రెండు రోజులు అంటే 48 గంటలు నిషి మాట వినకుండా, తన నుంచి ఎటువంటి సమాచారం లేకుండా.. శోభ మనసు సన్నద్ధం కావడం లేదు.
శోభ కంగారుకు ఆజ్యం పోసింది కొద్దిసేపటి క్రితం వచ్చిన ఫోన్ కాల్. ఆ కాల్ ముగిసిన తర్వాత బిడ్డ గురించి ఆదుర్దా శోభలో మరింత పెరిగింది. మళ్ళీ అంతలోనే తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది.
ఉష కూతురి విషయంలో జరిగినట్లు నా కూతురికి ఎందుకు జరుగుతుంది? ఎవరి జీవితం వారిదే. ఎవరి పరిస్థితులు వాళ్ళవే. ఒకరికి ఏదో సమస్య వచ్చిందని అది తమకు వస్తుందని భయపడడం ఏంటి? మరీ చిన్న పిల్లలాగా.. అని సర్ది చెప్పుకుంది. తనకు తాను ధైర్యం చెప్పుకుంది శోభ.
అది ఎంత సేపు.. కొద్ది సేపే. మళ్ళీ చిన్ననాటి స్నేహితురాలు ఉష తన అల్లుడి గురించి చెప్పిన విషయాలు చెవిలో జోరీగల్లా రొద చేస్తూ కలవరపెట్టడం మొదలు పెట్టాయి. తెలియని దిగులు ఆవహిస్తున్నది. శరీరం బాధగా.. నీరసంగా అనిపిస్తున్నది.
ఓ వైపు రేపు రానున్న బంధువుల కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. చాలా కాలం తర్వాత వస్తున్న వాళ్ళని చూస్తానన్న ఉత్సాహం లేకపోగా దిగులు ముంచుకొస్తున్నది. వద్దన్నా తరుముకొస్తున్న ఆలోచనల్ని విదిలించుకుని దూరం నెట్టేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది ఆమె. అందులో భాగంగా చేస్తున్న పని ఆపి మరో పనిలో చొర బడింది.
యాంత్రికంగా పని చేస్తున్నది కానీ నిష్కల తలపులు దూరం కావడం లేదు. కూతురు దేశం కాని దేశంలో ఏ పరిస్థితుల్లో ఉందోనన్న భయం చొరబడి కలవరపెట్టడం ఆగలేదు. ఏవేవో ఎప్పుడో ఎక్కడో విన్న సంఘటనలు కళ్ళ ముందుకు వచ్చి గందరగోళ పరచిపోతున్నాయి.
ప్చ్ .. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని శంకించాలో తెలియడం లేదు. ‘అపరిచితుడు లాగా మల్టీ పర్సనాలిటీ లక్షణాలు ఉంటున్నాయి. ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీలను ఎలా తెలుసుకునేది? ఎలా నమ్మేది? అలాంటి వాళ్ళ నీడన అమ్మాయి ఉండడం అంటే పాముపడగ నీడన ఉన్నట్లే కదా..!
ఆడపిల్లలకు ఇచ్చిన స్వేచ్ఛ ఆమెకు, ఆమె జీవితానికి గుదిబండగా మారుతున్నదా ? సందేహం మొలకెత్తింది. మనిషి ప్రవర్తనకి మనిషికి ఉన్న స్వేచ్చకి మధ్య అంతరం లేకుండా చూడాలనుకున్నప్పుడు ఒక్కోసారి గుదిబండై బాధ పెడుతుందేమో ..! అని ఉష బాధని తనకే వచ్చినంత విలవిలలాడుతున్నది శోభ.
పెద్ద కొడుకును చూడలేని తన దౌర్భాగ్యానికి తలచుకుని లోలోనే కుములుతున్న సుగుణమ్మ, శోభను గమనిస్తూనే ఉంది. ఆమె మనసులో ఏదో నలుగుతున్నది. కానీ ఇది అని చెప్పలేక పోతున్నది అని సుగుణమ్మకు అర్థమవుతున్నది. కానీ ఆమెను అడిగి తెలుసుకుని స్నేహం పంచలేకపోతున్నది నిన్నటి వరకు అధికారం చెలాయించిన సుగుణమ్మ.
గలగల పారే ఏరులా కనిపించే శోభ ఈ మధ్య మౌన సముద్రంలా అగుపిస్తున్నది. ఎందుకు? ఆమెలోని కడలి కల్లోలానికి కారణం ఏమై ఉంటుంది? చేస్తున్న ఏ పని మీద దృష్టి పెట్టలేక అందులోంచి బయట పడటం కోసం మొబైల్ అందుకున్న శోభను చూస్తూ అనుకున్నది సుగుణమ్మ.
శోభ వాట్సాప్ తెరిచింది. వరదలా వచ్చి పడుతున్న మెసేజ్ లు చూడటంమొదలు పెట్టింది. ఓ వీడియో మెసేజ్ ఆకర్షించి చూసింది. అది సహజీవనం గురించి జరుగు తున్న చర్చా కార్యక్రమం.
సహజీవనం అంటే కోరుకునే ముందు టెస్ట్ డ్రైవింగ్ లాంటిది … అని ఒకరు అంటే సహజీవనం ఉన్న జంటలో అమ్మాయి పెళ్ళి చేసుకుందాం అనే సరికి మొహం చాటేసే అబ్బాయిలు పెరిగిపోతున్నారు. తర్వాత పెద్దలు చేసిన పెళ్ళి చేసుకుంటున్నారని ఒకరన్నారు. అమ్మాయి తొందరపడి తన జీవితాన్ని అబ్బాయి చేతిలో పెట్టి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నదని అమ్మాయిని తప్పు పట్టారు ఒకరు. అడ్డూ అదుపూ లేని విశృంఖలత్వానికి కొత్త పేరే సహజీవనం. భారతీయ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్ర అంటూ ఆక్రోశించారు మరొకరు. ఆ చర్చ శోభ అంతరంగాన్ని తాకింది. ఆలోచనలు ఉధృతమయ్యాయి ఆమెలో.
వివాహంలోనైనా , సహజీవనంలోనైనా బాధ్యత, విలువలు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా! మానవ స్వభావంలో ఉండే ప్రేమ, హింస రెండింటిలోనూ ఉండవచ్చు. అయితే, వాటి పాళ్ళలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఏ బంధంలోనైనా మనిషికి శారీరక అవసరాలతో పాటు దృఢమైన మానసిక అనుబంధాలు అవసరం. పెళ్ళి అనే తంతు లేకుండా ఇతరుల జోక్యం లేకుండా ఒకరికొకరు ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా వాళ్ళు ఏర్పరచుకున్న నియమ నిబంధనలు పాటిస్తూ కలిసి జీవించే సహజీవనంలో తప్పేమీ కనిపించడం లేదు. శోభకు.
సహజీవనంలో మనిషి విచ్చలవిడి పోకడలు అడ్డు అదుపులేకుండా పెరిగి పోతాయని అంటున్నారు. కానీ వివాహ బంధంలో ఉండి కూడా అడ్డు అదుపులేని విచ్చల విడితనం నాటి నుండి నేటి వరకు చూస్తూనే ఉన్నాం. మనం చూడడం లేదా?! నాటి నుండి నైతిక విలువలు పాటించని మగవాళ్ళు తక్కువేం కాదు కదా.. భారతీయ వివాహ వ్యవస్థ గురించి మనం చాలా గొప్పగా, ఘనంగా చెప్పుకుంటాం కానీ నిజంగా అంతగొప్పగా ఉందా? మేడిపండు లా లేదూ..? వివాహం మాటున పొగచూరిన జీవితాలు, చిక్కి శిథిలమై పోయిన జీవితాలెన్నో..లెక్కించలేనన్ని .
ముఖ్యంగా మహిళల జీవితాలు… ఆ పంజరంలో ఇమడలేక బయటికి రాలేక అను క్షణం నరకం అనుభవించే జీవితాలను ఇంకా ఎన్నాళ్ళు దాచి పెడతారు? మసిపూసి మారేడుకాయ చేసి చూపిస్తారు? మన వివాహ వ్యవస్థలోని డొల్లతనం ఒప్పుకోవడానికి ఎందుకు వెనకాడాలి? నేటి జీవితానికి అనుగుణంగా మలుచుకోవాలి కదా.. కొత్త విధి విధానాలు రూపొందించుకోవడంలో తప్పేముంది. నిన్నటి నుంచి నేటిలోకి, నేటి నుంచి రేపటిలోకి ప్రవహించే మనిషి, భూమి నుంచి గ్రహాంతరాళాల్లోకి ఎగిరే మనిషి గతంలోని మంచిని తీసుకుంటూ చెరుపు చేస్తున్న వాటిని పాతాళంలో పూడ్చి పెట్టెయ్యాలి కదా .. అలా ఎందుకు చేయడం లేదు?
ఎంతసేపూ సహజీవనంలో ఉండే మానసికబంధాల వైఫల్యాన్ని భూతద్దంలో చూడటమే, దాన్ని ప్రచారం చేయడమే తప్ప వివాహంలో ఉండే ఆ వైఫల్యాల గురించి ప్రస్తావించరు, వాటికీ విలువ ఇవ్వరు.
సహజీవనంలో ఓ జంట మధ్య ఏదైనా సమస్య వస్తే అబ్బాయిని పట్టించుకోని సమాజం అమ్మాయినే తప్పు పడుతుంది. ఆమె ప్రేమే నేరమా? లేక సహజీవనం నేరమా? పెళ్ళిలో ఉన్న సమాజ మద్దతు సహజీవనంలో అందడంలేదు. పరిస్థితిని అర్థం చేసుకో కుండా ఆమెనే నిందిస్తున్నారు. నెపం ఆమె పై వేస్తున్నారు. ఆమెనే దోషిని ఈ వ్యవస్థ లోని లోపం.
ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పించుకు తిరిగే వారిని, చేసుకున్న ఒప్పందాన్ని పక్కకు తోసేసిన వారిని ఎందుకు మోసం చేశావని నిలదీయకుండా అమ్మాయిని దోషిని చేయడం, నేరం చేసినట్లు మాట్లాడడం … ఎంత వివక్ష… కావేరి విషయంలోనూ అంతే. కులమత వర్గ భేదాలకు అతీతంగా ఆమె ప్రేమను నమ్ముకుంది. పెళ్ళి చేసుకుంది. అది తప్పుకాదు కదా.. ప్రకృతిలో ఏ జీవిని చూసినా ఆడ మగ జత కట్టడం సహజం. మనిషి కూడా అంతే ఉండాలి కదా. నచ్చిన వ్యక్తితో జతకట్టి జీవించడం తప్పేలా అవుతుంది. ఇప్పటికీ కావేరి ఏదో నేరం చేసినట్లు మాట్లాడే వాళ్ళకు తక్కువేమీ కాదు. మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది శోభకు.
సహజీవనంలోనో, ప్రేమ పేరుతోనో జీవితంలో మోసపోయిన అమ్మాయిని, మానసికంగా కుంగిపోయిన అమ్మాయిని ఇంటాబయటా మాటల తూటాలతో, చేతలతో చంపడం చాలా అన్యాయంగా తోచింది శోభకు. కుటుంబం ముందు తమ కూతురు భవిష్యత్తు, ఆమె పరిస్థితి కంటె ముందు సమాజం గురించి ఆలోచిస్తుంది. పరువుమర్యాద అంటుంది. సమాజం ఇచ్చే తీర్పు గురించి ఎక్కువగా ఆలోచించి భయపడుతున్నది. అదే మగవాడికి అవకాశం అవుతున్నదని ఆలోచన చేయరేం? బుర్ర తక్కువ వెధవలు. ఆడదాన్ని తిట్టడం సరదా అయిపొయింది.
సమాజం ఒప్పుకోనిది ఇల్లీగల్ అంటారా.. లేక చట్టం ఒప్పుకోని దాన్ని ఇల్లీగల్ అనాలా? సహజీవనాన్ని చట్టం ఒప్పుకుంది. సహజీవనంలో కలిగిన బిడ్డకు తండ్రి నుంచి ఆస్తి హక్కు లభిస్తుంది. ఒకవేళ ఇద్దరికీ పొసగకపోతే ఎవరి దారిన వాళ్ళు పోతారు. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు?
అమ్మాయి నవ్వొద్దు. గట్టిగా మాట్లాడొద్దు , నచ్చిన బట్టలు వేసుకోవద్దు, రాత్రిపూట బయట తిరగొద్దు, మొగుడు ఏది చెబితే అది చెయ్యాలి. అత్తమామల మాట మీరొద్దు. ఒకవేళ వాళ్ళు ఎంత హింసపెట్టినా అది పెదవి దాటి, గడప దాటి బయటకు రావద్దు. అది మన సంస్కృతి అని చెప్పే వాళ్ళకి, అజమాయిషీ చేస్తూ, ఆధిపత్యం చెలాయించే వాళ్ళకు , చూపులతోనే శాసించే వాళ్ళకు సహజీవనం అంటే మంట. తమ ఆధిపత్యానికి చెల్లు చీటి ఇవ్వాల్సి వస్తుందని. తమ అధికారం అడుగంటుతుందని .
బహుశా, పెళ్ళి వ్యవస్థలో అంతర్భాగమై పోయి అవిభాజ్యంగా మారిన కనిపించని మానసిక, శారీరక హింసను భరించడానికి గతంలో లాగా ఆడపిల్లలు సిద్ధంగా లేరు. పెళ్ళి పేరుతో తమ పై ఆధిపత్యం, అధికారం చెలాయించడాన్ని నవతరం ఆడపిల్లలు సహించడం లేదు. ప్రశ్నిస్తున్నారు. నచ్చకపోతే సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నారు.
ఆ క్రమంలో ప్రేమను, సంతోషాన్ని వెతుక్కుంటూ సహజీవనంలోకి వెళ్ళడానికి మక్కువ చూపిస్తున్నారేమో!
సహజీవనంలో ప్రేమ తప్ప ఆధిపత్యం, అధికారం ఉండవనినమ్ముతున్నారేమో?!
పరస్పరం అర్ధం చేసుకోవడానికి అవకాశం ఎక్కువ అని భావిస్తున్నారేమో. మనసు చంపుకుని బలవంతపు కాపురం చేసే బాధ తప్పుతుందని ఈ పద్ధతి ఎంచుకుంటున్నా రేమో !
అసలు పెళ్ళి అందరూ ఎందుకు చేసుకోవాలి?
పెళ్ళి చేసుకోవాలో చేసుకోవద్దో వారి వారి వ్యక్తిగతం. అలాగే పెళ్ళి చేసుకున్నా ఎలా చేసుకోవాలో, ఎలా జీవించాలో కూడా వాళ్ళ వ్యక్తిగతమే.
నేనెందుకు పెళ్ళి చేసుకున్నాను? చిన్నప్పటి నుండి బావ నా మొగుడు అని పెద్దలు నిర్ణయించేశారు. నాలో ఆ భావన ఉగ్గుపాలతో కలిపి నింపారు. నాకు పెళ్ళి వయసు వచ్చిందని, బావకి ఉద్యోగం వచ్చిందని పెద్దలు మా పెళ్ళి తలపెట్టారు.
పెళ్ళి చేసుకోవాలి కావచ్చు అనుకుని పెళ్ళి చేసుకున్నాను. మనసులు కలవలేదు కానీ శరీరాలు కలిశాయి. ప్రేమ లేకుండా శరీరాన్ని వాడుకోవడం నేరమే కదా.. అది బావకు అర్ధమై ఉంటుంది. నాతో చెప్పలేక, చెబితే విషయం అర్థం చేసుకుంటానో లేదో తెలియక చాలా సతమతమై ఉంటాడు.
విషయం నాకు అర్ధమయ్యాక నా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, స్వేచ్ఛ కోసం నన్ను నేను మలుచుకుంటూ పోయాను. ఈ క్రమంలో కుటుంబం సమాజంతో పాటు నా పై నేను, నా శరీరంతో నేను చేసిన ఎంతో పోరాటం ఉంది. సంఘర్షణ ఉంది. ప్రేమ భావన కోసం పరితపించే మనసుకు, తోడు కోసం అల్లరి చేసే వయసుకు కళ్ళెం వేయడం అంత సులభం కాదు. ఇప్పుడు నా ఆలోచనల్లో ఉన్న పరిపక్వత ఆ రోజుల్లో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో..
మనసు ఎదగకుండా విడాకులు, విడిపోవడం గురించి అప్పటికి తెలియనే తెలియదు. కాలం గడుస్తున్న కొద్దీ అసలేం కావాలో తెలుస్తుంది. అప్పటికే నష్టం జరిగిపోతుంది.
నా పరిస్థితే కాదు, బహుశా బావ పరిస్థితి కూడా అదే అయి ఉంటుంది. కొందరు అయిష్టంగానే ఒక గొడుగు కింద కలిసి ఉంటుంటే , కొందరు విడాకులకు వెళ్తున్నారు. జతకూడే ఇద్దరికి జీవితం పట్ల ఒక పరిపక్వ అవగాహన వచ్చిన తర్వాత పెళ్ళి చేసు కుంటే ఎన్నో సమస్యలు వాళ్ళ చెంత చేరవు. ఒక వేళ ఏమైనా వచ్చినా ఆ ఇబ్బందు లను, ఇందు మూలంగా వచ్చే ఒత్తిడిని సులభంగానే వదిలించుకోగలరు. సహజీవనంలో నైనా, వివాహంలోనైనా పిల్లలు ఉంటే ఆ బాధ్యత తల్లిదండ్రులదే. ఒక వేళ ఆ ఇద్దరు విడిపోయి కూడా పిల్లల పట్ల బాధ్యతగానే మెలగాలి.
స్త్రీ పురుషుల మధ్య సెక్స్ వారి వ్యక్తిగత అవసరం. కానీ అందువల్ల పుట్టిన పిల్లలు సామాజిక అవసరం.
ఎవరి జీవితం గురించి వాళ్ళు చూసుకుంటే ఇతరుల జీవితాల్లోకి వెళ్ళి పోలీసింగ్ చేసేటైం దొరకదు. అది చేయరు కాబట్టే ఇవన్నీ.
ఒక ఆడపిల్ల సహజీవనంలోకి అడుగు పెట్టడం అంటే కోరుకున్న అబ్బాయి గురించి మాత్రమే కాదు కుటుంబం, సమాజం, సంస్కృతి అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అని శోభకు అర్థమైంది. పాత పద్ధతుల్ని కూలదోసి కొత్త బాట వేసే వారికి, కొత్త సంస్కృతి నిర్మించే వారికి సమాజం నుంచి అనేక సవాళ్ళు తప్పకుండా ఎదురవుతాయి. ఆమోదం లభించడం చాలా కష్టమని గడచిన కాలంలో జరిగిన అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఎప్పుడూ ఛాందసానికి నూతన ఆలోచనలకూ మధ్య ఘర్షణ ఉంటూనే ఉన్నది. కమిట్మెంట్ ఉన్న జంటలు పాతని కూలదోస్తూ కొత్తని నిర్మించు కుంటూ పోవడమే. లేకపోతే పాచి పట్టి కంపు కొట్టే కుంటలోని నీటిలాగే ఉంటుంది పరిస్థితి.
అయితే, సహజీవనంలోకి వెళ్ళేవాళ్ళు కొన్ని హద్దులు పెట్టుకోవాలి. ప్రేమ పేరుతో అమ్మాయిని సహజీవనంలోకి లాగే మగవాళ్ళ విషయంలో అమ్మాయిలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఎంతో కోల్పోవాల్సి వస్తుంది. ఇది నిజం.
నిజానికి అటువంటి అబ్బాయిలది ప్రేమ కాదు..ప్రేమ పేరుతో వంచన, మోసం, దగా, ద్రోహం. అలాంటి ప్రేమను కనిపెట్టే పరికరం ఏదైనా ఉంటే బావుండు.
ఎవరైనా కనిపెట్టగలరా?
ఒక ఆడ, మగ మధ్య ఉండేది నిజమైన ప్రేమనా? లేక అవసరానికి వేసుకున్న అందమైన ముసుగా? సందేహం తలెత్తింది ఆమెలో.
మనిషికీ మనిషికీ మధ్య దృఢమైన సంబంధాలు ఉండాలి. అది ప్రేమలో ఉన్న వారి మధ్య మరింత ప్రేమపూర్వక సంబంధాలతో పాటు స్నేహం ఉండాలి. ఆ స్నేహం తో స్వేచ్ఛ, స్వేచ్ఛ తో పాటు స్నేహం ఉండాలి. ఈ రెండూ ఉంటే జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఆనందంగా బ్రతికేయొచ్చు ముఖ్యంగా సహజీవనంలో.. తనను తనుగా ఎదగనిచ్చే బంధాలు కావాలి. భయపెట్టేవి, బంధించేవి కాదు.
రెక్కలు విప్పుకుని ఆకాశం వైపు ఎగరడానికి .. కిందపడి రెక్కలు విరిగినా పర్వాలేదు మళ్ళీ పుంజుకుంటాను . ఏదో ఒక రోజు ఆకాశాన్ని అందుకుంటాను అని నిషి ఎన్నోసార్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది. అటువంటి అమ్మాయి గురించి తాను దిగులు పడు తున్నది.
నిషికి పాలు, నీళ్ళను వేరు చేయగల నేర్పు ఉంది. ఎక్కడో ఏదో జరిగిందని, ఎవరికో ఏదో ఎదురైందని నా బిడ్డ విషయంలో నేను భయపడాల్సిన పనిలేదు. నా కూతురు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. తప్పు పట్టాల్సిన పని లేదు. ధర్మంగా నడిచే మనిషి అని స్థిరంగా అనుకున్నది శోభ. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి తీర్పు ఇచ్చే వాళ్ళకి వాళ్ళ ధర్మం గురించి తెలుసా అసలు?
అయితే, నిషిని చూడాలని, గుండెలకు హత్తుకుని మనేద తీర్చుకోవాలని ఆమె మనసు తపన పడింది. తనలో ఎటువంటి అనుమానాలు భయాలు పొడ చూపకుండా ఉండాలంటే అంకిత్ ని ఒకసారి ప్రత్యక్షంగా చూడాలి. అతనితో మాట్లాడాలి. అతని తీరు గమనించాలి. అప్పుడు కానీ ఈ తల్లి మనసు పూర్తిగా స్థిమిత పడదు. అది జరగాలంటే కొద్దిగా సమయం పడుతుంది.
మరి రెండు రోజుల్లో అత్తను చూడడానికి ఆమె కొడుకులిద్దరూ వస్తున్నారు. వీలైతే అన్నలు వచ్చే సమయానికి చెల్లెలు సరళ కూడా వస్తానని చెప్పింది. వచ్చి సర్ప్రైజ్ చేస్తాం చెప్పొద్దన్నారని ఆ విషయం అత్తకు చెప్పలేదు. ఆమెకు అనుమానం రాకుండా ఏర్పాట్లు చేస్తున్నది. అందరిని చూసి ఆ ముసలి గుండె ఎంత సంతోషపడుతుందో.. పెద్ద కొడుకును తలుచుకుని ఎంత తల్లడిల్లుతుందో అని తలపోసింది శోభ.
వాళ్ళంతా వచ్చి వెళ్ళాక తన కూతురు దగ్గరకు వెళ్ళాలని స్థిర నిర్ణయానికి వచ్చింది శోభ .