కారబ్బంతి చేను
-అనిల్ డ్యాని
మట్టిదారి
ముందు మనిషి కనబడడు
పొగమంచు దట్టంగా
గుండె జలుబు చేసినట్టు
ఊపిరి ఆడని ఉక్కిరిబిక్కిరి తనం
కుడివైపున
ఏపుగా పెరిగిన తాడిచెట్ల నుంచి
కమ్మగా మాగిన తాటిపళ్ళ వాసన
ఎడమవైపున
శ్మశాన వైరాగ్యపు సమాధులు
సామూహిక బహిర్భూమి ప్రదేశాలు
ప్రవహిస్తున్న మద్రాసు కాలవ నిండా
దాని తవ్వకానికి నా పూర్వీకులు
చిందించిన చెమట
ఒంటిమీద
కనీసం రెండైనా గుండీలుండని
పల్చటి చొక్కా
మోకాళ్ళ పైకి జారకుండా ఉన్న
నిక్కరుకి మొలతాడే ఆసరా
చేతులు ముడుచుకుని చలిలో
కాస్త ఆలస్యం అయినా
సగం కూలి పోతుందనే తొందర్లో
తెగిన పారగాన్ చెప్పుని అతికించిన
పిన్నీసు గుచ్చుతున్న స్పర్శతో నడుస్తుంటే
ఎవరో పిలిచినట్టు తోట సమీపానికి వచ్చేస్తుంది.
తెల్లటి సిమెంట్ గోతాలు
నడుం మీదకి తాడుతో సహా
అలంకరింపబడతాయి
అడుగు వేసిన ప్రతీ చోట
ఒట్టికాళ్ళ నిండా నీరుకట్టిన బంకమట్టి బురద
జారిపడితే పూలు నవ్వుతాయని భయం
ఆకుపచ్చటి పసిరిక వాసన నిలబడ నివ్వదు
చిక్కుతున్నట్టుగానే ఉన్న కారబ్బంతులు
చేతికి రానే రావు
ప్రాణం అంటే తీపి లేనిది ఎవరికి
కొలత కొద్దీ కూలి
కేజీల కొద్దీ ఆరాటం
పొద్దెక్కే కొద్దీ ఆకలి
ఎండెక్కితే
అనుకున్న కూలి కొండెక్కినట్టే
సమయం ఆరున్నర
కోత బరువు పదిన్నర
నిన్నకి ఇవాళ్టికి కూలితేడా పెరిగితే
బూతులు కొసరుగా మోసుకెళ్ళొచ్చు
అవసరం కొన్ని మాటలు విననివ్వదు
మళ్ళీ నిన్ను గాయపరచడానికి రేపు వస్తానని
కారబ్బంతి చేనుతో ఒక మాట చెప్పి వస్తాను
నా మాటకో లేదా
గాలి వీచిందనో తలలూపుతాయి
జేబు కాస్త నిండుతుంది
పంపుసెట్టు కాడ
అవమానాల బురద కడుక్కుని
చెప్పులేసుకుంటాను
వెనక్కి వెళ్ళేటప్పుడైనా
పిన్నీసు కరవకుండా ఉంటే బాగుండు……
( సంక్రాంతి చలికాలంలో చిన్నప్పుడు కారబ్బంతి చేలో కోతలకు వెళ్ళిన సందర్భం గుర్తొచ్చి….. )
*****