జీవితం అంచున -10 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          ఉరకలేసే ఉత్సాహంతో రెండో వారం కాలేజీకి తయారయ్యాను. నేను బయిల్దేరే సమయానికి అప్పుడే రాత్రి షిఫ్ట్ ముగించుకుని వచ్చిన అల్లుడు కారు బయటకు తీసాడు.

          “పోయిన వారం అమ్మాయి దింపినప్పుడు నేను దారి జాగ్రత్తగా గమనించాను. గూగుల్ మ్యాప్ సాయంతో నేను వెళ్ళగలను..” అన్నాను అల్లుడితో లోలోపల ఒంటరిగా వెళ్ళటానికి కొంత భయంగా వున్నప్పటికీ.

          “లేదు మమ్మీజీ.. యూనివర్సిటీ రోడ్డు చాలా ప్రమాదకరమైన దారి. ఎక్కువ రద్దీగా వుంటుంది. పైగా విద్యార్థులకు ఫ్రీ పార్కింగ్ లేదు అక్కడ. పేయిడ్ పార్కింగ్…అదీ, టెర్రేస్ పైన. రేటు కూడా చాలా ఎక్కువ.. పార్క్ చేయటం కష్టం కూడా..”

          “అలాగని సంవత్సరమంతా మీరే డ్రాప్ చేస్తారా… నాకు అలా ఇష్టం లేదు. అదే అలవాటు అవుతుంది నెమ్మదిగా… అయినా పిల్లల స్కూలుకి, ట్యూషనుకి, పియానో, టెన్నీసు, స్విమ్మింగ్, బ్యాలే క్లాసులకి నేను తీసుకు వెళ్ళగా లేనిది నేను నా కాలేజికి వెళ్ళలేనా…” ఉక్రోషంగా అన్నాను.

          “మమ్మీజీ, అవేవీ హై వేలు కావు.. అయినా రిస్క్ తీసుకోవటం, పైగా పార్కింగ్ కి బోలెడు ఖర్చు చేయటం అవసరమా…” అతనికి చికాకుగా వున్నా ప్రశాంతంగానే చెప్పాడు.

          అయిష్టంగా వెళ్ళి కారులో కూర్చున్నాను. వచ్చే వారం అల్లుడు ఉదయం షిఫ్టులో ఉంటాడు. అప్పుడిక నాకు నేనుగా వెళ్ళటం తప్ప వేరే దారి వుండదులే అనుకుని సరిపెట్టుకున్నాను.

          ప్రతి బుధవారం నా క్లాసు రోజున పాపను చూసుకోవటానికి మా అమ్మాయి ఒక పంజాబి ఆంటీని కుదుర్చుకుంది.

          నా క్లాసు తొమ్మిది నుండి నాలుగు వరకు మధ్యన రెండు విరామాలతో. ఆవిడ ఎనిమిదింటికి వచ్చి నాలుగు వరకు వుంటుంది. ఎనిమిది గంటలకు రెండు వందల డాలర్లు తీసుకుంటుంది. గంటకు పాతిక డాలర్లు. ప్రొఫెషనల్ బేబీ కేర్ టేకర్ కూడా కాదు. పంజాబు నుండి తన కొడుకు ఇంటికి విజిటింగ్ వీసా మీద వచ్చిందట. ఒక సంవత్సర కాలం వుంటుంది. ఇలా వంటలు చేసి, పిల్లల సంరక్షణ చేసి వీలయినంత సంపాదించుకుంటుంది. ఇల్లీగల్ సంపాదన. అంతా క్యాష్ పేమెంట్. పాపను చూసు కోవటంతో పాటు వంట కూడా చేస్తుంది.

          ఆవిడకు ఇచ్చే డబ్బుని రూపాయిల్లోకి తర్జుమా చేసుకుని ఒక్క రోజుకి దాదాపు పన్నెండు వేల రూపాయిలు తీసుకుంటోందని నేను బాధపడ్డానే కాని చాలా చవకగా, అనుకూలంగా అవసరానికి దొరికిందని అమ్మాయి చాలా సంతోషించింది.

          ప్రతీ బుధవారం నేను వంటగదిలోకి వెళ్ళకుండా వేడిగా నాకు బ్రేక్ఫాస్ట్ చేతికి అందించి, లంచ్ ప్యాక్ చేసి ఇచ్చే ఏర్పాటు జరిగిపోయింది.

          మూడో బుధవారం వచ్చేసరికల్లా అల్లుడు ఊబర్, 13క్యాబ్స్ నా మొబైల్లోకి  డౌన్లోడ్ చేసి నా బ్యాంకు అకౌంటుతో లింక్ చేసాడు.

          నాకెందుకో నా స్వేచ్ఛారెక్కలను కత్తిరించేసినట్టు అనిపించింది. ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో నేను పొందిన కారు డ్రైవింగ్ తర్ఫీదు, డ్రైవింగ్ పరీక్షలు, లైసెన్స్ కోసం పడ్డ అగచాట్లు అన్నీ వృధా అయినట్లు అనిపించింది.

          అరికట్టేయబడిన రవాణా స్వేచ్ఛ నాకున్న కాన్ఫిడెన్సుని నరికేస్తున్నట్టనిపిం చింది.

          ఇక్కడ అమ్మాయి నాకు కొనిచ్చిన హై ఎండ్ ఆడి కారు గురించి చెప్పాల్సిందే.

          నల్లగా నిగనిగలాడే నా కారు రూఫ్ కావాలంటే స్లయిడ్ చేసేసి టాప్లెస్ గా చేయవచ్చు. ఫ్రంట్ మిర్రర్ లో నూట ఎనభై డిగ్రీలలో ఎడమ, కుడి, వెనుక ట్రాఫిక్కు చూపిస్తుంది. మొదట్లో అర్ధం కాక కుడి, ఎడమ ప్రక్క కార్లు నా పైకి వచ్చేస్తున్నట్టు భయపడ్డాను. తరువాత క్రమంగా అలవాటు పడ్డాను. కారుకి అడుగు దూరంలో ఏదయినా మెదిలినా అలర్ట్ సైరను వినిపిస్తుంది.

          ఓ సారి నేను పిల్లలను స్కూలు నుండి తెస్తుంటే కారు ఒకటే కుయ్ కుయ్ అంటూ గోల చేయటం మొదలెట్టింది. అన్ని డోర్స్ లాక్ చెక్ చేసాను. బూట్ మూసే వుందని ఖరారు చేసుకున్నాను. నా సీట్ బెల్ట్, పిల్లల సీట్ బెల్ట్స్ సరిగ్గానే వున్నాయి. కొంత సేపటికి మా సందులోకి వచ్చాక మోత ఆగింది. కంగారుపడి అల్లుడికి చెబితే, టైర్స్ లేన్ కీ లేన్ కీ మధ్యనున్న తెల్ల పెయింట్ గీత పైకి ఎక్కితే, లేన్ తప్పుతున్నట్టుగా కారు టైర్స్ ఇచ్చే సిగ్నల్స్ అవి అని చెప్పాడు. ఆశ్చర్యమేసింది. అందుకేనేమో ఇక్కడ రోడ్డు మీద కారులన్నీ క్రమశిక్షణతో వాటి వాటి లేన్స్ లో వుంటాయి.

          కారులో స్టీరింగ్ పక్కన పెద్ద స్క్రీన్ పైన రూట్ మ్యాప్స్ వీడియో ఆడిబల్ గా వుంటుంది. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్స్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, ఒకే కారులో వేరు వేరు సీట్లకు వేర్వేరుగా టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్ భలేగా వుంటాయి.

          కారు సీట్ల కింద, వెనుక ఎండాకాలం మరియు చలికాలంలో వాడుకోవటానికి హీటింగ్ మరియు కూలింగ్ సిస్టమ్స్ వుంటాయి. చలి కాచుకోవటానికే కాకుండా ఒక్కోసారి నడుము నొప్పిగా వున్నప్పుడు సీట్ హీటింగ్ సిస్టం ఆన్ చేస్తే వీపుకి హీటింగ్ ప్యాడ్స్ తో మసాజ్ చేసినంత రిలీఫ్ గా వుంటుంది.

          ముందున్న రెండు సీట్ల వెనుక వీపు భాగంలో వెనుక కూర్చొన్న వారు చూసే వీలుగా ఫ్లైట్ లో వుండేట్టుగా రెండు ఇంటర్నెట్ కనెక్టెడ్ ఫ్లాట్ టీవీ మోనిటర్లలో ఎప్పుడూ పిల్లలు వాళ్ళ అభిరుచులకు తగిన సినిమాలు చూస్తుంటారు. 

          వాన చినుకు పడగానే ఆటోమేటిక్ గా తదనుగుణ స్పీడులో ఆన్ అయ్యే వైపర్లు. వెళ్ళబోయే మార్గంలో ఏదయినా ఆక్సిడెంట్ జరిగి వుంటే కారులో గూగుల్ మ్యాప్లో జరిగిన ఆక్సిడెంట్ స్పాట్ వివరాలు, దాని వలన జరిగే ఆలస్యం, నివారణకు వేరే అనుకూల మార్గపు సూచనలు చెబుతుంది. అద్భుతమైన టెక్నాలజీ గల నా కారంటే నా కెంతో ఇష్టం. 

          కొత్తలో కారుని చూసి అబ్బురంతో తబ్బిబ్బయితే అమ్మాయి “అమ్మా, ఇప్పుడు డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేని డ్రైవర్ లెస్ కార్లు కూడా వచ్చేసాయమ్మా” అంటూ నవ్వింది.

          ఈ భూలోక స్వర్గ సుఖాల వాహన సారధ్యం వహించటానికి అర్హత పొందటం ఎంతో కష్టమయ్యింది. ఇండియాలో సందుల్లో గొందుల్లో ఎడా పెడా కారు నడిపేసే నా చాకచక్యం ఇక్కడి డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష ఉత్తీర్ణతకు పనికి రాలేదు. ఇండియాలో కనీవినీ ఎరుగని ట్రాఫిక్ రూల్స్ ఇక్కడ.

          డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకి సంబంధించిన గత పరీక్షా పత్రాలు తిరగేసి, నమూనా పత్రాలు అధ్యయనం చేసి కంప్యూటరైజ్డ్ వ్రాత పరీక్ష ఒకే దఫాలో పాస్ అయ్యాను కాని ప్రాక్టికల్ డ్రైవింగ్ పరీక్ష మొదటిసారి తప్పాను. జీవితంలో అప్పటి వరకూ ఏ పరీక్షలోనూ ఫెయిల్యూర్ ఎరుగని నాకు అది మొదటి అపజయం. అమ్మాయి క్విక్ డ్రైవింగ్ క్లాసెస్ లో చేర్పించి మొత్తానికి గట్టెక్కించి లైసెన్స్ ఇప్పించింది.

          నా అహాన్ని తృప్తి పరిచే, నా పై నా నమ్మకాన్ని బలపరిచే నా కారులో కాకుండా క్యాబ్స్ లో వెళ్ళేట్టయితే నాకు అసలు నర్సింగ్ కోర్సు వద్దని, ఇంక క్లాసులకి వెళ్ళనని మంకుపట్టు పట్టాను. ఇప్పుడు ఆలోచిస్తే అసలు చిన్నపిల్లలా ఆ పెంకితనం ఏమిటో నాకే అర్ధం కాదు. అలాంటప్పుడే మా అమ్మాయి నాకు అమ్మ అవుతుంటుoది. చాలా ఓపికగా కష్టనష్టాలు విడమర్చి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అక్కడికీ బిగించుకు కూర్చున్న నన్ను సముదాయించటానికి తన చెల్లెలికి, అంటే అమెరికాలో వున్న మా చిన్నమ్మాయికి ఫోను చేసి చెప్పించింది.

          చిన్నమ్మాయి అమెరికా నుండి ఫోను చేసి “అమ్మా, క్యాబులో కాలేజీకి వెళ్లనంటు న్నావట. హాయిగా గుమ్మం ముందు కారెక్కి ఎటు వంటి స్ట్రెస్ లేకుండా వెళ్ళటానికి బాధ ఏమిటి ? అమెరికాలో నాలుగేసి కారులున్న మహామహులు కూడా ట్రాఫిక్కు బెడద నుండి, డ్రైవింగ్ స్ట్రెస్ నుండి తప్పించుకోవటానికి క్యాబ్స్ లో వెళతారు లేదా ట్రైన్ లో వెళతారు, వీలయితే కార్ పూలింగ్ చేస్తారు తెలుసా… అందులో చిన్నబుచ్చుకోవటానికి ఏమీ లేదు. అక్క నీ శ్రేయస్సు కోరే చెబుతోంది” అంటూ నన్ను ఊరడించింది.

          అయినా మొండిగా ఆ వారం క్లాసు మానేసాను.

          మళ్ళీ బుధవారం సరికి మనసు కొంత స్థిమితపడి కుదుటపడ్డాను.

          నిజానికి కోప తాపాలు నా తత్వమే కాదు. సర్దుకు పోయేతనం నా నైజం. మరి ఆ చిత్రమైన ప్రవర్తన ఏమిటో. క్లాసుకి క్యాబులో వెళ్ళే విషయంలో విడ్డూరంగా పిల్లలు, అల్లుడితో బ్రతిమాలించుకోవటం ఏమిటో ఇప్పుడు తలుచుకుంటే నా వైఖరి నాకే విచిత్రమనిపిస్తుంది. బహూశా హార్మోనల్ చేంజ్ వలన కలిగే మూడ్ స్వింగ్స్  అనుకుంటా ..

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.