మిట్ట మధ్యాహ్నపు మరణం- 23
– గౌరీ కృపానందన్
“అరెరే… మీరా!” అన్నాడు రాకేష్. “రండి రండి. లోపలికి రండి. ఉమా! ఎందుకు అక్కడే నిలబడ్డారు? ఆనంద్ రాలేదా?”
“రమ్మని చెప్పి వచ్చాను.”
“ఇన్ని రోజుల తరువాత దారి తెలిసిందా మీకు. కూర్చోండి. సారీ… రూమ్ కాస్త గందరగోళంగా ఉంది. బెంగళూరులో పెద్ద ఇల్లే ఉంది మాకు. కమిన్ ప్లీజ్.”
ఉమ కాస్త తటపటాయిస్తూ లోపలికి అడుగు పెట్టింది. ఎందుకిలా చేస్తోంది తను? తనని ఇక్కడికి ఆకర్షిస్తున్న విషయం ఏమిటి? రాకేష్? మాయా? అత్తగారు, ఈ సమాజం పెట్టిన కట్టుబాట్లకి వ్యతిరేకంగా మనసులో ఏర్పడిన భావాలు నన్నిలా నడిపిస్తున్నాయా? స్వేచ్ఛ అంటే ఇదేనా?
“చెప్పండి ఉమా! మొదటి సారిగా నా రూమ్ కి వచ్చారు. ఏం తీసుకుంటారు?”
“ఏమీ వద్దు. మాట్లాడడానికి వచ్చాను.”
“మై ప్రెషర్!”
***
సర్చ్ వారంట్ తో వచ్చిన మాధవరావు వెంటనే లోపలికి వెళ్ళి లాక్ చేసి ఉన్న డ్రాయర్ ని గునపం సహాయంతో తెరిచారు. లోపల రకరకాల పుస్తకాలు ఉన్నాయి. అన్నిటినీ విసిరేసినట్లు బయట పడేశారు. అన్నిటికన్నా క్రింద న్యూస్ పేపర్ చుట్టినట్లు గా ఒక పొట్లం కనబడింది. విడదీసి చూశారు.
ఎండిపోయిన రక్తపు మరకలతో కత్తి! రక్తసిక్తమైన ఒక షర్ట్!
“ఇతనే” అన్నాడు మాధవరావు.
***
“రాకేష్! మీరు నాకు నచ్చారు” అన్నది ఉమ.
ఉమ అన్న మాటలను వినగానే రాకేష్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“ఈ మాట నువ్వు ఏ రోజైనా చేబుతావని ఎదురు చూస్తూ ఉన్నాను ఉమా. ఎలా నా మనసును విప్పి చెప్పను? మీ కోసం నేనేం చేసానో తెలుసా?”
“ఏం చేశారు?”
“చాలా చాలా విషయాలు అన్నిటినీ తగిన సమయం వచ్చినప్పుడు చెబుతాను.”
“ఇప్పుడే చెప్పండి.”
“ఇప్పుడు చెబితే స్కోత్కర్ష గా ఉంటుంది. మొదటి సారిగా నా ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించిన వేళ! నా సంతోషాన్ని ఎలా మీకు తెలియచేయను? పిల్లి మొగ్గలు వేయనా?’
“వద్దు వద్దు.” సన్నగా నవ్వింది. “నాకు మీ గురించి ఇంకాస్త తెలుసుకోవాలని ఉంది.”
“అడగండి.”
“పెళ్ళి కాలేదనుకుంటాను.”
“నో.. ఉమ అంగీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.”
మౌనంగా ఉండి పోయింది.
“ఉమా! మీకు ఒక కధ చెప్పనా? ఆంగ్లో ఇండియన్ జాక్సన్ కధ. తన జాతికి చెందిన ఒకమ్మాయిని ప్రేమించాడు. ఆమె పేరు ఎలిజబెత్. ఆమెనే పెళ్ళి చేసుకోవాలని అను కున్నారు. కాని మంచి ఉద్యోగం లేదు. ఆమె తల్లి తండ్రులు ఆమెని డబ్బు, మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేశారు. మనసు విరిగిపోయిన అతను పెళ్ళి చేసుకోలేదు. ఆమె భర్తతో ఆస్ట్రేలియాకి వెళ్ళి నలుగురు పిల్లల్ని కని, వయసు మళ్ళి, లావెక్కి, అందం అంతా మాసిపోయింది. ఇరవై ఏళ్ళ తరువాత భర్త చనిపోయాక ఇండియాకి తిరిగి వచ్చింది. విమానాశ్రయంలో ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పిల్లలను తన పిల్లలుగా భావించాడు.
ఉమా! నా జీవితం ఇంకా ఒక్క రోజులో, రేపే ముగిసిపోతుంది అన్న తరుణంలో కూడా ఈ రోజు మీరు వచ్చినా నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుని ఉండేవాణ్ణి ఎలిజబెత్!” అన్నాడు.
“ఉమా! నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. మిమ్మలిని మొదటి సారి క్రికెట్ గ్రౌండ్ లో అంత మంది అమ్మాయిల మధ్య బైనాక్యులర్ లో చూసిన ఆ క్షణం నుంచి మిమ్మలిని తప్ప నేను వేరెవరినీ చూడలేదు. మీరు రన్స్ చేసింది, బౌలింగ్ చేసింది, మిగిలిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, మాటి మాటికీ ముంగురులను సరి చేసుకునే ఆ మానరిజం అన్నిటినీ చూస్తూ వచ్చాను. మీలో ఏదో ఒకటి నన్ను ఆకర్షించింది. మీరు టూర్ వెళ్ళినప్పుడు మీ వెనకాలే వచ్చాను. మీకు జ్ఞాపకం ఉందా? బెంగళూరు వెళ్ళినప్పు డు బృందావన్ లో మీతో వచ్చాను. అంతకు ముందు ఎన్నో సార్లు మీతో మాట్లాడాను, నా స్వప్న లోకంలో.
మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు చూశాను. సినిమా హాల్లో క్యూ లో నిలబడి టికెట్ కొన్నాను. దాసప్రకాశ్ లో ఐస్ క్రీం… ఇలా మిమ్మల్ని నీడలా వెంటాడుతూ ఉండేవాడిని. ఆ తరువాత మీ పెళ్ళిరోజు తాళికట్టే సమయంలో నేను పందిట్లోనే ఉన్నాను. రిసెప్షన్ జరుగుతున్నప్పుడు కచ్చేరి జరుగుతున్నప్పుడు అన్ని వేళల్లో మిమ్మల్నే చూస్తూ .. ఆ రోజు రాత్రి కొత్త చీర కట్టుకుని గదిలోకి వెళ్ళడం కూడా చూసాను. ఆ రోజు రాత్రి నన్ను మూర్తి స్థానంలో ఊహించుకున్నాను ఇలా చెప్పడానికి నేను సిగ్గు పడడం లేదు. నేనే నిన్ను…”
“మై గాడ్! మీరు చాలా అబ్ సెస్ట్ గా ఉన్నారు.”
“అబ్సెషన్ అనేది చాలా మామూలు మాట. నువ్వు ఎలా ఉన్నా సరే, ఎప్పుడైనా సరే స్వీకరించడానికి తయారుగా ఉన్న దాసుడిగా నేను ఉన్నాను. నేను మీ కోసం పడిన కష్టాలు, బాధలు మాటల్లో చెప్పలేను. మూర్తి చనిపోయాడు. అతనిది ముగిసిపోయిన చరిత్ర. ఇది కొత్త చరిత్ర. ఉమా! చెప్పండి. సమ్మతం అని ఒక్క మాట చెప్పండి.”
“లేదు రాకేష్! ఇంకా ఆలోచించు కోవాలి.”
“ఇంకా ఆలోచించుకోవడానికి ఏ ముంది ఉమా! మీరు ఆడిన మ్యాచ్ లన్నీ చూశాను. ఒక్కొక్క మ్యాచ్ లో మీ స్కోర్ ఏమిటో చెప్పాలా? మీరు ఎన్ని వికెట్లు తీసారో చెప్పనా?”
“వేరే పనేమీ లేకుండా నా వెంటే పడ్డారా మీరు? మాట వరసకు అడుగుతున్నాను. మీరు నా దగ్గిరికి వచ్చి మాట్లాడడానికో, స్నేహం చెయ్యడానికో ప్రయత్నం చెయ్యలేదు ఎందుకు?”
“ఉమా! నాకు కొంచం బిడియం ఎక్కువ. ఒక వేళ మీరు ఛీ పోరా అంటే ఎలా తట్టు కోగలను? నా జీవితంలో నా యిష్టానికి వ్యతిరేకంగా ఎన్ని జరిగినా, నో అని చెప్పలేని ఆశక్తుడిగా నిలబడిపోయిన సందర్బాలు ఎన్నోఉన్నాయి. నాకు లా చదవడం ఇష్టం లేదు. క్రిమినాలజి తప్ప మిగతావన్నీ బోర్. కానీ నాన్నగారి మాటకి ఎదురు చెప్పలేక ఆయన చెప్పినట్లే చదివి ముగించాను. ఫ్యాక్టరీ చూసుకోవడం నాకు ఇష్టం లేదు. కాని దాని కోసం ట్రైనింగ్ తీసుకోమని నాన్నగారు అన్నప్పుడు బలి పశువులాగా తలవంచాను. నాకు యిష్టమైన పనులని చెయ్యడానికి మా నాన్నగారు నాకు అవకాశమే ఇవ్వలేదు.”
“మీకు ఇష్టమైన పని ఏది?”
“ఉమా! నిన్ను ముద్దు పెట్టుకోనా?”
“ఓ… నో..”
“పోనీ. నీ చెయ్యి పట్టుకుని కాస్సేపు కూర్చోనా?”
“మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు.”
“కాస్త ఉండండి.” పెద్ద పుస్తకం ఒకటి తీసి దాని మధ్య నుంచి ఒక జేబు రుమాలును తీసి చూపించాడు. “ఇదిగో మీ కర్చీఫ్. ఇది మీ చీరలోని నూలు పోగు. ఆ రోజు హోటల్ నుంచి ఇవన్నీ తీసుకుని వచ్చాను. ఇవన్నీ నాకు నిధికి సమానం.”
అతన్నే చూస్తున్న ఉమకి ఏదో మెరుపు మెరిసినట్లు అనుమానపు రేఖ మనసులో మెరిసింది. హి ఈస్ నాట్ నార్మల్!
“చెబితే నమ్మరు. మీ జేబురుమాలును చేతిలో ఉంచుకుంటే గానీ నాకు నిద్ర పట్టదు.”
ఉమ తగ్గు స్వరంలో అన్నది. “ఇలా నా గురించి అహర్నిశలూ ఒక వ్యక్తి ఆలోచిస్తు న్నాడని అనుకుంటే ఒక పక్క గర్వంగానూ, ఇంకో పక్క భయంగానూ ఉంది రాకేష్. మరి నేను బయలు దేరుతాను.”
“నాకు జవాబు చెప్పకుండానే వెళ్తున్నారు.”
“దేనికి?”
“నన్ను పెళ్ళి చేసుకోవడానికి మీకు సమ్మతమేనా కాదా అని.”
“తరువాత చెబుతాను.”
“ఎప్పుడు?”
“ఇంకా కొన్ని రోజులు పోనీయండి.”
“ఎందుకు ఉమా? నీ కోసం నేను ఎంత చేశాను? ఎంత రిస్క్ తీసుకున్నాను? అవన్నీ వద్దు. ఇప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడడం? నాకు ఎప్పుడు జవాబు ఇస్తావు? అది చెప్పకుండా నువ్వు ఇక్కడి నించి కదలడానికి వీలు లేదు. నేను ప్రేమతో నిన్నుఆజ్ఞాపిస్తున్నానని అనుకో.”
“రాకేష్! ఇది ఇలా నిమిషాల మీద నిర్ణయం చేసే విషయం కాదు. మా అమ్మా నాన్నలను అడగాలి. అన్నిటికన్నా నా జీవితంలో అన్నీ ఏదో తొందరగా జరుగుతున్నా యని అనిపిస్తోంది. మూర్తి జ్ఞాపకాలు నా నుంచి మాసిపోవద్దా? దానికి కొన్ని రోజులైనా అవకాశం కావాలిగా.”
“ఎన్ని రోజులు? మూడు నెలలు, ఒక సంవత్సరం? ఎన్ని రోజులు ఉమా! ఎదురు చూస్తూ ఉంటాను.”
ఉమ ఆలోచించింది. “మనం ఒక ఒప్పందం చేసుకుందాం. మీరు ఆ మాయ ఎవరు అని చూపించండి. ఆ రోజు నేను మీ ప్రశ్నకి జవాబు చెబుతాను.”
“ఆల్ రైట్! ఇట్ ఈస్ అ డీల్! ఏ రోజు చూపించాలి?”
“ఏ రోజు మీకు వీలవుతుంది?’
“ఈ రోజే. ఇప్పుడే.”
“చూపించ గలరా?”
“మాయని చూపించాలి. అంతే కదా.”
“అవును.”
“రండి చూపిస్తాను. పోస్ట్ పోన్ చేయడంలో ప్రయోజనం లేదు. నాతో వస్తారా?”
“ఎక్కడికి?’
“ఆ మాయని చూడడానికి.
ఉమ తటపటాయిస్తూనే అతని వెనకాల పక్క గదిలోకి నడించింది. అక్కడ ఉన్న కిటికీ తలుపులు తెరిచి, “ఉమా! అదిగో చూడండి. అదే మాయ “ అన్నాడు.
***
మాధవరావు ఆ హోటల్ రిజిస్టర్ ని మళ్ళీ చూశారు. లిస్ట్లులో మూర్తి చనిపోయిన రోజు ఆ హోటల్ లో బస చేసిన వాళ్ళ పేర్లను పరిశీలిస్తూ వచ్చారు.
ఆర్.ఎస్. శేఖర్ అన్న పేరు దగ్గర ఆయన పెన్సిల్ ఆగింది. పచ్చరంగు సిరాతో వ్రాయబడిన శేఖర్. రాకేష్ ఇనిషియల్స్ మ్యాచ్ అవుతున్నాయి. బస చేసిన బ్లాక్ మూర్తి, ఉమలు దిగిన గదికి ఎదురుగా ఉంది. రాకేష్, శేఖర్ అని వ్రాసిన దాంట్లో ఒకే చేతి వ్రాత కనబడుతోంది. ఇంగ్లీషులో K అన్న అక్షరాన్ని వ్రాసే పద్ధతి రెండింటిలోనూ ఒకేలా ఉంది. దీనిని అప్పుడే ఎందుకు గుర్తించలేదు? మూర్తి దిగిన బ్లాక్ ని మాత్రమే విచారణ జరిపాడు. ఇతను ఎదుటి బ్లాక్ లో బస చేశాడు. అక్కడి నుంచి వీళ్ళను వాచ్ చేసి ఉంటాడు.
కొంత మందిని మాత్రం ఎంక్వయిరీ చేస్తే చాలదు. చుట్టూ పక్కల ఉన్న అందరినీ విచారణ చేసి ఉండాల్సింది.
“మీ హోటల్ చెక్ అవుట్ టైం ఎప్పుడు?”
“మధ్యాహ్నం పన్నెండు గంటలకి.”
“ఇతను పదిహేడవ తేదీ ఖాళీ చేసి వెళ్ళాడు. అంటే ఆ సంఘటన జరుగుతున్న సమయంలో చెక్ అవుట్ చేసి ఉంటాడా?”
“అలా చెప్పలేం సార్. కాస్త వెనకా ముందు ఉండొచ్చు. పది గంటలకే కూడాఆయన ఖాళీ చేసి ఉండవచ్చు.”
“అలాగే ఒంటి గంట తరువాత ఖాళీ చేస్తే మీరు ఇంకో రోజు అద్దెను చార్జ్ చేస్తారా?”
“లేదు సార్. అలా ఇంసిస్ట్ చేయడం లేదు.”
“మధ్యాహ్నం ఎన్ని గంటల వరకూ అలా ఇన్సిస్ట్ చేయరు?”
“మూడు నాలుగున్నర దాకా అనుమతి ఇస్తాము.”
“ఈ మనిషి మీ డెస్క్ నుంచే చెక్ అవుట్ చేసి ఉంటాడా?”
“లేదు సార్. అది వేరే బ్లాక్ కి సంబంధించినది. దానికి విడిగా రిసెప్షన్ సెక్షన్ ఉంది.”
“రెండు బిల్డింగులకి కనెక్షన్ ఉందా?”
“సర్వీస్ కౌంటర్ నుంచి కనెక్షన్ ఉంది.”
“ఆ గదికి వెళ్ళి చూడాలి.”
“రండి. చూపిస్తాను. ఏమయ్యింది సార్? ఇంకా హంతకుడు ఎవరో తెలియ లేదా?”
“హంతకుడు ఎవరని తెలిసిపోయింది. అతన్ని వెతుకుతున్నాము.”
మాధవరావు ఆ గదికి వెళ్ళి చూశారు. మూర్తి ఉన్న గదికి నేరుగా ఉంది. గది ఖాళీగానే ఉంది. లోపలికి వెళ్ళారు. కోటు వేలాడ దీయడానికి అల్మారా ఉంది. డబుల్ కాట్.
“సింగిల్ రూమ్ గా కూడా ఈ గదిని ఇస్తాము సార్.”
రాకేష్ ఇక్కడే బస చేశాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని మాత్రం తెలియడం లేదు. చెన్నైఫ్యాక్టరీకి ట్రంకాల్ చేసి చూశారు. ఆ వైపే అతను రాలేదట.
చెన్నైలో అతను ఉండే ఫ్లాట్ కు కూడా వచ్చి చాలా రోజులయ్యిందట.
“సార్! దేని కోసం వెతుకుతున్నారు?”
“దేని కోసం వెతుకుతున్నానో నాకే సరిగ్గా తెలియదు.”
అక్కడ ఉన్న వాల్ సీనరీ వెనకాల, కార్పెట్ కింద, చెక్క అలమారీ పై భాగం అన్నీ చూసారు. ఇవి రోజూ శుభ్రం చేసే ప్రదేశాలు కావు. ఏదైనా గత చరిత్రపు ఆధారాలు దొరక వచ్చు.
కుర్చీ మీద ఎక్కి అల్మారా పై భాగాన్ని చూశారు. సిగరెట్ పాకెట్ కనబడింది. తీసి చూశారు. ఒకే ఒక సిగరెట్ కనబడింది.
ఇది ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది? మంచం మీద పడుకున్న వ్యక్తి సరదాగా దాన్ని పైకి విసిరి పట్టుకుని ఆడుకుని ఉంటాడు. ఏదో ఒక సారి అది అలమార పై భాగంలో పడిపోయి ఉంటుంది. ఎక్కి తీయడానికి ఓపిక లేక అలాగే వదిలేసి ఉంటాడు. అంత ముఖ్యమైనది కాదు అనిపించి, తోసి పుచ్చుదాం అనుకుంటూనే సిగరెట్ పాకెట్ లోపల ఉన్న సిల్వర్ పేపర్ ని విడదీసారు. అప్పుడు కనబడింది, లోపలి అట్టలో మాయ- చెన్నై -4 అని వ్రాసి ఉంది. మాధవరావు ఒక్క నిమిషం ఆలోచించారు.
“థాంక్స్. తరువాత వస్తాను” అని జీప్ లో బయలు దేరి నేరుగా పోస్ట్ ఆఫీసుకి వచ్చాడు. ఉమ అడ్రసుకి టెలిగ్రాము ఇచ్చాడు. ముందే ఇవ్వాలనుకున్న టెలిగ్రాములో చిన్న మార్పు చేశారు.
“రాకేష్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. అతను మీ భర్తను చంపిన వ్యక్తి.”
మాధవరావు.
*****
(ఇంకా ఉంది)
1956లో దిండిగల్, తమిళనాడులో జననం. మాతృభాష తమిళం. తండ్రిగారి ఉద్యోగరీత్యా తెలంగాణాలో తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించారు. బి.కాం. పూర్తి అవుతుండగానే వివాహానంతరం చెన్నైకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తరువాతే తమిళ సాహిత్యం చదవడానికి అవకాశం లభించింది. సాహిత్యం అంటే మక్కువ. తెలుగులో తనకి నచ్చిన నవలలు, కధలు తమిళ పాఠకులకు, అలాగే తమిళంలో మనసుకు దగ్గరగా ఉన్న సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలనే కోరికతో, ఆశయంతో అనువాద ప్రక్రియను ఎంచుకున్నారు. 1995లో మొదటి అనువాద కధ యండమూరి వీరేంద్రనాథ్ గారి “ది బెట్’ తమిళంలో ప్రచురం అయ్యింది. దాదాపు ఎనబై తెలుగు నవలలు తమిళంలో వెలువడి ఉన్నాయి. (యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి, D. కామేశ్వరి, ఓల్గా) తెలుగులో పెరుమాళ్ మురుగన్ గారి “పూనాచ్చి ఒక మేకపిల్ల కధ” ఈ మధ్యే వెలువడింది. 2015లో ఓల్గాగారు “విముక్త” కధా సంకలనానికి సాహిత్య అకాడమి అవార్దు అందుకున్న అదే ఏడాది, విముక్త తమిళ అనువాదం “Meetchi”కి గౌరీ కృపానందన్ సాహితి అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు. మూలానికీ, అనువాదానికీ ఒకే ఏడాది సాహిత్య అకాడమి అవార్డులు రావడం ఇదే తొలిసారి.