“అరుంధతి@70” కథా సంపుటి పై సమీక్ష
-శృంగవరపు రచన
సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు
కథలు జీవితంలోని ఏ అంశాన్ని అయినా స్పృశించవచ్చు. కానీ ఆ కథల ద్వారా జీవితం పట్ల ఎలా స్పందించాలో అన్న అంశాన్ని ఎలా కథలో మలుస్తారో అన్నదే రచయిత ముద్రను స్పష్టం చేస్తుంది. అటు వంటి స్పష్టమైన ముద్రను కలిగిన రచయిత్రి లలితా వర్మ గారు. జీవితం పట్ల ఆశ, నమ్మకం కలిగేలా రాస్తూనే, జీవితంలోని అనేక సందర్భాల్లో విషాదం తలెత్తే తీరు తెన్నులను కూడా జీవిత ప్రక్రియలో భాగంగా ఎలా భావించాలో, పేదరికం-మధ్యతరగతి కుటుంబాల్లో తలెత్తే అనేక సమస్యలు ఎలా జీవితాలను అనేక రీతుల్లో మలుపులు తిప్పుతాయో చెబుతూనే, జీవితం చేజార్చుకో కూడదన్న సుతిమెత్తని హెచ్చరికను కూడా తన కథల్లో స్పష్టం చేశారు.”అరుంధతి@70″ అన్న కథా సంపుటిలో అనేక జీవితాలు మనకు తారసపడతాయి.
“నా చుట్టూ ఉన్న సమాజంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలకు చలించిన నా గుండె కరిగి ఒకానొకసారి కన్నీరై, మరొకసారి ఆనందభాష్పాలై స్రవించినప్పుడు వాటిని ఒడిసి గుప్పెట పట్టి అక్షర రూపమిచ్చి మీ ముందుంచాను. అంటూ తనలో కథలు పుట్టే మానసిక ఆవరణ గురించి చెప్పుకున్న రచయిత్రి… తన సాహితీ ప్రయోజనం… సమాజం లో తను నమ్మిన మానవీయ విలువలు సమాజంలో తమ ప్రాముఖ్యతను కోల్పోతున్న సందర్భాలను అధిగమించాల్సిన ఆవశ్యకతను పాఠకుల్లో కొంతైనా కలిగించడమే ఈ కథల లక్ష్యమని రచయిత్రి స్పష్టం చేశారు.
ఈ కథా సంపుటిలో 14 చిన్న కథలు, 2 పెద్ద కథలు ఉన్నాయి. మొదటి కథ ‘ఒక ప్రేమ కథ.’రచయిత్రి ప్రేమ గురించి ఓ వినూత్న కోణంలో చెప్పిన కథ ఇది. కాలంతో పాటు స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమలో అనేక మార్పులు వచ్చాయి. ప్రేమలో ఉండాల్సింది సాన్నిహిత్యం కాదని గౌరవం అని స్పష్టం చేసే కథ ఇది. ఈ కథాకాలం 1974. రచయిత్రి తన ఉద్దేశ్యంలో ప్రేమ ఎలా ఉంటే నేటి ‘స్త్రీ-పురుషుల’ ప్రేమల్లో తలెత్తే అసహనాన్ని, గందరగోళాన్ని, బాధ్యతారాహిత్యాన్ని అధిగమించవచ్చో ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సాధారణంగా నేటి ప్రేమల్లో సహనం తక్కువ. వెంట వెంటనే ఒకరినొకరు చూసుకోవడం దగ్గర నుంచి, వారి మధ్య త్వరత్వరగా ఆలోచనలు మారే క్రమం, ఒకరిని ఒకరు విడిచిఉండలేక పోవడం ఎంత గాఢంగా జరుగుతుందో, అలాగే విడిపోవడం కూడా అంతే త్వర త్వరగా జరిగిపోతుంది. కొంత యాంత్రికత ఈ ప్రక్రియలో పరోక్షంగా ఉండటం వల్ల, నిజంగా తమది ప్రేమేనా కాదా అన్న ఆలోచనకు కూడా స్పేస్ ఇవ్వలేని వేగమైన తరంతో పోటీ పడలేకపోతుంది ప్రేమ. దాని ఫలితమే విభేదాలు. బ్రేకప్ లు! ప్రేమ పట్ల, ప్రేమించిన వ్యక్తి పట్ల, ప్రేమ ఫలించని పరిస్థితుల పట్ల వ్యక్తులు అలవర్చుకోవాల్సిన ఓ కొత్త దృక్కోణాన్ని స్పష్టం చేసే కథ ఇది.
రెండో కథ ‘మానసరాగాలు.’ వ్యసనాలు ఉన్న భర్తను మార్చుకోవడం అన్నది భార్య ఓ నైపుణ్యంగా మార్చుకోగలిగితే దాని కోసం భర్త వల్ల తలెత్తే ఘర్షణ, ప్రేమ రాహిత్యం వంటి వాటిని అధిగమించవచ్చని రచయిత్రి ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథా నేపథ్యంలో ఓ మధ్య తరగతి స్త్రీ మానసను, ఆమె ఇంట్లో పని చేసే రంగిని, వారి భర్తలకు ఉన్న వ్యసనాలను గురించి చెప్తూనే, అవి మినహాయిస్తే భార్యలను ప్రేమించే ఆ భర్తల గుణాలను అర్ధం చేసుకుంటే భార్యాభర్తల బంధాలు విచ్చిన్నమవవని ఈ కథ ద్వారా రచయిత్రి స్పష్టం చేశారు.
మూడో కథ ‘విశాలి.’ఈ కథ నిజంగానే మనసును కలవరపరుస్తుంది. స్త్రీ దేనినైనా జయించి జీవితంలో నిలబడగలదు కానీ, ప్రేమించిన భర్త దూరం అయితే మాత్రం ఆమెలోని ‘స్త్రీతత్వమైన ప్రేమ’ వల్ల దానిని మాత్రం తేలికగా తీసుకునే మానసిక ధృఢత్వం ఆమెకు ఇంకా ఏర్పడలేదని ఈ కథలో విశాలి పాత్ర ద్వారా రచయిత్రి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. . ప్రేమరాహిత్యం కన్నా… నిజం కాని ప్రేమ స్త్రీ హృదయాన్ని ఎంత బాధ పెడుతుందో ఈ కథ స్పష్టం చేస్తుంది.
నాలుగో కథ ‘పశ్చాత్తాపం.’ స్త్రీలు వివాహమయ్యాక అనేక రకాలుగా మారిపోతారు. వారు పెరిగిన నేపథ్యం వారు ఇలా మారడానికి ఓ కారణం కావచ్చు.ఓ రకం స్త్రీలు వివాహమయ్యాక ఆ కొత్త కుటుంబంలో తనకు సానుకూలమయ్యే స్థితి ఉంటే తమ ఆధిపత్యం ఇతరుల మీద చెలాయించే ప్రయత్నం చేస్తారు. ఆ ఆధిపత్యం పేరుతో తమ బాధ్యతలను కూడా విస్మరిస్తారు. అటువంటి బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించే స్త్రీల వల్ల ఆ కుటుంబంలోని వారందరూ ఎలా బాధ పడతారో, అది ఆ కుటుంబంలో ఉన్న పిల్లల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో స్పష్టం చేసే కథ ఇది. స్త్రీ కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించవలసిన ఆవశ్యకతను గురించి సున్నితమైన మందలింపు ఈ కథ.
ఐదో కథ ‘మనసుంటే …’ మారిన కాలంతో పాటు తరాలలో ప్రేమలో కొన్ని మార్పులు వచ్చాయి. అలాగే దానిని అంగీకరించలేని మనస్తత్వం కూడా తల్లిదండ్రుల్లో ఉండిపోయింది. కులాంతర వివాహాల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ మనసు పెద్దది చేసుకుని ఆలోచిస్తే పిల్లల జీవితాలు బావుంటాయని, బాధ్యత వహించే ప్రేమికుల ప్రేమను గౌరవించాలని రచయిత్రి ఈ కథ ద్వారా స్పష్టం చేశారు.
ఆరో కథ ‘కర్మయోగి.’ జీవితం మనుషులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది.కొంత కాలం కష్టాలు లేని జీవితం ఓ రకమైన అనుభూతులను కలిగిస్తే, తర్వాత కష్టాలు మనిషికి నిజమైన జీవితాన్ని, వ్యక్తి తనను తాను నిర్మించుకునే నేపథ్యానికి సిద్ధం చేస్తాయి. అటు వంటి నేపథ్యం ఓ స్త్రీని ఎలా ధృఢమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మార్చిందో స్పష్టం చేసే కథ ఇది. భర్త మరణించి కుటుంబ బాధ్యతలు తన మీద పడ్డప్పుడు, కష్టజీవిగా జీవితాన్ని ప్రారంభించి, క్రమక్రమంగా ఆ కష్టాన్ని యోగత్వంలా భావిస్తూ కూతురు గొప్ప వైద్యురాలు అయ్యాక కూడా తన పనిలోనే తన జీవిత పరిపూర్ణతను సాధించిన స్త్రీ కేంద్రంగా రాసిన కథ ఇది. నేడు ఎందరో కష్టాలు తలెత్తినప్పుడు తాము కష్టపడి పిల్లలను స్థిరపరిస్తే వారే చూసుకుంటారన్న ఆలోచనా ధోరణిలో ఉంటూ,అది బెడిసికొడితే తీవ్రమైన నిస్పృహకు గురవ్వడం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో స్వీయ వ్యక్తిత్వా న్ని ఏదో ఒక పనినే నిరంతరం చేస్తూ, వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిలబడాల్సిన ఆవశ్య కతను స్పష్టం చేసే కథ ఇది.
ఏడో కథ ‘అరుంధతి@70.’ ఇది వినూత్న నేపథ్యం కల కథ. ప్రేమను వినూత్న కోణంలో రచయిత్రి ఈ కథలో ఆవిషకరించే ప్రయత్నం చేశారు. ప్రేమ వయసుకి సంబంధించిందని, వయసుతో పాటే ప్రేమ పట్ల మనిషికి ఉండే సున్నితత్వం తగ్గిపోతూ ఉంటుందని, దానికి కారణం కుటుంబ బాధ్యతలు, జీవితంలోని యాంత్రికత అనే భావన ఎందరిలోనో ఉన్నది. కానీ నిజంగా ప్రేమ అంటే వయసుకి సంబంధించి, ఆ వయసు దాటిపోగానే మనిషి జీవితంలో అంతరించే ప్రక్రియ కాదని, ప్రేమ అంతకు మించినదని ఈ కథ స్పష్టం చేస్తుంది. ప్రేమ అంటే ప్రేమించిన వ్యక్తి జీవితంలో ఏర్పరిచే ఒక సౌరభమని, ఆ సౌరభం జీవితం అంతా మనిషి మనసులోని ఏదో ఒక భాగంలో నిక్షిప్తమై, జీవించడానికి ఓ మధురమైన ఊతాన్ని ఇస్తుందని ఈ కథ స్పష్టం చేస్తుంది. ప్రేమకు వయసుకి సంబంధం లేదని అరుంధతి ద్వారా రచయిత్రి స్పష్టం చేశారు.
ఎనిమిదో కథ ‘ఆమని.’ఆడపిల్లలకు సౌందర్యమే ఆభరణమని, అదే వారికి వివాహ మయ్యే అర్హతను సమాజంలో కలిగిస్తుందని భావించే నేపథ్యంలో ఆడపిల్లలు దానిని దాటి తమ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ ఎలా ఎదగవచ్చో స్పష్టం చేసే కథ ఇది. ‘బ్యూటీ మిత్’ ను అధిగమించి నేటి సమాజం ఎదగాల్సిన అవసరాన్ని స్పష్టం చేసే కథ ఇది.
తొమ్మిదో కథ ‘బహుమతి.’ ఆడపిల్లలు వివాహ విషయంలో అందానికి ప్రాధాన్యత ఇచ్చి, బాధ్యత లేని వ్యక్తిని వివాహం చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు పడవల్సి వస్తుందో అన్న అంశాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది. ఇద్దరూ వ్యక్తులు ఓ కుటుంబంగా ఏర్పడి జీవితాన్ని సాగించాలంటే, బాధ్యతగా వ్యవహరించే స్వభావం ఉండటం ఎంత ముఖ్యమో ఈ కథలో జానకి జీవితం ద్వారా రచయిత్రి చెప్పే ప్రయత్నం చేశారు.
పదో కథ ‘ఆంతర్యం.’ తమ బలహీనతలను కప్పి పుచ్చుకోవడానికి ఎలా ఎదుటి వ్యక్తుల న్యూనతను కొందరు ముడిసరుకుగా వినియోగించుకుని వివాహం చేసుకుని, దానిని తన ఔదార్యంగా అందరి ముందు చిత్రించుకుంటూ, అంతటితో ఆగకుండా ఆమెను మానసికంగా ఎలా చిత్రవధ చేస్తారో దాని పర్యవసానమేమిటో చెప్పే కథ. భర్త లోని శారీరక లోపాన్ని భరించగలిగినా,మానసిక అవకారాన్ని భరించలేక భార్య తీసుకు న్న నిర్ణయం ఏమిటో తెలియజేసేకథ. సహజంగానే ఈ సమాజంలో మనిషి తనను తాను గొప్పవాడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనేక సందర్భాల్లో. కానీ అంతకు మించి తనను సమాజం లోకువ కట్టే ఏదైనా లోపం తనలో ఉంటే దాని ఫలితా లను స్వీకరించలేక, ఆ స్థితిని అంగీకరించలేక ఓ రకమైన శాడిజంను అలవర్చు కుంటారు. అటు వంటి శాడిజంను ఈ కథలో వాసు పాత్ర ద్వారా రచయిత్రి చక్కగా చిత్రించారు. లోపాలు ఉన్న మనుషుల్లో ఉండే రకాలను, వారు దాని పట్ల స్పందించే రెండు విరుద్ధ కోణాల నుండి రచయిత్రి చెప్పే ప్రయత్నం చేశారు.వాసు భార్య తనలో లోపాలు ఉన్నాయనుకుని న్యూనతకు గురైతే, వాసు మాత్రం శాడిస్ట్ గా మారాడు. శారీరక లోపాలను కొంత ప్రేమ-వ్యక్తిత్వ ధృఢత్వం వల్ల జయించవచ్చు కానీ మానసికంగా ఆధిక్యత ప్రదర్శించే క్రమంలో వ్యక్తి మారిన క్రమం మాత్రం అధిగమించలేని సమస్యగా ఎదుటి వ్యక్తులకు కూడా మారిపోతుంది. ఈ రెండు ఆంతర్యాలను స్పష్టం చేయడంలో ఈ కథ సఫలమైంది.
పదకొండో కథ ‘బ్రేకప్.’ నేటి ప్రేమల్లో అవసరాల రీత్యా మారిపోయే ఆడపిల్లల మనస్తత్వాలను ఈ కథలో రచయిత్రి చిత్రించే ప్రయత్నం చేశారు.బ్రేకప్ సంస్కృతి వచ్చాక నేటి యువత ప్రేమను చాలా తేలికగా, ఓ ఉత్పత్తిగా చూసే క్రమాన్ని స్పష్టం చేసే కథ ఇది.
పన్నెండో కథ ‘పరివర్తన.’ మాతృబాషను నేర్చుకోవడం నామోషిగా భావించే సంస్కృతి నుండి నేటి తరం బయటపడాలని, బాష అలంకార ప్రాయం కాదని, వ్యక్తుల మధ్య బంధాన్ని,తాము పుట్టి పెరిగిన నేపథ్యాన్ని అవగతం చేసుకోవడానికి ఉపకరించే సాధనం అని ఈ కథ స్పష్టం చేస్తుంది.
పదమూడో కథ ‘భగవాన్!’ నేడు స్త్రీల పైన వయసు మినహాయింపు లేకుండా జరుగుతున్న ఆత్యాచారాలు స్త్రీల మానసిక స్థితిని ఎలా అల్లకల్లోలం చేస్తున్నాయో ఈ కథ స్పష్టం చేస్తుంది. ఈ ఘటనల వల్ల స్త్రీలో ధైర్యం సడలిపోవడమే కాకుండా, పురుష ద్వేషులుగా మారే అవకాశం ఉందని, స్త్రీలలో ఇటువంటి మనస్థితి తలెత్తినప్పుడు వారిని అర్ధం చేసుకుని ఆసరా ఇవ్వాల్సిన బాధ్యత భర్తపై ఉందని ఈ కథ స్పష్టం చేస్తుంది. సున్నిత అంశాన్ని వినూత్న సామాజిక కోణంగా ఈ కథలో చిత్రించారు రచయిత్రి.
పద్నాలుగో కథ ‘తప్పెవరిది?’ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పరాయి వారి వల్ల తలెత్తినప్పుడు వారు పంతాలకు పోవడం వల్ల వారి జీవితాలే కాకుండా పిల్లల జీవితాలు కూడా ఎలా ప్రభావితమవుతాయో ఈ కథ స్పష్టం చేస్తుంది. మార్పు వచ్చేసరికి సమయం మించిపోవచ్చని,ప్రేమ-బంధాల ముందు అపార్ధాలు చిన్నవన్న అంశాన్ని నేటి తరం గుర్తించాల్సిన అవసరాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది.
ఈ కథా సంపుటిలో ఈ కథలతో పాటు ఇంకో రెండు పెద్ద కథలు ఉన్నాయి. రచయిత్రి వాటిని పెద్ద కథలుగా చెప్పినా వాటిని నవలికలుగా భావించవచ్చు. మొదటి నవలిక ‘కన్నా! నీ కోసం.’ ఈ కథలో స్త్రీ మనసులో ప్రేమ కొన్ని సార్లు ఆ ప్రేమ వల్లే ఎలా ద్వేషంగా మారుతుందో అన్న అంశాన్ని వినూత్నంగా రచయిత్రి చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేమగా పెరిగిన అక్కాచెల్లెళ్ళు రాధ, సరిత. బాల్యం నుండి సరిత అక్క అంటే ప్రాణం పెట్టేది. ఈ నవలలో ఈ అక్కచెల్లెళ్ల కుటుంబ నేపథ్యం ద్వారా ఓ కొత్త లోకంలోకి పాఠకులను తీసుకువెళ్తారు రచయిత్రి. సంస్కార పెంపకాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు.వివాహం కూడా అన్నదమ్ములనే వివాహం చేసుకుంటారు అక్కాచెల్లెళ్ళు. రాధా భర్త ఆశయానికి తన అంగీకారం తెలిపి ఓ పాపను దత్తత తీసుకుంటే, సరిత ఓ మగ బిడ్డకు జన్మనిస్తుంది.ఆ బిడ్డ మీద ప్రాణం పెంచుకున్న తల్లి ఓ యాక్సిడెంట్ వల్ల కోమాకు వెళ్ళడం,ఆ సమయంలో రాధ ఆ బిడ్డను సాకడం,తర్వాత సరిత తన బిడ్డ రాధను తల్లిగా భావించడం వల్ల ఎంతగానో ప్రేమించిన రాధ పట్ల ద్వేషం పెంచు కోవడం, అలా తల్లిగా ఆమెలో ఉన్న ప్రేమ అక్క పట్ల ద్వేషంగా మారిన కథ మరలా ద్వేషం నుండి ప్రేమకు మారేలా రచయిత్రి కథను మలిచారు.తల్లి ప్రేమకు ఇంకో కోణం ద్వేషం కూడా కావచ్చని,ఆ ద్వేషం ప్రేమ వల్ల జన్మించే అభద్రతల వల్లే కానీ సహజ సిద్ధం కాదని ఈ కథ ద్వారా రచయిత్రి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.
రెండవ నవలిక ‘మనసా తుళ్ళిపడకే!’ ఈ నవలలో కుటుంబం కోసం చదువు మధ్యలోనే ఆపేసి నర్సు ట్రెయినింగ్ తీసుకుని శ్రమపడి కుటుంబ బాధ్యత తీసుకున్న యువతి ప్రేమ కోసం పదిహేనేళ్లు వేచి చూసిన ప్రేమికుడి కథ చెప్తూనే, కుటుంబ బాధ్యతల భారం తీసుకున్న వ్యక్తిని తమ ఆస్తిగా భావిస్తూ ఆమెకు జీవితం ఉందని గుర్తించని కుటుంబ సభ్యులా గురించి, స్త్రీ ఒంటరిగా ఉద్యోగం చేస్తుంటే ఆమెను దక్కించుకోవాలని, దక్కకపోతే ఆమెను బాధ పెట్టడానికి ప్రయత్నించే కీచకుల గురించి కూడా రాశారు. బాధ్యతాయుతంగా ఉండే ప్రేమకు కాలం కూడా సాగిలపడుతుందని ఈ కథ స్పష్టం చేస్తుంది.
ఈ కథల్లో ఎన్నో జీవితాలు, ఎన్నో పాత్రలు.రచయిత్రి జీవితం పట్ల నమ్మకాన్ని కలిగించే ఆశావాహ దృక్కోణంతోనే ప్రతి కథను మలిచారు. మానవీయ విలువలు, అనుబంధాలు ధృఢంగా ఉండాలంటే కొంత ఓర్పు, నేర్పు కలిగి ఉండాలనే చెప్తూనే, నేటి . యువత తొందర పడకుండా ఆలోచిస్తే విలువైనవారిని జీవితంలో కోల్పోరని కూడా కొన్ని కథల్లో స్పష్టం చేశారు. స్త్రీలు సౌందర్య తాపత్రయాన్ని దాటి తమ జీవితాన్ని తామే నిర్మించుకునే ప్రయత్నం చేయాలని కూడా తన దృష్టిగా చెప్పారు. పిల్లలను సంస్కార వంతంగా పెంచాలని, మన ఆచారాలని పూర్తిగా తెలుసుకోకుండా అవహేళన చేయకూడ దని కూడా పరోక్షంగా చెప్పారు. బాధ్యతను తీసుకోగలిగిన సమాజం మన సాంప్రదా యాలను, ప్రేమానుబంధాలను అర్ధం చేసుకోవడంలోనూ, క్షణికావేశాలకు లోనూ కాకుండా, జీవితాన్ని అర్ధవంతంగా తయారు చేసుకోవడంలోనూ ఉంటుందన్న భావన ఈ కథలు చదువుతుంటే కలుగుతుంది. ఈ సందర్భంగా రచయిత్రికి అభినందనలు.
*****
శృంగవరపు రచన (రచనశ్రీదత్త) కాలమిస్ట్ , కథా రచయిత్రి , వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, ఆంగ్ల శిక్షకురాలు, అనువాదకురాలు, పుస్తక-సినీ సమీక్షకురాలు. ఆవిర్భవ సాహిత్య సంస్థలో భాగమైన ఆవిర్భవ తెలుగు పక్ష పత్రికకు ఆమె ఎడిటర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించారు. ఆంగ్లం నేర్చుకోవడం ఎలా, వ్యక్తిత్వ వికాసం మరియు సినీ సమీక్షల గురించి ఆవిడ దాదాపు 70 వీడియోలు వరకు చేశారు. ప్రస్తుతం spotify లో ‘Rachana-The Book Critic’ షో నిర్వహిస్తున్నారు.