క ‘వన’ కోకిలలు – 18 :
పద్మశ్రీ విక్రమ్ సేథ్ (భారతీయ ఆంగ్ల కవి)
– నాగరాజు రామస్వామి
నింగి, నేల, సముద్రాల సామరస్య సర్వైక్య శ్రావ్య గీతం నా సంగీతం – విక్రమ్ సేథ్.
పద్మశ్రీ విక్రమ్ సేథ్ ప్రసిద్ధ భారతీయ కవి. నవలా కారుడు. యాత్రాకథనాల (travelogues) రచయిత. గొప్ప అనువాదకుడు. ఆంగ్లంలో సాహిత్య వ్యవసాయం చేసి విశ్వఖ్యాతి గడించిన కృశీవలుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. సాహిత్య అకాడమీ, ప్రవాసీ భారతీయ సమ్మాన్, WH Smith Literary Award and Crossword Book Award, Stegner Fellowship, Guggenheim Fellowship, Commonwealth Writers’ Prize వంటి పలు బహుమతులను గెలుచుకున్న సాహిత్య స్రష్ట.
విక్రమ్ సేథ్ జూన్ 20, 1952 న కలకత్తాలో జన్మించాడు. తండ్రి వ్యాపారవేత్త, తల్లి డిల్లీ హైకోర్టులో తొలి మహిళా జడ్జి. అతని చదువూ, పెంపకం ఇండియాలో, లండన్ లో జరిగింది. భారతదేశంలోని ప్రత్యేక బోర్డింగ్ స్కూళ్ళలో చదువుకున్నాడు. డెహరాడూన్ లో చదివిన రోజుల్లో స్కూల్ వీక్లీ ముఖ్య సంపాదకుడుగా పనిచేశాడు. అతని ఉపాధ్యాయుడైన గురుదయాల్ సింగ్ ప్రభావం సేథ్ పై అధికంగా ఉండిందంటారు. గురుదయాల్ సింగ్ పర్వతారోహకుడు కావడం వల్ల భౌగోళిక శాస్త్రంలో ఆసక్తిని నాటాడు. అతనిలో పర్యాటకసాహస ప్రవృత్తిని పెంచాడు. అతన్ని పాశ్చాత్య క్లాసికల్ సంగీతంలో, నాటక కళలలో, స్కూళ్ళలో జరిగే డిబేటింగ్ లలో ఎంతగానో ప్రోత్సహించాడు. తర్వాత సేథ్ విద్యాభ్యాసం విదేశాలలో కొనసాగింది. ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో గ్రాడ్యుయేషన్ (ఎకనమిక్స్, పాలిటిక్స్, ఫిలాసఫి), అమెరికాలోని స్టాన్ ఫర్డ్ లో పి.హెచ్.డి (అర్థశాస్త్రం), చైనా నాన్ జింగ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు. ఇండియాకు వచ్చేసి సకుటుంబ సమేతంగా న్యూ డిల్లీలో స్థిరపడ్డాడు.
విక్రమ్ సేథ్ 8 కవితా సంకలనాలు, 3 నవలలు రాశాడు. అందులో కొన్ని రచనలు :
The Golden Gate, A Suitable Boy, An Equal Music, A Heave lake: Travel through…,Two Lives: A Memoir, A Suitable Girl, All You who sleep to Night: Poems, Mappings(poems), Three Chinese Poets, The Rivered Earth, The Poems 1981 – 1994, Summer Requiem.
The Golden Gate కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన, California Silicon Valley జీవన విధానాన్ని ప్రతిబింబించే కవనరూప (Verse) నవల. BBC టెలివిజన్ డ్రామా సీరియల్ గా ప్రసారంచేయబడింది. A Suitable boy టాల్ స్టాయ్, జేమ్స్ జాయ్స్, చార్లెస్ డికెన్స్ రచనలతో తులతూగ గల 1349 పేజీల బృహద్నవల. Three Chinese Poets చైనా దేశ సనాతన కవిత్రయం వాంగ్ వీ, లీ పో, తు ఫు (Wang Wei, Li Po, Du Fu) కవితల అనువాదం. An Equal Music నవల ఒక ప్రసిద్ధ వయోలిన్ విద్వాంసుడి భగ్న ప్రణయ గాధ. Mappings 1980 లో వచ్చిన తొలి కవితా సంకలనం. From Heaven Lake టిబెట్, నేపాల్ గుండా నాన్కింగ్ ( చైనా), నుండి డిల్లీ దాకా సాగిన యాత్రా కథనం.
సేథ్ నవలలు, కవితలు. ట్రావెలాగ్ లే కాక, కథలు కూడా రాశాడు. ఇంగ్లీష్ నేషనల్ ఓపెరా కొరకు గ్రీక్ పురాణ పురుషుడైన Arion సంబంధిత దృశ్యనాటికకు (Libretto) గీత రచన చేశాడు.
సేథ్ నేల విడిచి సాము చేయలేదు. సమకాలీన సాహిత్యానికి 19వ శతాబ్దపు శైలీ శిల్పరూప ప్రక్రియలను (Form) అద్దాడు. పాత కాలపు కవిని అంటూనే, ఒకింత అధునికానంతర కవిత్వ శైలిని తన కవిత్వంలో ప్రవేశపెట్టాడు. కొన్ని పద ప్రారంభ అక్షర సముదాయాల అక్రాస్టిక్ (Acrostic) కవితలు అల్లాడు. న్యూక్లియర్ మారణాయుధాలు, కాథలిక్ బోధలు, హోమోసెక్స్, ఓవర్ వర్క్ అనర్థాల లాంటి అన్నివిషయాలు అతని రచనా వస్తువులైనవి. తన నియమిత కవితారూపాన్ని (Poetic form) నిలబెట్టుకుంటూ వస్తున్న పరిణత కవి విక్రమ్ సేథ్.
దేశంలో జరుగుతున్న వివక్షకు నిరసనగా, మోదీ ప్రభుత్వంలో ప్రభలుతున్న అసహనానికి (rising intoerance in India) తిరుగుబాటుగా, మరెన్నో కారణాల వల్ల, 2015 నాటికి 38 మంది సాహిత్యకారులు తమ సాహిత్య అకాడెమీ అవార్డ్ లను తిరస్కరించారు. వారిలో మన కాత్యాయిని విద్మహే గారు కూడా ఒకరు.
రచయితల జీవితాలను, హక్కులను, భావప్రకటనా స్వేచ్ఛను సాహిత్య అకాడెమీ పరిరక్షించని పక్షంలో తన అవార్డ్ లను తిరస్కారిస్తానని విక్రమ్ సేథ్ తేల్చి చెప్పాడు.
ఇవిగో ఇవి నాకు తోచిన కొన్ని సేథ్ లఘు కవితలకు నా తెలుగుసేతలు:
1. ఈ రాత్రి నిదురించే మీరంతా (All You Who Sleep To Night)
కుడి ఎడమల ఎవరూ లేరు,
పైన అంతా శూన్యం;
ప్రేమించిన వాళ్ళకు దూరంగా
ఈ రాత్రి నిదురించే మీరంతా
ఒకటి గ్రహించండి
ఒంటరులు కారు మీరు;
యావత్ ప్రపంచం పంచుకుంటోంది
మీ అశ్రువులను, మీ చీకటి రాత్రులను –
కొందరు ఒకటి రెండు రాత్రులను,
కొందరు జీవిత పర్యంత నిశలను.
2. తనదికానితనం (Unclaimed)
అపరిచితులను ప్రేమించడమే నయం;
ప్రశ్నలుండవు, పరీక్షలుండవు, ప్రహేళికలుండవు.
ఈ చిక్కు ముడుల చీకటి రాత్రిలో
అబద్ధపు ప్రేమ ఊసుల, బాధల, బాంధవ్యాల
ప్రసక్తి ఉండదు.
రాక తప్పని పగటి భయాలు తనవి కావని,
తాకడం, తాకి గ్రహించడం అపరిచితులకే చెల్లుతుంది.
పరాపర హృదయ ఘర్షణల పట్టింపులు లేని వాళ్ళకు
సాగదీయడం, విడిపోవడం వంటి తలపులే తలెత్తవు.
అపరిచిత బాహువుల్లో ఒదిగిపోవడం,
అప్పటికి, అదే వాళ్ళ అనుభవసత్య వాస్తవం.
3. భరోసా ( Promise )
నేను సీదా సాదా సహచరిని;
ఇక
నాటి నా అస్పష్ట కళంకిత ఆకాంక్ష ఆవిరై పోతుంది,
ఏ అసౌఖ్య ఆలోచనా నిన్ను ఇబ్బంది పెట్టదు,
ఇకపై,
నా అనాసాయ నయన సర్వేక్షణ
నీ వదనాన్ని లలిత కోమలంగా స్పృశిస్తుంది.
4. తిరిగుతూ తిరిగుతూ …. (Round and Round)
అధ్వాన్నపు విమాన ప్రయాణం;
పగటి వెలుతురును రేయి చీకట్లలోకి సాగదీసిన
లాంగ్ ఫ్లైట్,
చీకాకుల పిల్లల గోల,
నా ప్లాస్టిక్ ఫుడ్ మీద తొణకిన విస్కీ.
ఆ గందరగోళం నుండి బయటపడ్డాక
బాగేజ్ క్లేమ్ వద్ద సామాన్ల వేట;
తమ తమ బాగ్ లు పట్టుకుని వెల్తున్న జనం,
నా లగేజ్ జాడ లేదు.
రంగుల రాట్నపు రబ్బరు పలకల బెల్ట్ మీద
ఓ ఎర్రెర్రని చిన్నారి సూట్ కేస్ తిరుగుతూనే వున్నది;
నాకు తెలుసు అది ఆమెదని.
ఏడేళ్ళయింది ఆమెను చూచి!
కీచుశబ్దాల కిర్రుబెల్ట్ కదలుతున్నంత సేపూ
నా స్మృతులలో మెదలుతూనే వున్నవి
మధుర మధుర కిలకిలా రావాలు.
ఓ వృద్ధుడు
కదిలే బెల్ట్ మీది తన పెట్టెను లాగేసుకున్నాడు,
నా లగేజ్ కనిపించగానే నేనూ చేశాను అదే పని.
5. వ్యాఖ్యానం (Interpretation)
ఎక్కడో,
నీ వలపు చూపుల ఏ మూలనో
దాగిన మర్మమేదో అవగతమౌతున్నది;
నిన్ను మోసగించే ఉద్దేశం లేని,
సందేహాలు గాని, సాక్షాలు గాని
ఏవీ లేని ఎరుక ఏదో చెబుతున్నది
నీ ఎద లోతులలో ఎక్కడో
వదలుకోవాలనే కోర్కె మసలుతున్నదని.
6. జాగరణ రాత్రి (Night Watch)
అతను
నిద్ర కరువైన అస్థిర నిశ్చల రాత్రిలో
మౌనంగా చుక్కలను లెక్కిస్తున్నాడు;
‘ఉదయం వచ్చింది, వెళ్ళి పోయింది
ఒకింత కాంతినైనా తేకుండానే’ –
ఆ చింత అతన్ని పట్టి పీడిస్తున్నది.
7. ఖిన్న భిన్నార్థ పదద్వయాలు (Distressful Homonyms)
నీవు నాకు ఇవ్వడానికి ఏ ఆత్మీయతా లేదు;
ఐనా, మన్నించి వదిలేస్తున్నాను.
అజాగ్రత్తా జనితమైన వ్యాకులతను
తాత్వికత నిమ్మళింప చేస్తుంది,
అందుకే అది
ఒక అతిసూక్ష్మ సత్యాన్ని ప్రతిపాదిస్తున్నది
‘మిగతా అన్ని ఉద్విగ్న భావాలకు లాగానే
ప్రేమకూ కావాలి విశ్రాంతి’ అని.
(ఇవి ద్వంద్వార్థ పదాలు:
Spare – ఇవ్వడం, వదిలేయడం.
State – రాష్ట్రం, స్థితి
Rest – విశ్రాంతి, మిగతవి )
ఆంగ్లంలో ఉన్న హోమోనిమ్న్ లను తెలుగులో సరితూగే ద్వంద్వార్థ పదాలలో అనువదించలేని అశక్తతకు చింతిస్తున్నాను. మూల కవితలోని కవి ప్రతిభను చాటడమే నా ఉద్దేశం.
8. గత రాత్రి ( Last Night)
గత రాత్రి
నా చెంతకు చేరింది
మసకబారిన నీ జ్ఞాపకం;
అడవిలోకి ఆమని నింపాదిగా వచ్చి నట్టు,
ఎడారిన వడిగాలి నెమ్మదిగా వీచినట్టు,
ఊహించని ఉపశమనం రోగి ఎదను చేరినట్టు.
విశ్వ విఖ్యాత భారతీయ ఆంగ్ల కవి విక్రమ్ సేథ్. మన సమకాలీన ఇంగ్లీష్ సాహిత్య సవ్యసాచి విక్రమ్ సేథ్.
*****