అనుసృజన
వ్రుంద్ ( Vrind (1643–1723) )
– ఆర్.శాంతసుందరి
వ్రుంద్ ( Vrind (1643–1723) ) మార్వాడ్ కి చెందిన సుప్రసిద్ధ హిందీ కవి. బ్రిజ్ భాషలో దోహాలు రాసాడు. 70౦ నీతికవితలు రాసాడు. అతని దోహాలను కొన్ని చూడండి
1. జైసే బంధన్ ప్రేమ్ కౌ , తైసో బంధ్ న ఔర్
కాఠహి భేదై కమల్ కో , ఛేద్ న నికలై భౌంర్
ప్రేమ వల్ల ఏర్పడే బంధం లాంటిది మరొకటుండదు
గండు తుమ్మెద కూడా/ కర్రలో రంధ్రం చేస్తుందే తప్ప కమలాన్ని ఛేదించదు.
2. అతి పరిచయ్ తే హోత్ హై , అరుచి అనాదర్ భాయ్
మలయాగిరి కీ భీలనీ , చందన్ దేత్ జరాయ్
ఎవరితోనైనా మరీ ఎక్కువగా పరిచయం పెంచుకుంటే వారి మీద అనాసక్తి, అగౌరవమూ కలుగుతాయి
మలయపర్వతం మీద నివసించే భిల్లస్త్రీ వంటచెరకుగా గంధపు కర్రలని ఉపయోగించు కుంటుంది !
3. జో పావై అతి ఉచ్చ్ పద్ , తాకో పతన్ నిదాన్
జ్యో తపి తపి మధ్యాహ్న్ లౌ , అస్తు హోతు హై భాన్
మధ్యాహ్నమంతా తీవ్రమైన నిప్పులు కురిపించే సూర్యుడికి కూడా అస్తమయం తప్పనట్టే
అతి ఉన్నత పదవిని అలంకరించిన వారికి ఎప్పుడో ఒకప్పుడు పతనం తప్పదు
4. ఫేర్ న హ్వైహై కపట్ సో , జో కీజై బ్యోపార్
జైసే హాండీ కాఠ్ కీ , చఢై న దూజీ బార్
చెక్కతో చేసిన పాత్రని రెండోసారి పొయ్యిమీదికి ఎక్కించటం సాధ్యం కానట్టే
ఇతరులని మోసగించి పనులు సాధించుకునేవాళ్ళు ఆ పని మళ్ళీ మళ్ళీ చెయ్యలేరు
5. నైనా దేత్ బతాయ్ సబ్ , హియ్ కో హేత్ అహేత్
జైసే నిరమల్ ఆరసీ , భలీ బురీ కహి దేత్
స్వచ్ఛమైన అద్దం మంచినీ చెడునీ ఉన్నదున్నట్టు చూపించినట్టే
మనసులోని మంచితనాన్నీ, కల్మషాన్నీ కళ్ళు బైటపెట్టేస్తాయి
6.కరత్ కరత్ అభ్యాస్ తే , జడమతి హోత్ సుజాన్
రసరీ ఆవత్ జాత్ తే , సిల్ పర్ పరత్ నిసాన్
శిల మీద తాడు అదిమిపెట్టి అటూ ఇటూ లాగుతూ ఉంటే ఏదో ఒక రోజు దాని మీద ఆ తాటి గుర్తు పడినట్టే
విడవకుండా అభ్యాసం చేస్తూ పోతే, మందబుద్ధి కూడా మంచి జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాడు
7.దుష్ట్ న ఛాడై దుష్టతా , బడీ ఠౌరహూ పాయ్
జైసే తజై న స్యామతా , విష్ శివ్ కంఠ్ బసాయ్
శివుడి కంఠంలో స్థానం సంపాదించుకున్నప్పటికీ విషం తన నల్ల రంగును విడిచి పెట్టనట్టే
ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఉన్నత స్థాయికి చేరుకున్నా , దుష్టులు తమ చెడ్డ గుణాన్ని వదులుకోరు
8. సరసుతి కే భండార్ కీ , బడీ అపూరబ్ బాత్
జ్యో ఖరచై త్యో త్యో బఢై , బిన్ ఖరచై ఘటి జాత్
సరస్వతి ధనాగారానికి సంబంధించి చాలా విచిత్రమైన విషయం ఒకటుంది
అది ఖర్చు పెట్టినకొద్దీ పెరిగిపోతుంది, దాన్ని ఖర్చు పెట్టకపోతే తరిగిపోతుంది
9.విద్యాధన్ ఉద్యమ్ బినా , కహో జు పావై కౌన్
బినా డులాయే నా మిలై , జ్యో పంఖా కీ పౌన్
విసనకర్రని చేత్తో ఊపందే గాలి తగలనట్టే
శ్రమించకుండా ఎవరికీ విద్యాధనం లభించదు
10.ఊంచే బైఠే నా లహై , గున్ బిన్ బడపన్ కోయి
బైఠో దేవల్ సిఖర్ పర్, బాయస్ గరుడ్ న హోయి
గుణవంతుడు కాని వాడు ఉన్నత స్థానంలో కూర్చున్నంత మాత్రాన గొప్పవాడైపోడు
దేవాలయ శిఖరం మీద వాలినంత మాత్రాన కాకి గరుడ పక్షి అవలేదు.
11.బురే లగత్ సిఖ్ కే వచన్ , హియే బిచారో ఆప్
కరువే భేషజ్ బిన్ పియే , మిటై న తన్ కో తాప్
మిమ్మల్ని ఎవరైనా కోప్పడి మందలిస్తే నొచ్చుకుంటారు, కానీ ఒకసారి ఆలోచించండి
చేదు మందు తాగకపోతే ఒళ్ళు పేలిపోయే జ్వరం తగ్గదు కదా !
*****