కొత్త అడుగులు – 46
శశికళ
– శిలాలోలిత
తన్నీరు (వాయుగండ్ల) శశికళ కొత్త కవయిత్రి . ఈమె నెల్లూరు జిల్లా నాయుడుపేట వాస్తవ్యురాలు. ‘సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల’ లో గణిత లెక్చెరర్ గా ప్రస్తుతం పనిచేస్తోంది. ఈమె కవితలు, కధలు, సాక్షి, నేటినిజం, సాహిత్యకిరణం, రమ్యభారతి, విశాలాక్షి వంటి పత్రికల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఫేస్ బుక్ లో, ఆమె వాల్ మీద చాలా కవితలొచ్చాయి. సమయం లేక పోవడం వల్ల తక్కువగా రాస్తోంది కానీ, లేకుంటే ఆమె రచనలు చాలా మంది చదవడానికి ఆస్కారముండేది.
తెలుగు ప్రతిలిపిలో బ్లాగర్ గా మొదట రెండు వందల మంది రచయిత్రులల్లో ఒకరు. నెల్లూరు రచయితల సంఘం సంయుక్త కార్యదర్శిగా పలు శతాధిక కవి సమ్మేళనాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని’, సావిత్రి బాయి ఫూలే’ పురస్కారాలు అందుకున్నది. రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది సన్మానం పొందింది.
ఇదీ క్లుప్తంగా శశికళ పరిచయం. తన తొలిపుస్తకంతో మంచి కవిత్వాన్ని ‘వెలుగు మొయిలు’ పేరుతో తీసుకొని వచ్చింది.
గణిత అధ్యాపకురాలి బాధ్యతల్లో నడుస్తూ ఉన్నప్పుడు చుట్టూ జరిగే విషయాలపై తాముగా వెలువడిన వెలుగు మబ్బులు ఈ కవితలు అంటుంది శశిశళ. ఈ సంవత్సరం వెలువడిన ఈ పుస్తకాన్ని గురించి శశికళ మాటల్లోనే చెప్పాలంటే…
కవిత, కవి, పాఠకుడు ఈ మూడింటి సమ్మేళనంతో అద్బుత కదలిక లోలోపల సాగుతుంది. ఒక వేదన, ఒక ఆలోచన కవితగా విప్పారి కవి నుండి పాఠకుడికి స్పందన కలిగిస్తుంది.
అజ్ఞానంతో తోటివారికే అన్యాయం చేస్తున్న మనవులకి లోలోపల వెలిగించి, ఆలోచన రగలించే ఒక వెలుగు మొదలు కావాలి. ఇప్పుడు కావాలి.
జన్మను ఇవ్వడమే కాకుండా, సాహిత్యాభిరుచి చిన్నతనం నుంచే కలిగించిన ఆమె తల్లి దండ్రులు వెంకటేశ్వర్లు శ్రేష్టి, నాగరత్తమ్మ గార్లు, అడుగులలో తానై నడిచే భర్త వాయుగండ్ల సురేష్ లను తలుచుకుంటుంది.
ఆమె శైలి ప్రవాహ శైలి. పాటలెంత స్పీడో, పనులెంత వేగమో, మానవత్వమెంత ఎక్కువో ఆమె కవితాక్షరాలే చెప్తున్నాయి. సమాజం పట్ల, ఇంకా మారని స్త్రీల స్థితి పట్ల కొన్ని చోట్ల ఆగ్రహాన్నీ, మరి కొన్నిచోట్ల ఆవేదనను బలంగా వ్యక్తీకరించింది.
ఈమె కవిత్వంలో ప్రత్యేకత ఏమిటంటే, విభిన్నత. విషయం పట్ల సమస్యల పట్ల, పూర్తి అవగాహన. వాటిని కవిత్వంగా మలిచే నైపుణ్యం, అలవోకగా కవితలల్లే నేర్పు కనిపిస్తాయి. సమాజంలో మార్పురావాలనీ, సామజిక బాధ్యతను రచయితలు నెరవేర్చాలనేది ఆమె నమ్మకం. తీసుకున్న వస్తువును చదివించే గుణంతో, ఆలోచించే హృదయంతో విప్పి చెప్పే ‘కళ’ శశికళకు తెలుసు.
ఇందులో ఏ ఒక్క కవితను వదిలిపెట్టినా, మరో పక్క కవితకు అన్యాయం చేసినట్లే అనిపించింది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె సమాజాన్ని చర్చకు పెట్టి నేరస్థులెవరు, వ్యక్తులా, వ్యవస్థా, అంటూ ప్రశ్నల్ని గుప్పించింది.
‘ ఇన్ బిల్ట్ ‘ – కవితలో
మేమంతే!
పాలచుక్కలు పోస్తూనే వుంటాము
అది మా ఆఖరి నెత్తుటి చుక్క అయినా కూడా
పల్లేరు ముళ్ళ క్రింద ముక్కలన్నీ తొక్కినా సరే,
నిలబడి నీడగా మారుతుంటాము
కడుపులో ఆకలి రాజేసి మీ అన్నం మెతుకులుగా మారి
మేము అమృతంతో ఆకలిని జో కొట్టుకుంటాము
రెక్కలు చిదిమేసి రోడ్డు మీద పడేసినా
కాలిగోరంత ప్రేమ దొరికితే పది అడుగుల తాటి చెట్టు అయిపోతాం
మీ సరిహద్దుల చదరంగాల్లో
బాంబుల మోతల మధ్య అటున్నా ఇటున్నా
ఇంటికి భయాన్ని కప్పి పిల్లల్ని కడుపులో పెట్టుకుంటారు
సందెలు తన్ని వెళ్ళిన అడుగులు
ఆకలిని మిగిల్చిన చీదరింపులు
ఇన్నింటి మధ్య పాదులు చేస్తూనే ఉంటాము ప్రేమ మొక్కకి!
ఖండాలు మారినా, ఎన్ని ముక్కలు చేసి చూసినా అవే లక్షణాలు
ఇన్ బిల్ట్ ఇన్ ప్రోగ్రామింగ్ చేసినట్టున్నాడు. స్పష్టికర్త’ – అనేస్తుంది.
‘హద్దు, చెదిరిన గూడు, మనిషికి ప్రశ్న? పసుపు చినుకు ? ఆమె ఎక్కడ? వంటి మంచి కవితలున్నాయి.
నోట్ల రద్దు అప్పుడు జరిగిన పొదుపు విప్లవాల గురించి ‘ఇది చాలు’ కవిత రాసింది.
ఒక స్త్రీ ఇంకో స్త్రీ కోసం రాసింది – ఆంగ్లం నుండి అనువాదం ‘ఆమెకోసం’ కవిత అద్భుతమైంది.
***
తాను మన కోసం జీవితంలో పరుగులు పెడ్తూ వుంది.
తన పై తాను ఉంచుకునే ఒత్తిడికన్నా ఇంకా ఒత్తిడి మీరు పెట్ట వద్దు
తన జీవిత క్షణాలను తన కోసం కొన్ని అయినా ఆస్వాదించనివ్వండి
పర్లేదు తనకోసం ఎదురు చూడండి.
నువ్వెటూ నువ్వు కాదు; ఒక మార్కు అయినా… నాన్న తనం
కొత్త దేహలను ఇచ్చే అక్షరాలు – వంటి వెన్నో ఈ వెలుగు మొయిలు కవిత్వంలో శశికళ అక్షరాలు సజీవంగా మన ముందున్నాయి.
*****
చక్కటి సమీక్ష మేడం.💐💐💐