బతుకు చిత్రం-33
– రావుల కిరణ్మయి
జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత
***
నా భార్య తో డాక్టర్ గారు అన్న మాటలను చెప్పి మాట్లాడాను. నా భార్య కూడా చాలా బాధపడింది. అంత మంచాయనకు దేవుడు ఎట్లా అన్నాలం చేసిండని? ఆ ఆలోచంలో నుండే నా భార్యా నేను నా చిన్న బిడ్డను ఆ డాక్టర్ కు సాదుకం ఇవ్వాలని నిర్ణయించు కున్నాం.
మల్ల ఆయనను కల్సి మాట్లాడినం .
వాళ్ళ అమ్మా, నాయిన గిన అందరు సంబురపడ్డరు. ఎన్ని పైసలు గావాల్నో అడుగుండ్రి అన్నరు, కానీ పిల్లను అమ్ముకున్న కసాయిలం గాదని నా బిడ్డను మీ బిడ్లె
సాడుకొంద్రని ఒప్పజేప్పినం. దానికాయన నీ బిడ్డను నువ్వు ఎప్పుడయినా రావచ్చు, అవసరమయితే నీకు ఏదైనా పని ఇవ్వదానికైనా నేను సిద్ధమే అన్నాడు.
కానీ, అవేవీ అక్కరలేదని నా బిడ్డను వారికి అప్పగించాను. చాలా రోజుల వరకు చూడడానికి కూడా వెళ్ళలేదు. చివరి సారిగా ఆ డాక్టర్ గారు కబురు పంపితే వెళ్ళి చూసి అచ్చ్నం.
నా బిడ్డను చూసి మేము నమ్మలేకపోయాం. చాలా ఆరోగ్యంగా చలాకీగా ఉన్న బిడ్డను చూసుకొని మురిసిపోయాం.
నాన్నా! అని దగ్గరికచ్చి మాట్లాడింది.
డాక్టర్ గారు నాకు అన్ని విషయాలు చెప్పారు, అని పెద్దరికంగా మాట్లాడి తానూ పై
చదువులకని బయిటి దేశాలకు పోతున్నట్టు చెప్పి ఫోన్ నెంబర్ తీసుకున్నది. అప్పటి నుండి ఎప్పుడు వీలయితే అప్పుడు ఇలా మాట్లడుత్హున్తది.
అంతావిని సైదులు బిడ్డను పోగొట్టుకున్నందుకు నీకు బాధ లేదా ?
ఎందుకయ్యా? మంచి జీవితాన్ని ఇస్తానని అదృష్టం తలుపు తట్టి వచ్చిన్దనుకొని
ఇచ్చేశాను. ఇంకా బుద్ది వచ్చింది. పరిమిత కుటుంబమే మేలని తెలిసి వచ్చింది.గందుకే మగ పిలగాడని, ఆడపిలగాదని ఇట్లా కోరుకున్నోల్లు పుట్టేదాంక పిల్లల కానుకుంట పోయఎటోల్లకు రీతి గాదని చెప్తుంట.
ఔ ..గని నీకేన్న్త మంది? అని అడిగాడు.
తనకు ముగ్గురు ఆడ పిల్లలని చెప్పాడు. కమల సంగతి చెప్పలేదు.
పోనీలే !ఈ కాలానికి ఆడిపిల్లలే నయ్యం. నా సంగతే చూస్తివా ?ఇప్పుడు నేను సాదుకం ఇచ్చిన బిడ్డ పంపిచ్చే పయిసలతోనే నేను, నా భార్యా బతుకుతానం. మిగతా వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు ఆన్ని ఆ బిడ్డే ఎల్లదీసింది. ఎనుకట అట్టిగనే అన్నరా?మన తాతలు? పొయ్యిన్నాడు తలాపున గూసోని ఏడ్సెటందుకన్న ఆడి పిలగాండ్లు ఉండాలని.
సరే కొడుకా! నువ్వేవలో నేనేవలో ఇంత సేపు కట్టం సుఖం చెప్పుకున్టిమి. నేను
బోతున్నా అని వెల్లిపోయాడు.
కమల ఇంకా రాలేదు.
ఆటే చూస్తున్నాడు.
ఇంత వరకు ఆ పెద్దమనిషి చెప్పిన మాటలే తలలో తిరుగుతానయ్. ఆయన బ్బిడ్డకు ఈ రకంగా తను కన్నందుకు మేలు చేసిన్నని సంబురపడుతాందే తప్ప వేరే కాదు. మరి తను కూడా దేవత చెప్పినట్టు చేస్తే అవ్వ కూడా గట్టేక్కుతదా!అనుకుంటుండగా…
పోదామా? అని కమల వచ్చి భుజం కుదిపి అడిగేసరికి,
ఆ ..ఆ.. పా ..పా ..అని లేచాడు.
ఏంది ఎప్పుడు చూసినా బెరిపోయ్యి ఉంటవ్? ఏందసలు? ఏమాయే ?అన్నది. చిరాగ్గానే.
ఏమ్లె ..!
కమల మళ్ళీ అడుగ లేక పోయింది.
ఇద్దరూ ఇల్లు చేరారు.
జాజులు,ఈర్లచ్చిమి కమల ఆరోగ్యం గురించి అడిగారు.
అంతా మంచేనట. బలానికి శాపలు, గుడ్లు తినమన్నారు. వాళ్ళు చెప్పకున్నమనం తినిపియ్యాలే అన్నది జాజులమ్మ.
ఔ ..ఔ ..అని మాత్రమె అని ఈర్లచ్చిమి అక్కడి నుండి కదిలింది.
ఆమెకు ఒకటే బాధ. ఇంతమ్న్దిమి కూసోని తింటుంటే ఇంట్ల ఎల్లుడే కష్టం గుంటే
కరువుల కక్కచ్చే అన్నాట్టు కమల, పాణం బాగాలేక నేనూ అని అన్కోసాగింది.
సైధులు దేవత చెప్పిన విషయం జాజులమ్మతో చెప్పాలని అనుకుంటున్న వీలు చిక్కడం లేదు, పిల్లల కోడిలా ఎప్పుడూ పిల్ల తూనూ అవ్వతోనే కనిపిస్తున్నది.
శ్రీమంతానికి రాజ్యా ముహూర్తం పెట్టించుకు రావడంతో ఆ ఏర్పాట్లు చేయడంలో
మునిగి ఉంది. పలహారాలు చేయడానికి ఖర్చుల కోసం సాయంత్రం దొరికిన పనికల్లా పోతున్నది. మిరప కాయలు తొడిమె తీయడం, బట్టలకు గంజి పెట్టడం లాంటి ఏ పని చేయడానికయినా వెనుదీయడం లేదు.
సైదులుకు జాజులమ్మ తాపత్రయం చూసి చాలా జాలి కలిగింది. అందుకే తానూ ఏదో రకంగా డబ్బుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అప్పు కోసం తమ్ముడికి ఫోన్ చేశాడు.
టా దూర సందులేదు మెడకో డోలన్నట్టు ఇప్పుడున్న పొలగాండ్లకే సరిగ తిండికి గతిలేదు గాని ఇంక సూడ సక్కదనమని సీమంతమని అప్పు అడుగసిగ్గనిపిత్తలేదా?అన్న? నీకు? అని మొహం మీద కొట్టినట్టే మాట్లాడాడు.
సైదులుకు చిన్నతనమనిపించింది.
తమ్ముడు మాట్లాడిన దాంట్లో తప్పు లేదనిపించింది. నిజమే కదా !మల్ల పెళ్ళి
చేసుకోవడం ఎంత పెద్ద పొరపాటు? నాయన మాట తీసెయ్య్యలేక ఒప్పుకున్నందుకు
అనుభవించాల్సిందే .అనుకున్నాడు.
రెండు ,మూడు రోజులు తిప్పలవడి పలహారాలు పూర్తి చేసింది జాజులమ్మ. ఊర్లో, బంధువులను అందరిని పేరంటానికి పిలిచింది.
కమలకు లోలోన చాలా ఆనందంగా ఉంది. తన జీవితం నాశనం చేయాలని చూస్తున్నప్పుడు తాను పిరికిగా చావాలనుకుంది కానీ తనకు ఇంత అదృష్టం ఉండబట్టే బతికిందని జాజులమ్మే అందుకు కారణమని అనుకున్తున్నది.
***
ఆ రోజే సీమంతం. కోడికూరతో భోజనాలు సిద్ధం చేయించింది. కమలకు చాలా ఇష్టమైన ఆకుపచ్చని చీర, మల్లెలు, పంచ రంగుల గాజులు తెప్పించింది. ఈర్లచ్చిమి అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటె కాస్త శ్రమ తగ్గినట్టుగా అనిపించింది.రావలసిన వారు పిలిచినవారు అందరూ రావడంతో కార్యక్రమం మొదలయింది.
కమలని చక్కగా అలంకరించి తయారు చేసిన ఫలహారాలన్నీ ఒక్కొక్కరుగా ఒడి నింపి దీవించారు.
సకినాలు ఓడినిమ్పితి భామా ….నీకూ ..
చక్కన్ని పాపాయి మా చేతి కియ్యి …
దానిమ్మ పళ్ళను నీ ఒడి నింపితి …భామా ….
పండంటి పాపాయి మాకియవమ్మ ….
……………………………………………………………………………
ఇట్లా వాళ్ళు చేసిన అన్నీ తీర్ల పలహారాల పేర్లతో హారతి పట్టి, ఆఖరున
ఈ నెలత మీదకు ఏ దిష్టి పడకా ……
ఎములాడ రాజన్నా …..
నువ్వే మరి సాచ్చి ……
ఈ భామిని మీదకు ఏ గాలి సోకక …..
అమ్మా దుర్గమ్మా నీవే మరి సాచ్చి …..
……………………………………………………………..అంటూ కుంకుమ కలిపినా ఎర్ర నీళ్ళతో దిష్టి తీశారు.
కడుపునిండా వచ్చిన వారందరూ భోజనం చేసి కరువు దీరా ముచ్చట్లాడుతుంటే అక్కడ పెళ్లిసందడే కనిపించింది.
కమలకు పట్టరాని ఆనందంతో కన్నీల్లె వచ్చాయి. సైదులుకు దండం పెట్టింది.
అతను జాజులమ్మకు, ఈర్లచ్చిమికె ఈ దండాలు పెట్టుమన్నాడు. దేవత కూడా వచ్చింది.
ఆ తతంగమంతా పూర్తయ్యాకా జాజులును విడిగా కూర్చో బెట్టుకొని మాట్లాడింది. ఇలా
జాజులూ! నువ్వు ఇంత ఘనంగా ఈ సీమంతం చెయ్యకుంటే ఎమాయే? మీ అత్త పాణం గురించి ఆలోచించేదేమన్న ఉన్నదా? గాలికి దీపం బెట్టినట్టేనా? నీకు ఎంత పెద్ద భీమారో సుత చెప్పిన. ఖర్చులు తక్కువ గాదు అనికూడ చెప్పితి. ఆ ముచ్చట ఇడ్సి కొత్త ముచ్చట ముందటేసుకున్నావ్ గదా ?
గట్లనకక్కా, ఏ ముచ్చట జరుగవలసినప్పుడే జరిపియ్యాలె గదా!
ఔ ..!మల్ల అత్త పాణం సంగతి ?
చేత్తానక్కా, ఎంత దేవులాడుతున్నా ఏ దారి దొరుకుత లేదు. నాకు అగులు గుబులు
అయితాంది.
నువ్వేమన్నా చూస్తివా?
నేనా ..?
ఆ ..!
నాకు తెలిసిన దారి మీకు నచ్చుతదా?
అక్కా! గట్లట వెంది? పెద్దమనిషి పాణం నిలవడాలేగని, తీసుకుంటనంటే నా పానమయినా ఇస్తా. ఏందో జర జప్పరాదక్క .
నేను మీ ఆయనకు ఎప్పుడో జెప్పిన, నీతోనన్లె?
అవునా ? ఆ మనిషి ఏమి జెప్పలేగదా !
సరే !నువ్వు ఈ సమ్భురాన్నే ఉంటివి. నిమ్మలంగ చేప్తడెమో, గని ఇద్దరు
సోచాయించుకొని ఎగిర్త పడున్ద్రి. నేను మల్ల కలుత్త. అని వెళ్లిపోయింది.
జాజులుకు కొంచెం కుదుట పడ్డది. అత్తకు నయం చేయించేతందుకు దేవత మంచి దారే చెప్పి ఉంటది. కమల డెలివరీ అయ్యేలోపు అత్తకు పాణం బాగు జేపియ్యాలే అనుకున్నది.
సాయంత్రం కొంతమంది, మరునాడు కొంతమంది బంధువులు వెళ్ళిపోవడంతో జాజులుకు కొంచెం తీరిక దొరికినట్టయింది.
సయిదులుతో మాట్లాడాలని కాచుకొని చూస్తున్నాది.
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.