎక్కడున్నా, ఏం చేస్తున్నా వాళ్ళు తమ ప్రజల అనుభవాల్ని ఇతరులకి చాటి చెప్పొచ్చు.
*****
(సశేషం)