కల్యాణి నీలారంభం గారి స్మృతిలో-
(ఇటీవల పరమపదించిన కల్యాణి నీలారంభం గారికి నెచ్చెలి నివాళిగా వారి ఇంటర్వ్యూలని పాఠకులకు మళ్ళీ అందిస్తున్నాం -)
-డా||కె.గీత
Rendezvous with Kalyani a.k.a Life
కల్యాణి నీలారంభం గారితో సాయిపద్మ కబుర్లు – సాయిపద్మ
ఈ ములాకాత్ , ముఖాముఖీ కి పేరు పెట్టేటప్పుడు కూడా ఎంతో ఆలోచించాను. కల్యాణి గారు అందామా.. లేదా తెలుగు పేరు పెట్టలేమా అని.. నాకెందుకో ఆమె ఫైరీ స్పిరిట్ కి, రాందవూ అనే పేరు సరైంది అనిపించింది. rendezvous అనే పదానికి స్లాంగ్ లో, ఒక సన్నిహిత సమావేశం అనే అర్ధం కూడా ఉంది.. మరి అందుకేనేమో..!
ఇకపోతే, కల్యాణి గారు.. ఒక నది.. చిన్న చిన్న కాలువల, చెలమల దాహాన్ని తీర్చి, అవి తనని దాటి వెళ్ళినా హాయిగా నవ్వుతూ, వెళ్తూ ఉండాలి అనుకుని సాగనంపే ధీమతి అయిన నిర్మోహ నది..!
అలాంటి కల్యాణి గారితో.. కొన్ని కబుర్లు- అవి నాకు, మీకూ కూడా హాయి అయిన కబుర్లు. మళ్ళీ మర్చిపోతానేమో, లేదా జీవితపు మైమరపులోనో, వెరపు లోనో, పాటించనేమో అనే జాగ్రత్తతో రాసుకున్న ఆమె చెప్పిన వాక్యాలు.. దీనికి తలా తోకా, గ్రామర్, సాహిత్యం, మీటర్,వ్యాకరణం లాంటి నియంత్రణలు ఏమీ లేవు.. ఉన్నదల్లా మనుషులపై ఆమె ప్రేమ, కరుణ..నాలో కొన్ని ఎందుకిలా అనే ప్రశ్నల జవాబులు వెతకాలనే తపన ..అంతే..
కాబట్టి.. దీనికి ఒక వివరం లేదు అనుకుంటే క్షమించండి.. అర్ధం లేదు అనుకుంటే మన్నించండి.. అసలు ఎందుకిది అనుకుంటే.. ఇక్కడనుంచి చదవకండి..!!
సాయి: కల్యాణి గారూ.. మీరు ఎవరు? అమ్మ నాన్నల ప్రభావాల, మనస్తత్వాలలో మీరెంత శాతం ?
కల్యాణి: నేను అమ్మ, నాన్న్నల బెస్ట్ మిక్స్ అనుకుంటాను. నాన్న తలెత్తుకు నిలబడే తత్వం, ఉద్యోగధర్మం పట్ల శిస్తు , పనిలో ఖచ్చితత్వం నాలో ఉన్నాయి, అలాగే అమ్మ సున్నితత్వం, తన శుభ్రత, ఏ ఎమోషన్ ఉన్నా కనబడనివ్వని తత్వం కూడా .. స్టోనీ ఫేస్ అంటారు కదా అలా అన్నమాట ( నవ్వుతూ )
సాయి: భలే.. మీరు మారారా అప్పటినుండీ ఇప్పటి దాకా.. ?
కల్యాణి: మారలేదు అని చెప్పను. జీవితం మనల్ని మార్చే పద్ధతి భలే విచిత్రంగా ఉంటుంది. నేనూ అంతే. కానీ, కొన్ని నా బేసిక్ విలువలు మాత్రం అసలు మార్చుకోలేక పోయాను. ఉదాహరణకి, నాకు సారీ చెప్పే అలవాటు లేదు ( నేను తప్పు చేయకపోతే, అసలు లేదు ) , దేనికోసమూ ఎవరి కాళ్ళ మీద పడలేను. డబ్బు పోయినా పర్వాలేదు, మనశ్శాంతి ముఖ్యం అనుకుంటాను. చాలా నిర్ణయాలకు పర్మిషన్ అడగటం రాదు. అవసరం అనుకున్నది చేసేయటమే తప్ప.. అనుమతి కోసం ఎదురు చ అలవాటు లేదు. ఉద్యోగానికి కి సంబంధించిన కొన్ని విషయాలలో తప్ప, అక్కడ కూడా మంచి జరుగుతుంది అని నమ్మిన విషయాలలో వెనుతిరిగే అలవాటే లేదు.
సాయి: హహహ.. మీరు మగవాడు అయి ఉంటె , ఇవన్నీ గొప్ప నాయకత్వ లక్షణాలుగా చెప్పుకునేవారెమో కదా..?
కల్యాణి: నవ్వుతూ.. నిజమే కావచ్చు. నాకు తగ్గట్టుగా అప్పుడు చుట్టూ వాతావరణం నాకు తగినట్లుగా అడ్జస్ట్ అయి ఉండేదేమో. ఏమో పద్మా.. అంత ఆలోచించను, కానీ, నేను బాధ్యతగా అనుకున్నపని గానీ, నాకు అసైన్ చేసిన డ్యూటీ గానీ చేసేయటమే తప్ప.. ఇది ఆడపని, మగపని అనే తేడా ఉండేది కాదు .అంతే కాదు .ఆడవాళ్లం అని పనిలో కన్సెషన్ అడగడం కూడా నచ్చేది కాదు .ఒకటే జీతం ,ఒకటే పని .వ్యక్తిగత జీవితంలోని బాధ్యతలు ఉద్యోగంలోకి తీసుకుని రాకూడదు అన్నది నా నియమం .
సాయి :మరి ఆ నియమం పాటించడంలో కష్టాలు ఎదురు కాలేదా?
కల్యాణి : రాలేదని అనలేను .కాకపోతే That goes with the territory అనేమాట వినే ఉంటారు మీరు .
సాయి : అలాంటి దృక్పథం ఎలా వచ్చింది మీకు ?
కల్యాణి: ఇంట్లో వాతావరణం అనుకుంటా .ఇంట్లో ఆడ , మగ అనే తేడా చూపేవారు కాదు చదువు, బాధ్యతలు అన్నీ సమానమే.
సాయి : మిమ్మల్ని ప్రభావితం చేసిన విషయాలేమిటి ?
కల్యాణి: అమ్మతో మొదలుపెట్టి నేను చదువుతున్న సాహిత్యం, ఇంటినిండా సంగీతం ఇవి రెండూ చాలవా ? కొన్ని విషయాలలో అది ఆధ్యాత్మికతో , మరేదో నేను చెప్పలేను గానీ.. లలితా సహస్రనామం లో అమ్మవారి ముక్కెర ని వర్ణిస్తూ, కోటి నక్షత్రకాంతులు దిగదుడుపే అన్నమాట గురించి ఆలోచిస్తూ, రెండు రోజులు ఆనందించగలను.. అలాగే విష్ణు సహస్రనామంలో “యోగి హృధ్యాన గమ్యం”.. ఇలాంటి పదాలు ఏదో చెప్తూన్నట్టే ఉంటాయి. బహుశా, చదివిన సాహిత్యం కావచ్చు. సంగీతం కానీ సాహిత్యం కానీ అసలు నేను ఇదీ అదీ అని లేదు, అన్నీ వింటాను, చదువుతాను . ముఖ్యంగా క్లాసికల్ వి. ఏదో తెలీని శక్తితో అవి నన్ను నింపుతూనే ఉన్నాయి, ఉంటాయి.
అదీగాక, మనపని మనమే చేసుకోవాలి, ఎవరూ రారు అనేమాట నాలో నాకు ముద్ర పడి ఉండవచ్చు. కాబట్టి, నాకు నిరాశ కూడా ఉండదు. మొదటి పది సంవత్సరాలు వదిలేస్తే, నేను వొంటరిగా ప్రయాణాలు చేస్తూనే ఉన్నాను. అదో హాయైన అలవాటు.
సాయి: అమ్మ శర్వాణి గారి అనువాదాల గురించి, మీ అనువాదాల గురించీ చాలానే విన్నాము. మీకు పర్సనల్గా సాహిత్యం అంటే ఏమిటి?
కల్యాణి: నా వెనుక బలం. మొదట అమ్మ అనువదించిన పుస్తకానికి రెండు వందల ఏభై రూపాయలు వచ్చాయి.మేలుప్రతి చేసినందుకు అందులో సగం అమ్మ నాకే ఇచ్చేసింది అచ్చంగా. అరవైలలో నూట పాతిక రూపాయలు ..ఇంక చూసుకో, వైజాగ్ వచ్చి , బుక్ సెంటర్ లో పెరల్ బక్ పుస్తకాలు బోలెడు కొనేశాను. తెలుగు పుస్తకాలు వచ్చేవి ఎలాగో ఒకలాగా. కానీ, అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు కొనుక్కున్నది అప్పుడే. ఇంక నా సంతోషం చూసుకో.. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే.. ప్రతీ రోజూ చదువుతూనే ఉన్నాను. చాలా బిజీగా రోజూ వేరే ఊళ్లో ఉద్యోగం చేసేటప్పుడు కూడా.. బయటకి వెళ్ళాలంటే బాగ్ లో పెట్టుకొనేది మొదట పుస్తకం. వంద కిలోమీటర్ల ప్రయాణంలో, చదువుకుంటూ వెళ్ళేదాన్ని. సాహిత్యం- నా స్నేహిత, బలం, కామ్రేడ్, నాతో నడిచే, నన్ను నిరాశపరచని నేస్తం. ఒక ఇంగ్లీష్ ఫాకల్టీ గా, వ్యక్తిగా సాహిత్యం నాకు చేసిన మేలు అంతా ఇంతా కాదు.
సాయి: ఓహ్.. అదే అడుగుదాం అనుకున్నా.. సాహిత్యం మీకు ఎలా హెల్ప్ చేసింది టీచింగ్ లో?
కల్యాణి: (నవ్వుతూ) మొదట కాలం చెల్లిన సాహిత్యాన్ని గుర్తించేలా చేసింది. రోమియో జూలియెట్ పాఠం ఉన్నప్పుడు నేను ఏం చెప్తానో , ప్రేమకథ ఎంత రంజు గా ఉంటుందో అని ఊహించుకుంటూ క్లాస్ నిండిపోయేది. అమ్మాయిలు ముడుచుకుపోతూ కూర్చోనేవారు. నేను మూడు వారాలు feuds in families (కుటుంబ కలహాలు) ఎలా పుడతాయో, వాటి జెనిసిస్ ఏంటి అన్నది చెప్పాను. నిరాశపడి అల్లరి బ్యాచ్ రావటం మానేసిన తర్వాత, మామూలుగా రోమియో జూలియెట్ చెప్పాను. అది ప్రేమ కథ మాత్రమే కాదు కుటుంబ కలహ కథ కూడా కదా..? అయినా ఉదాహరణకి అందులో నర్స్ కేరక్టర్ ఉంటుంది.. పచ్చి దేహభాష, బూతులు మాట్లాడుతుంది. అది అవసరమా స్టూడెంట్స్ కి.. భాష నేర్చుకోవాలంటే వేరే క్లాసిక్స్ ఉన్నాయి కదా.. రోమియో జూలియెట్ సరిగ్గా చెప్పకుండా మావాళ్ళ నోట్లో మట్టి గొట్టారు.. అన్నారు ఒక సీనియర్ లెక్చరర్. నేనీ పాఠాలు చెప్పే కాలంలో ఆడపిల్లలు సిగ్గు పడి తలదించుకుంటే అదేదో ఘనకార్యం అనుకునే రోజులవి ., ఏ పాఠమైనా మీ అమ్మాయి అదే క్లాసులో ఉండగా మీరు పాఠం చెప్పగలిగేలా ఉండాలి అనుకుంటాను నేను అన్నాను. మరి నోరెత్తలేదు మహానుభావుడు.
సాయి: అయితే పిల్లలకి/స్టూడెంట్స్ కి ఏం నేర్పాలి అంటారు మీరు?
కల్యాణి: వాళ్ళ అభిప్రాయాలు, వాళ్లకి ఏర్పర్చుకునే ఊత ఇవ్వాలి, పర్సెప్షన్ అండ్ పర్స్పెక్టివ్ ఈ రెండు మాటలూ నాకు చాలా ఇష్టం. అవి నేర్పాలి. అది సాహిత్యం ద్వారా నేర్పినా, జీవించి నేర్పినా.. క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి నేర్పినా.. పద్ధతి ఏదైనా కావచ్చు, వాళ్ళు అర్ధం చేసుకున్నదే వాళ్ళు నిలుపుకుంటారు. ఉదాహరణకి నాతో ఉన్న మా మేనల్లుడు, వాళ్ళ నాన్నమ్మ ,అత్తల దగ్గర అల్లారుముద్దు గా పెరిగిన వాడు, ఒకరోజు ముంజేతి నేప్పితో నేను బాధపడటం గమనించి.. నేను ఏమీ చెప్పకుండానే అడగకుండానే బండెడు అంట్లు వాడే తోమేసాడు. నాకు ఆశ్చర్యం వేసింది, నా మొహంలో బాధ వాడు గమనించినందుకు. తన భార్యను ఎంతో అర్ధం చేసుకొనే మనిషిగా మారాడు అతను. నాకు చాలా గర్వకారణం అది. అదే విధంగా మరో అబ్బాయి.. మా అమ్మ తిట్టలేదు , నువ్వు తిట్టావు, నువ్వు బాడ్ అన్నాడు. నిజానికి వాళ్ళ అమ్మ తిట్టిన దానిలో నేను ఒక శాతం కూడా అనలేదు, అదికూడా ఒకసారి మాత్రమే. మనం ఎంత చేసినా, వాళ్ళ మనసులో తల్లి స్థానం వేరు, ఇంకెవరైనా వేరు అని అర్ధం చేయించాడు వాడు నాకు. అది కూడా గీతాసారం కన్నా తక్కువేమీ కాదు.
సాయి: ఇంత సాహిత్యం చదివారు కదా.. మిమ్మల్ని మీరు ఏ కేరక్టర్ తో ఐడెంటిఫై చేసుకుంటారు?
కల్యాణి: దేనితోనూ కాదు పద్మా.. అందరూ ఏదో నేర్పి వెళతారు. మనుషులు ,పాత్రలు కూడా.. ఏదన్నా రిగ్రేట్ లేకుండా నేర్చుకున్నప్పుడు బాధ ఉండదు. బంధాల్లో కూడా నేను అలాగే ఉన్నాను.. మా నాన్నగారి ఆఖరి మజిలీలో ఆయనతో ఎక్కువ మాట్లాడలేదు, గడపలేకపోయాను అనే రిగ్రెట్ తప్ప ఇంకెవరి విషయంలోనూ నాకు బాధ లేదు. ఎందుకంటె ..నిలుపుకోవటమే కాదు.. వదులుకోవటం కూడా ప్రయాణమే.. అది ఒక జర్నీ.. మజిలీలుగా చేస్తాం.. ఎవరినుంచి అయినా దూరం అయినప్పుడు.. మొదట వాళ్ళ సమీపాన్నుంచి వెళ్ళటమే కష్టం.. ఎందుకంటె, ప్రతీ వ్యక్తితో మనం ముడిపడి ఉంటాం రకరకాలుగా.. అత్యంత సాన్నిహిత్యం నుండి, ఫిజికల్ గా, మెంటల్ గా , ఎమోషనల్ గా దూరం జరగటం చాలా కష్టం. దానితో పోలిస్తే, ఇల్లు మారటం, వస్తువులు వదులుకోవటం, అక్కర్లేని మనుషుల్ని వదులుకోవటం పెద్ద విషయమే కాదు.
సాయి: ఒంటరిగా ఉండటాన్ని ఎంచుకున్నారు కదా.. ఇబ్బందిగా లేదా ?
కల్యాణి: వొంటరితనం మొదట మనిషికి దూరం జరిగినప్పుడే వస్తుంది పద్మా.. తర్వాత, మనం మానసికంగా నిలబడటం మొదలెట్టే ప్రక్రియలో.. మన శూన్యాన్ని మొదట ఇన్ఫర్మేషన్ తో, తర్వాత అనాలసిస్ తో, తర్వాత wisdom తో నింపుకోవటం మొదలెట్టిన తర్వాత, అసలు వొంటరితనానికి చోటేదీ… అందుకే నన్ను వెన్నుపోటు పొడిచిన స్నేహితులతో కూడా నేను మాట్లాడగలను, మరీ సన్నిహితం కాకుండా కాస్త జాగ్రత్తగా ఉంటాను అంతే.. ! ఈ స్టేజ్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటె ఇప్పుడు మనుషులు నా బలం, బలహీనత కాదు. అలాగే ప్రేమ కూడా..!
సాయి: భలే చెప్పారు, మీ ఆలోచనలు చాలా కాంటెంపరరీ గా ఉంటాయి.. అలాగే మీకు స్నేహితులు కూడా ఇరవై ఏళ్ళ వాళ్ళ నుండీ, ఎనభై ఏళ్ళ ఆ పై వాళ్ళు కూడా ఉన్నారు.. అలా ఎలా సాధ్యం?
కల్యాణి: హ్మ్మ్.. ఏమో.. వెనక్కి వెళ్తే, మా అమ్మకి పద్దెనిమిదేళ్ళప్పుడు పెళ్లి అయింది. ముఫై కి మేమందరం పుట్టేసాం.. నలుగురు పిల్లలు.. శారద కాస్తా శారదమ్మ అయింది.. నేను కల్యాణి అమ్మని కాలేదు..అందుకే యంగ్ గా ఉన్నానేమో (పెద్ద నవ్వు ).. కానీ, ఆలోచిస్తే.. నేను బలవంతపు అమ్మతనం తీసుకోలేదు. నా స్నేహితులలో చిన్నవాళ్ళకి కూడా నను కల్యాణి గారినే, కల్యాణమ్మని కాదు. అదే విధంగా చుట్టాలకి, పిల్లల వయసు వాళ్లకి కూడా.. మరీ దగ్గర వాళ్ళు ఆంటీ అంటారు, కల్యాణి టీచర్, మెంటార్, ఫ్రెండ్.. కాబట్టి, నాకు, నా స్నేహాలకి వయసుతో సంబంధం లేదు. నా బౌండరీ ని నేను పరిరక్షించుకుంటాను. ఎవరి కోసమో కాదు, నా కోసం.
సాయి: సూపర్ అండీ బాబూ.. మరీ భరించలేని బాధ వస్తే ఏం చేస్తారు?
కల్యాణి: డివైస్ ని ఫేక్టరీ రీ-సెట్ చేస్తాను.. నవ్వుతూ.. మొత్తం పలక చెరిపేస్తాను పద్మా.. ఎండుకంటే గజిబిజిగా ఉంటె ఇబ్బంది పడేది మనమే.. నేనొకటి గమనించాను.. మనసు రీ సెట్ చేసినప్పుడు.. మంచి జ్ఞాపకాలు కూడా చెరిగిపోతాయి, అది ఒక్కోసారి అయ్యో అనిపించినా.. వాటితో దుఖపు జ్ఞాపకాలు, రంగు కూడా వెళ్ళిపోయింది కదా అని సంతోష పడతాను.
సాయి: మళ్ళీ సాహిత్యానికి వస్తాను.. ఎలా ఉండాలంటారు? ఇంగ్లీష్ లో అంత బాగా రాయగలిగి ఉండి. మీరు తెలుగు అనువాదాలకి మాత్రమే ఎందుకు పరిమితం అయ్యారు?
కల్యాణి: సాహిత్యానికి కొలత, మీటర్ ఇలాగే ఉండాలి అని నేను చెప్పను గానీ, మనం అనుభవించలేని, స్పృశించలేని, ఎన్నో కోణాల సమాహారం సాహిత్యం. నావరకూ నాకు కన్నడ సాహిత్యం చాలా కొత్తగా ఉంటోంది.. చాలా ముందుకి వెళ్తున్నారు వాళ్ళు, క్లాసిక్స్ మాత్రమే కాదు కొన్ని కొత్త కథలూ , నవలలూ కూడా ఎన్నో నేర్పుతున్నాయి.. సంక్లిష్టమైన ఈ జీవితాలలోని కొన్ని విషయాలు సాహిత్యం ద్వారా తప్ప, వేరేగా తెలుసుకోలేం. ఉదాహరణకి, పబ్లిక్ లైఫ్ లో ఉన్న ప్రతీది మనకి జుద్జ్మెంటల్ గానే ఉంటుంది, కానీ ప్రైవేట్ లైఫ్ లో జరిగిన విషయాల నీడ దానివల్ల పబ్లిక్ లైఫ్ లో మనుషులు తీసుకొనే నిర్ణయాలు ఇవన్నీ మనకి కథల, ఇమేజరీ ద్వారానే అర్ధం అవుతాయి. అది వీలైనంత వరకూ, తెలుగులో అందివ్వాలని అనువాదం చేస్తున్నాను, నాకు వీలైనంత వరకూ. ఇకపోతే తెలుగులో రాయటానికి కారణం, రీచ్. తెలుగు పాఠకులు విశాఖ సముద్రంలాగే నాలో ఒక భాగం.
సాయి: అమ్మాయిలు/ఆడవాళ్ళు ఏం నేర్చుకోవాలి ?
కల్యాణి: అందరూ ఏం నేర్చుకోవాలో నేను చెప్పలేను గానీ .. నేను ఏం నేర్చుకున్నానో చెప్పగలను. నిర్మోహత్వం.. ఇది ఆధ్యాత్మిక పదం అనుకుంటారు అందరూ .Unattachment లేకపోతే ఏ పనీ సరిగ్గా ఆస్వాదించలేము, ప్రేమించలేము కూడా అన్న అర్ధంలో అంటున్నాను. ఈ నిర్మోహత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎలా ఉందంటే.. నేను మొదటిసారి, ఎనభైల చివర్లో, అమెరికా వెళ్లాను. అక్కడ ఎక్కువ నడవాలి కాబట్టి, చీరలో కష్టం అని చెప్తే రెండు పాంట్లు, షర్ట్స్ , బూట్లు కొన్నాము. మొదటిసారి బూట్లు బిగించి, ఎలా జాగ్రత్తగా నడవాలి అన్న స్పృహతో కాకుండా నడిచినపుడు నాకు గాల్లో తేలిపోతున్నట్టు ఉంది.. ఒకసారి ఆ సుఖం అలవాటు అయినప్పుడు, అర్ధం అయ్యాక , ప్రతీ క్షణం అదే అడ్వెంచర్ లో ఉన్నాను నేను.. నాకోసం నేను జీవించటం అనే అడ్వెంచర్.
సాయి: అమ్మాయిలకి/ఆడవాళ్ళకి ఏమన్నా చెప్తారా ?
కల్యాణి: అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకి, మనుషులు అందరికీ చెప్పేది ఒకటే. సెల్ఫిష్ నెస్/ సెల్ఫ్ కేర్ / సోల్ కేర్ .. ఇలా రకరకాలుగా చెప్పినా.. మన గురించి మనం అలోచించుకోవటం , మనం ప్రేమించే విషయం మనం చేయటం తప్పు కాదు. ఇతరులని మనం ఇబ్బంది పెట్టనంత వరకూ.. సెల్ఫిష్ నెస్ తప్పు అని ఎవరు చెప్పినా వినకండి. మళ్ళీ అదే చెప్తున్నా..నిర్మోహంగా జీవితాన్ని ప్రేమించండి.. !!
సాయి : కల్యాణి గారూ.. ఐ లవ్ యు.. మీకు బై చెప్పటం లేదు. ఈ కొన్ని కబుర్లు ఈ సమయం ఎంతో కరుణగా, ప్రేమగా నాకిచ్చారు. భలే సంతోషం.
ఉపసంహారం: ప్రేమకీ, కరుణకీ ఉపసంహారం లేదు..!!
బై
సాయి పద్మ
*****
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
“నాకోసం నేను జీవించటం అనే అడ్వెంచర్” అన్న మాట స్త్రీ లలో ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది.
ఆవిడ గురించి తెలుసు కానీ పరిచయం లేదనుకున్న తరుణం లో ఆవిడ fb లో నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు.
తరువాత నా ఫోన్ తీసుకుని కాల్ చేసి మాట్లాడారు. విజయవాడ రమ్మని చెప్పారు. నేను ప్లాన్ కూడా వేసుకున్నాను వెళ్ళాలనితెలిసింది. అంతలోనే ఆవిడ ఇక లేరని తెలిసింది. చాల బాధ కలిగింది.
గీత గారు ఇవేమనకు తరగని ఆస్తులు. ఇవన్నీ కూడా ఇలా అక్షరరూపం లో లేదా డిజిటల్ గా భద్రపరచడం వల్ల ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ధన్యవాదాలు