శాఖాహారి సింహం

-కందేపి రాణి ప్రసాద్

          ఉదయాన సింహం నిద్రలేచింది. రోజూలాగా వళ్ళు విరుచుకుని బయటకు కదల బోయింది. ఏదో పొట్టలో కలుక్కుమన్నది. లేచింది లేచినట్లుగా కూలబడింది. మళ్ళీ పొట్టలో గడ బిడ మొదలయ్యింది. ‘ఏమైందబ్బా’ అని ఆలోచించేంతలో పొట్టలో పేగు లన్ని కదులుతున్నట్లనిపించింది. సింహం కడుపు పట్టుకుని కూలబడిపోయింది.
 
          కాసేపటికి అడవికి అంతా తెలిసిపోయింది. “మృగరాజు కడుపునొప్పితో బాధ పడుతోంది” అని అందరూ మాట్లాడుకోసాగారు. “ఏమైంది?ఏమైంది?” అని ఆదుర్దా పడేవాళ్ళు కొంతమంది. “ఆ! రాత్రి బాగా తిని ఉంటుంది. తిండి ఎక్కువై నొప్పి వచ్చుంటుంది’ అని వెక్కిరింపుగా అనేవాళ్ళు మరికొందరు. అసలేం జబ్బు వచ్చిందో? అని అనుమానపు చూపులు చూసేవాళ్ళు ఒక వైపు, ‘బాగా జరిగిందిలే’! అని ఏడుపు గొట్టు వాళ్ళు మరోవైపు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
 
          రాజా స్థానంలో ఉన్న మంత్రులు వెంటనే వైద్యుల్ని పిలిపించారు. ఏనుగు, ఎలుగుబంటి మృగరాజుకు వైద్యం చేయటానికి వచ్చారు. రాగానే గబ గబా పరీక్షలు చేయడం మొదలు పెట్టారు. కడుపును తాకగానే సింహం విలవిల్లాడింది.
 
          సింహం కడుపులో కుళ్ళిపోయిన ఆహారం ఉండటం వల్ల నొప్పి వచ్చిందని వైద్యులు భావించాయి. అందువలననే సింహానికి బాగా నొప్పి వస్తున్నది.
 
          “రాజా! రాత్రి తమరు ఏ ఆహారం తిన్నారు.
 
          దున్నను తిన్నాను వైద్యులు గారూ’ అన్నది సింహం నీరసంగా.
 
          మూడు రోజుల క్రితం ఆ గుట్ట కింద చంపినా దున్ననేనా రాజా అని ఏనుగు అడిగింది.
 
          “అవును అంటూ మూలుగుతూ సమాధానం చెప్పింది సింహం.
 
          “అయ్యో రాజా! మూడు రోజుల క్రిందటి ఆహారాన్ని తింటే కడుపు చెడిపోతుంది. ఆ మాంసం అంతా కుళ్ళిపోయి ఉంటుంది. అదే తిన్నట్లయితే మీ పొట్టలో ఇన్ఫెక్షన్ చేరుతుంది. మీ కడుపు నొప్పికి అదే కారణం అయి ఉంటుంది”. తేల్చి చెప్పేసింది ఏనుగు.
 
          “మరి ప్రతిసారి అలాగే తింటాం కదా! ఇప్పుడు కొత్తగా ఏం చేయలేదు” సింహం సందేహంగా చెప్పింది. “ఇప్పుడు కాలం మారింది మహారాజా! ఈ కాలంలో జబ్బులు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది” ఎలుగుబంటి పెద్ద ఉపన్యాసమే చెప్పింది.
 
          మరేం చేయమంటారు వైద్యులు గారూ! అడవే తరిగి పోతుంది. అడవిలో జంతువులే లేవు. ఎదో దొరికిన ఆహారాన్ని దాచుకుని దాచుకుని తింటున్నాను. ఇలా నొప్పి వస్తుందని తెలియదు. ఏం చేయాలో తెలియటం లేదు” నీరసమై గొంతులో అన్నది సింహం.
 
          ముందు నొప్పి తగ్గటానికి ఒక ఇంజక్షన్ ఇచ్చి సింహాన్ని పడుకోమన్నాయి. ఆ తర్వాత ఏనుగు ఎలుగుబంటి గుహ బయటికి వచ్చి మంత్రులతో మంతనాలు మొదలు పెట్టాయి. అడవిలో జంతువులు తగ్గిపోవటం వలన సరైన ఆహారం లభించటం లేదు. అదీ కూడా తాజా ఆహారం లభించక జంతువులు అనారోగ్యం పాలవుతున్నాయి. కానీ సింహానికి ఏమని సలహా ఇవ్వాలి. అది అర్థం కాక అందరూ తలలు బద్దలు కొట్టుకుంటు న్నారు.
 
          అప్పుడొక బుల్లి కుందేలు ముందుకొచ్చి నేనొక సలహా చెప్పనా’ అని అడిగింది. అందరూ ఏమిటో చెప్పమన్నట్లు దాని వంక చూశారు.
 
          అప్పుడు కుందేలు భయం భయంగా గొంతు సవరించుకొని ఇలా అన్నది.”కొన్ని రోజులు రాజు గారికి శాఖాహారం తినిపిద్దమా! నేను రకరకాలుగా వండి తెస్తాను. అడవిలో దుంపలు చాలా కాశాయి. ఈ సంవత్సరం విపరీతంగా చెట్లు పంటలు కూడా పండాయి. అప్పటికి రాజుగారి పొట్ట బాగుపడుతుందని కదా!”
 
          ఏనుగుకు ఈ ఉపాయం భలే నచ్చేసింది. అవును ఈసారి చెట్లు ఏపుగా పెరిగాయి. ఆకుల సలాడ్లు, పండ్లు, జామ్ లు, కూరగాయలతో పులుసులు వంటివి ఎంతో బాగుంటాయి. అసలు మానవులు కూడా ఈ మధ్య శాఖా హారమే తింటున్నారు. మాంసా హారాన్ని పూర్తిగా తగ్గించేశారు. మనం కూడా రాజు గారికి శాఖాహారాన్ని సూచిద్దామా’ ఏనుగు ఉత్సాహంగా అడిగింది.
 
          నువ్వంటే చెట్లు ఆకులు తినేదానివి కాబట్టి నీకూ బాగానే ఉంటుంది. మాంసాహారం తినే జంతువులకు ఆకులు అలములు ఎలా సహిస్తాయి అని నక్క ఎగతాళిగా అన్నది.
ఎలుగుబంటి ముందుకు వచ్చి “ప్రస్తుతం అడవి పరిస్థితి కూడా బాగా లేదు. జీవుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ఇది పూర్తిగా తగ్గిపోతే అడవి ప్రమాదంలో పడుతుంది. కొద్ది రోజులు ఆగితే కొంత ఉపయోగం జరగవచ్చు. ఎలాగోలా రాజు గారిని శాఖాహారానికి ఒప్పిద్దాం” అన్నది.
 
          మీరెన్ని చెప్పినా రాజుగారికి శాఖాహారం తినమని చెప్పడం చాలా కష్టం. ఏమ్మట్లా డితే ఏం సమస్య వస్తుందో తెలియదు. రాజుగారు ఎలా ఆలోచిస్తారో ఎలాంటి శిక్షలు విధిస్తారో కూడా తెలియదు. మీరేదో సరదాగా మాట్లాడినట్లుగా అనుకుంటున్నారు అంటూ తోడేలు బెదిరించింది.
 
          చిన్న జంతువులన్నీ భయపడ్డాయి. ఆలోచన బాగుందే కానీ ఆచరణ ఎలా అన్నదే సమస్య. అందరూ కలసి ఈ విషయాన్నీ ఏనుగు భుజాల మీదకు ఎక్కించాయి. ఏనుగు కూడా భయపడినప్పటికి ఆలోచించింది. మెల్లగా మనసులో ఆలోచించుకుని సింహం దగ్గరకు వెళ్ళింది.
 
          “రాజా! అని మెల్లగా పిలిచింది ఏనుగు.
 
          మెల్లగా కళ్ళెత్తి చూసింది సింహం. ఏమిటన్నట్లుగా చూసింది.
 
          ఇప్పుడెలా ఉంది మహారాజా! కొద్దిగా నేమ్మదించిందా ! ఇంకొద్దిసేపు విశ్రాంతి తిసుకుంటారా!
 
          సింహం మెల్లగా తలాడించింది. ఏనుగు మాట్లాడాలి అన్నట్లు చూసేసరికి‘ఏమిటని’ అడిగింది.
 
          ఏనుగు వివరంగా శాఖాహారం గురించి వివరించింది. “మీరు కష్టపాడాల్సింది ఏమీ లేదు. రోజూ కుందేలు చక్కగా వాళ్ళింట్లో వండుకుని తెస్తుంది. మీరు సమయానికి తిని విశ్రాంతి తీసుకుంటే చాలు. కొన్ని రోజులు మాత్రమే ఇలాంటి కష్టం మహారాజా. ఆ తర్వాత మీ మాంసాహారం మీరు తినవచ్చు”.
 
          సింహం ఆలోచించింది. ముందు నొప్పి తగ్గితే చాలు అనుకున్నది. కడుపులో ఉన్న నొప్పికి ఏ ఆహారమైతే ఏమీ అని ఆలోచించింది. సరేనని ఒప్పుకున్నది సింహం.
 
          కుందేలు రోజూ రకరకాల కూరలు వండుకుని సింహం కొరకు తెస్తున్నది. సింహం రోజు ఆ ఆహారాన్ని తింటూ ఆనందిస్తున్నది. ఆకుకూరలు ఇంత రుచిగా ఉంటాయా అని ఆశ్చర్య పోసాగింది. కొన్ని రోజులకు సింహం కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. సింహం శాఖాహారిగా మారిపోయింది. అడవిలో జంతువులు ఆనందంగా తిరగసాగాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.