‘ఎదురుగా హిమాలయ శిఖరాలు! వారి వారి స్థాయిలను బట్టి కూర్చుని ఉన్న దేవతలందరి నిర్నిమేష దృక్కులూ ఒకే చోట కేంద్రీకృతాలై ఉన్నాయి. డమరుక విన్యాసాలూ, శంఖ ధ్వనులూ, వీణా వేణు నాదాలూ, జతుల సందడులూ – అన్నిటితో కూడిన సర్వేశ్వరుని నాట్య చాతుర్య దృశ్యాలు!
ఏమానందము భూమీతలమున ! అదిగదిగో! బంగారు రంగుల మబ్బులు, నెమ్మది గా కదులుతున్నాయి. త్వరగా వెళ్తే, సంధ్యా శివుని నాట్యం చూడలేకపోతామేమోనన్న భయం వల్ల కాబోలు! ఆకాశ మార్గంలో గుంపులు గుంపులుగా, అతిలోక సుందరీమణులైన అప్సరా బృందాలు, తదేకంగా కైలాస శిఖర సానువుల మీద జరుగుతున్న నటరాజు నాట్య చాతుర్యాన్ని వీక్షిస్తున్నారు. తామింత వరకూ నేర్వని సరికొత్త నాట్య భంగిమలూ, విన్యాసాలూ, ముద్రలూ శివ నాట్యంలో కనిపిస్తున్నాయి మరి! అటువంటి భంగిమలను అతి అలవోకగా ప్రదర్శిస్తూ, అప్పుడప్పుడు, వారిని కూడా సవాల్ చేస్తున్నట్టే ఉంది సదాశివుని నాట్యావేశం! ‘ ఇలా మధ్య మధ్య వ్యాఖ్యానంతో సాగిపోతూంది శివతాండవ గానం.
అక్కడ కూర్చుని వున్న పిల్లలందరూ విచ్చుకున్న కళ్ళతో ఆయన్నే చూస్తున్నారు. చేతులు ఆడిస్తూ, ఏవేవో భంగిమలు చూపిస్తూ, అప్పుడప్పుడు, నాట్యాభినయం కూడ చేస్తూ, గంభీరమైన గళంతో పుట్టపర్తి శివతాండవ గానం చేస్తూ ఉంటే, అదేదో అద్భుతం చూస్తున్నట్టు..వాళ్ళ కళ్ళల్లో ఆశ్చర్యం!
ఇక పాఠశాల అధ్యాపక బృందం, అక్కడున్న పెద్దవాళ్ళ పరిస్థితి సంభ్రమమే! వాళ్ళు ఇంతకు ముందెన్నడూ ఇటు వంటి పండితోత్తముని ఉపన్యాసం విననేలేదు. సాహిత్యోపన్యాసాలలో ఏదో పరిమిత జ్ఞానంతో ఎంతో కష్టపడి ఒక గంటసేపు మాట్లాడి ‘అయిందమ్మ వాయనం’ వలె ఉపన్యాసం ముగించి, వాళ్ళిచ్చే దుశ్శాలువా, అర్ధ నూటపదహార్లో మరొకటో పుచ్చుకుని, వెళ్ళిపోయేవాళ్ళే తప్ప, పిల్లలతోనూ ఇలా కలిసి పోయి వాళ్ళనూ శ్రోతలుగా పరిగణించి, సంభాషిస్తూ, మధ్యలో హాస్యోక్తులతో, అటు పెద్దలనూ, ఇటు పిల్లలనూ కూడా ఆకట్టుకుంటున్న పుట్టపర్తి ఒక అద్భుతం. పైగా యీ శివతాండవ గానం, మరీ ప్రత్యేకం.
ఎవరికి వారు, తాము కూడా కైలాసంలో నటరాజు ఎదురుగానే కూర్చుని వారి నాట్య వైభవాన్ని దర్శిస్తున్నట్టు అనుభూతి చెందుతున్నారు. ఎందుకంటే పరమశివుడు భక్తవ శంకరుడు కదా! తక్కిన దేవతలకన్నా భక్తుల ఆనందమే హరునికి హర్షాతిరేకాన్నిస్తుంది. అందుకే ఇక్కడ కూడా భక్తులకే ప్రథమ తాంబూలం.
ప్రధానాధ్యాపకుడు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య వైపు, మెచ్చుకుంటున్నట్టుగా చూశారు. వల్లంపాటి గుండెల్లో కోటి వీణలు! పుట్టపర్తిని పట్టుదలతో తానే కదా ఇక్కడికి రప్పించి, వీళ్ళందరికీ యిటువంటి అనుభూతిని, ఇంత:పూర్వమెరుగని పారవశ్య ముంటుందని తెలియబరచింది మరి! వల్లంపాటి మనసు కూడా పరవళ్ళూ తొక్కుతూ ఉంది.
ఏమిటీ స్వామి కల్పనాశక్తి! వారి గళంలో సంస్కృత శ్లోకాలు వింటుంటే, వేద నాదాలు వింటున్నట్టే ఉంది. గంభీరంగా వారు గొంతెత్తి పఠిస్తూ ఉంటే, తాను సంస్కృతం చదవక పోయినా వాటి అంతరార్థమేదో అవగతమైపోయినట్టుగానే అర్థమవు తున్నది. తలపైని చదలేటి..అలలు తాండవిస్తున్నాయట! క్రొన్నల పూవు అంటే ఏమిటో? ఊహూ..ఒక్క పదమూ అర్థం కావటం లేదు. కానీ ఏదో అంతా అర్థమైనట్టుగానే, సంతోషానుభూతి. శివతాండవం పుటలు తక్కువే ఐనా, అర్థం కావాలంటే, జీవితకాలం పట్టేలా ఉంది..’ ఇలా వెంకటసుబ్బయ్య ఆలోచనలు సాగిపోతున్నాయి. ఒక్కసారి పక్క నున్నతను ఆనందంతో చప్పట్లు కొట్టేసరికి ఇహలోకంలోకి వచ్చి పడ్డాడు.
అటు వేదిక మీద పుట్టపర్తి శివతాండవ పఠనం, మధ్యలో వ్యాఖ్యానం కూడా జోరుగా సాగుతున్నది. ‘మేళకర్త రాగాలంటే, సంగీతంలోని ప్రధాన రాగాలు. అవి డెబ్భైరెండు. వాటిలో సప్తస్వరాలుంటాయి. సప్త స్వరాలెన్ని పిల్లలూ?’
పిల్లల నుంచీ జవాబు రాలేదు. అధ్యాపకుల్లో ఒకరెవరో అన్నారు. ఏడు కదా స్వామీ!
‘ఆ అవును. ఈ ఏడు స్వరాలూ స రి గ మ ప ద ని. షడ్జమం స. రిషభం రి. గాంధారం గ. మధ్యమం మ. పంచమం ప. ధైవతం ద. నిషాదం ని. ఇవన్నీ శుద్ధంగా అంటే వాటి స్థానాల్లో వాటిని పాడే విధంగా ఉండటం ఒక పద్ధతి. దాన్ని శుద్ధ రిషభం, శుద్ధ గాంధరం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, ఇలా అంటారు. పంచమం ఎప్పుడూ మారదు. పంచమం కోకిల స్వరమ మన్నమాట! కోకిల ఎప్పుడూ ఒకే శ్రుతిలో పాడుతుంది కాబట్టే సంగీతంలో పంచమ స్వరం, ఏ రాగంలోనైనా అదే స్థానంలో ఉంటుందన్నమాట! అలా కాక తక్కిన స్వరాలను వాటి స్థానాల్లో కాస్త తగ్గించో లేదా సరళంగా సున్నితంగా పాడటమో చేస్తే వాటికి వేరే పేర్లు. ఇంతకూ యీ మేళకర్తరాగాల నుండీ చిన్న చిన్న తేడాలతో మరెన్నో రాగాలు పుట్టాయి. పుట్టాయి అంటే, సంగీత శాస్త్ర కారుల గానాలలో ఇలా ఊపిరి పోసు కుని, వారు పాడగా పాడగా, ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట! అందుకే వాటిని జనక రాగాలంటారు. వాటి నుండీ వచ్చిన వేరే రాగాలను జన్యరాగాలంటారు. శివుడు మేళకర్త రాగాలలో అంటే జనక రాగాల్లో ఆలాపన చేశాడట!’
‘ఆయనే జగత్పిత కదా మరి!’
గుంపులో ఎక్కడి నుంచో ఒక గొంతుక.
పుట్టపర్తి ముఖాన చిరునవ్వు. ‘ఈ కావ్యమంతా ఒక భావోద్వేగంలో ఆశువుగా ఆవిర్భవించిన రచన. కాకపోతే, నేను వైష్ణవుడైనందు వల్ల, అటు ఆళ్వారులూ, ఇటు నాయనార్ల భక్తి సాహిత్యాన్ని బాగా పఠించటమూ జరిగింది. కొన్ని సంగతులు ఆయా పండితులనడిగి తెలుసుకోవటమూ జరిగింది. చిదంబరంలోని నటరాజ మూర్తి ప్రధానంగా నన్నమితంగా ఆకర్షించింది. చిదంబర రహస్యమన్న విశ్వాసం వెనుక వ్యక్తిగతంగా నా ఆత్మకు సంబంధించిన ఏదో బంధమున్నట్టే తోచేది. సహజంగా నాకు ఇటు వంటి విషయాల గురించి ఆసక్తి ఎక్కువే! అదే స్పందనను, నా మనసు యీ విధంగా వ్యక్తపరచిందేమో! ఏది ఏమైనా, యీ శివతాండవం నా జన్మ చారితార్థకమైంది. ఇదేనప్పా నా సాహిత్య కృషి! మీకు నచ్చిందని మీ చప్పట్ల వల్ల తెలిసింది. ఇంకేమి మాట్లాడేది. పిల్లలకు నేను చెప్పేదొక్కటే. బాగా చదువుకోండి. బాగా ఆడుకోండి. బాగా అల్లరీ చెయ్యండి. ఇవన్నీ బుద్ది వికాసానికి మార్గాలే! ఒరే వెంకటసుబ్బయ్యా! మంచి నీళ్ళూ, కాస్త కాఫీ కావాల్రా!’ అంటూ కుర్చీలో కూర్చున్నారు పుట్టపర్తి.
బాగా అల్లరి చెయ్యండి అన్నందుకో ఏమో గానీ, పిల్లలందరూ, ఎంతో గట్టిగా చప్పట్లు కొట్టారు.
అప్పటిదాకా ఏదో ఆకాశంలో విహరిస్తున్నట్టే ఉన్న వెంకటసుబ్బయ్య, పుట్టపర్తి వారు తన పేరు పెట్టి పిలవటంతో యీ లోకంలోకి వచ్చి పడ్డాడు. పరుగుపరగున పుట్టపర్తి గారికి మంచినీళ్ళ గ్లాసు అందించి వచ్చి, వెంటనే వేదిక దగ్గరే తయారుగా ఉంచిన ఫ్లాస్క్ లో నుంచీ వేడి వేడి కాఫీ కూడా గ్లాసులో పోసి వారికి వినయంగా అందించాడు. ప్రధానో పాధ్యాయులూ, ఇంకా కొంత మంది పెద్ద మనుషులూ కలిసి, పుట్టపర్తి వారికి సన్మానం ఏర్పాట్లు చూసుకుంటూ హడావిడి పడుతున్నారు.
ప్రధానోపాధ్యాయుడు, ఎంతో సంబరంగా మైక్ అందుకున్నాడు. ‘సరస్వతీపుత్రుల వారికి నమస్కార శతములు. ఈ రోజు మాకూ మా పిల్లలకూ కూడా ఎంతో గొప్ప పర్వ దినం. మీ వంటి పండితోత్తముడు, మహాకవి, ఎక్కడో ఉన్న చిన్న పల్లెటూరుకి రావటం మా భాగ్య విశేషం మీ కవిత్వాన్ని శివతాండవాన్ని సవ్యాఖ్యానంగా వినిపించటం, మా పూర్వజన్మ సుకృతం. పిల్లా పెద్దా అందరమూ, సశరీరంగా కైలాసానికి వెళ్ళీ ఆ పరమశివుని తాండవాన్ని చూసివచ్చినట్టుగా ఉంది. మీ వంటి పండితునికి మా యీ సత్కారం, చంద్రునికి నూలుపోగు వంటిదే! కానీ, మీరు మాకు యీ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ధన్యులం. ముఖ్యంగా మా ఊరబ్బయి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య ద్వారా మీ రాక ఇక్కడికి సాధ్యమైంది. అతనికి కూడా సభా ముఖంగా నా ఆశీస్సులు. అసలా అబ్బాయికి శివతాండవం ముందే పరిచయమవటం మా అదృష్ట మైంది కదా మరి! ఇప్పుడీ చిన్న మొత్తంతో మిమ్ములను సత్కరిస్తున్నాం. క్షమించవలె! కానీ మా పాఠశాలతో మీ అనుబంధాన్ని ఇట్లే కొనసాగించాలనీ, వచ్చేసారి ఘన సన్మానం చేస్తామని కూడా సభాముఖంగా మనవిచేసుకుంటూ, యీ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించటానికి వల్లంపాటి వాళ్ళ తండ్రిగారు, పెద్దలు, అశ్వత్థమయ్యగారిని ఆహ్వానిస్తున్నాను.’
పుట్టపర్తి వారికి మల్లెపూలదండ వేసి, దుశ్శాలువ కప్పి, అర్ధ నూట పదహార్లతో సన్మానం ముగిసింది, పిల్లల కేరింతలూ, పెద్దల గౌరవ వచనాల మధ్య!
రాత్రి పుట్టపర్తికి వెంకటసుబ్బయ్య ఇంట్లోనే పడక.
బాగా అలసిపోయిన పుటపర్తి స్వామి భోజనం తరువాత మంచం మీద అలా వాలీవాలగనే నిద్రలోకి జారుకున్నారు. పక్కనే కూర్చుని విసన కర్రతో వారికి గాలి తగిలేలా మెల్లగా విసురుతున్న వెంకటసుబ్బయ్యకు వీరు రేపేగదా మళ్ళీ కడపకు వెళ్ళి పోతారన్న సంగతి గుర్తుకు వచ్చి, ఏదో వెలితి ఏర్పడబోతున్నదన్న భావం కలిగింది. ఊహూ..కాకూడదు. ఈ సరస్వతీపుత్రునితో తన పరిచయమిక్కడే ముగియ కూడదు. జీవితాంతం కొనసాగాలి, దీనికి తానేమైనా చెయ్యాలి. ఎలా? అని ఆలోచనలో పడ్డాడు.
*****
(సశేషం)