జీవితం అంచున -11 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి
శిశిరం వసంతం కోసం కాచుకున్నట్లు ఆరేసి రోజుల ఎదురు చూపుల తరువాత బుధవారం వచ్చేది. ఆరు రోజుల రొటీను నుండి ఇష్టమైన ఆహ్లాదకరమైన మార్పు.
ఆ ఇష్టమే రోటీనయితే మళ్ళీ అంత ఉత్సాహం వుండదేమో…
బుధవారం ఇంటి పని, వంట పనికి సెలవు.
ఆస్ట్రేలియాలో గ్రాసరీ షాపింగ్ చేయటం లేదా పిల్లలను దింపటం వరకేనా నా ఔటింగులు అని ఇంత వరకూ పడిన ఆవేదన ఇప్పుడు తీరింది. నా దగ్గరున్న రకరకాల ప్యాంటులు, అందమైన టీ షర్టుల ఉపయోగం కనబడింది.
కాలేజీకి యూనిఫారం లేదు. అమ్మాయి కొన్న ఖరీదయిన చొక్కాలకు రెక్కలు వచ్చాయి. బుధవారం నా వార్డ్ రోబ్ సందడి చేసేది.
కోర్సు పూర్తయ్యాక సంవత్సరాంతంలో జరిగే రెండు వారాల సిములేటెడ్ క్లినికల్ ల్యాబ్స్ కి, ఆ తరువాత ఆసుపత్రి లేదా వృద్ధాశ్రమాలలో జరిగే రెండు వారాల ప్లేస్మెంట్ కి యూనిఫారంతో పాటు కొన్ని పాటించాల్సిన నియమాలు వుంటాయిట.
ఎప్పుడెప్పుడు యూనిఫారం వేసుకుంటానాని మనసు ఉవ్విళ్ళూరుతోంది.
మొత్తం కోర్సులో పది యూనిట్స్ వున్నాయి. కోర్సు కాలాన్ని పది యూనిట్ల మధ్య విభజించిన టైం టేబుల్ ఇచ్చారు. యూనిట్స్ టైటిల్స్ చదువుతుంటే అసిస్టెంట్ నర్సింగ్ కోర్సుకే ఇంత విషయం వుంటే మరి నర్సింగ్ కోర్సుకి ఎంత వుంటుందో కదా అనిపించింది. చాలా ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్స్.
అన్నింటికన్నా నా మనసును చమరింతతో తట్టిన యూనిట్ “Facilitate empowerment of older people”… వృద్దుల సాధికారతను ఎలా సులభతరం చేయాలన్న అంశం పై బోలెడన్ని చాప్టర్స్. ఇంట్లో ఎనభయ్యేళ్ళు దాటిన అమ్మ వుండటంతో ఆ యూనిట్ కి బాగా కనెక్ట్ అయ్యాను. అసెస్మెంట్స్ లో విభిన్నమైన సినారియోలు ఇచ్చి, ఆ ఆ సందర్బాల్లో ఒక నర్సుగా నా ప్రతిస్పందన ఎలా వుంటుందో రాయమంటే ప్రతీ సినారియోలో అమ్మను ఊహించుకుంటూ ఎంత కలతపడి గుండె బరువెక్కిపోయి అసెస్మెంట్స్ రాసేదానినో.
మరో యూనిట్ “Work with diverse people”… ప్రతి వ్యక్తి ప్రత్యేకంగా ఉంటాడు. అది అర్థం చేసుకోవడం మరియు వారి వ్యక్తిగత వ్యత్యాసాలను గుర్తించడం. ఈ వ్యత్యాసాలు జాతి, మత, లింగం, లైంగిక ధోరణి, సామాజిక-ఆర్థిక స్థితి, వయస్సు, శారీరక సామర్థ్యాలు, మత విశ్వాసాలు, రాజకీయ విశ్వాసాలు లేదా ఇతర భావజాలాల కోణాలలో ఉండవచ్చు. ఇందులోని అంశాల్లో లింగం, లైంగిక ధోరణి పైన దిగ్భ్రాంతికర సమాచారం నన్ను స్తబ్దు పరిచాయి. సుధీర్గ ఆలోచనల్లోకి జారిపోయాను.
నేను నా “గొంతు విప్పిన గువ్వ” లో ‘స్వేచ్ఛ కోరిన సంస్కృతి’ అనే కథాంశంలో గే (gays) ల పట్ల, లెస్బియన్ల (lesbians) పట్ల నా అభిప్రాయాన్ని నిర్భయంగా ఖచ్చితంగా “స్వలింగ సంపర్కాలను ఆమోదించి గౌరవించటమే ఎదగటం అనుకుంటే నాకు ఎదగాలని లేదు” అని వెలిబుచ్చాను.
ఇప్పుడు నా దృష్టి కోణంలో మార్పు ప్రారంభమయ్యింది. స్వలింగ సంపర్కులను ఇక్కడి సమాజం అంగీకరించే తీరుని, అతి మామూలుగా తమతో కలుపుకునే విధానాన్ని చూసాక నా దృక్పథంలో పరివర్తన కలిగింది. నా ఆలోచనా ధోరణి, అభిప్రాయం మారింది. అప్పటి నా ఇరుకు ఆలోచనా పరిధులకు, సంకుచితత్వానికి ఇప్పుడు సిగ్గు పడుతున్నాను.
నన్ను మరింత కలవరపరిచిన మరో యూనిట్ “Work with people with mentalhealth”. మనం పచ్చిగా ‘పిచ్చి’ అనే పదం వాడే సందర్భాన్ని, ఇక్కడ మృదువుగా ‘మానసిక అస్వస్థత’ అనటం, మానసిక రోగులతో ప్రవర్తించాల్సిన సున్నితమైన తీరూ నన్ను ఆశ్చర్యపరిచింది.
మన మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి కొంత “నా సమయం” (metime) సహాయపడుతుంది. ఎవరు, ఎక్కడ, ఎలా బ్రతుకుతున్నప్పటికీ ప్రతిరోజూ తమ కోసం కొన్ని క్షణాలు కేటాయించుకోవటం సంతోషంగా మరింత దృడంగా వుండటానికి దోహద పడుతుంది. మానసిక శ్రేయస్సు అనేది మన భావోద్వేగాలను నిర్వహించడానికి, ఒత్తిడికి ప్రతిస్పందించటానికి, జీవితం పై మన సాధారణ దృక్పథాన్ని ప్రదర్శించే ఏకైక మార్గం. మానసిక శ్రేయస్సు మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది, క్లిష్ట పరిస్థితులలో స్థితి స్థాపకతను ప్రోత్సహిస్తుంది, జీవితం యొక్క ప్రయోజనాన్ని సాధించటంలో సహకరి స్తుంది.
మా కేట్ టీచర్ అంటారు “You deserve the best possible you..”. అది ఏంగ్సయిటీ, డిప్రెషన్ లను జయించినప్పుడే సాధ్యపడుతుంది అంటారు.
ఈ యూనిట్లో పారానాయిడ్ స్కీజోఫ్రోనియా, డెల్యూషన్స్ మైండ్, డెమెన్షియా, రిట్రోగ్రేడ్ అమ్నేసియా అంటూ అనేకానేక మానసిక స్థితులకు సంబంధించిన చాప్టర్స్ వున్నాయి. చదివే కొద్దీ, విభిన్నమైన సినారియోలు చూసే కొద్దీ నాలో ఉత్కంట పెరిగింది. అమ్మ మానసిక పరిస్థితి దిగజారటంతో ఈ యూనిట్ లో మరీ ఎక్కువగా లీనమయి పోయాను.
నన్ను సగం డాక్టరుని చేసేసిన యూనిట్ “Recognise HealthyBody Systems & Medical Terminology”. డాక్టరుని కాలేక పోయినందుకు మరోసారి బాధపడ్డాను. చిన్న పిల్లలా హుషారుగా బోలెడన్ని మెడికల్ అబ్రివియేషన్స్ (సంక్షిప్త పదాలు) భట్టీ కొట్టేశాను. నేనెప్పుడూ ఏకసంథాగ్రాహిని కాను. కష్ట జీవిని. ఈ యూనిట్ అసెస్మెంట్స్ లో నేనే క్లాస్ టాపర్ ని.
మిగతా యూనిట్లు Infection control, Assist with movement, Transport patients, Maintain highstandards of service, Provide FirstAid, Meet Personal Support Needs, Organise workpriorities వగైరాలు.
నేను నేర్చుకున్న ఒక్కో యూనిట్ గురించి ఒక్కో పుస్తకం రాయొచ్చు.
బుధవారాలు కాలేజీలో క్లాసులు, గురువారాలు జూమ్ క్లాసులతో పూర్తి స్థాయి విద్యార్థిని అయిపోయాను. కుటుంబ అవసరాలకు న్యాయం చేస్తూ, శ్రద్దగా అర్ధరాత్రుళ్ళ వరకూ దీక్షగా చదువుకుంటూ, కథలు, కవితలు, whatsapp, fb, Instagram లాంటి నా “metime” కి మాత్రం న్యాయం చేయ లేకపోయాను.
ఇంతలో ఇండియాలో అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని కబురు వచ్చింది. నాలో కలకలం మొదలయ్యింది.
*****
(సశేషం)