నిష్కల – 34

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: పెద్ద కొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ. అత్తను కన్న తల్లిలా ఆదరించే కోడలు శోభ. నిష్కల, సారా అక్కాచెల్లెళ్ళు అని తెలుసుకుంటారు. అంకిత్ అలక విడిచి తిరిగివస్తాడు. సారాతోనే కాదు సారా తల్లి వాంగ్రాతో కూడా నిష్కలకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అమ్మ, నాయనమ్మలను ఆశ్చర్యచకితులను చేయాలని సహచరుడు అంకిత్, వాంగ్, సారాలతో విమానం ఎక్కింది నిష్కల

***

          నాన్నమ్మా.. వృద్ధాప్యంలో నవ్వడానికి కొన్ని నవ్వులు దాచుకోవాలి. ఒంటరితనం లో అవి నీ కూడా ఉంటాయి అనే నిష్కల మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి సుగుణ మ్మకు.

          చిన్న పిల్ల కానీ ఎంత బాగా చెప్పిందో ..

          నాన్నమ్మా , నువ్వు నవ్వుతుంటే ఆనందం ఇల్లంతా పరుచుకున్నది. అలాగే నవ్వుతూ ఉండాలి.. నువ్విలా నవ్వుతూ ఉంటే నీ నవ్వు ముందు ఏ విద్యుత్ దీపాలు అవసరం ఉండదేమో.. ఎంత హాయిగా ఉన్నదో నీ నవ్వు అనే నిష్కలను చూడాలని సుగుణమ్మ మనసు బలంగా కోరుకుంటున్నది.

          నిష్కలను చూడాలంటే ఆమె రావాలి. వస్తే తన కొడుకు గురించి ఏమైనా జాడ తెల్సుకుందేమో తెలుసుకోవాలి. ఈ సారి నిష్కల ఫోన్ చేసినప్పుడు తను కూడా మాట్లాడాలని ఆత్రుత పడుతున్నది సుగుణమ్మ మనసు.

***

          చీకటి మేఘాలు దాటి వెండి బంగారు వర్ణపు పొరల్లోంచి పైకి పై పైకి దూసుకు పోతున్నది లోహ విహంగం.

          అప్పుడెప్పుడో ఒకసారి, నేను ఇండియా రాను అంటే వెనకటికి ఎవడో నీలాంటి వాడు చెరువు మీద కోపంతో ముడ్డి కడుక్కోవడం మానేసాడంట. అట్లా ఉంది నీ వరస అంటున్న నాన్నమ్మ పై ఉన్న కోపం మొత్తం ఎగిరిపోయి పకపకా నవ్వింది. నాన్నమ్మ మాటల్లో అనేక పలుకుబడులు, జాతీయాలు, సామెతలు అలవోకగా దొర్లుతుంటాయి. ప్రపంచాన్ని కాచి వడబోసినట్టు మాట్లాడే ఆమె భాష వినసొంపుగా ఉంటుంది.

          అబద్దాలే రాజ్యమేలుతున్నాయి. నిజం చెప్పులేసుకునే సరికి అబద్దం ఊరంతా నమ్మించి చెప్పులు విడుస్తుంది అనే నాయనమ్మ మాటలు గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంది నిష్కల.

          ఆ వెంటనే నాన్న లేరన్న నిజం.. తమ ఫ్యామిలీ ఫోటో .. నాన్న లేని ఫ్యామిలీ ఫోటో గుండె గదిలో వేలాడేసుకోవడం మాత్రమే కాదు గోడకు వేలాడే నిలువెత్తు చిత్తరువు పెట్టాలి. అది చూసి అప్పుడో ఇప్పుడో ముగిసిపోయే జీవితపు ఘడియల్లో ఉన్న నాన్నమ్మ శోకపు కుప్పవుతుందేమో .. ఆమెను ఎన్ని వేల చేతులతో ఓదార్చాలో .. అది నా శక్తికి మించిన పనని తెలుసు. అందుకే బాబాయిలిద్దరినీ, అత్తని కుటుంబాలతో రమ్మని కోరింది. ఆ ఉద్విగ్న సన్నివేశాన్ని అనుభవించే సమయంలో అనుభవించక తప్పదు అని తలపోస్తూ దీర్ఘంగా నిట్టూర్చిన నిష్కల కదిలిపోతున్న మేఘాల వరుసను చూస్తూ కొన్ని క్షణాలు గడిపింది.

          నన్ను చూడగానే అమ్మ ఎలా ఉంటుంది?! బహుశా, ఆమె మొహంలో నాలుగు చందమామల వెన్నెల పరుచుకుంటుందేమో !

          భర్త తోడు తెలియని అమ్మ జీవితంలో వెన్నెల నేనే.. అనుకుంటున్న నిష్కలకి అకస్మాత్తుగా నాన్న గుర్తొచ్చాడు. తనలో తాను నలిగి నుజ్జు నుజ్జు అయిందే తప్ప నాన్నని ఎన్నడూ తప్పు పట్టలేదు. తనకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టలేదు. లోకం పోకడ పట్ల పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే ఆయన పెళ్ళి, ప్రేమ అంతా ఆయన వ్యక్తిగతంగా చూసింది అమ్మ.

          ప్రేమ, పెళ్ళితో సుఖాంతం అవుతుందని అనుకోవడం సమాజం కల్పించిన భ్రమ. ప్రేమించినపెళ్ళిలోనయినా పెద్దలు కుదిర్చిన పెళ్ళిలోనయినా ఇద్దరికీ పొసగనప్పుడు ఎవరికి వారుగా ఉండడమే మేలు. విడాకులు తీసుకోవడానికి సమాజం ఒప్పుకోలు కోసం మదనపడడం వ్యర్థం అంటుంది అమ్మ. ఆమె స్వభావం బాగా తెలుసు కాబట్టి వాంగ్ ని, ఆమె కూతుర్ని ఆదరిస్తుంది అనే నమ్మకంతో ఉన్నాను. చూడాలి ఎలా చూస్తుందో.. ! ఏం జరనున్నదో ..

          ఎవరికైనా పెళ్ళి వారి వ్యక్తిగత నిర్ణయం. వారి పెళ్ళి ఆనంద వేడుకలను వారి మీద అభిమానంతో సంబరంగా తీసుకుంటాం. అదే మనం వారు సయోధ్య కుదరక విడిపోతు న్నప్పుడు కూడా అంతే వ్యక్తిగతం అని ఆలోచించం ఎందుకు? వారి తాలూకు కలతలను వారికే వదిలేయం ఎందుకు? వారి జీవితాన్ని పీలికలూ చీలికలుగా చేసి తీర్పు ఇచ్చేస్తుం టాం ఎందుకు? అలా చేయడం నిజంగా వారిని అభిమానించినట్లు కాదు కదా!

          ఎవరి పరిస్థితులు వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి. కాబట్టి, కనీసం వారి జీవితాల పై మనం తీర్పు చెప్పడం మానేయాలి. అది కనీస సంస్కారం. విభిన్న కుటుంబాలు/ఆచారాలు జత పడడానికి పెళ్ళిని ఎలా స్వాగతిస్తామో, అలాగే విభిన్న మనస్తత్వాల మధ్య పొత్తు కుదరకుంటే విడాకులని కూడా అంతే సులువుగా స్వీకరించగలగాలి. అది జీర్ణించుకోవడం అమ్మకి సాధ్యమైంది. ఆ సంస్కారం అమ్మకి అబ్బింది. ఆ తల్లి బిడ్డగా పుట్టినందుకు గర్వపడుతూ తల్లిని మనసులోనే అభినందించింది నిష్కల.

          ఎలాంటి నిరూపణలు, వివరణలు అవసరం పడని ప్రేమ, ఒత్తిడి లేని ప్రేమ వాంగ్, నాన్నల మధ్య ఉన్నది. దాన్ని అమ్మ అర్థం చేసుకున్నా నానమ్మ ఏమంటుందో .. ఎలా తీసుకుంటుందో? అని ఆలోచిస్తూ పక్కన ఉన్న అంకిత్ వైపు చూసింది నిష్కల.

          లాప్టాప్ లో ఏదో చదువుకుంటున్న వాడల్లా ఆపి తెరిచి ఉన్న విండో నుంచి బయట కు చూస్తూ ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. బయట చీకటి తప్ప ఏమీ కనిపించడం లేదు. నిద్ర వస్తోందా ? నెమ్మదిగా అడిగింది. లేదన్నట్టు తల ఊపాడు . కానీ అతనిలో నలుగుతున్న ఆలోచనల పరంపర కొనసాగుతూనే ఉంది.

          ఎవరైనా ముందుకు నడుస్తారా? వెనక్కి నడుస్తారా? అకస్మాత్తుగా నిష్కల మొహం లోకి చూస్తూ అడిగాడు.

          ఏమైంది అంకిత్ ? ఏమిటా ప్రశ్న? ఆశ్చర్యంగా అంకిత్ ని చూస్తూ అడిగింది నిష్కల.

          ఆ వెంటనే, మనిషి పుట్టుక నుంచి ముందుకు నడుస్తూనే ఉన్నాడు. లేకపోతే ఇన్ని ఆవిష్కరణలు వచ్చేవా? ఇన్ని తెలివితేటలు వచ్చేవా? భూమి నుంచి చంద్రుడు దాకా ప్రయాణం జరిగేదా ? అంతుచిక్కని అంతరిక్షం లోతు తెలియని పాతాళం గురించి తెలిసేవా ? ఇన్ని శాస్త్రాలు అభివృద్ధి చెందేవా? వేల ఏళ్ళుగా మానవ సమాజాలు , సంస్కృతులు పరిణామం చెందుతూ ఉన్నాయి. ఉన్నతీకరించబడుతూనే ఉన్నాయి అంటున్న నిష్కల మాటలకు అడ్డువచ్చాడు అంకిత్.

          నిజమే, నిన్నటి నుంచి నేటికీ, నేటి నుంచి రేపటి లోకి చేసే ప్రయాణంలో ఆధునికం అవుతున్నాడు మనిషి. నడిచి వచ్చిన దారుల్లోని మంచిని రేపటి వైపు నడిపించే ఇంధనంగా మలుచుకుంటూ మనిషి ముందుకు సాగాలి. అదే కదా మానవ జీవన విధానం.

          నడచిన బాటలో, నలిగిన బాటలో కళ్ళు మూసుకుని నడవడం కాదు. ఏ విషయం లో నైనా మంచి చెడు , ధర్మాధర్మాలు, ఉచితానుచితాలు మన వివేచనతో, విశ్లేషణతో అంచనా వేసుకుంటూ కొత్త బాటలు వేసుకోవాలి. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, లైంగిక తను బట్టి, ప్రాంతాన్ని బట్టి, సంస్కృతిని బట్టి నాగరికతను బట్టి మనం ఏర్పాటు చేసుకున్న నియమాలు, ధర్మాలు మారిపోతుంటాయి. ఎప్పుడు ఏది స్థిరంగా ఉండదు.

          ఎప్పటికప్పుడు మారుతున్న కాలమాన పరిస్థితులు బట్టి మార్గం రూపొందించు కోవలసిందే. లేదంటే సామాజిక మార్పు సాధ్యం కాదు. అప్పుడెప్పుడో ఎవరో వేసిన దారిలో నడవాలి అంతే అంటే ఏమవుతుంది? మొత్తం కుప్ప కూలిపోదూ! అన్నాడు అంకిత్.

          ఆ స్వరంలో అంతులేని ఆవేదన కనిపిస్తున్నది. కారణం అర్ధం కాలేదు నిష్కలకు.

          తాను పుట్టిన దేశం, తన తాత ముత్తాతల దేశం వెనక్కి వెళ్ళిపోయే దిశగా, సనాతన ధర్మం అంటూ ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వాన్ని చూసి అంకిత్ బాధ అని ఆమెకు తెలియదు.

          నీవేదో కోల్పోతున్నట్లు ఆ మొహం ఏంటి అంకిత్. మన వాళ్ళందరితో మన సంతోషాలు పంచుకోవడం కోసం, మన వాళ్ళందరి ఆనందం మనదిగా చేసుకోవడం కోసం చేసే ఈ ప్రయాణం మొదలైన దగ్గర నుండి నీ తీరు నాకర్ధం కావడం లేదు అంకిత్. అతనికి మాత్రమే వినపడేట్లు అన్నది నిష్కల.

          అయితే అదేమీ వినిపించుకోలేదు అతను.

          75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో మనం సాధించుకున్న లౌకిక, ప్రజాస్వామిక, సమానత్వ విలువలు ఎలా తుడిచిపెట్టుకుపోగలవో ఒక్కొక్కటిగా కూలిపోతున్న రాజ్యాంగ వ్యవస్థలే నిదర్శనం. అందుకే ఇది సనాతనాన్ని తిరస్కరించాల్సిన సమయం. లౌకిక, ప్రజాస్వామిక, సమానత్వ విలువలు ఎత్తిపట్టాల్సిన సమయం ఇప్పుడు ఎక్కువగా ఉంది. సనాతన వాదుల చేతిలో కీలుబొమ్మగా మారే బదులు భిన్నాభిప్రాయా లు భిన్న రాజకీయ విశ్వాసాన్ని వినిపించిన ఉదయనిధిని కలిసి హగ్ చేసుకోవాలని పించింది ఆ క్షణాన. మేల్కొనకపోతే భారత్ కు చీకటి రోజులే అని మనసులో తలపోస్తూ “మారనిది అంటూ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటుందా?” అని నిష్కల చేతిని చేతిలోకి తీసుకుంటూ అడిగాడు అంకిత్.

          “ఎందుకొచ్చింది ఆ సందేహం”

          “సనాతన అంటే ఎప్పటికీ మారనిది, నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్ధం అట. కానీ ఈ ప్రపంచంలో శాశ్వతం ఏదీ కాదు. ధర్మాలు, నియమాలు జీవితం ఉత్తమంగా నడవడానికి తరతరానికి మారుతూనే ఉంటాయి. ఆ నియమాలన్నీ మనం ఏర్పరచు కున్నవే. మనం మార్చుకోవలసినవే” జవాబిచ్చాడు అతను.

          అప్పుడు అర్ధమైంది అంకిత్ దీర్ఘాలోచనకు కారణం. ఈ మధ్య ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఆ పై జరుగుతున్న దుమారం గురించి అంకిత్ ద్వారానే విన్నది నిష్కల. పనుల్లో బిజీగా ఉండి వార్తలు ఫాలో అవలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడం వలన ఆమెకు విషయాలు తెలియలేదు.

          సనాతన అంటే .. కుల, మత, లింగ ఆధిపత్యాలు కొనసాగడమే ఆమె ప్రగాఢ విశ్వాసం. కుల అసమానతలు హెచ్చుతగ్గులు సృష్టించింది ఎవరు? వారు సృష్టించిన మనుధర్మాన్ని, పితృస్వామ్య విధానాన్ని కూలదోయాలని అనుకున్నాం. కొత్త బాటలు వేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. మనం ఒక అడుగు వేస్తే సనాతన వాదులు నాలుగడుగులు వెనక్కి లాగే యత్నంలో ఉన్నారు. కుల, మత, వర్గ, జెండర్ పరంగా మనుషుల్ని విభజించి పాలించే సనాతన ధర్మాన్ని నెత్తినేసు కుంటున్నారు పాలకులు. అసమానత్వ వ్యవస్థలను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వా నిది . కానీ పెంచి పోషిస్తే?

          అంటే… అంకిత్ అన్నట్లు మనం ఎక్కడికి పోతున్నాం? ఆలోచనలో పడింది నిష్కల.

          వేల సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఆ నాటి సమాజానికి రూపొందించిన నియమాలు అవి. మారిన కాలంతో పాటు ఆ నాడు మంచి అనుకున్న ధర్మాలు కూడా కనుమరుగు కాక తప్పదు. ప్రవహించే నది లాంటిదే జీవితం. ఆ నదిలో ఎప్పుడూ పాత నీరే ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. మనకు కూడా అదే బోధిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అన్నది నిష్కల.

          నిజమే నిష్…

          ఈ దేశంలో ఒకరు తమ అభిప్రాయాలు చెప్తే ఎందుకంత తలకిందులై పోతున్నా రు. రాజకీయం చేస్తున్నారు. అతనికి ఆ స్వేచ్ఛ లేదా? ప్రజాస్వామ్య దేశంలో అది నచ్చని వాళ్ళు అభ్యంతరం తెలుపవచ్చు లేదా ఖండించవచ్చు. కానీ.., అయోధ్య సాధువు పరమహంస ఆచార్య , ఉదయనిధి తల నరికిన వారికి 10 కోట్ల రూపాయల నగదు బహుమతి ప్రకటించాడు .. అలా బహిరంగంగా బరితెగించి ప్రకటించాడు. అది నన్ను చాలా కలవరపరుస్తున్నది.

          అది నేరం కదా? నేరపూరితమైన వ్యాఖ్యలు చేసిన వారి పట్ల చర్యలు ఏమిటో .. భయానకంగా కనిపిస్తున్నది.

          విదేశంలో ఆధునిక సౌకర్యాలు అన్నీ కావాలి అనుకునే మా నాన్న ఇప్పటికీ సనాత నుడే. ఆ ధర్మంలోని వివక్ష రూపాలను చూస్తూ పెరిగిన వాణ్ణి. బహుశా గుజరాత్ లోనే ఉంటే నేను కూడా నాన్నలాగే తయారయ్యే వాడినేమో!

          ఇక్కడికి వచ్చినా విశాల ప్రపంచంలోకి రాకపోయి ఉంటే అలా ఉండేవాడివేమో!
యూనివర్సిటీలో చదివిన పుస్తకాలూ మన స్నేహ బృందాలతో చేసిన చర్చల ప్రభావం నా పై చాలా ఉంది. నువ్వు ఆలోచించే తీరు నన్ను అబ్బురపరుస్తుంది. అనుకున్న పని సాధించాలంటే ఎంతో ఓపిక పట్టుదల అవసరమని నిన్ను చూసి నేర్చుకున్నాను నిష్ అంటూ ఆరాధనాపూర్వకంగా చూసే అంకిత్ చూపుల నుంచి తప్పించుకుంటూ వెనక వరుసలో ఉన్న సారా, వాంగ్ వాళ్ళేం చేస్తున్నారోనని వెనక్కి తిరిగింది నిష్కల.

          వాంగ్ కళ్ళు మూసుకుని కూర్చుంది. అది నిద్రపోతున్నట్లు లేదు. వాళ్ళు ప్రేమతో పాటు అభిమానం, ఆరాధన, విసుగు, కోపం కూడా సమానంగా ఇచ్చి పుచ్చుకున్నారు. అన్నిటిని సమానంగా సమతుల్యంగా అనుభవించారు అంటుంది సారా. వాళ్ళ స్నేహ బంధం, ప్రేమ బంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, భౌతికంగా నాన్న లేరన్న వెలితి తప్ప. జీవించాల్సిన జీవితంలో జీవించారు. అది కదా అసలైన జీవితం.

          నిజానికి ఒక జంట ఎలా ఉండాలో జీవించి చూపించారు. వారి సహవాస పరిమళం లో పెరిగిన సారా అంతే సౌరభాలు పంచుతుంది.

          జీవితంలో ఒలికిన చేదును, బుగ్గల పై ముద్దరేసిన కన్నీటి చారికల హద్దులు చెరుపుకుని కుటుంబాన్ని ఆలింగనం చేసుకోవాలని , అనుబంధాల దారంతో ముడేసే ప్రయత్నం చేస్తున్న వాంగ్ .. మంచి గంధపు చెక్క లా వాంగ్ ..

          .. ఆ క్షణంలో ఆమెను గుండెకు హత్తుకోవాలనిపించింది నిషికి . ఆమె ఆరాధనని ఎన్ని కొలతలేసి కొలిచి నాన్నమ్మకు చూపగలదు. రాలిపోయిన క్షణాలు ఏరుకుంటున్న ఆమె నుంచి చూపు సారావైపు సారించింది.

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.