నా అంతరంగ తరంగాలు-8
-మన్నెం శారద
నేనూ …నా చిన్నతనపు రచనావ్యాసంగం ..
————————————-
‘అసలు రచన అంటే ఏమిటి ..ఎలా రాయాలి, ఎందుకు రాయాలి’ అనే ప్రాధమిక విషయాలేమీ తెలియని రోజుల్లోనే నా రచనా వ్యాసంగం మొదలయ్యింది . మొదటిసారి అంటే నా ఏడవ సంవత్సరంలో మా పెదనాన్నగారు, దొడ్డమ్మ ఆయన చీపురుపల్లిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కాకినాడలో చదువుకుంటున్న వాళ్ళ పిల్లల్ని చూసేందుకు దగ్గర బంధువుల్ని ఇంట్లో పెట్టి వెళ్ళారు.
వాళ్ళు పెదనాన్న పంపిస్తున్న మిఠాయిలు, తినేస్తూ డబ్బు వాడేసుకుంటూ … అక్కయ్యల్ని దులపరిస్తూ అడ్డంగా గుమ్మాలు పట్టకుండా తయారయిపోయారు. మేము సెలవులకి వచ్చినప్పుడు వాళ్ళు మా అమ్మకి చెప్పి లబోదిబోమన్నారు .”ఏం చేస్తామే , వాళ్ళు మీ నాన్నగారి తరఫు వాళ్ళు , ఏమన్నా అంటే బాగుండదు . “అంది అమ్మ వాళ్ళతో.
అప్పుడు నేను మణక్కకి నాటకం విషయం చెప్పి అలవాటు ప్రకారం పళ్ళికిలించా ను .
“పిచ్చి వేషాలెయ్యకు ,అమ్మావాళ్ళకు తెలిసిందంటే చావగొడతారు “అంది మణక్క కొంత నవ్వు దాచుకుంటూ .
కానీ అసలే భగ్గుమంటున్న సౌదాకి మాత్రం ఈ నా ప్రపోజల్ బాగా నచ్చింది. “వేద్దాం వేద్దాం రాసేయ్ “అని ప్రోత్సహించింది సంబరంగా.
ఇంకేంటి …వాళ్ళమీద వ్యంగ్యంగా ఒక నాటిక తయారయ్యింది. అది ఫక్తు నేను ఆ రోజుల్లో మాచర్ల టూరింగ్ టాకీస్ లో చూసిన జానపద సినిమాలకు ఆధారం ! నేను మంత్రిని .. అంటే విలన్ని, సౌద రాజకుమార్తె , మా అత్తయ్య కూతురు పరిచారిక, మా హేమక్క రాజు …అలా.. అన్నమాట.
మాకు మా మామయ్యకు తెలియకుండా అన్ని విధాల సహకరించిన మా అత్తయ్య కు నిర్మలకు పనిమనిషి వేషం ఇస్తారా ‘అని కోపం కూడా వచ్చింది . సరే… ఎలాగూ వేస్తున్నాం కదా అని, నాటకం ఎంతమాత్రం అల్లాటప్పగా వేయకూడదని నిర్ణయించు కుని కొన్ని పోస్టర్లు తయారు చేసాం. వాటిని కొబ్బరి ఈనెలకు అంటించి ఊరేగింపు చేసాం.
చెప్పొద్దూ….
మంచి రెస్పాన్సె వచ్చింది.
“పిల్లలు నాటకం ఆడతారంట. సూద్దారీ!”అనుకున్నారు అందరూ.
అప్పుడే పెదనాన్నగారి పెద్దకూతురు కృష్ణక్కకి పెళ్ళి కుదిరింది. బావగారు ఇంజినీర్, ఆయనే మాచర్లలో మాకు మొదటిసారి బొమ్మలు వేసుకోవడానికి డ్రాయింగ్ షీట్స్, వ్వాటర్ కలర్స్ కొనిచ్చింది .
బావగారి నాన్నగారు కృష్ణారావు నాయుడు గారంటే అందరికీ హడల్. ప్రముఖ లాయర్, రంగూన్ లో పని చేసి వచ్చినవాడు. చండశాసనుడని పేరు ! ఆరడుగుల పచ్చని విగ్రహం ! అందరూ ఆయన్ని చూసి గడగడా వణికేవారు. నేను మాత్రం చొరవగా ఆయన దగ్గరకి వెళ్ళేదాన్ని.
కాకినాడలో ఏ కొత్త సినిమా వచ్చినా రాత్రిపూట రకరకాలుగా పోస్టర్లు అంటించి బళ్ళలా చక్రాలులా తయారు చేసి పెట్రోమాక్స్ లైట్లతో వూరేగించేవారు .
‘ఏం సినిమా కావాలోయ్… అంటే గుండమ్మ కథ కావాలోయ్ “అంటూ ఏ సినిమా వస్తే ఆ పేరుతో ఊరేగింపు సాగేది . ఆ ఊరేగింపు చూస్తేనే సగం సినిమా చూసినంత సంతోషం !
మేం అలానే అరుస్తూ ఊరేగింపుని మా క్కాబోయే బావగారింటికి దారి తీయించేము .
“వద్దొద్దు, ఆయనసలే మంచోడు కాదు.”అన్నారందరూ.
“ఏం కాదులే ” అని అందరికి నచ్చచెప్పి బేచ్ నంతా బయలుదేరదీసాను.
వాళ్ళిల్లు చాలా అధునాతనంగా ఉండేది.
“ఏంటిలా వచ్చావ్ గేంగ్ నేసుకుని ?”అని అడిగేరాయన నవ్వుతూ ,
“డ్రామా వేస్తున్నాం, చందాకావాలి మావయ్య గారూ !”అన్నా వినయంగా
“ఏంటే …మీ పెదనాన్న పెళ్ళికి డబ్బులు లేక మీ చేత నాటకాలేయిస్తున్నాడా ?” అన్నాడాయన వెటకారంగా “
“అవును మావయ్యగారూ …మీకు కట్నం ఇవ్వాలికదా !” అన్నాను నేను కూడా నవ్వుతూ.
అంతకోపిష్ఠి మనిషికి ఎందుకో నవ్వొచ్చింది .
బడాయిగా” ఇది సరిపోతుందా? “అంటూ వంద రూపాయిలనోటు నా మీదకు విసిరేడాయన.
నా కళ్ళు మెరిసాయి.
చటుక్కున అందుకుని మళ్ళీ ఎక్కడ వెనక్కు తీసుకుంటాడో అని ఇంటికి ఒకటే పరుగు!
మా పిసినారి తాసీల్దారు మామయ్య దగ్గరకూడ ఎలాగోలా ఒక పది రూపాయిలు గుంజేం. అలా కొన్ని చందాలు వసూలయ్యాయి అట్టలకి చంకీ కాగితాలు అంటించుకుని వడ్డాణాలు, కిరీటలూ, కాస్టుమ్స్ తయారు చేసుకున్నాం. అత్తని బ్రతిమిలాడి పట్టు చీరలు తెచ్చి కర్టెన్స్ కట్టేం. ముందు పక్కన ఉన్న గచ్చు నేలాంతా ప్రేక్షకుల కోసం చాపలు, తివాచీలు వేసాం. మా ఇంటిదగ్గర పార్సీ షాపులోకెళ్ళి కూల్ డ్రింక్స్ తెచ్చి వాటిని ఇంట్లో వున్న ఔన్స్ గ్లాసుల్లో పోసి ఇవ్వడానికి రెడీ చేసుకున్నాం.
అసలు సంగతి చెప్పనే లేదు కదా.. ఈ నాటకం వెయ్యడానికి మా అమ్మని సౌదా వాళ్ళు ముందు చాలా బ్రతిమిలాడి ప్రసన్నం చేసుకున్నారు.
మా అమ్మగారికి మా దొడ్డమ్మ గారి పిల్లలంటే చాలా ప్రేమ! పెళ్ళికి ముందు వాళ్ళని తనే పెంచిందట. అందుకే ఎలాగో ఒప్పుకుంది.
నిజానికి మేం ఆఁ నాటకం చుట్టాల్ని ఉద్దేశించి వేస్తున్నాం అని అమ్మకి తెలియదు.
మా మూడో హిట్లర్ మావయ్య బయటకి వెళ్ళేక నాటకం మొదలెట్టేం. సౌదా పొడవు, నేను పొట్టి. చిన్నస్టూల్ మీద నిలబడి నేను దాన్ని బెదిరించాలి రాజనాల లెవల్లో. అది బెదరి పోతుండాలి.
నేను sv రంగారావు, లెవల్లో రెచ్చి పోతున్నాను. చివరకు నాటకం పక్కదారి పట్టింది.
అసలు కథ వదిలేసి మేము వళ్ళు మరచిపోయి ఆఁ చుట్టాలు చేసిన పనులు డైరెక్ట్ గా చెప్పేస్తున్నాం.
ఇంకేముంది…
వాళ్ళ మొహాలు మాడి పోతున్నాయి.
పరిస్థితి అర్ధం చేసుకుని అమ్మ, అత్త ‘ఆపండి ‘ అంటూ ఒక్క అరుపు అరిచారు.
ఇంతలో మా మామయ్య కూడా రావడం… నాటకం రసా భాస కావడం… మేం ఎవరి మేకప్పులు వాళ్ళం ఊడ బీక్కుని చంకలో పెట్టుకుని వుడాయించడం జరిగిపోయింది.
వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుని “పొమ్మంటే పోయేవాళ్ళం కదా..ఇలా పిల్లల చేత నాటకాలు వేయించి మా పరువు గంగలో కలుపుతారా .”అని గింజుకుని తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోయారు.
మేం మావయ్యకు, అమ్మకు దొరక్కుండా నాలుగు రోజులు మా చుట్టాలిళ్ళల్లో దాకున్నాం.
పెదనాన్నా , దొడ్డమ్మా వచ్చాక విషయం తెలిసి అంతగా సీరియస్ అవ్వలేదు.
పిల్లల్ని సరిగ్గా చూడలేదని వాళ్ళకి కూడా కోపం వచ్చింది.
ఆలా నా మొదటి రచన వెలుగు చూసింది.
రెండవది నా పదకొండో ఏట రాసిన “పగపట్టిన పడుచు ” అనే డిటేక్టీవ్ నవల.
నాగార్జునసాగర్ లో నాన్న పని చేసే రోజుల్లో శ్రీరామ్మూర్తి గారనే సూపరిండెంట్ ఇంజినీర్ గారూండేవారు. ఆయన శ్రీమతి లీలావతి గారికి ఎప్పుడూ ఏవో బుక్స్ పార్సెల్స్ వస్తుం డేవి. ఆమె బాగా చదువుకున్నారని తరచూ బుక్స్ తెప్పించు కుంటుంటారని నాన్న అమ్మతో అనడం విన్నాను. ఆమె అమ్మకు లేడీస్ క్లబ్ లో ఫ్రెండ్.
S.E గారు లేనప్పుడు ఆమె ఒక్కోసారి నన్ను రాత్రులు పడుకోడానికి రమ్మనేవారు.
అప్పుడు తెలిసింది.. ఆఁ బుక్సన్నీ డిటేక్టీవ్ నవలలని. అక్కడ వాటిని చదవడం అలవాటయి ఆఁ ప్రభావంతో నేనొక నవల రాసేసాను. గుండ్రటి అక్షరాలతో తెల్లకాగితా లతో కుట్టిన పుస్తకంలో రాసి కవర్ మీద అందమైన బొమ్మకూడ వేసాను కానీ ఎంత బతి మాలిన ఏవో పిల్ల చేస్టల్లే “అని ఎవరూ పట్టించుకోలేదు.
మూడోది ముచ్చటగా సాగర్ స్కూల్లో నేను రాసి నటించిన నాటకం “ఎత్తుకు పై ఎత్తు “. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే తర్వాత కాలంలో “గుణపాఠం “పేరుతో ఆలిండియా రేడియో విజయవాడలో ప్రసారమయ్యింది.
అలా బాల్యదశలో నా రచనా వ్యాసంగం నడిచింది. ఇదంతా నా బాల్యం గురించి రాసిన “చిగురాకు రెపరెపలు “పుస్తకంలో వివరించాను కానీ ఆఁ బుక్ చదవని వారి కోసం ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను. చాలామంది ఫ్రెండ్స్ ఆఁ బుక్ గురించి అడుగుతున్నారు. కాపీలు లేనందున ఇలా కొన్ని సంగతులు షేర్ చేస్తున్నాను.
నన్ను ప్రోత్స హించిన నా సంపాదకుల గురించి మరో సారి ముందు ముందు.. థాంక్యూ
*****
(సశేషం)
నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.