ఇంటికి దూరంగా
-ఎం.అనాంబిక
రాత్రి మెల్లగా గడుస్తుంది
గిర్రున తిరిగే ఫ్యాన్ చప్పుడు
మాత్రమే నా చెవులలో
ప్రతిధ్వనిస్తుంది..
ఒక్కొక్కసారి మాత్రం కాలం
సీతాకోకచిలుకలా నా నుంచి
జారిపోతుంది
అంటుకున్న
రంగు మాత్రం పచ్చని ముద్రలా మిగిలిపోతుంది..
ఉబ్బిన కళ్ళలో కాంతి తగ్గిపోయి
నీరసించిన మొహంలో తెలియని తడి
అన్నిసార్లూ బాధని చెప్పుకోలేకపోవచ్చు
అసలు రాత్రున్నంత మనేది
పగలుండదేందుకో!
నిజానికి అప్పుడే ఎన్నో
ఆలోచనలు మనసు చుట్టూ
మెదడు చుట్టూ గుప్పుమంటాయి
ఆ ఆలోచనల్ని పూరించే
సమాధానాలు నాకు ఒక్కటీ
కనిపించవు.
*****