నీవో బ్రతుకు మెట్టువు
-డా. కొండపల్లి నీహారిణి
టీ నీళ్ళు మరుగుతున్నాయి
కమ్మని వాసన తన రుచులు అవి అని గొప్పలుబోతున్నది
ఉదయం వెంటేసుకొచ్చే హుషారు సమయాలు
చేయాల్సిన పని ఒక్కటే వెన్నంటి ఉన్న విషయాన్ని కాసేపు మరచిపొమ్మన్నది
ఎల్లలు లేనిది ఆకాశానికే కాదు
హృదయాలకు కూడా!
కావాల్సినంత ఓపిక
కాలేని విసుగు
మసిగుడ్డను
పక్కన్నే పడిఉన్న పట్కారును
పక్క దిగని పిల్లలను
పనికెళ్ళాల్సిన పెనిమిటినీ
సముచిత భావముద్రలుగా
ఆమెతోబాటు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి
తద్ధితాలో కృదంతాలో
మాటమాటకు అడ్డుతగిలినట్టు
రింగ్ టోన్ మాటిమాటికి మనసును అదుపులో ఉండనీయకున్నా
ఒకటేదో నిధి నిక్షేపంగా
చూపుదారాలకు చిక్కింది
ఎక్కడ దాగుందో చిత్రంగా ఇన్నాళ్ళు ఆనందం పదే పదే మురిపిస్తున్నది
పండుగకని ఇల్లు దులుపుకోవటం సర్దుకోవడం మంచిపనే
పాత ఫోటో దొరికింది
ఆ కళ్ళల్లో ఎంత ధీమా!
సొట్టలు పడిన నానమ్మ చెక్కిళ్ళు
ఊడిన పళ్ళ జాడ చెప్పకనే చెప్తున్నది
ఉమ్మడి కుటుంబాల కళాజీవనం
కనుమరుగైన బతుకు చిత్రరచనచేసి
ఒక్కతరమంటే ముప్పదేళ్ళంటరన్న నిజాన్ని మూడంగలల్లో దాటొచ్చంటున్నది
జనరేషన్ గ్యాప్ అయిదేళ్ళేనని
పదిమందిలో ఉన్నా ఏకాకితనమని వాపోతున్న
నిర్జీవతను పక్కనబెట్టి
తొక్కు కారం కలుపుకుతిన్న బలమేనా
ఏమోగాని
పసుపురాళ్ళు కొట్టినా
ఇసుర్రాయి తిప్పినా
దంపుడు బియ్యం చెరిగినా
తాతనవ్వుల్ని తనవిచేసుకునేదని
వాళ్ళత్తమాటకు ఎదురుచెప్పని
మంచితనమంతా ఆమెదేననీ
చిన్ననాడు నాయనమ్మ చెప్పిన ముచ్చట్ల జ్ఞాపకాలన్నీ
తాగుతున్న కమ్మని టీ అంతబాగున్నవి
గుండె కోట మీద కోటి వెలుగుల
చందం ఈ పాత ఫోటో
ఆ పాత మధుర గీతం
*****
Beautiful poem maam