ది లెగసీ (కథ)
-బి.భవాని కుమారి
“వర్ధని ఆ౦టీ రమ్మన్నది, నువ్వు కూడా రారాదు” అన్నపూర్ణ కూతురుతో అన్నది.
“దేనికి? లలిత ప్రశ్నించింది తల్లిని.
వాళ్ళ అబ్బాయి, అమ్మాయి అమెరికా నుంచి వచ్చారట “
“వస్తే, మన౦ దేనికి?”
“నిన్ను చూసి చాలా రోజులైందంటా, వాళ్ళ శ్రీజ రమ్మన్నదని చెప్పింది. “
తల్లికేసి జాలిగా చూసింది లలిత. తల్లి దేనికోసం ఆశ పడుతుందో ఆమెకి తెలుసు. ఆమెకి వర్ధనమ్మ సంగతి బాగా తెలుసు. ఇలా పిండివంటలు తల్లి చేత చేయించి బాగానే ముట్ట చెబుతుంది. తండ్రి వ్యాపారం ఎన్నేళ్ళైనా లాభసాటిగా నడవక పోయేసరికి , ఆమె ప్రతి చిన్నపని ఒప్పుకుంటోంది. తన పెళ్ళి గురించి తల్లికెంత దిగులో ఆమెకి తెలుసు. అందుకే తల్లి మాట తీసివేయలేక ఆమె వెంట వెళ్ళింది.
వర్ధనమ్మ నవ్వుతూ ఎదురొచ్చింది. శ్రీజ లలితని చూసి ,
‘ ఎంత అందంగా వుంది అత్తా, నీ కూతురు” తర్వాత అజయ్ వచ్చి బావున్నావా అత్తా అని పలకరించి లోపలికి వెళ్ళిపోయాడు. సాయంత్ర౦ దాకా తల్లికి పిండి వంటలు చేస్తుంటే సాయం చేసింది లలిత.
కొన్ని పిండివంటలు, అయిదువందల ఆమె చేతిలో పెట్టి ,” అజయ్ కి మంచి మ్యాచ్ కుదిరింది. అమ్మాయి డాక్టర్. బాగా వున్నవాళ్ళు.” అన్నది వర్ధని.
ఇంటికి వెళుతున్నప్పుడు మాటి, మాటికీ తల్లి కళ్ళు తుడుచుకోవటం గమని౦చి, ఇంటికొచ్చాక తల్లిని ఓదార్చింది. ” అసలంత ఆశ ఎలాపెట్టుకోన్నావమ్మా, వాళ్ళకు డబ్బు, హోదా వుంది, దానికి తగ్గ మ్యాచ్ చూసుకొంటారే తప్ప, నన్ను చేసుకొంటారా చెప్పు, అది అత్యాశ కాదా? అట్లా కధల్లో, సినిమాలలో జరుగుతాయి, నిజ జీవితంలో కాదు.” ఓదార్చింది లలిత.
***
లలిత తన జాబ్ కి వెళ్ళివస్తోంది. ఆ రోజు తల్లి కూతురు మార్కెట్ కెళ్ళి వస్తున్నారు. “పూర్ణా,పూర్ణా” అంటూ వెనక నుండి ఎవరో పిలుస్తుంటే , ఆగి వెనక్కి చూసారిద్దరు. కారు దిగి వస్తోంది ఒకావిడ. దగ్గరికి వచ్చాక గుర్తుపట్టింది పూర్ణ వేదవతిని. “వేదా” సంతోషంగా పిలిచింది. వేదవతి ఆమెని గట్టిగా కౌగలించుకొన్నది. వేదవతి పచ్చని పసిమి ఛాయ, కొద్దిగా లావుగా వున్నది.
“ఎన్నాళ్ళకి కనపడ్డావ్ పూర్ణా, పద మీ ఇంటి కెళదాం ” అంటూ కారెక్కించింది. ఇద్దరూ కబుర్లే, కబుర్లు. ఎప్పుడో టెన్త్ చదివాక విడిపోయారిద్దరు. వేదవతి ముందు నుండే వున్నవాళ్ళు. ఏరి కోరి జగదీశ్వరరావుని వరించింది. అతన్ని చేసుకున్నందుకు ఏమి రిగ్రెట్స్ లేవనీ, చిన్న వూరైనా , ప్రశాంత జీవనమని చెప్పింది.
పూర్ణని పెద్దగా వివరాలు నొప్పించేలా అడగ లేదు. లలితని దగ్గరికి తీసుకొని, “మా చంద్రిక నీకు మంచి కంపెనీ, నేను కారు పంపుతాను. అన్నయ్యతో కలిసి తప్పకుండా రావాలి” అంటూ సెలవు తీసుకొంది.
ఆమె వెళ్ళాక పూర్ణ కూతురితో చెప్పింది, ” చాలా మంచింది. ఎంతైనా చిన్నప్పటి ఫ్రెండ్ కదా” ఆ రోజు తల్లి ఎప్పుడూ లేనంత సంతోషంగా వున్నది.
మళ్ళీ రమ్మని వేదవతి దగ్గర్నుండి పిలుపు. ఈసారి తండ్రి ఇద్దర్నీ వెళ్ళమన్నాడు. బస్సులో వెళ్లారు. కారు పంపించింది వేదవతి, లలిత మనసులో నవ్వుకొంది, అమ్మకి తెలియటం లేదు, వున్నవాళ్ళు ఒక్కక్కళ్ళు ఒక్కో రకంగా వాళ్ళ స్థాయిని చూపిస్తారని.
వేదవతి, కూతురు చంద్రిక ఎదురొచ్చి స్వాగతం పలికారు. అంత పెద్ద ఇంటిని లలిత ఎప్పుడూ చూసివుండలేదు. క్రిందనే నాలుగు బెడ్ రూమ్స్ , పెద్ద హాల్, డైనింగ్ హాల్, కిచెన్ విశాలంగా వుంది. మోడరన్ ఇల్లు కాదు కానీ చాలా బాగా మెయిన్ టయిన్ చేస్తున్నారని పించింది.
చంద్రిక వాళ్ళకి గెస్ట్ రూమ్ చూపించింది. ,” బెడ్ షీట్స్ ఉదయమే మార్చాను ‘అన్నది నవ్వుతూ.
స్నానాలు చేసి రెడీ అయ్యారు. వేదవతి వచ్చింది, “పూర్ణా, పదండి టిఫిన్ చేద్దురు కానీ” అంటూ వెంట తీసుకెళ్ళింది. వేదవతి అత్తగారు, మామగారు, చంద్రిక లలిత, అన్నపూర్ణలకు ఇడ్లీ, వడ సర్వ్ చేసింది. తాను కూడా వాళ్ళతో టిఫిన్ చేసింది. వంటమ్మాయి పళ్ళ ముక్కలున్న బౌల్స్ సర్వ్ చేసింది. టీ తాగాక చెప్పింది,” ఈయనకు, మా అబ్బాయికి ఎవరు చేసినా ఇష్టం ఉండదు, నేనే చెయ్యాలి, పద్మ నాకు సాయం చేస్తుంది’ ఆ యింట్లో తను లేనిదే గడవదని చెప్తోంది” అనుకొంది లలిత.
తర్వాత పెద్ద కుండలో, తాడు కట్టిన పెద్ద కవ్వంతో వెన్న చిలక సాగింది. ప్రక్కనే రెండుస్తూల్స్ మీద తల్లీ కూతుళ్ళు కూర్చున్నారు. కొంచం సేపు ఆవిడ ఎలా చేస్తుందో గమనించి , ” నేను ట్రై చెయ్యనా ఆంటీ ” రెండు నిమిషాలలో పట్టు సాధించిన లలితని మెచ్చుకోలుగా చూసింది వేదవతి
చంద్రిక ” నీకు ఇల్లు చూపిస్తాను రా ” అంటూ లలితని లాక్కు పోయింది.
“ఏం చదువుకున్నారు” లలిత అడిగింది.
“మీరు అంటూ ఈ మర్యాదలేమిటి? చక్కగా నువ్వు అని పిలువు.” డిమాండింగ్ గా అన్నది చంద్రిక.
పైకి వెళదాం,. పైన ఒక వరండా , రెండు పెద్ద గదులున్నాయి. ఒకటి చూపిస్తూ ఇది అన్నయ్య గది, ఇది నాది, ప్రస్తుతం నేను వాడటం లేదనుకో, పెళ్ళి అయ్యాక నందు, కోసం. ” ఆ మాట చెబుతున్నప్పుడు ఆమె ఏ మాత్ర౦ సిగ్గు పడలేదు. లలిత అడిగింది,” ఎలా పరిచయం?”
ప్రతాప్ గది చాలా విశాలంగా వుంది. రాక్స్ లో చాలా పుస్తకాలు వున్నాయి. పెద్ద టీవీ, ఒక సోఫా సెట్ చాలా నీటుగా వుంది.
ఫ్యామిలీ ఫ్రెండ్స్, అన్నయ్య తను జిగ్రీ దోస్తులు, ఇంటికొచ్చేవాడు, కొత్తలో నాతో మాట్లాడాలంటే చాలా భయపడేవాడు, డాక్టర్ అయ్యాక మానేశాడుకానీ చాలా నెమ్మది” అల్లరిగా నవ్వుతూ అన్నది..
నువ్వు మెడిసిన్ చేయలేదేం?
“తను ఆర్థో లో MS చేస్తున్నాడు, వాళ్ళ నాన్నగారు MD, roaring ప్రాక్టీస్, నాకు చదువుకు పడదు, నందుని, ఇంటినీ చూసుకుంటే చాలు అనుకొన్నా. ఇలాటి మాటలు చెబితే నందూ నవ్వుతాడు, అది చెయ్యి, ఇది చేయి అని బలవంతం చేయడు” చిలిపిగా నవ్వుతూ అన్నది. లలితకి అతని ఫోటో చూపించింది, చంద్రికతో పోలిస్తే రంగు చాలా తక్కువ కానీ బావున్నాడు, ముఖ్య౦గా అతని నవ్వు..
అతని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళలోని మెరుపు చూసి అనుకొంది లలిత, అన్నివిధాలా అదృష్టువంతురాలు ఈ అమ్మాయి అని.
***
తొమ్మిదింటికి వాకిట్లో బైక్ ఆగిన చప్పుడు అయ్యింది.
చంద్రిక, ” అమ్మా, నీ కన్నయ్య, చిన్నూ, మహారాణా ప్రతాపుడు వచ్చాడు,
చేయి, చేయి వేడిగా టిఫిన్ రెడీ చేయి”.
వేదవతి కొడుక్కి ఎదురెళ్ళి, ” చూసావురా దీని అల్లరి, ఇంట్లో గెస్ట్స్ వున్నారని కూడా లేదు” అంది కంప్లైంట్ చేస్తున్నట్టుగా.
ప్రతాప్ నవ్వి , “ఓహో, ఇవ్వాళ ఇలా బిజీగా ఉందా, అందుకేనా నందు మీ చెల్లి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు అని మెసేజ్ పెట్టాడు” అన్నాడు.
చంద్రిక ఆత్రంగా అన్న దగ్గరికి వచ్చి ” నా సెల్ లో రింగ్ రాలేదు, నిన్న సాయంత్ర౦ కూడా చేయలేదు, ఏది ఇలా ఇవ్వు, నే చూస్తాను ” అంటూ అన్న చేతిలో ఫోన్ లాక్కుని చూసింది. అందులో ఏ మెసేజ్ లేదు, కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి చంద్రికకి.
నీకు ఫోన్లు చేయటమేనా వాడి పని, బుద్దూ, ఇవ్వాళ నైట్ డ్యూటీ అయివుంటుంది, చేస్తాడులే” అన్నాడు నవ్వుతూ.
కూతురి కన్నీళ్ళు చూసి వేదవతి కూడా నవ్వేసింది, ” ఇంకెంతలే తల్లి , ఆర్నెల్లు, వెళ్లిపోదువుగానిలే మీ నందు ఇంటికి”.
“నాన్న రానీ చెబుతాను, మీరిద్దరూ కలిసి నన్ను ఎడిపిస్తున్నారని ” అంటూ విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది.
నవ్వుతూ తలెత్తిన ప్రతాప్ అక్కడ కొత్తవాళ్ళని చూసి చిరునవ్వు నవ్వాడు. ఆరడుగుల పైనే ఉన్నాడతను. దృఢంగా, ఆరోగ్యాంగా వున్నాడు. అతను ఒక్క క్షణ౦ లలితకేసి చూసి,చూపుతిప్పుకొని లోపలికి వెళుత “అమ్మా, ఆకలేస్తుంది, ఫ్రెష్ అయి వస్తాను” అంటూ పైకివెళ్ళాడు.
***
పూర్ణా , ఫామ్ కెళదాం ” పూర్ణ తలూపింది.
“అక్కడ చిన్న ఇల్లు వుంది, అన్ని వసతులతో. మావారు అక్కడే వండించుకొని తింటారు, అందుకే ఉదయమే వెళ్ళిపోతారు, బాబు నా కోసం ఇంటికి వస్తాడు” కొంచం గర్వం ఆమె గొంతులో”.
వేదవతి, పూర్ణ వంట పనిలో పడ్డారు. జగదీశ్ కూతురితో అన్నారు, ” ఆ అమ్మాయికి మన ఫామ్ చూపించు” అని.
“అబ్బా, నాన్నా, ఈ ఫామ్ అంతా నేను తిరగలేను, అన్నయ్యకి అప్పగిస్తాను, ఆయన వివరంగా చెబుతాడులే “అంది తండ్రి దగ్గిర గారాలు పోతూ.
జగదీశ్వర రావు నవ్వి, “ నీకు వీలున్నట్టు చేయి. ఆమె మన గెస్ట్ అని మర్చిపోకు.”
అబ్బా, ఎంత బావుంది ఈ ఫామ్” పరవశంగా అన్నది లలిత.
“అంత బావుందా, అయితే ఆ “ఫిష్ ఫామ్, కోళ్ళు, బాతుల ఫామ్స్ వున్నాయి, అక్కడ వాసన ఇంకా బావుంటుంది, పద, పద “అంటూ లాక్కు పోయింది చంద్రిక.
ఫిష్ ఫామ్ దగ్గిర వున్నాడు ప్రతాప్. అమ్మాయిలిద్దరినీ చూసి “వెల్కమ్” అన్నాడు చిరునవ్వుతో.
“నీ ఫామ్ చూసి లలిత పరవశించి పోతోందిరా అన్నయ్యా, ఈ ఫామ్స్ చూపిస్తే, పరవశం తగ్గుతుందని తీసుకొచ్చా” అంటూ ప్రతాప్ ఏదో అనేలోపే అక్కడ నుండి పారిపోయింది.
ఇద్దరూ వేప చెట్టు నీడలో గుండ్రంగా ఉన్న చప్టా పై కూర్చున్నారు.
“MS అయ్యాక, మీరు హైదరాబాద్ ISB లో చేశారట కదా, మరెందుకు అగ్రికల్చర్ వైపు వచ్చారు?” కుతూహలంగా అడిగింది లలిత.
నేను ఈ పచ్చని మొక్కల మధ్యనే పెరిగాను. తరువాత ఐఐఎం లో ఇంజనీరింగ్ చేసి US వెళ్ళాను, మొదట నుండీ చదువులో topper ని . హైదేరాబద్ వచ్చాను, ISB లో MBA చేశా, నాకెందుకో ఏదో ఒక కంపెనీలో పనిచేయటం , లైఫ్ అంతా పరమ బోర్ గా అనిపించింది. వెనక్కి వచ్చేసాను, చాలా ఖర్చు అయినా నేను వ్యవసాయం చేస్తానంటే అమ్మా, నాన్న ఎంత సంతోషించారంటే, వాళ్ళని చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఏదో అయింది లేకపోతే అంత చదువు చదివి వెనక్కి ఎందుకు వస్తాడని అందరూ అనుమానా లు వ్యక్తం చేస్తే అమ్మ బాధ పడింది కానీ పైకి తేలింది కాదు. నాన్నకి నేనంటే ఎంత ప్రేమ అంటే , నేను చేసే ప్రకృతి వ్యవసాయానికి , ఈ ఫిష్ ఫామ్ కి అన్నిటికి ఎంత ఖర్చు అయినా వెనక్కి తీయలేదు.
“అమేజింగ్ ” అప్రయత్నగా అన్నది లలిత.
లోపలికి వెళదాం రండి” లోపలి infrastructure చూసి , అప్రతిభురాలైంది లలిత. అతను చెప్పనారంభించాడు ” అక్కడ దాదాపు circular సిస్టం లో నిర్మించబడిన tanks వున్నాయ్. కొన్ని స్టీల్ వి కూడా వున్నాయి. దీన్ని RAS సిస్టం అంటారు.”
“అంటే ?” ప్రశ్నించింది లలిత.
Recirculating aqua culture సిస్టం. రకరకాలుగా పొల్యూట్ అయిన నీరు బయటికి వెళ్లి , ఫ్రెష్ అయి మళ్ళీ ఫిష్ పాండ్స్ లోకి చేరుతుంది. ఫిష్ excreta, ఇతర మలినాలు బయటికి పోతాయి. అవి మళ్ళీ మొక్కలకు వాడతాం.” ఎంతో ఉత్సాహంగా వివరించి చెప్పాడతను. .
“పవర్ బిల్ కొంత సోలార్ ఎనర్జీ, మిగతాది పవర్ యూస్ చేస్తాము. రోజుకి 200 కిలోల వరకు సేల్ చేస్తా౦ “
“మార్కెటింగ్ ఎలా చేస్తారు?” అడిగింది లలిత,
ప్రతాప్ నవ్వి, “నాలుగు స్టార్ హోటల్స్ తో టై అప్ వుంది. ఉదయమే ఎనిమిది లోపలే వస్తారు. ఆదివారం చాలా బిజినెస్ అవుతుంది, ఈ బిజినెస్ కోసం నేను చాలా కంట్రీస్ తిరిగాను, చాలా హోమ్ వర్క్ చేశాకే మొదలు పెట్టాను, నాన్న ఫుల్ సపోర్ట్, సేల్ చేయడమంతా నాన్నే చూసుకొంటారు”
తరవాత కోళ్ళఫామ్ కి తీసుకెళ్ళాడు. అన్నీ నాటు కోళ్ళు, 500 కోళ్ళు వున్నాయి. దీనికి మాత్రం మా తాతయ్య హోల్ అండ్ సోల్. అంత పెద్ద వయసులో కూడా ఆయనే మొత్తం చూసుకొంటారు. వీటిలో “లేయెర్స్” అని ఉంటాయి, అవి ఎక్కువశాతం గుడ్లు పెట్టె కోళ్ళు. ఒక సైజు వచ్చాక అమ్మేస్తాం. పిల్లల్ని కూడా.” వాటికి అవసరమైన దాణా మిల్స్ నుండి తెప్పిస్తాం. బరువు పెరగటం కోసం ఏ రకమైన అసహజ పద్ధతులు పాటించం, అందుకే చికెన్ షాప్ వాళ్ళు, లోకల్స్ హోటల్స్ వాళ్ళు నాటు చికెన్ కోసం, ఎగ్స్ కోసం వస్తారు. ఆ జాతర చూడాలంటే ఉదయం రావాల్సిందే” నవ్వుతూ చెప్పాడు.
లలితకి డక్ ఫామ్ చూసి చాలా ఆశర్య పోయింది. పెద్దగా తెల్లగా వున్న వాటిని చూసి ” అవి హంసలు కదా” అన్నది.
ప్రతాప్ నవ్వి , ” కాదు అవి Muscovy ducks ” అవి సరదాగా పెంచుతారు. ఇవి కూడా గుడ్లు పెడతాయి, పొదిగి పిల్లల్లని చేస్తాయి Indian runners ఖాకి క్యాంబెల్” కేవలం ఎగ్స్ కోసం అంటే బెస్ట్ ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, వీటికి నీళ్ళు ఉండాలి, పెద్ద పెద్ద పాండ్స్ మూడు చూపించాడు. చిన్న చిన్న చెరువులలా వున్నాయవి. ప్రస్తుతం 400 ducks వున్నాయి, 360 రోజులు గుడ్లు పెడతాయి, ఒక్కొక్క పంట అయ్యాక అక్కడ వీటిని వదులు తాము, ఇవి నాచురల్ పేస్ట్ కంట్రోలర్స్. “
“గుడ్లు ఏం చేస్తారు?”
“మా ఇంటికి దగ్గరలోనే నానమ్మ పేరున ఒక గర్ల్స్ ఆర్ఫన్ హోం ఉంది, accidents లో తల్లి, తండ్రులని కోల్పోయిన ఆడ పిల్లలని, వివిధ కారణాలతో అనాథలైన ఆడపిల్ల లని ఇక్కడ చదివిస్తాం. అయిదేళ్ళయింది, అమ్మ చూసుకుంటుంది, డక్ ఎగ్స్ చాలా వరకు ఈ హోమ్ లోనే వాడతారు, కూరగాయలు, ధాన్యం అంతా మా ఫామ్ నుంచే వెళతాయి. చంద్రిక మామగారు చాలా ఫండింగ్ చేస్తారు, నా ఫ్రెండ్స్ కూడా”
లలిత మనసంతా ఒక అనిర్వచీయమైన ఆనందంతో నిండిపోయింది. వేదవతి గురించి తప్పుగా ఆలోచించినందుకు లోలోపల సిగ్గుపడింది.
ఫామ్ ఫ్రెష్ కూరగాయలతో చేసిన భోజన౦ ఎంతో రుచిగా వుంది. నాలుగింటికి, మూడెకరాలలో వేసిన ఫారిన్ , నాన్ లోకల్ ఫ్రూట్ ఫామ్ కి తీసుకెళ్ళాడు, చంద్రిక కూడా వెళ్ళింది. అసలా వెరైటీ ఫ్రూప్ట్స్ ని ఆమె ఎప్పుడూ చూడలేదు. చాలా వరకు కమర్షియల్ దృక్పధంతో పెంచుతున్నవే. పాలీ హౌసెస్ లో పెంచుతున్న రొసెస్, జెర్బారాస్ చూసిన లలిత మనసు పులకించిపోయింది. ఆనందం నిండిన మనసుతో అన్నది ” ఇవన్నీ చూస్తుంటే కృష్ణ శాస్రి గారి” ఆకులో ఆకునై ” పాట గుర్తుకొస్తోంది, కాదు కాదు నా మనసు ఆ పాట పాడుకొంటోంది” తన్మయ౦గా అన్నది.
” పోనీ ఉండిపో ” చంద్రిక అన్నది నవ్వుతూ.
ఉలిక్కిపడిన లలిత తమాయించుకొని అన్నది, ” ఇంత చక్కని ప్రకృతి నాలుగు తరాల నుండి కాపాడుకొంటూ వస్తున్నారు, ముఖ్య౦గా మీరు, ప్రతాప్ వైపు తిరిగి అన్నది, ప్రపంచం ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజి అయ్యింది. సిటీలో వుండేవాళ్ళకు ఎన్ని నెట్ వర్క్ సౌకర్యాలు ఉన్నాయో అన్నీ పల్లెల్లోకి కూడా వచ్చేసాయి. అయినా వ్యవసాయం వైవు ఎవరూ చూడటం లేదు. ఆర్ధిక కారణాలు కూడా వుండొచ్చుననుకోండి. కానీ వ్యామోహంతో వెళ్ళేవాళ్ళే ఎక్కువ, కనీసం టౌన్స్ లో కూడా ఉండట౦ లేదు, ఒక ఎక్సోడస్ లా సిటీస్ వైపు పరిగెడుతున్నారు. సిటీస్ అన్నీ క్యాన్సి వోరస్ (cancerous) డెవలప్మెంట్ తో దుర్భరంగా మారుతున్నాయి.
” అనుకున్నంత తేలిక కాదు లలితా, ఇక్కడ ఉందట౦ ” మొదటిసారి కొంచం గంభీరంగా మాట్లాడింది చంద్రిక.
లలిత నవ్వి ” అది ఒక relative పాయింట్ చంద్రికా , జీవితం పట్ల మన దృక్పధం మీద ఆధారపడి ఉంటుంది.”ప్రతాప్ మౌనంగా ఆమెనే చూస్తున్నాడు.
***
సాయంకాలం మల్లెలు , మరువం కలిపి మాల కడుతోంది పూర్ణ. లలితని తనతో పాటు పెరట్లో మామిడి చెట్టు చుట్టూవున్న గట్టు మీద కూర్చోటానికి రమ్మంది వేదవతి. విరజాజులు మరువం కలిపి కడుతోంది లలిత, ఆమె పూలను అందిస్తుంటే.
లలితా, మా ఇల్లు, ఈ పల్లె జీవితం, ఎలా అనిపించింది నీకు?
చాలా బావుంది ఆంటీ, ప్రశాంతంగా, హాయిగా వుంది, అంత చదువు చదివి ప్రతాప్ గారు ఇలా అగ్రికల్చర్ వైపు రావటం నిజంగా ఫెంటాస్టిక్ కానీ చాలా కష్టపడితే గానీ ఇది సాధ్యం కాదు.”
“మీరు అంకుల్ ని ఇష్టపడి చేసుకున్నారట కదా”
“అవును, ఆయనని, ఆయన నెమ్మది స్వభావాన్ని, నన్ను ఎంతో ప్రేమించే ఆయన మనసుని ఇష్టపడి చేసుకొన్నాను, నో రిగ్రెట్స్, లలితా, అత్తయ్యా, మామయ్యా మాతోనే వున్నారు మొదటి నుండీ. పిల్లలని ఆయన వదిలి ఉండలేరు. దేశ విదేశాలు చూసాం పిల్లలతో కలిసి. ప్రతాప్ వ్యవసాయం చేస్తానన్నప్పుడు, నా కొడుకు మాతోనే ఉండటానికి నిశ్చయించుకొన్నాడని తెలిసి మా ఇద్దరికీ ఎంతో సంతోషం వేసింది. ప్రతాప్ తో ఇది నాలుగో తరం, ఈ ప్రకృతిలో మమైక౦ అయ్యే నాలుగో తరం.
ఒక్క క్షణ౦ ఆగి అన్నది, కానీ వాడికి మ్యాచెస్ రావటం కష్టమైపోయింది, వాడు ఒక రైతు, కౌలుకి ఇచ్చి సిటీలో వుండాలని కొందరూ, కొంతకాలం విదేశాలలో ఉందామని కొందరూ అన్నారు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అడుగుదామనుకొన్నాను. కానీ, నువ్వు నీ ఆర్ధిక పరిస్థితి చూసి నేను ఈ ప్రపోసల్ తెచ్చానని అనుకొంటావని సంశయిం చాను. డాక్టర్ పిల్లలు డాక్టర్స్, ఇంజనీర్ పిల్లలు ఇంజినీర్లు, రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ వ్యవసాయం పట్ల చాలా చిన్నచూపు వుంది మన దేశంలో, మా కుటుంబ లెగసీ ఇది లలితా” బాగా అలోచించి చెప్పు, టైం తీసుకో, నువ్వు ఒప్పుకోకపోయినా నాకూ, పూర్ణకి మధ్య స్నేహం అలాగే ఉంటుంది. కానీ, ఈ ఇంటి కోడలు ఈ లెగిసిని ముందుకు తీసుకెళ్ళాలి”
లలిత మనసు ఆనంద తరంగమైంది, ఆ మాట వినగానే. తన ఎదురుగా కూర్చున్న ఆ స్త్రీమూర్తి కేసి తదేకంగా చూసింది. మంచి మంచి సంబంధాలు వచ్చినా ఒక రైతుని ఇష్టపడి చేసుకొంది. ప్రేమానురాగాలతో కుటుంబ విలువలని కాపాడుకొంటూ జీవిస్తు న్నది. తన కొడుకుకి సరైన జీవన సహచరి కోసం, ఎంత శోధన! వ్యథా భరితమైన ఆడపిల్లల జీవితాలలో వెలుగు నింపటానికి శ్రమిస్తున్నది. ప్రకృతిలో మమేకమై జీవిస్తూ తన కుటుంబ లెగసీని ప్రతాప్ తో కలిసి ముందుకు తీసుకెళ్ళమంటున్నది. ఇంతకంటే తనకు కావలిసిందేమిటి?
“అత్తయ్య”, అన్నది నెమ్మదిగా ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకొని. ఆ ఒక్క పిలుపులో లలిత మనసు అర్ధమై , లలితని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దాడింది.
***
మర్నాడు రాఘవ రావుని పిలిచి విషయం చెప్పింది వేదవతి. సంతోషంతో ఆ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. హోమ్ భాద్యతను వాళ్ళకి అప్పగించి, అక్కడే వున్న కేర్ టేకర్ హోంలో వసతి ఉందని చెప్పింది.
ప్రతాప్ తన గదిలో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. పైకి వెళ్ళింది లలిత. దగ్గరికి రమ్మనట్టుగా చేయి చాచాడు. ఫోనని ప్రక్కన పెట్టి, “ త్వరగా వచ్చేయి లలితా, నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఏదో వెలితిగా వుంది”అన్నాడు. “నీ నెంబర్ చెప్పు”
అతని గుండెల మీద వేలితో ఒక్కో అంకె రాసింది. అతను ఆమె గడ్డాన్ని పట్టుకొని పైకెత్తి ” “ఇంత వరకూ ఎవరూ ఇలా నెంబర్ చెప్పివుండరు” అన్నాడు నవ్వుతూ. గుమ్మం దగ్గిర అలికిడి. చంద్రిక ” బొత్తిగా భయం లేదు ఇద్దరికీ, అరగంటయింది, ఇద్దరూ కిందికి రండి” లలిత సిగ్గుపడి అతనికి దూరంగా జరిగింది. ఇద్దరూ క్రిందికి వస్తుంటే అందరి కళ్ళూ తృప్తితో మెరిసాయి.
క్రిందికి వచ్చాక లలితని హాగ్ చేస్తూ, చెవిలో గుస గుసగా అన్నది చంద్రిక.,”రెండు రోజుల్లో వచ్చేయి, నందు వచ్చేదాకా ఏ ఫంక్షన్ ఉండదు, అప్పటిదాకా చక్కగా ప్రేమించుకోండి”
నీళ్ళు నిండిన కళ్ళతో అంది లలిత, ” థాంక్స్ ఫర్ ఎవ్విరిథింగ్ చంద్రికా”
“నాదేం లేదమ్మా, మీ అత్తగారి ప్లాన్, నేను అమలు చేశానంతే” అంది చిన్న గొంతుతో. కారెక్కాక, ఆమె చీర కుచ్చిళ్ళు డోర్లో పడకుండా సర్ది డోర్ వేసాడు ప్రతాప్.
“అమ్మోయ్, అన్నయ్య అప్పుడే వదిన కొంగు పట్టుకొని తిరుగుతున్నాడే”
‘”నీ తోక పట్టుకొని తిరగటంలా నందుగాడు” రిటార్ట్ ఇచ్చాడు ప్రతాప్.
అందరి నవ్వుల మధ్య కారు బయల్దేరింది.
*****
నా పేరు బి. భవాని కుమారి. అనుకృతి” నా కలం పేరు. 34 ఏళ్ళు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసి 2014లో రిటైర్ అయ్యాను. సాహిత్యాభిలాష ఎక్కువ, ఇంగ్లీష్, తెలుగు సాహిత్యాలపట్ల మక్కువ. నా మొదటి కథ “తొలకరి” 2019లో “సాక్షి” ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. కూనంనేని స్మారక కధల పోటీలో నా కథ ‘” నాన్నా, నాకూ అవకాశమివ్వు ” సాధారణ ప్రచురణకు ఎంపికైనయినది కానీ “నవ్య” పత్రిక ప్రచురణ ఆగిపోవటంతో అది ప్రచు రింపబడలేదు. 2023లో ” తంగేడు” వెబ్ మాగజైన్లో నా కథ “ఆమె గెలిచింది” మహిళాదినోత్స్ వ సందర్బంగా ప్రచురింపబడింది. 2023జూన్ లో ” ” తోడొకరుండిన” కథ “గోతెలుగు” వెబ్ మేగజైన్ లో ప్రచురింపబడింది.
కనుమరుగవుతున్న పల్లె జీవితాలను ముందుకు తీసుకెళ్ళాలి… రచయిత్రి ప్రయత్నం చాలా బాగుంది…janaki
కథాంశం బావుంది. రచయిత్రికి అభివందనాలు.