నా జీవన యానంలో- రెండవభాగం- 34

-కె.వరలక్ష్మి

          “మనం ఘర్షణ పడాల్సింది ఆదర్శాలతో, విలువలతో, వ్యక్తుల్తో కాదు” అంటాడు బుచ్చిబాబు గారు.

          మోహన్ పనుల్లో అలసిపోతున్నా రిలాక్సేషన్ కోసం ఏదో ఒకటి రాస్తూనే ఉండే దాన్ని. చేసిచేసి, రాసి రాసీ అలసిపోయి అతని మంచం పక్కనే నేలమీద పడి నిద్ర పోయేదాన్ని. గాఢమైన నిద్రలో ఉండడం చూసి తన చెక్కపేడుతో మంచం పట్టిమీద గట్టిగా అదేపనిగా చప్పుడు చేస్తాడు లేదా రిమోట్ చేతిలో ఉంటుంది కాబట్టి టివి సౌండ్ పెంచేస్తాడు.

          2004 లో రాజకీయనాయకులు ముందుగా రాజీనామాలు చేసి ముందస్తు ఎన్నికలు తెచ్చారు. మా ప్రాంతంలో మే 26న జరిగిన ఎన్నికలకి మోహన్ని ఆటోలో తీసుకెళ్ళి ఓట్లు వేసి వచ్చాం. ఎన్నడూ లేనిది మా ఊరి సెంటర్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల వాళ్ళు కొట్టుకుని ఆ రోజు సాయంకాలం గొడవలు పడి,  కార్లు, స్కూటర్లు తగలబెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 185  స్థానాల్లో గెలిచి విజయాన్ని సాధిస్తే తెలుగు దేశం 44 స్థానాలు గెలిచి పరాజయం పొందింది. కేంద్రంలో కూడా BJP సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోయి, కాంగ్రెస్ సంకీర్ణం వచ్చింది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి C.M అయ్యాడు. తెలుగు దేశం హయాంలో మొదలైన మా ఊరి మధ్య నంచి వెళ్ళే హైవే ఫ్లైఓవర్ వర్క్ పూర్తై ఆ సంవత్సరం ప్రారంభమైంది.

          విశాలమైన జగ్గంపేట కూడలిలోని గాంధీ బొమ్మ, ఒక్కలారీనో బస్సో వెళ్ళే చిన్ని రోడ్లు, అప్పటి హోటల్స్, షాపులు అన్ని చరిత్రలోకెళ్లి పోయాయి. దూరప్రాంతాల ట్రాఫిక్ ఫ్లై ఓవర్ మీదికి మళ్ళించబడినా ఫ్లై ఓవర్ కి రెండు వైపులా మరింత ఇరుకు రోడ్లు తయారయ్యాయి, నాకైతే ‘ఇది జగ్గంపేటేనా?’ అని చాన్నాళ్ళకి వచ్చిన వాళ్ళకు  అన్పిస్తుంది అని అనిపించింది, కాని, దాన్నికడుతున్నప్పుడు దారి నిలువున తవ్విన పునాదుల్లో, సెంటరింగ్ ఊచల్లో పై నుంచి పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా గుర్తుకొచ్చింది. నాకే జరగబోయి తప్పిన అలాంటి ప్రమాదం గుర్తుకొస్తే ఇప్పటికీ నా గుండె దడదడమంటుంది. ఆ రోజు రేడియోలో కథ చదవడానికి విశాఖ పట్నం వెళ్ళి తిరిగి వచ్చేసరికి రాత్రి  తొమ్మిదై పోయింది. హోరున వర్షం కురుస్తోంది. పవర్ కట్ వల్ల చిమ్మ చీకటిగా ఉంది. ఎక్స్ ప్రెస్  కావడం వల్ల ఊరిబస్ షెల్టర్లో ఆగదని ఊరికి తూర్పు చివర దించేసి వెళ్ళిపోయింది. నేను నాలుగడుగులు ముందుకు నడిచే సరికి రోడ్డుకి అవతలి వైపు నుంచి చేతిలో లాంతరులో వాచ్ మేన్  కాబోలు “అటెళ్ళకండి, ఎళ్ళకండి” అని అరుస్తూ పరుగెత్తుకొచ్చాడు. మరో రెండడుగులేస్తే ఏమయ్యేదో లాంతరు వెలుగులో తెలిసింది. “అమ్మ నాతల్లోయ్, ఇయాళ ఎంత ప్రమాదం తప్పింది.” అన్నాడ తను. కుడివైపు నడిపించి మా కాలనీ కెళ్ళే రోడ్డులో వదిలాడు. యాక్సిడెంట్ కాబోయి తప్పిన మూడవ ప్రమాదం అది నాకు ఊహ తెలిసాక.

          ఆ సంవత్సరం కథ 2003 ఆవిష్కరణ ఆంధ్రాయూనివర్శిటీ కేంపస్ లోని TLN హాలులో జరిగింది. అప్పట్లో కథ ఆవిష్కరణ సభలు గొప్పగా జరగడమే కాక, మర్నాడు దగ్గర్లోని టూరిస్ట్ ప్లేసెస్ కి ప్రయాణాలు ఉండేవి. అందరూ రచయితలే కావడం వల్ల ఆ ప్రయాణాలు కథలు కబుర్లతో ఆహ్లాదకరంగా జరిగేవి.సెప్టెంబర్ 26న సభ, 27న అరకు వేలీకి ట్రిప్. ఇట్నుంచి ట్రైయిన్లో, అట్నుంచి బస్సులో. తిరిగి వచ్చేటప్పుడు పౌర్ణమి చందమామ పర్వతాల పైన విశాలమైన ఆకాశంలో కురిపించే వెన్నెల, కొండకోనలూ ఎంతగా అలరించాయంటే ఇంటికి చేరగానే ‘లెట్ యువర్ హార్ట్ ఫ్లై’ అనే కవితను రాయించాయి. అది 17.10.2004 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఈ వారం కవితగా వచ్చింది. 28న కైలాసగిరి, రిషికొండ, R.K బీచ్ వగైరాలు చూసి క్రిష్ణాబాయిగారింటికెళ్ళి పద్మినినీ, అత్తలూరిని చూసి తిరిగి వచ్చేను.

          2004 మచలీపట్నం భావతరంగిణి నా కథ ‘ఛిద్రం’కు బహుమతి ప్రకటించింది. అక్టోబర్ 9న బహుమతి ప్రధానోత్సవానికి రమ్మని భవిష్య గారి పిలుపు మేరకువెళ్ళి, అక్కడి జవహర్లాల్ ఆడిటోరియంలో జరిగిన సభకు అటెండయ్యాను. అక్కడ అప్పుడు జరుగుతున్న సాహిత్య అకాడమీ సభకోసం వచ్చిఉన్న ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారి చేత బహుమతి ప్రధానం చేయించారు. అదంతా ముగిసేసరికి పొద్దుపోవడం వలన భవిష్య గారింట్లో ఉండిపోయాను. ఆయన భార్య, పిల్లలు గాయత్రి, అమర్నాథ్, అక్కయ్య విజయలక్ష్మిగారు, మేనకోడలు సాహితి నన్ను ఎంతో ఆత్మీయంగా చూసుకున్నారు.

          అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో ముంబైలో జరిగిన సాహిత్య అకాడమీ కవితాగోష్ఠులకి గీతకు ఆహ్వానం అందింది. గీత నాకు చెప్పకుండానే నాక్కూడా ఫ్లైట్ టిక్కెట్టు బుక్ చేసేసి ఫోన్ చేసింది. ఇక తప్పక మోహన్ని తీసుకుని వచ్చేను. అతన్ని ఎవరూ చూడలేక తార్నాకలోని ఓ హోమ్ లో 13500 కట్టి జాయిన్ చేసారు. అప్పటి ఎయిర్ పోర్ట్ బేగం పేటలోనే ఉంది. గీత, నేను, కోమల్ 17th ఉదయం 9కి ముంబై చేరుకున్నాం. చిన్న పిల్లాడు కోమల్ ఆ ఫ్లైట్ జర్నీని బాగా ఎంజాయ్ చేసాడు. దాదర్ లో ఉన్న ‘మిడ్ నైట్ ప్రీతమ్’ హోటల్లో మాకు ఎకామడేషన్. స్టార్ హోటల్లో బసచెయ్యడం అదే మొదటి సారినాకు. ఆ సాయంత్రం ప్రభావతిలో ఉన్న ‘రవీంద్ర నాట్యకళామందిర్’ లో జరిగిన ఇనాగరల్ ఫంక్షన్ కి అటెండయ్యాం. 18 ఉదయం 8కే సభ ప్రారంభమైంది. మధ్యలో లంచ్, టీ బ్రేక్స్ తో సాయంకాలం 5 వరకూ అన్ని రాష్ట్రాల కవులు తమ కవితల్ని మాతృ భాషలోను, ఇంగ్లీష్, హిందీ అనువాదాల్లోనూ విన్పించడం. ఆంధ్రా నుంచి శివారెడ్డి, బాపు రెడ్డి గార్లు, గీత అటెండయ్యారు. 19న గీత  కవిత్వపఠనం. శిల్పా టెండూల్కర్ పోయెం గీత హిందీలోకి అనువదించి చదివిన ‘కంప్యూటర్ కాపురం’ పోయెంకి శ్రోతల నుంచి ఎవరికీ రానంత గొప్ప  ప్రతిస్పందన వచ్చింది. అ రెండు రోజులూ రకరకాల భాషల కవుల పరిచయాలయ్యాయి. రాజస్థాన్ లోని జోధ్ పూర్ నుంచి వచ్చిన కవి నిజాం అచ్చం అమితాబ్ బచ్చన్లా ఉన్నాడు. ఆయన గజల్స్ చాలా బావున్నాయి. ఆ మూడు రోజులూ తీరిక సమయాల్లో పరిసరాలన్నీ పరిశీలించినా, 20 వ తేదీ పూర్తిగా ముంబై సందర్శన కోసం ట్రావెల్స్ టిక్కెట్లు కొన్నది గీత. ఉదయం నుంచి రాత్రి 9 వరకూ 50 ప్రదేశాలు చూపిస్తానని టిక్కెట్లు అమ్మిన ట్రావెల్ వాడు గెట్ వే ఆఫ్ ఇండియా, నెహ్రూ సైన్స్ సెంటర్, హేగింగ్ గార్డెన్స్, ఇస్కాన్ టెంపుల్ మాత్రం చూపించి మిగతావన్నీ బస్సులో నుంచే ‘చూడండి చూడండి’ అన్నాడు. ఆ రాత్రి 10 కి శివాజీ టెర్మినల్లో ట్రెయినెక్కి మర్నాడు 12.30 కి బేగంపేట స్టేషన్లో దిగేం. 29న జగ్గంపేట ఇంటికి వెళ్ళిపోయాం. నాలుగేళ్ళుగా వెన్నుకి దెబ్బతగిలి మంచం మీద ఉన్న మా గురువర్యులు నూజిళ్ళ  నరసింహంగారు కాలధర్మం చెందారు.

          ఆ సంవత్సరం లైబ్రరీ దినోత్సవాల (గ్రంథాలయ వారోత్సవాలు) సందర్భంగా నవంబరు 19న విజయవాడ ఠాగూరు గ్రంధాలయంలో కథా నేపథ్యాలు కార్యక్రమానికి పిలిచారు. పి.సత్యవతి గారి అధ్యక్షతన నేను, ప్రతిమ, నల్లారి రుక్మిణి పాల్గొన్నాం.

          నా కథ ‘మల్లెపువ్వు’ ను శాంత సుందరిగారు హిందీలోకి అనువదించగా ‘ఔరత్’ హిందీ పత్రికలో ‘చమేలీకా ఫుల్’ పేరుతో వచ్చింది. అంతకు ముందు ‘స్వస్తి’ కథ అనువదించబడింది. అప్పటికి హిందీలో వచ్చిన నా రెండవ కథ అది.

          ప్రఖ్యాత  కర్ణాటక  విద్వాంసురాలు M.S.సుబ్బులక్ష్మి 11.12.2004 న స్వర్గస్థు లయ్యారు.

          ఆ సంవత్సరం వేలూరి & పాణిగ్రాహి అకాడమీ బహుమతికి నా కధ ‘బాంధవ్యం’  ఎన్నికైంది.

          12.12.2004 న విజయవాడ ఠాగూర్ గ్రంధాలయంలో ఘనంగా సన్మానం చేసి బహుమతి ఇచ్చారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు అప్పటికి దుర్గగుడి మెట్ల దగ్గర ఇంట్లో ఉండేవారు. వారింట్లో నాకు బస ఏర్పాటుచేసి వేలూరి కౌండిన్య, సుధ గార్లు నన్ను ఎంతో ఆత్మీయంగా చూసుకున్నారు.

          23.12.2004 వ మరో విద్యావేత్త, మాజీప్రధాని శ్రీ పి.వినరసింహారావు 83 వ ఏట న్యూఢిల్లీలో కన్ను మూసారు.

          ఆ నెల 31 సన్నిధానం శర్మగారి గ్రంథాలయం నుంచి రిటైరైన ఫంక్షన్  చాలా బాగా జరిగింది. స్మైల్, చలసాని, జ్ఞానానందకవి ప్రభృతులు పాల్గొన్నారు.

          అలా 2004 ముగిసింది. చాసొ అవార్డుతో మొదలై పులికంటి, R.S.కృష్ణమూర్తి, భావతరంగిణి, వేలూరి & పాణిగ్రాహి  మొదలైన అవార్డుల్నీ, గొప్ప గుర్తింపుని తెచ్చి పెట్టింది.

          పులికంటి సాహితీ సత్కృతి పొందిన ‘మంత్రసాని’ కథ 23.1.04 ఆంధ్రప్రభ వీక్లీ లోను, తర్వాత చాలా సంకలనాలలో చోటు చేసుకుంది.

          5.3.04 హైదరాబాద్ రేడియోలో ‘నిరసన’ కథా నాటిక ప్రసారమైంది.

          ‘అతడు-నేను’ 2004 మార్చి రచన మంత్లీలోనూ, ప్రస్థానం మంత్లీలోనూ, తర్వాత ఇతర సంకలనాలలోనూ వచ్చింది.

          May 16th 2004 న విశాఖ రేడియో బమ్మిడి జగదీశ్వరరావు ‘అమ్మ చెప్పిన కథలు’ మీద నా రివ్యూ ప్రసారమైంది.

          22.5.04 లో ఆంధ్రభూమిలో  ‘కొడుకు’ కథ వచ్చింది.

          సెప్టెంబర్ 2004 నడుస్తున్న చరిత్ర మంత్లీలోనూ, అక్టోబర్ భావతరంగిణిలోను, తర్వాత ఇంటర్నెట్లోను ”ఛిద్రం’ కథ వచ్చింది.

          17.10.04న ఆదివారం ఆంధ్రజ్యోతిలో ‘లేట్ యువర్ హార్ట్ ఫ్లై’ కవిత  వచ్చింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.