కమ్యూనిస్టు ప్రణాళిక

పుస్తకాలమ్’ – 23

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

 

ఉత్తేజభరిత మానవేతిహాస మహాకావ్యం – కమ్యూనిస్టు ప్రణాళిక

కమ్యూనిస్టు ప్రణాళికగా సుప్రసిద్ధమైన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ల సమష్టి రచన ‘మానిఫెస్టో ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ’ వెలువడి ఈ ఫిబ్రవరి 21 కి నూట డెబ్బై రెండు సంవత్సరాలు. ఆ సందర్భంగా కమ్యూనిస్టు ప్రణాళికతో పాటు, ఎంగెల్స్ రాసిన ‘కమ్యూనిజం మూలసూత్రాలు’ కూడ కలిపిన తెలుగు అనువాద పుస్తకం ఒక లక్షప్రతులు ముద్రించి ఒక ప్రత్యేక ఉత్సవం జరపాలని రెండు రాష్ట్రాలలోని ఐదు వామపక్షప్రచురణ సంస్థలు (ప్రజాశక్తి, నవతెలంగాణ, విశాలాంధ్ర, నవచేతన, పీకాక్) తలపెట్టాయి. కమ్యూనిస్టు ప్రణాళికను మళ్ళీ ఒకసారి ఇంత పెద్ద ఎత్తున చర్చలోకి తెస్తున్నందుకు ఐదు ప్రచురణ సంస్థలకూ అభినందనలు, కృతజ్ఞతలు.

          కమ్యూనిస్టు ప్రణాళిక ఒక మహాకావ్యం. ఒక సామాజిక పరిణామ చరిత్ర. ఒక తాత్విక దృక్పథంలోకి ఆహ్వానం. ఒక సమగ్ర రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక విశ్లేషణ. ఒక భవిష్యత్ స్వప్నం. ఒక శాస్త్రీయ కార్యక్రమపు వ్యూహపత్రం. అది రాసిన 1840ల వర్తమానంలో స్థిరంగా నిలబడుతూనే తరతరాల గతచరిత్రలోకీ, భవిష్యత్ మార్గ నిర్దేశనంలోకీ చదువరుల కళ్ళు తెరిచే అద్భుతమైన కరదీపిక. నా వరకు నాకు పదమూడో ఏటనో, పద్నాలుగో ఏటనో మొదటిసారి చదివి, ఈ నలబై ఐదు సంవత్సరా లలో డజన్లకొద్దీసార్లు మళ్ళీ మళ్ళీ చదివి, వందలసార్లు రాతలోనూ మాటలోనూ ఉటం కించిన సార్వకాలిక, సార్వత్రిక, సార్వజనిక సమగ్ర పత్రం అది. అది చేసిన విశ్లేషణలు, ఇచ్చిన నినాదాలు, పలికిన మేల్కొలుపులు వందల కోట్ల జనాన్ని ఉర్రూతలూగించాయి, కదిలించాయి, సామాజిక పరివర్తనకు ఉద్యుక్తుల్ని చేశాయి, విలువైన మనుషులుగా తీర్చిదిద్దాయి.

          ముప్పై ఐదు పేజీల ఈ మహోన్నత మానవ సృజన ఈ నూట డెబ్బై రెండు సంవత్సరాలలో ప్రపంచంలోని వందలాది భాషల్లోకి అనువాదమైంది. వేలాది ప్రచురణల్లో కోట్లాది ప్రతులు అచ్చయ్యాయి, అవుతున్నాయి. పూర్తి పుస్తకంగానూ, ఉటంకింపులుగానూ, ఇతరేతర అంశాల సంకలనాలలోనూ ఎన్నెన్ని చోట్ల ఎన్నెన్ని రకాలుగా ఈ పుస్తకం ప్రాచుర్యంలోకి వచ్చిందో, ఆ చరిత్రే అనేక సంపుటాల ఉద్గ్రంథ మవుతుంది.    

కమ్యూనిస్టు ప్రణాళికకు నాకు తెలిసి తెలుగులో ఏడు అనువాదాలున్నాయి.

  1. కంభంపాటి సత్యనారాయణ అనువాదం, త్రిలింగ పబ్లిషింగ్ కంపెనీ, విజయవాడ, మొదటి ప్రచురణ సంవత్సరం తెలియదు. 1940ల చివర కావచ్చు. (నాకు ఫుట్ పాత్ మీద దొరికిన పుస్తకంలో ఆ ప్రచురణ వివరాల పేజీ చించేశారు!!). ‘కంభంపాటి సత్యనారాయణ స్వీయచరిత్ర – రచనలు’ అనే పుస్తకంలో ఇదే పుస్తకం గురించి “ద్వితీయ ముద్రణ 1956 ఆగస్టు” అని ఉంది. ఆ తర్వాత విశాలాంధ్ర ప్రచురణగానూ, ఇతర ప్రచురణల్లోనూ కూడ పునర్ముద్రణలు పొందినట్టుంది. ఇందులో వి జి కీర్నన్ 1944 ఆగష్టులో రాసిన ఉపోద్ఘాతం, ఎంగెల్స్ రాసిన ఒక ముందుమాట, “రయజనోవ్ వ్రాసిన మూలం నుంచి వి. జి. కీర్నన్ క్లుప్తీకరించి, సంస్కరించిన వ్యాఖ్యలు” అనే శీర్షికతో 68 వివరణలు ఉన్నాయి.
  2. గిడుతూరి సూర్యం అనువాదం, విదేశ భాషా ప్రచురణాలయం, మాస్కో – మొదటి ప్రచురణ సంవత్సరం తెలియదు. బహుశా 1956-60 మధ్య అయి ఉండవచ్చు. సోవియట్ ప్రచురణల్లో ఈ ప్రచురణ వివరాలు వేసే అలవాటు ఉండేది కాదు. ఇదే ప్రతి ఆ తర్వాత ప్రగతి ప్రచురణాలయం ప్రచురణగానూ, విశాలాంధ్ర ప్రచురణ గానూ కూడ చాల పునర్ముద్రణలు పొందింది. ఇందులో ఎనిమిది వివరణలూ ఏడు ముందుమాటలూ ఉన్నాయి.
  3. రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాదం. ఇది యుగసాహితి, ప్రొద్దటూరు/కడప (?) ప్రచురణగా 1960ల చివర ప్రచురించినట్టు గుర్తు. నేను వరంగల్ మండీ బజార్ విశాలాంధ్రలో 1979-80ల్లో కొనుక్కున్న కాపీ ఎవరో తీసుకు పోయినట్టున్నారు, ప్రస్తుతం నా దగ్గర లేదు. ఎంగెల్స్ ఇచ్చిన 43 వివరణలకు రాచమల్లు రామచంద్రారెడ్డి అదనంగా మరొక 25 వివరణలు కలిపారు. ఈ ప్రతిని కామ్రేడ్ కొల్లా వెంకయ్య మెమోరియల్ లైబ్రరీ, పెదనందిపాడు 2015 మే లో పునర్ముద్రించింది.
  4. ఇంగువ మల్లికార్జున శర్మ అనువాదం. ఇది అనువాదకుడి స్వీయ ప్రచురణ. పుస్తకం మీద ప్రచురణ తేదీ లేదు. నాకు గుర్తున్నంత వరకు 1980-81ల్లో వెలువడింది. దీనిలో డెబ్బై వివరణలు, ఐదు ముందుమాటలు ఉన్నాయి.
  5. ఎ. గాంధి అనువాదం. పీకాక్ క్లాసిక్స్ , హైదరాబాద్ ప్రచురణ, 2019. దీనిలో ప్రణాళికతో పాటు ఎంగెల్స్ రాసిన ‘కమ్యూనిజం సూత్రాలు’ కు గాంధి అనువాదం కూడ ఉంది. వివరణలు లేవు గాని మూలంలోని ఏడు ముందుమాటలూ ఉన్నాయి. ఈ పుస్తకాన్నే ఇప్పుడు ఐదు వామపక్ష ప్రచురణ సంస్థలు పునర్ముద్రిస్తున్నాయి.
  6. మహీధర రామమోహనరావు అనువాదం. ఇది నా దగ్గర ఉండేది గాని ప్రస్తుతం దొరకడం లేదు. ప్రచురణ వివరాలు తెలియవు.
  7. ఇవి కాక పుచ్చలపల్లి సుందరయ్య గారు 1933-34ల్లో ప్రణాళిక అనువాదం చేశాననీ, అది ముందు తన ఊళ్ళో యువజన బృందం కోసం అనువాదం చేశాననీ, చేతి రాత ప్రతి ప్రచారంలో ఉండేదనీ, తర్వాత కాట్రగడ్డ నారాయణరావు, తాను దాన్ని అచ్చు వేయించడానికి డబ్బు ఏర్పాటు చేశామనీ, అదేమిటో ప్రింటింగ్ ప్రెస్ యజమానికి తెలియకుండా ఒక ఏలూరు ప్రెస్ లో గారపాటి సత్యనారాయణ అచ్చు వేయించారనీ తన ‘విప్లవ పథంలో నా పయనం’లో రాశారు. ఆ ప్రతి మళ్ళీ  పునర్ముద్రణ అయినట్టు లేదు. కనీసం నేను చూడలేదు. అది తెలుగునాట తొలి కమ్యూనిస్టు ప్రణాళిక అనువాదం గనుక, సుందరయ్య గారు చేశారు గనుక తప్పని సరిగా సంపాదించి, భద్రపరిచి, పునర్ముద్రించవలసిన చారిత్రక పత్రం.

కమ్యూనిస్టు ప్రణాళిక గురించి మరికొంత

మిత్రులారా, కమ్యూనిస్టు ప్రణాళిక తెలుగు అనువాదాల గురించి నేను రాసిన పోస్ట్ తర్వాత మిత్రుల నుంచి అందిన సమాచారం మరి కొంత చేర్చవలసి ఉంది.

  1. ఫేస్ బుక్ మీద నా పోస్ట్ చూడగానే మిత్రులు, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లో డిపార్ట్ మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ లో అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు సాహిత్యం మీద పరిశోధకురాలు, లీసా మిషెల్ (Lisa Mitchell) నాకు రెండు పాత కమ్యూనిస్టు ప్రణాళిక తెలుగు అనువాదాల డిజిటల్ కాపీలు పంపారు. వాటిలో ఒకటి “కమ్యూనిస్టు కరపత్రము” పేరుతో “అనువాదం సామ్యవాది” “ఆదర్శ గ్రంథ మండలి, ఎలమర్రు, కృష్ణా జిల్లా” ప్రచురణగా వెలువడింది. దాని ప్రచురణ 1934. అయితే దాన్ని “రెండవ కూర్పు” అన్నారు గనుక మొదటి కూర్పు అచ్చులో వెలువ డిందా, రాతప్రతినో, సైక్లోస్టైల్ ప్రతినో మొదటి కూర్పుగా పరిగణించి దీన్ని రెండో కూర్పు అన్నారా పరిశోధించాలి. ఎక్కడన్నా ఆ రాతప్రతి, సైక్లోస్టైల్ ప్రతి దొరుకు తాయా అన్వేషించాలి. ప్రచురించిన ఆదర్శ గ్రంథ మండలి గద్దె లింగయ్య గారిది గనుక ఈ అనువాదం ఆయనదే అయి ఉంటుందా అని ఒక అనుమానం ఉంది. కాని ఈ అనువాదం “శ్రీ పాండురంగప్రెస్, ఏలూరు” లో అచ్చయినందు వల్ల పుచ్చలపల్లి సుందరయ్య గారిది కావచ్చునని కూడ అనిపిస్తున్నది. సుందరయ్య గారు తన ఆత్మకథ ‘విప్లవపథంలో నా పయనం’లో తన అనువాదం గురించి రెండు మూడు చోట్ల ప్రస్తావించడం మాత్రమే గాక , “1933-34లో కమ్యూనిస్టు మానిఫెస్టో అనువదించి ముద్రించే సందర్భంలో తరచుగా ఏలూరు, విజయవాడ మధ్య తిరగాల్సి వచ్చేది. నా సైకిలు వాహనం వుండనే వుంది గదా! ఒకోసారి సైకిలు పై ఏ అర్ధరాత్రో, అపరాత్రో విజయవాడ చేరేవాణ్ని…” అని రాశారు. ఆయన రాసిన సంవత్సరాలను బట్టి, అచ్చయిన ఏలూరు ప్రెస్ ప్రస్తావనను బట్టి “సామ్యవాది” ఆ అనువాదానికి సుందరయ్యగారు ఉపయోగించిన కలంపేరు కావచ్చునని అనిపిస్తు న్నది. ప్రణాళిక బదులు కరపత్రము అని ఎందుకు వాడారో కూడ వివరణ ముందు మాట రాశారు. ఆ రోజుల్లోనే ఇది “ముద్రణ 2000 ప్రతులు” అని ఉండడం మరొక విశేషం. ఈ 109 పేజీల పుస్తకంలో ప్రణాళికతో పాటు ఎంగెల్స్ రాసిన 1888 ముందు మాట ఒక్కటే అనువదించారు. అలాగే “వ్యాఖ్యలు” అనే పేరుతో 35 వివరణలు, నాలుగు పేజీల ఇంగ్లిష్ పదాల తెలుగు అనువాద గ్లాసరీ కూడ ఇచ్చారు.
  2. అలాగే, లీసా మిషెల్ నేను ఇదివరకే ప్రస్తావించిన కంభంపాటి సత్యనారాయణ గారి అనువాదం, త్రిలింగ పబ్లిషింగ్ కంపెనీ ప్రచురణ పుస్తకం కూడ పంపారు. ఈ డిజిటల్ ప్రతిలో ప్రచురణ వివరాల పేజీ కూడ ఉంది. దాని ప్రకారం ఆ అనువాదం అచ్చయినది 1952 ఫిబ్రవరిలో.
  3. ఈ రెండు పుస్తకాలూ ఏదో పాత గ్రంథాలయం నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రాని కి చేరి, అక్కడ 2006లో డిజిటైజ్ అయ్యాయని అంతర్గత వివరాలు చెపుతున్నా యి. మొదటి పుస్తకం మీద “రవీంద్రనాథ గ్రంథాలయం, పచ్చల తాటిపర్రు” అనే ముద్ర ఉంది. రెండో పుస్తకం మీద ముద్ర స్పష్టంగా తెలియడం లేదు.
  4. కమ్యూనిస్టు ప్రణాళిక రాచమల్లు రామచంద్రారెడ్డి గారి అనువాదం 1968 అని దివి కుమార్ గారు ఖచ్చితమైన ప్రచురణ సంవత్సరం తెలియజేశారు. ఆ అనువాదాన్ని రంగనాయకమ్మ గారు తన వివరణలతో పునర్ముద్రించారని మిత్రులు నన్నూరి వేణుగోపాల్ గారు తెలియజేశారు.
  5. కొత్త లక్ష ప్రతుల ప్రచురణలో ముందుమాటలో అభ్యంతరకరమైన మాటలున్నా యని దివికుమార్ గారు రాశారు. నేనింకా ఆ ప్రతి చూడలేదు గాని “నయా ఉదార వాదం” అనే మాట ఉన్నదని ఆయన రాశారు. అది ఇటీవల పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలూ, మాటల వాడకంలో అంత శ్రద్ధ చూపని మేధావులూ వాడుతున్న రాజకీయంగా అసందర్భమైన, పదునులేని మాట. స్వేచ్ఛామార్కెట్ గురించి తొలిదశలో మాట్లాడిన పెట్టుబడిదారీ విధానం “ఉదారవాదం” అనీ, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్న ద్రవ్యపెట్టుబడిదారీ విధానం “నయా ఉదార వాదం” అనీ కొందరు మిత్రులు భావిస్తున్నారు. నిజానికి అప్పటిదే ఉదారవాదం కాదు, మాటల్లో కొన్ని ఉదారవాద నినాదాలు ఇచ్చింది, ఆచరణలో పెట్టుబడిదారు ల పట్ల ఉదారవాదం అది. ప్రస్తుతం సాగుతున్నదైతే ఎంతమాత్రం ఉదారవాదం కాదు, తనను తాను పిలుచుకునే ప్రపంచీకరణ అనే తటస్థమైన మాట కూడ దాని అమానుషత్వాన్ని పూర్తిగా చెప్పజాలదు. ఇది సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, ద్రవ్య పెట్టుబడి నియంతృత్వం.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.