ఎనభైవ దశకంలో సావిత్రి అనే ఒక చిత్రకారిణి మద్రాస్ లో ఉండేది. ఆమె వృత్తి రీత్యా బ్యాంకు ఆఫీసర్. ఆమె హాబీ చిత్రకళ. ఆమె ప్రత్యేకత నగ్న చిత్రాలను గీయటం, ఆ నగ్న చిత్రాలు తనవే కావడం.
కొంత కాలం క్రితం వార్తలలోకి ఎక్కిన వ్యక్తీ – ఇంద్రాణి ముఖర్జీ. ఆమె తన సొంత కూతురిని అందరికీ చెల్లెలిగా పరిచయం చేసేది.
Tamara de Lempicka అనే సుప్రసిద్ధ చిత్రకారిణి సావిత్రి, ఇంద్రాణి చేసిన రెండు పనులూ చేసింది. ఆమె పోలాండ్ లో పుట్టింది, స్విట్జర్లాండ్ లో పెరిగింది, రష్యాలో మొదటి పెళ్ళి చేసుకుంది , మరెందరో ప్రేమికులతో అమెరికాలో గడిపింది, చెల్లెలు అని చెప్పుకునే తన ఏకైక కుమార్తె దగ్గర మెక్సికో లో తుది శ్వాస విడిచింది. ఆమె అందంలో క్లియోపాత్రాకు తీసిపోదంటారు. వార్సాలో అతనికన్నా అందమైన వాడు లేడని ఘనత వహించిన ఒక బికారిని పదహారు ఏళ్ళ వయసులోనే పెండ్లాడింది. సంవత్సరం తర్వాత మొగుడ్ని జైలులో పెడితే, అధికారులని లోబరచుకొని, అతడిని తప్పించి, అతనితో పారిస్ కు పారిపోయి తన తెలివితేటలను నిరూపించుకుంది. అక్కడ ఆర్ట్ లో శిక్షణ పొందింది.
ఆమె Art Deco శైలిలో చిత్రాలు వేసి పేరు తెచ్చుకుంది. శృంగారాన్నీ , దానికున్న శక్తి నీ ఆమె చిత్రాలు కనబరిచేవి. ఆమె వేసిన స్త్రీ-పురుషులు – బట్టలు వేసుకున్న, వేసుకోకపోయినా, అందంగా – ఆధునిక నగర జీవన నేపథ్యంలో – చిత్రించబడేవారు. ఫాషన్ షూట్ , ఫిల్మ్స్..లాంటివి ఎన్నిటినో ఆమె చిత్రాలు ప్రభావితం చేసాయి. యుద్ధ కాలంలో ఆమె చిత్రకారులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తల చిత్రాలు వేసేది, వారిలో చాలా మంది ఆమె ప్రేమికులే. రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక, ఆమె హాలీవుడ్ చేరింది, అక్కడ Star Painter అయింది, ప్రముఖ నటుల రూపచిత్రాలను చిత్రించింది. వయసు మీరాక, కూతురి దగ్గరకి చేరింది. ఆమె కోరినట్లే ( నెహ్రూ ఇంచు మించు ఇలాంటి కోరికను ముందే కోరారు) ఆమె చితాభస్మంను ఒక అగ్ని పర్వతం పైన జల్లారు.
ఆమె వేసిన ఈ తైలవర్ణ చిత్రం 1929 లో చిత్రించ బడింది, ఆధునిక చిత్రకళలో దీనికో ప్రత్యెక స్థానం ఉంది.