కొత్త అడుగులు – 45

నిప్పుల వానలో వర్షపుఋతువు – స్వయంప్రభ

– శిలాలోలిత

నా అక్షరాలు

కన్నీటి భాష్పాలు కాదు

పోరాడమని చెప్పే విస్ఫు లింగాలు

నా అక్షరాలు దీన స్వరాలు కాదు

చైతన్యాన్ని పెంచే ధిక్కార స్వరాలు

నా అక్షరాలు కల్లోలాల

జల ప్రళయాలు కావు

 ప్రేమైక్య జీవన స్వప్నాలు

నా అక్షరాల స్తోత్రాలు కావు

మనో రుగ్మతలకు ఔషధాలు

నా అక్షరాల పద్మవ్యూహాలు కావు

చీకటిని చీల్చుకొచ్చి

క్లిష్ట చిక్కుముడులను

విప్పే ఉషోదయాలు

నా అక్షరాలు  ముఖస్తుతుల

బాకాలు కాదు

దిక్కుని చూపించే నిరుపమాన

 దిశ నిర్దేశాలు

 నా అక్షరాలు కంటి పొరలని చూల్చే

 అశ్రువులు  కాదు

 బతకడానికి తెగింపు నిచ్చే అస్త్రాల కుప్పలు

అదే నేను రగిలించిన  ఈ

పూల నిప్పులు

.. – అని ప్రకటించింది స్వయంప్రభ.  ఈసారి స్వయంగా తనకు తానే ప్రభవించిన ‘పూల నిప్పులను’  పరిచయం చేసుకుందాం. అమరావతిలో ఉండే ‘ప్రభ’  ఇతర ప్రక్రియల్లో గతంలో రాసినప్పటికీ ఇది మాత్రం తొలి కవిత్వ సంపుటి. ఆ స్వచ్ఛత, సరళత, ఉద్వేగ ఛాయలు, కవిత్వ ప్రేమ కనిపిస్తున్నాయి.

          ఐతే ఇప్పుడు వస్తున్న ఆధునిక కవిత్వం పోకడలకు కొంత దూరమేనని చెప్పాలి.  ఎందుకంటే ఉద్దేశాలు సమాజాన్ని ఒడబోసిన రీతి, స్త్రీల పట్ల వివక్ష ఇంకా మారని పురుష స్వభావం పట్ల అవగాహన ఎక్కువగా ఉంది.

          వ్యక్తీకరణ పదును తేలాల్సిన అవసరం ఉంది. ‘పూల నిప్పులు’ వేరే విలక్షణంగా ఉంది. కవయిత్రి మనసులో మెత్తదనం, ఆగ్రహం పెల్లుబికిన వైనం ఏకకాలంలో వెలి బుచ్చిన పద బంధమిది. పువ్వులు సౌకుమార్యానికి సౌందర్యానికి ప్రతీకలు. నిప్పులు మండుతున్న వ్యవస్థకు సంకేతాలు. ఈ రెంటినీ కలిపి తనకు, సమాజానికి జరిగిన, జరుగుతున్న అంతర్యుద్ధాన్ని ఈ కవిత్వం వెల్లడించింది.

          కెంగర మోహన్ గారు, కాంచనపల్లి గార్లు మంచి ‘ముందు మాటలు’ రాశారు. స్వయంప్రభను అర్థం చేసుకోవడానికి దారి దీపాలవి.

          ‘సగటు మహిళ జీవితం నిప్పుల నడకలా ఎలా మారిందో, మారుతుందో స్పష్టంగా చాలా చోట్ల చెప్పింది. చాలా చోట్ల పురుషుడు రాజీ పడడు, స్త్రీ కున్న సహనం పురుషుడికి లేదనే చెప్పాలి. వెతల్ని కవితలుగా రాయడం ఇటీవల కాలం సాహిత్యం సాధించిన ఘనవిజయమని చెప్పవచ్చు. ఈ కవిత్వ సంపుటి అనేకానేక వస్తువుల సముదాయం. అనేకానేక మానసిక వైఖరుల గమనం. ఈ సంపుటిలో మొదటి కవిత అన్నదాత కష్టాల్ని రాశారు.

“మట్టిని ముద్దాడిన పుడమి తల్లి పుత్రులం

మలినమంటని పేగులం

 విశ్వానికే కంచంలో అన్నం పెట్టిన దాతలం

 కాలే కడుపుకు నడుము కట్టి కట్టు కట్టిన దారిద్రరేఖ బంధువులం

– ఇలా జీవన సమరంలోని సంఘటనలెన్నో పరుచుకొని ఉన్నాయి.

 స్వయంప్రభ కవిత్వంలో కొన్నిచోట్ల స్టేట్ మెంట్లు గబుక్కున ముందుకు వస్తాయి.

 ప్రశ్నిస్తేనే మారదు సమాజం

మార్పు నీతోనే మొదలవ్వాలి

ఎదిరించి నిలబడితేనే జరగవు కార్యాలు

ఆచరణాత్మక అడుగులేస్తేనే విజయాలు–

ఇటీవల కాలావసరంగా,  సమాజంలో మార్పును అభిలాషిస్తూ, పోరాటపఠిమను వెల్లడిస్తున్న ‘సమూహ’ ను ఒక్క క్షణం తలుచుకునేటట్లుగా కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి.

          కాంచనపల్లి రాజేంద్ర రాజు గారి ముందుమాటలో ‘ఆమె కవిత్వం దాగుడుగా వెలుగుతుంది. ముందు తరాలకు ముగిసిపోని దారిగా సాగుతుంది.’  అని అభిప్రాయ పడ్డారు.

          “తగిలిన చోటే మళ్ళీ మళ్ళీ గాయాలు తగులుతూ ఉంటాయి. గాయాన్నే చూస్తూ నిలబడితే గమ్యాన్ని చేరుకోలేము.” అనే స్టేట్ మెంట్లు ఈ కవిత్వం నిండా పుష్కలంగా ఉన్నాయి. రాజేంద్ర రాజు గారి మాటల్లోనే.. “కవయిత్రి స్వయంప్రభ ఉప్పెన కాదు. ప్రళయం కాదు. విస్ఫోటనం కాదు. జీవితంలో రాలపడ్డ గాయాల గాజు పెంకులు గుచ్చు కోకుండా నిప్పుల కవచం కప్పుకున్న కుసుమం.

          ఇలా ప్రతినెలా ఒక కొత్త కవితని పరిచయం చేయటమే కొత్త అడుగులు ఉద్దేశం.  ఇది స్పందన, విమర్శ, సమీక్ష కాదని గమనించగలరు

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.