అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 10
– విజయ గొల్లపూడి
జరిగినకథ: విశాల, విష్ణుసాయి పెళ్ళి కాగానే, ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పరుచుకో వడానికి సిడ్నీ చేరుకుంటారు. విష్ణుసాయి కొలీగ్ సిడ్నీలో తన బంధువు వివరాలు ఇస్తాడు. ఆ విధంగా సిడ్నీచేరుకోగానే వినయ్, అనిత వారిని తమ ఇంటికి తీసుకుని వెడతారు.
***
మనిషికి, మనిషికి మధ్య ఏర్పడే పరిచయాలు కొన్ని శాశ్వతంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని పరిచయాలు కేవలం అవసరం నిమిత్తమై ఏర్పడి, దేముడు పంపిన దేవదూతల్లా కొంత మంది ఆ సమయానికి ప్రత్యక్షమవుతారు. పరిచయం నిలుపుకోవాలని ఇరువురు అనుకున్నాగానీ, పరిస్థితుల ప్రభావం వల్ల లేదా దైవనిర్ణయం వల్ల కొన్ని బంధాలు కలకాలం కొనసాగవు. అదేనేమో డెస్టినీ అంటే….
విష్ణుసాయి వినయ్ తో ముఖ్యవిషయం మాట్లాడాలి అని విషయం చెప్పబోతుంటే, అపుడే డోర్ బెల్ మ్రోగగానే, ఒక్క నిమిషం అంటూ వెళ్ళి తలుపు తీసాడు. ఎదురుగా తన స్నేహితుడు గోపి నవ్వుతూ లోపలికి వచ్చాడు.
“నెక్స్ట్ వీక్ మీరు వరల్డ్ టూర్ వెళ్ళిపోతున్నారు కదా, ఒకసారి కలుద్దామని వచ్చాను” అన్నాడు గోపి.
గోపి సోఫాలో కూర్చుంటూ, ప్రశ్నార్థకంగా విష్ణుసాయి వంక చూసాడు. వినయ్ విష్ణు ని పరిచయం చేస్తూ..
“మీట్ క్యూట్ కపుల్ అంటూ అపుడే అక్కడకి వచ్చిన విశాలను, విష్ణుసాయిని చూపిస్తూ, వీళ్ళు ఈ రోజే వచ్చారు, గోయింగ్ టు సెటిల్ హియర్ ఇన్ ఆస్ట్రేలియా.”
గోపీ, విష్ణు ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.
వినయ్ మళ్ళీ మాటలు కొనసాగిస్తూ “గోపి, నేను అదివరకు ఒకేచోట పనిచేసే వాళ్ళము. గోపీ బ్లాక్ టౌన్ లో ఉంటాడు.” అని చెప్పాడు.
ఇంతలో అనిత వచ్చి, హాయ్ గోపీ! చాలా రోజులైంది నిన్నుచూసి, భోజనం చేద్దువు గాని రా అని డైనింగ్ రూమ్ లోకి తీసుకువెళ్ళింది.
వినయ్ విష్ణుతో చెప్పాడు, “మేము ఇంకో వారంలో వరల్డ్ టూర్ హాలిడేస్ కి వెడుతు న్నాము. అందుకనే ఇందాక మా నైబర్ కి బాక్ యార్డ్ చూసుకోవడానికి కీస్ ఇచ్చాము. చెప్పు, ఇందాక ఏదో మాట్లాడాలన్నావు కదా, ఏమిటి?”
“ఇక్కడకి మేము పెర్మనెంట్ వీసాతో వచ్చాము. మొదటగా ఐడెంటిటీ ఏర్పరుచుకో వడానికి ఏమేమి చేయాలి, ఒకసారి నాకు సీక్వెన్స్ చెప్పండి. అలాగే నేను ఉండటానికి అకాండేషన్ వగైరా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను.”
వినయ్ పెన్, నోట్ పాడ్ చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. “మీరు జాబ్ కి అప్లై చేసారా? అది తెలుస్తే అపుడు మీరు ఇల్లు ఆ ప్రదేశానికి దగ్గరగా తీసుకుంటే బాగుం టుంది.”
విష్ణు చెప్పాడు నేను రీసెర్చ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చాను, ఐతే కొద్దిగా సెటిల్ అయ్యాక వర్క్ తో కంబైన్డ్ గా రీసెర్చ్ టాపిక్ యూనివర్సిటీకి వెళ్ళి వాకబుచేయాలి.
అపుడు వినయ్ నర్మగర్బంగా నవ్వుతూ అన్నాడు. “విష్ణు, నేను ఒకటి ఓపెన్ గా చెపుతాను. ఇక్కడ సిడ్నీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈస్ వెరీ హై. మీరు టెక్నికల్ గా హైలీ స్కిల్డ్ ఐతే బెటర్ టు గెట్ ఎ జాబ్ ఫస్ట్. తర్వాత కొంత సమయం తీసుకుని, మెల్లిగా రీసెర్చ్ వర్క్ చేసుకోవడం మంచిది అని నా ఒపీనియన్.
ఇంక మీరు మంచి విషయం అడిగారు. ఐడెంటిటీ కోసం, జాబ్స్ అప్లై చేయడానికి మీరు పెర్మనెంట్ రెసిడెంట్ గా వచ్చారు ముందు టాక్స్ పైల్ నంబర్ కోసం, ఆస్ట్రేలి యన్ టాక్స్ ఆఫీస్ కి వెళ్ళి, ఫాం ఫిలప్ చేయండి. ఇరవై ఎనిమిది రోజుల్లో వచ్చేస్తుంది.
ఆస్ట్రేలియాలో కామన్ వెల్త్ బ్యాంక్, సెయింట్ జార్జ్ బ్యాంక్, వెస్ట్ పేక్, నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ ముఖ్యమైనవి. మీరు వీటిలో ఒక బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయండి.
అడ్రస్ కోసం మీకు ఇల్లు దొరికే వరకు, నా ఫ్రెండ్ ప్రస్తుతం ఒక్కడే ఉంటున్నాడు, అతని ఇంట్లో ఒక నెల రోజులకు మీరు పేయింగ్ గెస్ట్ గా ఉండటానికి అడుగుతాను.ఇక్కడ ఇంటి అద్దె చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎవ్విరి వీక్ ఆర్ ఫోర్ట్ నైట్ పే చేయాలి. అలాగే జాబ్స్ సేలరీ వీక్లీ ఆర్ ఫోర్ట్ నైట్ పే చేస్తారు. గెట్ డ్రైవర్స్ లైసన్స్ ఫస్ట్, ఆర్ టి ఏ ఆఫీస్ కి వెళ్ళి అప్లై చేయండి, అని లిస్ట్ నోట్ పాడ్ లో రాసి ఇచ్చాడు.
గోపీ, నువ్వు అంతకు ముందు పేయింగ్ గెస్ట్ కావాలి అని చెప్పావుగా? ఒక నెల రోజులు నువ్వు ఇండియా వెళ్ళినపుడు ఇంటిని చూసుకోవడానికి అన్నావు, అంత వరకు వీళ్ళు మీ ఇంటిలో ఉంటారు. నీ పేరు, ఫోన్ నంబర్ రిఫరెన్స్ గా ఇస్తారు, అడ్రస్ కూడా.
విష్ణు యు కెన్ పే హిం హండ్రెడ్ డాలర్స్ పెర్ వీక్ అని ఒక మధ్యవర్తిగా గడ గడా చెప్పేసాడు.”
ఆ సమయంలో విష్ణుకి వేరే ఛాయిస్ లేదు, ఆలోచించుకునే వ్యవధి కూడా లేదు. బయటివారి నుంచి సాయం తీసుకుంటున్నపుడు, ఫ్యూచర్ గురించి ఎక్కువ తర్జన, భర్జనలు జరిపే ఆస్కారం, చనువు అతనికి లేదు. ఒక్కసారిగా వారానికి వంద డాలర్ల్ అనగానే అంటే ఐదువేలు ఇవ్వాలన్నమాట అని మనసులో లెక్కలు వేసుకున్నాడు. తన దగ్గిర ప్రస్తుతం ఉన్న డాలర్ల్ ఇంటి అద్దె పేయింగ్ గెస్ట్ అకాండేషన్ కే ఖర్చు అయ్యేటట్టుంది అనుకున్నాడు.
అమర్, అన్విత అక్కడకు నవ్వుతూ వచ్చారు.
“ఐ గాట్ ఎ వీక్ ఎండ్ ప్లాన్ టుమారో. వెదర్ ఈస్ బ్రైట్ అండ్ సన్నీ. లెట్స్ ఆల్ హేవ్ ఫన్ ఫర్ టుమారో. వియ్ ఆల్ గో టు బోండై బీచ్” అన్నాడు అమర్.
“ఓకే గోపి, నువ్వు కూడా రా. రేపు అందరం కలిసి బీచ్ కి వెడదాం. తరువాత విష్ణు, విశాల వాళ్ళిద్దరినీ మీ ఇంటికి తీసుకుని వెళ్ళు.” అన్నాడు వినయ్.
విశాల, విష్ణు వంక ప్రశ్నార్థకంగా చూస్తుంది. కళ్ళతో విష్ణు నేను నీకన్నీ చెపుతాగా అన్న భావంతో ఆమె వైపు చూసాడు. అలా వారిరువురు కళ్ళతో మాట్లాడుకోవడం గోపీ గమనించాడు.
అన్విత అందరికీ వేడి వేడిగా టీ ఇచ్చింది. హాలులో టీ.వి నడుస్తోంది. ఆస్ట్రేలియా లో మిలీనియం ప్రత్యేకత, ఒలింపిక్స్ కి ఆతిధ్యం ఇవ్వడం, ఓపెనింగ్ సెర్మనీ వచ్చే వారం అట్టహాసంగా మొదలవుతోందని న్యూస్ కవరేజ్ వస్తోంది.
విశాల ఆసక్తిగా ఆ వివరాలు చూస్తోంది.
“మనం వెళ్ళే బీచ్ దగ్గిర ఒలింపిక్ ఈవెంట్ టికెట్స్ అమ్ముతున్నారు” అని గోపీ అన్నాడు.
పిచ్చాపాటి కబుర్లు అవీ ఇవీ మాట్లాడుకున్నాక, గోపీ “ఇంక నేను వెడతాను” అని లేచాడు. “రేపు ఎనిమిదిన్నరకి వచ్చేస్తాను, అందరం కలిసి రెండు కార్లలో బీచ్ కి వెడదాము” అని చెప్పి వెళ్ళీపోయాడు.
విష్ణు మొహమాట పడుతూ “ఇండియా కి ఫోన్ చేసుకోవడానికి నేను $10 డాలర్స్ కార్డ్ కొన్నాను. మొబైల్ ఫోన్ ఏ కంపెనీ బెటర్?” అన్నాడు.
“విష్ణూ!, ఏమీ ఫర్వాలేదు. మీరు ఈ రోజు మా ఫోన్ లో లోకల్ నంబర్ చేసి కార్డ్ యూజ్ చేయండి. మీరు కొనుక్కోవడానికి ప్రీ పెయిడ్ మొబైల్ ఓడా ఫోన్ బెస్ట్.” అని అనిత చెబుతూ చేతికి ఫోన్ రిసీవర్ ఇచ్చింది వినయ్ కి.
హాలులో విష్ణు, విశాల ఇద్దరే ఉన్నారు. అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు డిస్పర్స్ అవడంతో వాళ్ళు ఇండియా ఫోన్ చేసుకోవడానికి కాస్త ప్రైవసీ ఏర్పడింది.
విష్ణు, ఇంటికి ఫోన్ చేసి “అమ్మా! మేము ఇక్కడ బాగానే ఉన్నాము. వీలు దొరికి నప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. మేము రేపు వేరే చోటకి మూవ్ అవుతున్నాము. నాన్నగారికి ఒకసారి ఇవ్వు” అనగానే విశ్వనాథంగారు ఫోన్ తీసుకున్నారు. “ఏరా, విష్ణు అమ్మాయి, నువ్వు ఎలా ఉన్నారు? నువ్వు స్థిమితంగా అన్ని పనులు చక్కబెట్టుకో. డబ్బు కోసం ఇబ్బంది పడకు. నేను కావాలంటే సర్దుతాను.” అని అన్నారు.
తరువాత విశాల కూడా ఒకసారి వాళ్ళకి హలో చెప్పింది. విశాల తన తల్లిదండ్రు లతో కూడా మాట్లాడింది. “అమ్మా! ఈ రోజు సూపర్ మార్కెట్ కి వెళ్ళాను. వెజిటబుల్స్ అన్నీ పెద్ద సైజ్ లో ఉన్నాయి. మమ్మల్ని ఈయన ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకుని, చక్కగా మంచి బ్రేక్ ఫాస్ట్, లంచ్ పెట్టారు అని గలగల ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది. విష్ణుకి కాస్త బెరుకుగా ఉంది. ఫోన్ లో విశాల అన్ని విషయాలు అలా చెప్పేయటం చూసి, ‘అసలు ఏ విషయం దాచకుండా అన్నీ చెప్పేస్తుంది, తల్లిదండ్రుల వద్ద గారంగా పెరిగిన అమ్మాయి’ అనుకున్నాడు మనసులో విష్ణు.
విశాల, విష్ణు, వచ్చిన మొదటి రోజు ప్రయాణ బడలికతో ఒళ్ళు తెలియకుండా త్వరగా నిద్రపోయారు.
మరుసటిరోజు ఉదయమే ఐదు గంటలకి విశాలకి మెలకువ వచ్చేసింది. ఆలస్యం చేయకుండా స్నానాదికాలు ముగించుకుని రెడీ అయిపోయింది. తన హ్యాండ్ బ్యాగ్ లో స్తోత్రరత్నావళి పుస్తకం తీసుకుని ఆదిత్యహృదయం చదువుకుంది. బాల్కనీలోకి వెళ్ళి, అపుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ఓం దివాకరాయనమః! అని నమస్కారం చేసింది.
ఇంతలో అనిత వచ్చి, “విశాలా! గుడ్ మార్నింగ్. రాత్రి డిన్నర్ చేయకుండానే ఇద్దరు నిద్రపోయినట్టున్నారు. బాగా నిద్ర పట్టిందా? అంది.
“అవునండీ, బాగా అలసిపోయాము. మాకు ఒక రోజు మాయమైపోయినట్టుంది ఈ టైమ్ జోన్ డిఫరెన్స్ వల్ల. నిద్రకి ఆగలేక పడుకుండిపోయాము.” అంది విశాల.
అందరూ లేచి త్వరగా సిద్ధమైపోయారు. అనిత వేడివేడిగా జీడిపప్పు ఉప్మా అల్పాహారంగా ఇచ్చింది. గోపీ అనుకున్న టైమ్ కి ఠంచన్ గా ఎనిమిదిన్నర కి రాగానే అందరూ రెండు కార్లలో సర్దుకుని, వెనకాల క్రికెట్ కిట్, థ్రో రగ్ సరంజామా పెట్టుకుని బయలుదేరారు.
ఈసారి అనిత, విశాల కారు బాక్ సీట్ లో కూర్చుని చాలా కబుర్లు చెప్పుకున్నారు. విశాలలో ఉన్న ఒక సద్గుణం మనసులో ఏ కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్లు సమయానుకూలంగా మాట్లాడగలగటం అనితకు నచ్చింది.
కాసేపు అందరూ కారులో అంత్యాక్షరిలో కొత్త, పాత పాటలు పాడుకున్నారు. విశాల తనకు బాగా వచ్చిన జానకి పాట ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ అని అందుకుంది. అమర్, అన్వితతో సహా అందరూ ఆమె ఓయిస్ మెలోడియస్, పాట అద్భుతంగా పాడింది అని మెచ్చుకున్నారు.
విష్ణుకు విశాల పాట వినగానే ఒకింత గర్వం, ఆనందం కలిగాయి. విశాలలో తనకు తెలియని టాలెంట్స్ చాలా ఉన్నాయి అని గ్రహించాడు ఆ క్షణంలో.
టైమ్ తెలియనంత వేగంగా అందరూ బీచ్ కి చేరుకున్నారు. గోపి, విశాలవిష్ణుల దగ్గరకి వచ్చి “దిస్ బోండై బీచ్ ఈస్ ఆస్ట్రేలియాస్ ఐకానిక్ బీచ్ అన్నాడు.
బీచ్ కి తగ్గట్టుగా అందరూ డ్రెస్ చేసుకుని హేట్స్ పెట్టుకున్నారు. అమర్ అందరి చేతికీ సన్ స్క్రీన్ లోషన్ ఇస్తున్నాడు. విశాల చేతికి ఇవ్వగానే, “ఏమిటిది?” అని అడిగింది.
దానికి అనిత, దిస్ ఈస్ సన్ స్క్రీన్. ఇక్కడ ఎండ ధాటికి తట్టుకోవడానికి, సన్ బర్న్ స్కిన్ మీద రాకుండా ఇది వాడతారు అని చెప్పింది.
అందరూ కార్ పార్కింగ్ దాటుకుని, బోండై బీచ్ కి చేరుకున్నారు. ఒక్కసారిగా బీచ్ దగ్గిర వాతావరణం చుట్టూ ఇసుక తిన్నెలు, అక్కడక్కడ ఆస్ట్రేలియా భామల సోయగాలు, చిన్న పిల్లలు ఇసుక గూళ్ళు కట్టుకుంటూ కేరింతలు, మరోవైపు బీచ్ నీటిలో సర్ఫింగ్, స్విమ్మింగ్ చూసి విశాల, విష్ణు విస్మయానికి లోనయ్యారు. ఇద్దరూ తెలియకుండానే ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. వావ్ బ్యూటిఫుల్ అని ఈసారి విష్ణు ఆనందంగా అన్నాడు.
గోపీ తన కెమెరాతో వెంటనే ఇద్దరికీ ఒక ఫోటో తీసాడు.
అమర్, అన్విత క్రికెట్ ఆడటానికి సన్నాహాలు చేస్తున్నారు. వాళ్ళు ఆడుకుంటున్న సమయంలో వినయ్ విష్ణు దగ్గిరకు వచ్చి “క్రొత్త జంట, మీరు ఇద్దరూ సరదాగా బీచ్ వాక్ వెళ్ళి రండి” అన్నాడు.
ఇద్దరూ మెల్లిగా ఇసుకలో చేతులు పట్టుకుని, నీళ్ళ దగ్గిరకు చేరుకున్నారు. కాలి జోళ్ళు కార్లలో వదలడంతో, ఎగసిపడే అలలు వారిరువురి పాదాలను సుతారంగా స్పృజిం చాయి. అంత వరకు ఎండ వేడికి కందిపోయిన విశాల అరిపాదాలకు చల్లదనం తాకగానే సంతోషపడింది.
“అబ్బో, బోండాయ్ బీచ్ చాలా చాలా బాగుంది. ఊహలకు మించి ఉంది. అయామ్ వెరీ లక్కీ టు బి హియర్” అంటూ ఆనంద పడింది.
విష్ణు విశాలను చూస్తూ “ఐయామ్ గ్లాడ్ విశాల, యూ ఆర్ హాపీ. పద వాళ్ళు ఎదురు చూస్తున్నారు” అన్నాడు.
దానికి విశాల “విశాలమైన సుందర అలల తీరాన్ని వదిలి రావాలని లేదు” అంటుంది.
దానికి అతడు “మనం మళ్ళీ ఇంకోసారి వద్దాం, అపుడు నువ్వు ఎంత సేపైన ఉండవచ్చు.” అన్నాడు
ఇద్దరూ తిరిగి అందరి దగ్గిరకు వచ్చారు.
అమర్, అన్విత అందరికీ ఐస్క్రీమ్ కోన్స్ కొనుక్కుని తలొకటీ ఇచ్చారు.
వాళ్ళు ఐస్క్రీమ్ తింటూడగా, గోపీ విష్ణుని తీసుకుని “మీరు నన్ను ఒక విషయం అడిగారుగా, పద వెడదాం అంటూ దూరంగా వేరేచోటికి తీసుకుని వెళ్ళిపోవడం చూసి, విశాల ఆశ్చర్యంగా వాళ్ళవైపు చూస్తూ, నాకు తెలియకుండా విష్ణు గోపీని ఏమి అడిగాడు, ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచనలో పడింది.
* * * * *
(ఇంకా ఉంది)