యాత్రాగీతం
అమెరికా నించి ఆస్ట్రేలియా
(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)
-డా||కె.గీత
భాగం-8
బ్లూ మౌంటెన్స్ డే ట్రిప్ (Blue Mountains Day Trip)
సిడ్నీ పరిసర ప్రాంతాల్లో చూడవలసిన ముఖ్యమైన ప్రాంతం బ్లూ మౌంటెన్స్. సిడ్నీ నుంచి డే ట్రిప్స్ ఉంటాయి. కానీ సీజనులో ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూరు కూడా మా ప్యాకేజీ టూరులో భాగమే.
ఉదయం 6.50 కల్లా మా హోటలు నించి అయిదు నిమిషాల దూరంలో ఉన్న హోటలు దగ్గిర పికప్ పాయింటు. ఇరవై మంది కూర్చునే మినీ వ్యాను అది. ఎక్కడా ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా నిండిపోయింది వ్యాను. ఒక్కొక్కరిగా అందర్నీ పికప్ చేసుకుని ముందు రోజు మేం ప్రయాణం చేసిన టన్నెల్ గుండా పయనం చేసి దాదాపు 7.30 ప్రాంతంలో నగరాన్ని దాటింది. దాదాపు పది కిలోమీటర్ల పెద్ద టన్నెల్ అది.
బ్లూ మౌంటెన్స్ సిడ్నీ సెంట్రల్ నించి దాదాపు 50 కి.మీ దూరంలో ఉంటాయి. ఈ పర్వతాలు దూరం నించి చూడడానికి ఆకాశంతో సమానంగా నీలంగా ఉంటాయి కాబట్టి ఆ పేరు వచ్చిందట.
ఇక్కడి ఇసుకరాతి గుహాంతర్భాగ కుడ్యాల మీద దాదాపు 22 వేల సంవత్సరాల నాటి ఆదిమానవ చేతిముద్రలు దొరికాయట.
ఈ బ్లూ మౌంటెన్స్ ని కనుగొన్న వ్యక్తి జాన్ విల్స్. ఈయన బ్రిటన్ నించి ఆస్ట్రేలియా లోని సిడ్నీకి పంపించబడ్డ నేరస్తుల తొలి నౌకలోని వ్యక్తి. బ్లూ మౌంటెన్స్ లో బొగ్గు నిల్వలు అధికంగా ఉండడం వల్ల త్వరితగతిన రోడ్డుమార్గ నిర్మాణానికి ఇది ప్రధాన కారణం అయ్యింది. ఇక ఇక్కడ కొండాకోనల్లో దాక్కొని ఉన్న బొగ్గుని తవ్వి కొండ మీదికి పంపడానికి నిలువునా దిగి, ఎక్కే రైలు మార్గాన్ని వెయ్యడం ఇక్కడి విశేషం. ఇందు కోసమే ఒక బ్రిడ్జిని కూడా నిర్మించాల్సి వచ్చిందట.
ఇక ఈ రోజు మా టూరులో మొదటి స్టాపుగా దాదాపు 8.30 ప్రాంతంలో లాసన్ (Lawson) అనే ఊళ్ళో కాఫీల కోసం ఆపేడు వ్యాను డ్రైవరు & గైడు. పర్వత ప్రాంతం కావడం వల్ల చల్లగా ఉన్నా, మంచి ఎండ కాస్తున్నందు వల్ల ఆహ్లాదంగా ఉంది. వ్యానుని ఆపిన పార్కింగ్ లాట్ లోనే చిన్న పార్కు ఉంది. ఎదురుగా చిన్న రోడ్డు మీద వరసగా దుకాణాలు ఉన్నాయి. విలియం లాసన్ అనే వ్యక్తి మొట్టమొదట బ్లూ మౌంటెన్స్ ని దాటి వెళ్లొచ్చిన టీమ్ మెంబర్ అట. ఆయన పేరు మీదుగానే ఈ ఊరికి లాసన్ అనే పేరు వచ్చింది కాబట్టి ఆయన విగ్రహం అక్కడ పార్కులో ప్రతిష్టించారు.
కాఫీకి క్యూ పెద్దగా ఉండడంతో నేను, పిల్లలు బయట కూర్చున్నాం. అప్పటికే మా ఎదురుగా కుక్కపిల్లని తీసుకుని వచ్చి ఎండకి హాయిగా సేదతీరుతున్న ఒకామెమమ్మల్ని పలకరించింది. ఇక రెండు నిమిషాల్లో కుక్కపిల్ల పక్కనే చేరిపోయేరు పిల్లలు. ఆస్ట్రేలియన్ ఏక్సెంట్ లేకపోవడంతో “అమెరికా నించి వచ్చేరా” అని అడిగాను. “కాదు కెనడా నించి” అని బదులు చెప్పింది. అంతే కాకుండా ఇరవై ఏళ్ళుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నామని, సిడ్నీ బిజీ జీవితం నించి ఈ పర్వత ప్రాంతానికి వచ్చి స్థిరపడాలన్నది తన చిరకాల కోరిక అని, ఇటీవలే అక్కడ నివాసం ఏర్పరుచుకున్నట్టు చెప్పింది. నగర గందరగోళాల నించి బయటికొచ్చి ఇలాంటి నిశ్శబ్దమైన ప్రదేశంలో ఉండడం తపస్సు చెయ్యడం లాంటిదని సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇంతలో మరో కుక్కపిల్లని తీసుకుని మరొకామె వచ్చింది. అమెరికాలో కుక్కపిల్లలున్నవాళ్ళు సాధారణంగా సాయంత్రంపూట ఇలా నడవడానికి వస్తారు. ఇక్కడ వీళ్ళు ఇలా ఉదయాన వస్తున్నారంటే బహుశా: ఆహ్లాదకరమైన నును వెచ్చని ఎండలో సేదతీరడానికేనేమో! మొత్తానికి కుక్కపిల్లని వదిలి రాని మా చిన్నమ్మాయి సిరిని మాయచేసి వ్యానులోకి తీసుకురావడానికి మేం బోల్డు కష్టపడాల్సి వచ్చింది.
ఆ ఊరు పొలిమేర దాటుతూన్నపుడు ఆ ఊరి చరిత్రని చెప్పాడు మా గైడు. బొగ్గు గనులు ప్రారంభమైన కొత్తలో ఈ ఊరి మధ్యనించి హైవే వెయ్యాల్సి వచ్చినపుడు ఊర్లో ఉన్న చారిత్రాత్మకమైన లాసన్ కమ్యూనిటీ సెంటర్ వంటి కట్టడాల్ని కూల్చి వెయ్యడం ఇష్టంలేని స్థానికులు కట్టడాల్ని యథాతథంగా పక్కకి జరిపి కాపాడుకున్నారట.
మరో అరగంటలో అంటే 9.30 ప్రాంతంలో కతూంబా (Katoomba) అనే ఊరికి చేరేం. ఊరి చివర్లో ఉన్న ఈకో పాయింట్ లుకవుట్ (Echo Point Lookout) దగ్గిర వ్యాను దిగేం.
అక్కణ్ణించే ప్రఖ్యాతి గాంచిన త్రీ సిస్టర్స్ (Three Sister) అనే మూడు పర్వత శిలల్ని చూడొచ్చు. ఇవి గోడలా వ్యాపించిన పర్వత కొసలో ఉలితో చెక్కినట్లు, ఒకదాని పక్కనొకటి ఎవరో నిలబెట్టినట్టు అద్భుతంగా ఉంటాయి. ఇవి దాదాపు రెండువందల మిలియను సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయట.
ఇక్కడ రకరకాల “లుక్ అవుట్ పాయింట్లు” ఉన్నాయి. ఒక్కొక్క చోటి నించి ఒక్కో విధమైన అందమైన దృశ్యం కనిపిస్తుంది.
మేం వెళ్ళిన రోజు ఎండ కాస్తున్నా విపరీతమైన గాలి ఉండడంతో చలిగానే ఉంది. డిసెంబరు నెల ఆస్ట్రేలియాలో వేసవి అయినా ఉన్నట్టుండి వీచే చల్లగాలుల్ని తట్టుకోవ డానికి, అనుకోకుండా వర్షం వచ్చినా తడవకుండా కాపాడుకోవడానికి సరిపడే జాకెట్లు మేం తలాఒకటి ఎందుకైనా మంచిదని పట్టుకెళ్ళడం ఎంత మంచిదైందో! అంత చలిలోనూ పిల్లలు ఇక్కడి గిఫ్ట్ షాపులో అమ్ముతున్న ఐస్ క్రీములు కొనుక్కుని తిన్నారు.
స్థానిక అబోరీజినల్ కథనం ప్రకారం విమల, మీని, గునెడూ (Wimalah, Meeni, and Gunedoo) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్ళు జామిసన్ లోయలో కతూంబా తెగలో నివసిస్తూ ఉండేవారు. వీళ్ళు నేపియన్ తెగకు చెందిన ముగ్గురు సోదరులతో ప్రేమలో పడ్డారు, కానీ స్థానిక గిరిజన నిబంధనల ప్రకారం తెగల మధ్య వివాహం నిషేధం. ఈ నిబంధనని అంగీకరించని సోదరులు ఎలాగైనా ముగ్గురు సోదరీమణుల్ని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రెండు తెగల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళని రక్షించుకోవడానికి సదరు తెగ పెద్ద వీళ్ళని రాళ్ళుగా మార్చేసాడు. ఆ యుద్ధంలో ఆ తెగపెద్ద హతమయినందున అప్పటి నించి ఎవరూవీళ్ళని తిరిగి మనుషులుగా మార్చలేకపోయారట.
ఇక స్థానిక గుండుంగుర్రా & ధారుగ్ (Gundungurra & Dharug) ఆటవిక తెగల నమ్మకం ప్రకారం ఈ ప్రదేశం చాలా పవిత్రమైంది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మూడు నక్షత్ర మండలాలట. భూ మండలం మీద ప్రకృతి యావత్తూ వీరు ప్రసాదించిన వరాలే. మనందరం భూమి, ఆకాశం, నీరు, ప్రాణులు మొ.న అన్నిటినీ సంరక్షిస్తే ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మనకు ఎటువంటి కష్టం కలగకుండా చూస్తారట.
మొదటి లుక్ అవుట్ పాయింటు లోనే ఆదిమానవ చేతిముద్రల్ని పోలిననిలువెత్తు రాయిని చూడొచ్చు.
ఇక్కడ చుట్టూ ఉన్న కాలిబాటల్లో నుంచి ఈ పర్వత లోయల్లోకి నడిచి విశేషాలు చూసే వీలుంది.
ఈ ఎకో పాయింట్ నుండి, బుష్‌వాకింగ్ ట్రయిల్ ద్వారా “ది జెయింట్ స్టెయిర్‌వే” అని పిలువబడే దాదాపు 800 ఉక్కు , రాతి మెట్ల మీంచి త్రీ సిస్టర్స్ లోయలోకి వెళ్లొచ్చు. ఫెడరల్ పాస్ ట్రయిల్‌లో గంటన్నరపాటు నడిస్తే కతూంబా జలపాతాన్ని, సుందరమైన రైల్వే స్థావరాన్ని చూడొచ్చు. వచ్చేటపుడు నిర్ణీత రుసుముతో నడిచే విశేషమైన రైలెక్కి తిరిగి పైకి చేరుకోవచ్చు.
మాకు ఉన్న సమయం 45 ని.లు మాత్రమే కావడం వల్ల అన్ని పాయింట్ల నించి కనిపించే చుట్టూ అందమైన దృశ్యాల్ని చూడడం, ఛాయాచిత్రాల్లో బంధించడం త్వర త్వరగా పూర్తి చేసాం.
ఇక్కడ ఉన్న షెల్టర్స్ లో ఒకటి గిఫ్ట్ షాపు, రెండోది బాత్రూములు. గట్టిగా వర్షంవస్తే ఇక్కడ నిలబడ్డం కూడా కష్టమే. వెంటనే తలదాచుకోవడానికి వేరే షెల్టర్ లేదు. కాబట్టి ఎండగా ఉన్నపుడు మాత్రమే వెళ్ళడమే మంచిది. అక్కణ్ణించి కాస్త ముందుకు వీధి కనబడే వరకు నడిస్తే ఊరు వస్తుంది. ఈ కతూంబా చుట్టుపక్కలే చూడవలసిన ఎన్నో విశేషాలు ఉన్నాయి.
*****
(సశేషం)