యాత్రాసాహిత్యంలో నవచైతన్యం
-దాసరి అమరేంద్ర
తెలుగువారు తమ ప్రయాణాల గురించి రాయడం మొదలెట్టి 185 సంవత్సరా లయింది (ఏనుగుల వీరాస్వామి, కాశీయాత్ర చరిత్ర, 1938). ఇప్పటి దాకా సుమారు 200 యాత్రాగ్రంథాలు వచ్చాయి. వేలాది వ్యాసాలు వచ్చాయి. ప్రయాణాల గురించి రాయా లన్న ఉత్సాహం ఉన్నవాళ్ళ దగ్గర్నించి పరిణితి చెందిన రచయితల వరకూ యాత్రా రచనలు చేసారు, చేస్తున్నారు. మొట్ట మొదటి యాత్రా రచనే చక్కని పరిణితి ప్రదర్శిం చినా నిన్న మొన్నటి దాకా యాత్రారచనలు చాలా వరకూ వింతలూ విడ్డూరాలకూ, కాలాలూ దూరాలకూ, గణాంక వివరాలకూ, రచన చేయాలన్న ఉత్సాహాలకూ పరిమితమై సాహితీ విలువలను సంతరించు కోవడంలో అంతగా విజయవంతం కాలేక పోయాయి.
గత ఇరవై పాతికేళ్ళుగా యాత్రారచనల ధోరణి బాగా మారింది. కుతూహలాల స్థానంలో జిజ్ఞాసా, పిపాసా వచ్చి చేరాయి. వింతలూ విడ్డూరాల స్థానంలో ప్రకృతీ మనిషీ ముఖ్యమయ్యాయి. ఉపరితల పర్యటనలు గాఢత నిండిన యాత్రలయ్యాయి. ప్రదేశా లను కళ్ళతో చూసి కలంతో రాయడం స్థానంలో మనసుతో చూసి హృదయంతో రాయడం మొదలయింది. అనుభవాలు అనుభవాల దగ్గరే ఆగకుండా అనుభూతులకు దారి తెరిచాయి. పెదవి నుంచి వచ్చిన నోటి మాటల స్థానంలో మనసు పలికే మౌనరాగా లు యాత్రారచనల్లో వినిపించసాగాయి. మనుషులూ ప్రదేశాలూ ప్రపంచమూ అంటే ఉండే ఆసక్తీ అభిమానాల స్థానంలో అనుకంపా అక్కరా చోటు చేసుకున్నాయి.
తెలుగు సాహిత్యంలో చెప్పుకో దగ్గ రచనలు అంటే 1838 నాటి కాశీయాత్ర చరిత్ర- మాలపల్లి, కన్యాశుల్కం లాంటి రచనల సహపంక్తిన ఉండటం మనం గమనించవచ్చు. అలాంటి సాహితీస్థాయి గల యాత్రారచనలు ఈ పాతికేళ్ళలో కనీసం అరడజను వచ్చాయి.
ప్రపంచంలో ఇప్పటికీ పర్యటన అన్నది డబ్బుతో నిండిన వేడుక. పరిశ్రమ స్థాయికి చేరిన వ్యాపార ప్రక్రియ. ప్రయాణాలు చేసేవారిలోనే కాకుండా వాటి గురించి రాసేవారిలో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం మీద మౌన అంగీకారం ఉండటం మనం గమనించవచ్చు. తెలుగు యాత్రాసాహిత్యం అందుకు మినహాయింపు కాదు.
కానీ, 1830లోనే ఏనుగుల వీరాస్వామి తన ప్రయాణానికి జిజ్ఞాస, పిపాస కేంద్ర బిందువులుగా చేసుకొన్నాడు. అనుభవాలూ, మానవ సంపర్కం మీద దృష్టిపెట్టాడు. అలా చేసిన పదిహేను నెలల కాశీయాత్ర గురించి గొప్ప రసజ్ఞతతో రాయగలిగాడు. అదే ధోరణి 1978లో వచ్చిన కాశ్మీర దీపకళికలో నాయని కృష్ణకుమారి ప్రదర్శించారు. సౌందర్య దృష్టితో తాను తిరిగిన ప్రదేశాలను చూసి ఆయా అనుభవాలను కవితా త్మకంగా, అనుభూతి ప్రధానంగా చెప్పిన కృష్ణకుమారి ఆధునిక తెలుగు యాత్రా రచనకు పునాది రాయి వేసారు. గమ్యం కన్న గమనం ముఖ్యమని చెప్పకనే చెప్పారు.
కాశ్మీర దీపకళికను అభిమానించిన వారిలో ఒకరైన దాసరి అమరేంద్ర ఆ రచనలోని అనుభూతి అన్న అంశాన్ని కేంద్రంగా చేసుకుని 1990లో తన తొలి యాత్రారచన మూడు నగరాలు (మ్యూనిక్, పారిస్, లండన్) వెలువరించారు. ఆ రచన ఒక దిన పత్రికలో ధారావాహికగా వచ్చినపుడు దానికి సంపాదకులు, ‘అనుభూతిని మేళవించి చెప్పిన విదేశీ యాత్రాగాథ,’ అన్న ట్యాగ్ లైన్‌ను జోడించారు.
1999లో వచ్చిన భ్రమణకాంక్ష (మాచవరపు ఆదినారాయణ) ‘ప్రయాణం’లోని అనేక మౌలిక అంశాలకు ప్రతీకగా నిలిచింది. నదులు, కొండలు దాటుకుంటూ వేలాది కిలో మీటర్లు కాలి నడకన సాగిపోయిన ఆ మూడు ప్రయాణాల ముప్పేట పాఠకులకు ఢిల్లీ చేరినప్పుడో, డార్జిలింగ్ చేరినప్పుడో కాకుండా ఆయా ప్రయాణాల పొడవునా అనేకానేక అనుభవాల రుచి చూపి ఆ గమనాల రమ్యతను వారి మనసుల్లో నింపగలిగింది. |
తెలుగులో యాత్రా రచనకు ఊతమివ్వడమే గాకుండా ఆ ప్రక్రియను ఒక మలుపు తిప్పింది. దీప స్తంభంగా నిలిచింది. ఎంతో మందిలో యాత్రా పిపాసను నింపగలిగింది.
సుఖమూ సౌఖ్యమూ దైనందిన జీవితాలలోని మొనాటనీ జయించడమూ ప్రయాణా ల లక్ష్యంగా ఉన్న రోజుల్లో, ఆ లక్ష్యాలకు అనుగుణంగా ట్రావెలాగ్స్ వస్తోన్న సమయంలో, సుఖం కన్న సంతోషం మిన్న అంటూ సౌఖ్యం కన్న సాహసం ముఖ్యం అంటూయాత్రలు చెయ్యడం, యాత్రాగాథలు వెలువరించడం గత ఇరవై పాతికేళ్ళలో తెలుగులో వచ్చిన చెప్పదగ్గ పరిణామం.
ఎవరూ ఊహించని మధ్య యుగాలనాటి వ్యాపారమార్గం సిల్క్ రూట్లో సాహసయాత్ర (పి. లోకేశ్వర్, 2013), నలుగురు స్త్రీ సాహసికులు 56 రోజులపాటు ఆరు దేశాలలో పదిహేడు వేల కిలోమీటర్లు మోటారుసైకిళ్ళ మీద తిరిగిరావడం (రోడ్ టు మెకాంగ్, జయ భారతి, 2019) మనం గమనించవచ్చు. |
అలాగే సైకిళ్ళ మీద ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అడవులన్నిటినీ 78 రోజులపాటు తిరిగి వచ్చిన వైనం మనకు అడవి నుంచి అడవికి (జయతి, 2018) పుస్తకంలో కనిపిస్తుంది. |
జగము నేలిన తెలుగు (డి.పి. అనూరాధ, 2021) వెదుకులాటలో ఆ వెదికిన వ్యక్తి ఎంతటి సాహస ప్రవృత్తిని సంతరించుకొని ప్రదర్శించారో మనం ఊహించవచ్చు. దేశపు సరిహద్దుల్లో (రెహానా, 2018) పర్యటించినా, చత్తీస్‌ఘడ్ అడవుల్లో వేల కిలోమీటర్లు స్కూటరు మీద తిరుగాడినా (స్కూటర్ పై చత్తీస్‌ఘడ్ యాత్ర, పరవస్తు లోకేశ్వర్, 2009)- వీటన్నిటి వెనుకా సాహసమే మా ఊపిరి అన్న మౌలిక ప్రేరణ ఉంది. ఇప్పుడది మన యాత్రికుల్లోనూ యాత్రారచన ల్లోనూ మునుపెన్నడూ లేనంత ప్రస్పుటంగా కనిపిస్తోంది.
దీనితో ముడిపడిన మరో ఆసక్తికరమైన పరిణామం గురించి చెప్పుకోవాలి. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో వీరాస్వామి కాశీ యాత్రకు ఎద్దుబళ్ళూ, పల్లకీలూ సాధనాలయ్యా యి. రోడ్లూ, రైళ్ళూ, విమానాలూ వచ్చాక ‘సహజంగానే’ అవి యాత్రికుల ముఖ్య సాధనా లయ్యాయి. దానికి భిన్నంగా- రవాణా సౌకర్యాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన 21వ శతాబ్దంలో ఊహాతీతమైన యాత్రా సాధనాలు మనకు కొన్ని యాత్రా రచనల్లో కనిపిస్తాయి. ఆదినారాయణ యాత్రలకు కాళ్ళే ప్రధాన వనరు. జయతికి సైకిలు ముఖ్యమైన సాధనమయితే జయభారతికీ లోకేశ్వర్‌కూ స్కూటర్లు, మోటారు సైకిళ్ళూ అభిమాన పరికరాలు. జలమార్గానా, కారుల్లోనూ ఈ మధ్య చేసిన యాత్రల గురించి ఇంకా పుస్తకాలు రాలేదుగానీ అవీ రావడానికి పెద్దగా సమయం పట్టదు.
తెలుగువారు యాత్రికులుగా సీమాంతరాలు వెళ్ళడమన్నది కనీసం నూట యాభై ఏళ్ళ క్రితమే జరిగిన దాఖలాలు ఉన్నాయి. పుస్తకంగా ఆ వివరాలు నమోదు అయ్యాయి (పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్, పోతం జానకమ్మ, 1876). ఆ తర్వాత కూడా ఓడల్లోనూ విమానా ల్లోనూ వెళ్ళి వచ్చినవాళ్ళు ఉన్నారు. కానీ 1950లు 60ల దాకా విదేశీయానం అన్నది మనకు అపురూపమైన విషయంగానే ఉండి పోయింది. 1970లు వచ్చే సరికి విద్యా ఉద్యోగాల కోసమో, సాంస్కృతిక రాయ బారులుగానో తెలుగువారి విదేశీ ప్రయాణాలు పెరిగాయి. అలా వెళ్ళి వచ్చిన కవులూ కళాకారులూ పాత్రికేయులూ రచయితలూ తమ తమ యాత్రల గురించి రాసారు కూడానూ.
21వ శతాబ్దం వచ్చేసరికి విదేశాలు వెళ్ళి రావడమన్నది అతి సులభమయింది. ఏదో కార్యక్రమం పెట్టుకొని వెళ్ళి రావడం గాకుండా టూరిస్టులుగానూ, యాత్రికులుగానూ వెళ్ళడం, రాయడం సామాన్యమయింది. సిల్క్‌రూటు యాత్ర గురించీ, రోడ్ టు మెకాంగ్ గురించీ చెప్పుకొన్నాం. ఇవి రెండూ రొటీన్‌కు భిన్నంగా పొందిన అనుభవాలు; సాహసా లు పునాదిగా చేసిన యాత్రలు. ఈ నవీన బాణీ యాత్రలూ, యాత్రారచనలూ గత పాతికేళ్ళలో మనకు ఎన్నో కన్పిస్తాయి. |
2016లో వచ్చిన భూభ్రమణకాంక్ష ఆరు ఖండాలూ పధ్నాలుగు దేశాలలో మాచవర పు ఆదినారాయణ చేసిన విదేశీ యాత్రల సమాహారం. నగరాలూ, మహానదులూ,సంపన్న దేశాలూ, వింతలూ, విశేషాలను పట్టించుకోకుండా టాస్మానియా, నైజీరియా లాంటి అంత గా ప్రయాణీకులకు అందని దేశాలకు అనాది యాత్రికుని బాణీలో వెళ్ళి తిరుగాడి రాసిన ప్రపంచశ్రేణి యాత్రా గాథ ఈ భూ భ్రమణకాంక్ష. 2016లో వచ్చిన నా ఐరోపా యాత్ర (వేమూరి రాజేష్) కూడా యూరప్‌లోని అనేకానేక దేశాల గురించి రాసిన పుస్తకమే అయినా అది ప్రముఖ దేశాలూ నగరాల గురించి గాదు; లిచ్చెన్ స్టెయిన్, లక్జెంబర్గ్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ లాంటి పది పన్నెండు దేశాలను మనసుతో చూసి హృదయంతో రాసిన పుస్తకమది. ఇదే బాణీలో అదే రచయిత 2022లో యూరప్‌లోని మారుమూల పర్వతశ్రేణిలోని అజార్బైజాన్, అర్మేనియా లాంటి దేశాలలో తిరుగాడి మా కాకసస్ యాత్ర అన్న పుస్తకం తీసు కొచ్చారు. గల్ప్ గీతం (2021) అంటూ దుబాయ్, మస్కట్ల గురించి రాసినా అవి ఆయా దేశాలలోని ఆకాశాహార్మ్యాలనూ, బంగారపు విపణి వీధుల్నీ హెచ్చు చేసి చెప్పకుండా అక్కడి జనసరళిని ఒడిసి పట్టుకుని పాఠకులకు అందించడానికి చేసిన ప్రయత్నం. ఎండ్లూరి సుధాకర్, అంపశయ్య నవీన్, మధురాంతకం నరేంద్ర, ఎన్. గోపీ లాంటి ప్రముఖులూ, జయభారతి లాంటి ఔత్సాహికులూ తమ తమ దృష్టిలో చూసిన ఆయా దేశాల గురించి తమదే అయిన బాణీలో రాసుకొచ్చారు. ఈ సందర్భంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలోనూ ‘ప్రయాణించి’, ఆగదు మా ప్రయాణం (2018) అంటూ సమాచార దర్పణాల్లాంటి పుస్తకాలను ప్రచురిస్తోన్న నర్మదా రెడ్డినీ గుర్తు చేసు కోవాలి.
ప్రతి యాత్రికునిలోనూ ఒక కవి ఉంటాడు.
‘‘మధ్యాహ్నం ఎండ గంజి పెట్టిన నూలుగుడ్డలా పెళపెళ లాడుతోంది,’’ అంటూ కాశ్మీర దీపకళిక ఆరంభిస్తారు నాయని కృష్ణకుమారి. ‘‘తెల్లరంగు వేసిన మైలురాళ్ళు వికసించిన పుష్పాల్లా ఉంటే నేను వాటిని వెంటాడే తేనెటీగగా మారిపోయాను,’’ అంటారు ఆది నారాయణ భ్రమణకాంక్షలో. ‘‘తెల్లటి ఇసుకమీద వంగుతోన్న పొద్దులోంచి నారింజరంగు పారుతోంది,’’ అంటారు జయతి సాయంసంధ్యలో ఒక కొండవాగును చూసి తన అడవి నుంచి అడవికి పుస్తకంలో.
గల్ప్ యాత్రలో ఉన్న అమరేంద్రకు దుబాయ్ నగరపు పాతబస్తీలో ‘కనిపించి’, ‘పలకరించిన’ 1875-1954ల నాటి కవి ఒఖైలీలో మధ్యయుగాల బమ్మెర పోతన, తదుపరి కాలపు కబీరూ, ఢిల్లీ నగరపు గాలిబూ, ప్రజాకవి కాళోజీల ఛాయలు ప్రస్పుటంగా కనిపించి మురిపించడం సదరు యాత్రారచన యాత్రాపరిధినీ, కవితాస్పూర్తినీ దాటుకుని వెళ్ళి విశ్వమానవ స్పర్శకు సంకేతంగా పరిణమించడంగా చెప్పుకోవచ్చు.
ఆటా జని కాంచె (2006) అంటూ తన అమెరికా యాత్రను 134 కవితల్లో చెప్పారు ఎండ్లూరి సుధాకర్. జర్మనీలో కవితాయాత్ర (2015) అంటూ రాసారు ఎన్. గోపీ. నిరంతరం (2020) అన్న తన టాగోర్ తిరిగిన దారుల్లో చేసిన యాత్రాకథనాన్ని కవిత్వంతో నింపేసారు ఆకెళ్ళ రవి ప్రకాష్. |
యాత్రల గురించి కథారూపంలోనూ, నవలారూపంలోనూ చెప్పడం (అమెరికా, అమెరికా – అంపశయ్య నవీన్, జగమునేలిన తెలుగు – డి.పి. అనూరాధ) ఇపుడు సామాన్యమయిపోయింది.
యాత్ర అంటే కొత్త ప్రదేశాలను, దేశాలను, మనుషుల్ని మనవిగా మనవారిగా చేసుకోవడం. ‘టూరిస్టు పక్క ఊరికి వెళ్ళినా పరాయివాడిగా పట్టుబడిపోతాడు. యాత్రికు డు మనుషులూ భాషా తెలియని దూరదేశాలకు వెళ్ళినా క్షణాల్లో అక్కడివాడయి పోతాడు,’ అంటారు అనుభవజ్ఞులు. ఇలా జరగాలంటే యాత్రికునికి అనుకంప, అక్కర ఉండాలి. ప్రదేశాలలో మనుషులతో మమేకమవ గలగాలి. ఆయాచోట్ల తన ప్రతిబింబాన్ని చూడగలగాలి.
ఈ లక్షణాలున్న యాత్రాగాథలు మనకీమధ్య తరుచూ కనిపి స్తున్నాయి.
తన ఐరోపా యాత్రలో వేమూరి రాజేష్ జర్మనీ వెళ్ళినపుడు అక్కడి ప్రముఖ ప్రదేశాల కన్నా ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధ కాలపు ఆష్‌విడ్జ్ నాజీ కాన్సంట్రేషన్ కాంప్ చూడాలని కోరుకుంటాడు. తన తరానికి అంతగా పరిచయం లేని ఆ యుద్ధపు దారుణాలతో ముఖాముఖీ అవుతాడు. ‘ఎవరీ హిట్లర్? జాత్య హంకారం, యుద్ధోన్మాదం ఒక జాతి మొత్తాన్ని నిర్మూలించే క్రీడగా, ఒకానొక దారుణ వ్యవస్థకు ఆర్థిక పుష్టిని చేకూర్చే పరిశ్రమగా ఎందుకు పరిణమించింది,’ అంటూ వ్యాకుల పడతాడు. అసంకల్పితంగా అతని కళ్ళు నీటి చెలమలవుతాయి. యాత్రలూ యాత్రా రచనలూ మౌలిక మానవ స్పందనలకి ఎలా ప్రేరణలవుతాయో ఆ ఘట్టంలో స్పష్టమవుతుంది.
సరిహద్దుల్లో రెహాన 2016లో కాశ్మీరు బోర్డర్ ప్రాంతానికి వృత్తిపరంగా వెళ్ళారు. అక్కడి ఉద్రిక్తతలనూ, ఉగ్రవాదుల కార్య కలాపాల వివరాలను తెలుసుకోవడానికి కాల్పులు జరుగుతోన్న సరిహద్దు గ్రామాలకు వెళ్ళారు. వెళ్ళి తూటాలకు కొడుకును పోగొట్టు కొన్న ఒక తల్లిని కలిసారు. గ్రామాలలోని కన్నీటి గాథలు విన్నారు. ‘మనిషిని పలకరిస్తే చాలు ఊరు ఊరంతా పోగైపోయేది,’ అంటారు. వృత్తిపరిధిని దాటిన అక్కరా, అనుకంపా ఆమెది. |
డిబ్రూఘర్ నుంచి కన్యాకుమారి దాకా నాలుగు రోజులు రైల్లో ప్రయాణించిన జయతి రిజర్వుడు బోగీలు కూడా మూడు రెట్లు మనుషులతో నిండిపోయినప్పుడు, ‘తోటివాళ్ళు నిలబడి వుంటే సీట్లు పట్టుకుని ఎలా కాళ్ళు చాపుకుంటాం? ఆ కష్టాన్ని వందల మందిమి పంచుకొన్నాం,’ అంటారు. ఆ ప్రక్రియలో అస్సాం నుంచి కేరళకు పనుల కోసం వస్తున్న కుర్రాళ్ళందరూ తమ్ముళ్ళయిపోయారు అంటారు.
ఈ అక్కర, అనుకంప జయతీ, రెహాన, రాజేష్‌లకే పరిమితం కాదు. యాత్రల గురించి పిపాసతో రాసే అందరి రచనల్లోనూ ఇది ఒక సామాన్య లక్షణంగా కనిపిస్తోం దిప్పుడు.
మగతోడు కోసం చూడకుండానూ, తమంతట తామే చొరవతో మహిళలు యాత్రలు చెయ్యడం, వాటి గురించి రాయడం ఈ మధ్య కాలంలో వచ్చిన చక్కని పరిణామం. గత పది పదిహేనేళ్ళ కాలంలో మహిళలు రాసిన యాత్రారచనలు విరివిగా వచ్చాయి. ముందు చెప్పుకున్న డి.పి. అనూరాధ, నర్మదా రెడ్డి, రెహాన, జయతి, జయభారతిలే కాకుండా పూదోట శౌరీలు, రొంపిచర్ల భార్గవి, కె. గీత, కొండవీటి సత్యవతి లాంటి వారు కూడా తమ యాత్రారచనలను ప్రచురించారు.
యాత్రారచనను స్వీయ అనుభవాలకే పరిమితం చెయ్యకుండా యాత్రాసంబంధిత విషయాలనూ పాఠకులకు చేర్చే ప్రయత్నం ఇపుడు బాగా జరుగుతోంది. ఈ విషయంలో ఆది నారాయణ గణనీయమైన కృషి చేసారు. స్త్రీ యాత్రికులు (28 మంది ప్రపంచ ప్రసిద్ధ మహిళా యాత్రికుల జీవనరేఖలు), మహాయాత్రికులు (24 మంది ప్రపంచస్థాయి యాత్రికుల జీవితాలు), తెలుగువారి ప్రయాణాలు (64 మంది తెలుగు యాత్రికుల అనుభవాలు), ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర (1838 నాటి మూలప్రతికి సరళీకృత వెర్షన్) లాంటి అపురూపమైన పుస్తకాలను ఆదినారాయణ గత ఇరవై యేళ్ళలో ప్రచురిం చారు. దాసరి అమరేంద్ర కూడా సాటి తెలుగు యాత్రికుల రచనలనూ, తెలుగేతర ప్రముఖ యాత్రాగ్రంథాలనూ, తెలుగులో వచ్చిన యాత్రాసాహిత్యపు రూప పరిణామాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు.
మనకు ఉన్న రెండు వందల యాత్రాగ్రంథాలలో చాలా వరకు ఆయా రచయితలు ఒకసారి ట్రావెలాగ్ రాసి విరమించుకొన్న కోవకే చెందుతాయి. ఔత్సాహికులే కాకుండా ఇతర సాహితీ ప్రక్రియల్లోనూ, కళారంగాలలోనూ కృషి చేసి పేరు పొందినవారు కూడా ఒక యాత్రారచన చేసి విరమించడం సామాన్య లక్షణంగా ఉంటూ వచ్చింది. ఇపుడా ధోరణిలో మార్పు వచ్చింది. డా|| ఎన్. గోపి, పరవస్తు లోకేశ్వర్, దాసరి అమరేంద్ర నిలకడగా యాత్రారచనలు వెలువరించడం గమనించవచ్చు. జయతి రాసిన మూడు పుస్తకాలూ మౌలికంగా యాత్రా సంబంధితాలే. ఆదినారాయణ, నర్మదారెడ్డి లాంటివారు కేవలం యాత్రారచనకే తమ సాహితీవ్యాసంగాన్ని అంకితం చెయ్యడం ఆసక్తికరమైన పరిణామం.
అనువాదాలకు తెలుగు సాహిత్యంలో ప్రముఖస్థానం ఉంది. యాత్రా సాహిత్యమూ దానికి మినహాయింపు కాదు. 1950ల నుంచీ నాణ్యమైన అనువాద యాత్రారచనలు తెలుగులో వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హైకూయాత్ర (మత్సువొ, బషో, వాడ్రేవు చినవీరభద్రుడు), టిబెట్‌లో 15 నెలలు (రాహుల్ సాంకృత్యాయన్- పారనంది నిర్మల), ప్రయాణానికే జీవితం (అజిత్ హరిసింఫూని- కొల్లూరి సోమశంకర్), జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర (పోతం జానకమ్మ- కాళిదాసు పురుషోత్తం), ఊహలకందని మొరాకో (నిమ్మగడ్డ శేషగిరి- దాసరి అమరేంద్ర) లాంటి అనువాద యాత్రా గ్రంధాలు వెలువడ్డాయి. ఈ కాలంలో వచ్చిన తెలుగు యాత్రా రచనలకు పాఠకుల ఆదరణ పెరిగినట్టుగానే ఈ అనువాద రచనలూ ఆదరణ పొందుతున్నాయి.
యాత్రారచనలు నిజానికి ఆత్మకథలు. యాత్రికుడు తన బింబాన్ని అక్షరాల్లో నిలిపి ప్రతిబింబాలను పాఠకుల్లో చూసుకొనే ప్రక్రియలు. ప్రపంచంలో తన ఉనికినీ, తనను తాను వెదుక్కొనే ప్రయత్నం. ఈ లాంటి ప్రయత్నాలు జయతి రాసిన మూడు పుస్తకాల్లోనూ, దేవనపల్లి వీణావాణి రాసిన ధరణీరుహ (2022) లోనూ, ఆదినారాయణ రాసిన పుస్తకాల్లోనూ మనకు కనిపిస్తాయి. ప్రయాణాలను దాటి వెళ్ళి తమలోకి తాము ప్రయాణించ గల అరుదైన వ్యక్తుల ఆత్మ ఘోషలు అవి.
కథ, కవిత, నవల, వ్యాసం లాంటి సాహితీప్రక్రియల అంశాలను ఇముడ్చుకో గల అవకాశం యాత్రారచనకు ఉంది. చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, మానవ మనస్త త్వాలను కల్పనా రహితంగా చిత్రించే శక్తి యాత్రారచనకు ఉంది. అలాగే మనుషులు తమంతట తామే సృష్టించుకొన్న భౌగోళిక రాజకీయ హద్దులను దాటుకుని వెళ్ళి ప్రపంచ మంతటినీ కౌగిలించుకొనేలా చేసే శక్తి యాత్రకూ, యాత్రారచనకూ ఉంది.
కులాన్ని దాటి, మతాన్ని దాటి, ఊరు దాటి, ప్రాంతం దాటి, జాతీ దేశాల పరిధులు దాటి, మనిషినీ సమాజాన్నీ ప్రపంచాన్నీ జీవితాన్ని ఆవిష్కరించ గల శక్తి యాత్రలకూ యాత్రారచనలకూ ఉంది.
ఆ దిశగా ఈనాటి తెలుగు యాత్రాసాహిత్యం తొలి అడుగులు వేస్తోంది.
తాజాకలం: ఇంతియానం అన్న పేరిట నలభైమంది తెలుగు మహిళల యాత్రానుభవాల సంకలనం జులై 2023లో విడుదల అయ్యింది.
దాసరి అమరేంద్రకు పుస్తకాలతో అరవైయేళ్ళ పరిచయం..యాత్రలతో ఏభైయేళ్ళు. ప్రయాణాలు సాహిత్యం జీవితం పరస్పర ఆధారితాలు అని గుర్తించిన మనిషి. 35యేళ్ళ నుంచీ రాస్తున్నారు. కథలు వ్యాసాలు యాత్రాకథనాలు అనువాదాలు – ఇలా విభిన్న ప్రకియల్లో 16 పుస్తకాలు ప్రచురించారు. అవి అభిరుచి ఉన్న పాఠకుల అభిమానం పొందాయి. వృత్తిరీత్యా ఇంజినీరు. నివాసం ఢిల్లీ.