నా అంతరంగ తరంగాలు-10

-మన్నెం శారద

నాకు తెలిసిన జానకమ్మగారూ!
1992 లో నా టెలిసీరియల్ పనిమీద చెన్నై వెళ్తున్న నన్ను వీలు కుదిరితే తమ పత్రిక కోసం జానకమ్మ గారిని ఇంటర్వ్యూ చేయమని కోరారు మయూరి వారపత్రిక వారు. ఆ  పత్రిక కోసం నేను వివిధ రచయితలని చేసిన ఇంటర్వ్యూ లకు మంచి పేరు రావడంతో ఈ బాధ్యత నాకు అప్పగించారు.

          నేను చెన్నైలో నా పని చూసుకుని జానకి గారి ఫోన్ నంబర్ సేకరించి ఆమెకు ఫోన్ చేసాను.

          దానికి ముందు చిన్న ట్రయల్స్!

          అంత పెద్ద సీనియర్ నటితో మాట్లాడాలంటే భయం! కళ్ళలో కలెక్టర్ జానకి కనిపిస్తున్నది .

          ఫోన్ చుట్టూ మూడు ప్రద క్షిణలు చేసి మెల్లిగా ‘మేడం ‘ అన్నాను.

          “ఎవరమ్మా, ఎవరు కావాలీ?” అవతలి నుండి సదరు కంచు కంఠం మోగింది.

          నేను వివరాలు చెప్పి “మీ ఇంటర్వ్యూ కావాలి మేడం, “అన్నాను నసుగుతూ.
“ఓ, హైదరాబాద్ నుండి వచ్చారా? అయితే వెంటనే మా ఇంటికి రండి. నేను కాసేపట్లో నా హోటల్ కి వెళ్ళాలి ” అన్నారు సౌమ్యంగా.

          నేను ఆమె చెప్పిన ప్రకారం ఆటోలో వారిల్లు చేరుకున్నాను. అప్పటికే ఆమె గుమ్మంలో నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నారు.

          “రామ్మా రా !” అన్నారు నవ్వుతూ.

          దబ్బపండు ఛాయ, క్రాఫ్, కలంకారీ చూడీదార్ లో ఆమె చాలా సింపుల్ గా వున్నారు.
నేను నమస్కరించి ఆమెతో పాటూ ఇంట్లోకి నడిచాను.

          ‘జస్ట్ ఏ మినిట్ ‘అంటూ లోనికి వెళ్ళి నాకు ఆమె చేతుల్తో చేసిన ఫిల్టర్ కాఫీ, బిస్కెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు.

          ఈ లోపున ఆఁ ఇల్లు… ఇంటిపరి సరాలు పరిశీలించాను. ఇంటి ముందు చిన్నతోట. అందులో అన్నీ కూరగాయమోక్కలే.. అవి చూస్తుంటే వంటల పట్ల ఆమెకున్న ప్రీతిని తెలుపుతున్నాయ్. ఇల్లు పొందికగా ఒక పొదరిల్లుని స్పురింపజేస్తున్నది.

          అందులో ఆమే అమర్చిన ఇంటి తీరు ఫర్నిచర్, కర్టెన్స్.. ఇంటి గోడల రంగు.. ఆమెకు ఇంటీరియర్ డెకొరేషన్ మీద వున్న ఆసక్తిని తెలియజేస్తున్నాయి. ఆ మాటే నేనంటే “ఇంటీరియర్ డెకరేషన్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రతినెలా ఇంటి రూపు రేఖలు మార్చేస్తుంటాను ….గోడల రంగులతోసహా !”

          “సరే పద మనం వెళ్తూ మాట్లాడుకుందాం ” అన్నారు ఇంటికి తాళం వేసి కారులో స్టీరింగ్ దగ్గర కూర్చుంటూ .

          ఆమె అనర్గళంగా మాట్లాడుతున్నారు ….నేను వింటున్నాను. తొణుకు బెణుకు లేని కంఠస్వరం! ఏదన్నా దాయాలని, బడాయి మాటలు చెప్పాలనే తాపత్రయం లేని నిక్కచ్చి నిజాలు ఆమె నోట వెల్లువలా వస్తున్నాయి .

          ఎస్సెల్సీ వరకూ చదివారట !తండ్రి పేపర్స్ మిల్ లో చీఫ్ ఇంజనీర్ చేసేరట , వారివల్ల అనేక ప్రాంతాలు చూసారు , సాహిత్యం అంటే ఇష్టంతో తెలుగు ,ఇంగ్లీష్ సాహిత్యాన్ని బాగా చదివారట !

          ప్రేమపెళ్ళి! ఫెయిల్ అయ్యింది. ముగ్గురిపిల్లల్ని పోషించాలి, నా కంఠస్వరమే నాకు భుక్తిని పెట్టింది. ఆలిండియా రేడియోలో పని చేసాను. నాటకాలు వేసాను. ఇప్పటికీ వేస్తున్నాను, I am very much passionate to act on stage “అన్నారు నవ్వుతూ దారిలో ఏవో కొనుక్కోవాలని కారు ఆపి షాప్ లోకి వెళ్ళారు. కూడా నేనూ వెళ్ళాను .’సావుకారమ్మ సావుకారమ్మ’ అంటూ ఆ షాపతను లేచి నిలబడి! ‘వణక్కం”అన్నాడు వినయంగా.

          ఆమె ఏవో తీసుకుంటుంటే కొంత మంది పరిగెత్తుకొచ్చి ఆటోగ్రాఫ్ లు అడిగి తీసుకున్నారు .

          తిరిగి కారెక్కి స్టార్ట్ చేస్తూ “తమిళియన్స్ కి సినిమా నటులంటే పిచ్చి ఆరాధన, సీనియర్స్ ని కూడా మరచిపోరు. మనవారిలా కాదు ” అన్నారు నవ్వుతూ.

          “మీ ధైర్యం, అఛీవ్మెంట్ చాలా గొప్పవి “అన్నాను ఒకరకమైన ఆరాధనతో.

          “అదేం లేదు శారదా, I was forced to do all these things for the sake of bread! “అన్నారామె చిరునవ్వుతో.

          కారు ఆమె స్వయంగా నిర్వహిస్తున్న ఆమె హోటల్ ‘coconut grooves ‘కి చేరింది.
ఎంట్రన్స్ లోనే ఒక జంట తిరిగి వెళ్ళిపోవడం ఆమె కంట పడింది.

          జానకిగారు కారు ఆపి “ఎందుకు వెళ్ళిపోతున్నారు?” అని అడిగారు.

          “తాళి (భోజనం) ఇంకా తయారవ్వలేదటండి, అందుకే వెళ్ళిపోతున్నాం ” అని జవాబిచ్చారు ఆ దంపతులు.

          అందులో ఆమె గర్భవతి.

          జానకిగారు నొచ్చుకుంటూ “నేను పది నిముషాల్లో వండి పెడతాను లోపలికి రండి ” అని చాలా ప్రాధేయపడ్డారు. అయినా వాళ్ళు వేరే పని ఉందని వెళ్ళిపోయారు.

          అంతే! జానకి గారు మొహం ఎర్రబడిపోయింది. కారు దిగగానే అపరకాళి లా కిచెన్ లోకి ప్రవేశించి కుక్ లందర్నీ చెడా మడా తిట్టేశారు.

          ఆ తర్వాత వెంటనే కూల్ అయి “సారీ శారదా, వీళ్ళకెంత నిర్లక్ష్యమో చూడు… ఒక కస్టమర్ వెళ్ళిపోయిందని కాదు నా బాధ… ఆమె కడుపుతో వున్నారు. అలాంటి ఆమెకు భోజనం పెట్టకుండా పంపారు. అందుకే ఈ రోజు నేను పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టను “అని శపధం చేసి చేతికున్న ఉంగరాలు తీసి పక్కన పెట్టి వంటపనిలోకి దిగేరు.

          నేను అక్కడే కుర్చీలో కూర్చున్నాను. పెద్ద పెద్ద డేగిసాల్లో పెద్ద పెద్ద మంటల క్రింద ఆమె చికెన్, క్రాబ్స్ తదితర శాకాహారా మాంసాహారా వంటల్ని గరిట తిప్పుతూ వండేస్తుంటే నేనలా నిశ్చేష్టగా చూస్తూ కూర్చున్నాను.

          పనిలో వున్నా నన్ను ఏ మాత్రం విస్మరించలేదు. ఒక కూల్ డ్రింక్ తెప్పించి ఇచ్చారు.

          “వంటలు ఎంత అద్భుతంగా అలవోకగా చేసేస్తున్నారూ !”అన్నాను మెచ్చుకోలుగా

          “వంట చేయడం ఒక ఆర్ట్! ఆహారం వలనే కదా ఆరోగ్యం ,,,,దాన్ని నేను తు .చ తప్పకుండా పాటిస్తాను. అందుకే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా లాంటి మొక్కలు పెంచడానికే ప్రాధన్యత ఇస్తాను. అన్నట్లూ నువ్వు టీవీ ఛానెల్స్ లో వంటలు చేసే ప్రోగ్రామ్స్ ఎప్పుడయినా చూసేవా ?”అని అడిగారు నవ్వుతూ .

          “ఎప్పుడయినా మేడం !” అన్నాను .

          ఆమె పకపకా నవ్వుతూ “చాలా వరకూ చదువుకున్నవారే ఈ వంటల ప్రోగ్రామ్స్ చెబుతుంటారు. కానీ మోచేతులదాకా మెహందీ, వేళ్ళ నిండా ఉంగరాలూ .,పొడవాటి గోళ్ళు పెంచి వాటికి రంగులూ …ఎంత బాక్టీరియా ఫారం అయివుంటుంది వాటిలో ….ఈ విషయాన్ని ఎందుకు గ్రహించరో అని బాధ కలుగుతుంది ” అన్నారు విచారంగా.

          ఇంతలో ఆమె పెద్ద కూతురు యజ్ఞప్రభ అక్కడకి వచ్చారు. జానకి గారు ఏదో విషయం మీద కాస్త కోపం గానే మాట్లాడారు.. ఆమె మౌనంగా వెళ్ళిపోయారు. ఆమె నా వైపు తిరిగి “మనంత అయినవాళ్ళు ప్రతిదానికి మనమీద ఆధారపడటం నాకు నచ్చదు శారదా!”అన్నారు బాధగా.

          మాటల్లోనే ఆరు దాటింది.

          “ఇంతకీ నువ్వు నన్నేమీ అడగనే లేదు. ‘అన్నారు నవ్వుతూ..

          మాట్లాడకుండానే మీ గురించి చాలా తెలిసింది “

          “తెలివైనదానివే!”

          “అనే అనుకుంటారు మేడం! లౌక్యం తెలియక చాలా పోగొట్టుకున్నాను. “అన్నాను నేనూ నవ్వుతూ.

          “కళాకారులకి అది శాపం ” అన్నారామె నిట్టూరుస్తూ. ఆమె నన్ను డ్రాప్ చేస్తూ “రేపు దీపావళి కదా! మన హోటల్లో పార్టీ ఉంటుంది అందరికీ, సాయంత్రం తప్పకుండా రా, వస్తావుగా!” అన్నారు.

          “Sure, వస్తాను మేడం!” అన్నాను నవ్వుతూ.

          నిజానికి ఆమెను మరోసారి కలవాలనే నాకూ వుంది.

          మర్నాడు సాయంత్రం అయిదు గంటలకే నేను కోకోనట్ గ్రూవ్స్ కి చేరుకున్నాను.
ముందు రోజు నేను ఆ హోటల్ని సరిగ్గా గమనించలేదు గానీ జిగ్జాగ్ గా ఎర్రటి గొడుగు ల్లాంటి కుటీరాలు, నల్ల రంగు పిల్లర్స్, వాటిలో హరికేన్ లైట్స్, స్థంబాల చుట్టూ పామ్ ట్రీస్.. అంతా చైనీస్ స్టయిల్ లో చూపర్లని ఎంతగానో ఆకర్షించే విధంగా వుంది.

          ఆమె అప్పటికే ఒక చోట కూర్చుని నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఆమె తయారు ఎంతో ప్రత్యేకం!

          పింక్ బోర్డర్, ఉన్న రాయల్ బ్లూ బిన్నీ జార్జెట్ చీర ఆమే తెల్లటి వంటి మీద మెరిసి పోతుంది. వాలుజడ వేసుకుని జాజీపూలు పెట్టుకున్నారు. వజ్రాల బుట్ట లోలకులు అదే మ్యాచింగ్ నెక్లేస్ ఆమెకు ఏ మాత్రం ఏసగా లేవు. ఆ అందం ఆమె శరీరానిదా… ఆమెలోని జ్ఞానానిదా…’ఆలోచిస్తుండగానే “ఏంటి.. నువ్వు పండుగ పూట ఇలా సాదా సీదాగా ఉన్నావ్?” అని అడిగారు.

          నేను నవ్వి నాకంత తయారు మీద ఇంటరెస్ట్ వుండదండీ “అన్నాను.

          “నో నో, ఆడవాళ్ళు చక్కగా తయారవ్వాలి, ఎప్పుడూ కళ కళ లాడుతూ ఉండాలి. మనజీవితం మనది. అది దేవుడిచ్చిన వరం. దాన్ని దుఃఖపెట్టె అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు. “అన్నారు

          ఎంతో తెలిసినామె… ఎన్నో చూసినామె.. చెబుతుంటే వినడమే నా వంతయింది.

          కృష్ణ కుమారిగారి గురించి అడిగాను.

          చాలా హాయిగా , సుఖంగా వుంది. ఎప్పటి నుండో ఆమెనే ప్రేమిస్తూ, ఆరాధిస్తూ ఎదురు చూసిన వ్యక్తి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. MTR మసాలా ప్రొడక్ట్స్ వాళ్ళవే. “అని చెప్పేరు.

          కాసేపు ప్రేమలూ, పెళ్లిళ్ళ గురించి మాట్లాడేరు. ఆమె మొహం కాసేపు సీరియస్ అయ్యింది.

          “మగవాడి ప్రేమ అంతా ట్రాష్ శారదా, అంతా అవసరార్ధం. స్త్రీ ప్రేమిస్తే అతనికోసం సర్వం వదులుకుంటుంది. నిజానికి స్త్రీ ప్రేమకు అర్హుడయినా మగవాడు లేడు”అన్నారు కొంచెం ఆవేశంగా. ఏవో అనుభవాల నుండి వచ్చిన మాటలవి.

          రచనలగురించి అడిగాను

          ” కొందరు చాలా బాగా రాస్తారు. అన్నీ వీలుని బట్టి చదువుతుంటాను. కంఫర్ట్ జోన్ లో ఉండి రాసే రచనల్లో లైఫ్ వుండదు. వారికి అనేక విషయాలు తెలియవు. గడప దాటి బయటకొచ్చిన వారికి వుండే సమస్యలు వారి ఊహకి కూడా అందవు. అందులో సినిమా రంగంలో బాధలు మరీ ఎక్కువ. వీళ్ళకు ఏడవడానికి కూడా వుండదు. నిద్రలేకపోయినా , ఏడ్చినా మర్నాడు షూటింగ్ కూడా పనికి రారు.”అన్నారు వేదనగా.

          వారిమీద వచ్చే పుకార్ల గురించి అడిగాను.

          ఆమె నవ్వి “అవి రాసేవారు మా గుమ్మం దాకా కాదు.. మా వీధిలోకి కూడా వచ్చిన రకాలు కాదు. ఏం చేస్తాం.. పోనీలే అలా బ్రతికిపోతున్నారని వదిలేయడమే!”అన్నారు.

          టాపిక్ సావిత్రి గారి మీదకు మళ్ళింది.

          సావిత్రి గారి పేరు వినగానే ఆమె మొహం మ్లానమయ్యింది.

          “సావిత్రి అలా ఎందుకు చేసుకుందో అర్ధం కాదు. నిజానికి నా కన్నా కష్టాలు పడలేదు తను. రాగానే సూపర్ స్టార్ అయ్యింది తను. నిజానికి దేవదాసులో మొదట నన్ను బుక్ చేశారు. ఆ తర్వాత ఎందుకో నన్ను తీసేసి సావిత్రిని బుక్ చేశారు. ఒక గొప్ప అద్భుతమైన నటి వచ్చినందుకు మేమంతా సంతోషించాం. అద్భుతమైన అభినయం, చక్కటి రూపురేఖలు చెప్పలేని ఐశ్వర్యం… ప్చ్… ” చాలా విషాదం “అన్నారు.

          అలా ఆ సాయంత్రం ఆ అద్భుతమైన వ్యక్తిత్వం, చదువు, విజ్ఞానం, ధైర్యం ఉన్న మహా నటితో ఆహ్లాదంగా గడిచింది.

          ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్బంగా ఆమె నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా వుండాలని మనసారా కోరుకుంటూ.. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు తున్నాను. 

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.