మిట్ట మధ్యాహ్నపు మరణం- 26

– గౌరీ కృపానందన్

          రాకేష్ చాలా సాధారణంగానే ఆ ప్రశ్న అడిగాడు. కళ్ళల్లో మాత్రం కొంచం తీవ్రత కనబడింది. ఏమాత్రమూ ఆలోచించకుండా,“పోలీసులా? మీరు ఏం చెబుతున్నారు రాకేష్? పోలీసులు ఎందుకు రావాలి?” అంది.

          “ఏమీ తెలియనట్లు బుకాయించకు ఉమా.”

          “మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు రాకేష్. కాస్త విడమరిచి చెబితే బాగా ఉంటుంది.”

          “ఈ రోజు సాయంత్రం టెలిగ్రాం వచ్చిందే. దాన్ని చదవలేదా?”

          “మీరేగా దాన్ని చదివి వేరే ఎవరికో వచ్చిందని చెప్పారు. ఏమైయ్యింది రాకేష్? కమాన్… ఏదో మనసులో ఉంచుకుని డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు. అవుట్ విత్ ఇట్. ఏం అడగాలనుకుంటున్నారో, సూటిగా అడగండి.”

          “అలాగైతే ఆ షాపుకి అంత అర్జంటుగా ఎందుకు వెళ్ళావు?”

          “ఏ షాపుకి? అర్జంటు ఏమిటి? మై గాడ్! ఆర్ వి గోయింగ్ ఇన్ టు దట్ అగైన్? మా అత్తగారిని గుడి నుంచి పిలుచుకుని రావాలని వెళ్ళాను. మీకేమైంది? మరీ అనుమానిస్తు న్నట్లు ప్రశ్నిస్తున్నారు?”

          “కాఫీ తాగాక, ఇంకొక కాఫీ తాగాలని ఇక్కడే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు?”

          “మీతో ఇంకాస్సేపు గడపాలన్న కోరికతో. అది తప్పా? తప్పే అయితే మా ఇంటికి రండి. అక్కడ మాట్లాడుకుందాం.”

          ఇప్పుడు అతని కళ్ళలో విరోధం కనబడలేదు. మెల్లిగా పెదవుల పై చిరునవ్వు విరిసింది.

          “ఉమా! ఇప్పుడే నా మనసు కాస్త తేట పడింది. నీ దగ్గర ఒక విషయం చెప్పి తీరాలి. పోలీసులు నన్ను అనుమానిస్తున్నారని అనుకుంటున్నాను.”

          “దేనికీ అనుమానం?”

          “మూర్తిని నేను హత్య చేశానని.”

          ఉమ నవ్వింది.“అబ్సర్డ్! మీరా? ఎవరు చెప్పారు? పోలీసులు మిమ్మల్ని ఎంక్వయిరీ చేశారా? మీరే ఊహించుకుంటున్నారా?”

          “లేదు ఉమా! నాకు బెంగళూరులో జరుగుతున్నదంతా తెలుసు. పోలీసులతో జాగ్రత్తగా ఉండాలి.”

          “అవును ఇలాంటి అసంబద్దమైన నిర్ణయాలకి వచ్చి, అందరినీ తిప్పలు పెడతారు. అందులోని ఇది వాళ్ళ అసంబద్దతకు శిఖరంలాంటిది. మీరు మూర్తిని హత్య చేశారని అనుమానిస్తున్నారా? తరువాత ఇంకా ఎవరి మీద అనుమానం ఉందట? నా మీదా? నన్ను కూడా అనుమానిస్తున్నారా?” అంది ఉమ.

          “అంటే నువ్వు నమ్మలేదా ఉమా?”

          “దేన్నయినా నమ్మడానికి కొంచమైనా నిజం ఉండాలిగా రాకేష్. మూర్తి ఎలా పోతే నాకెందుకు? బ్రతికి ఉన్న నన్నుచూడండి.”

          ఇప్పుడు అతని అనుమానం తొలిగిపోయినట్లుగా కనిపించాడు.

          “ఆ టెలిగ్రాములో కూడా నా గురించి ఏదో చెడుగానే ఉంది.”

          “మీరు తప్పుగా అర్థం చేసుకున్నారా. దాన్ని చదివినా వెంటనే నమ్మి ఉంటానని అనుకున్నారా మీరు? ఎలా అనుకోగలిగారు అలా?”

          రాకేష్ మరింత ఉద్వేగంతో కరిగిపోయిన మనసుతో,“ఉమా!” అన్నాడు. ఆమె చేతిని పట్టుకుని తన చెంపల మీద ఆనించుకున్నాడు. ఉమ అభ్యంతరం చెప్పలేదు. ఆమె చెంపలను చేతితో స్పృశించాడు.

          ఎవరైనా ఆ కాగితం ముక్కను చదివారా? దాన్ని పారేయకుండా పోలీసులకు ఫోన్ చేసి ఉంటారా? ఎంత సేపు? ఎంత సేపు ఇతడిని ఇలా భరిస్తూ, ఇక్కడ ఆపగలను? త్వరగా పోలీసులు వస్తే బాగుండును.

          (ఆమెవ్రాసి ఇచ్చిన కాగితం ముక్క యాభై రూపాయల నోటు మడతతో సహా సర్వర్ గల్లా పెట్టె దగ్గర ఉన్న యజమాని ముందు ఉంచాడు. బిల్లును చూస్తూ ఆయన నోటును తీస్తున్నపుడు ఆ కాగితం ముక్క క్రింద పడి పోయింది.)

          రాకేష్అన్నాడు.“ఉమా! ఏ రోజయినా నీకు నా కధను చెప్పి తీరుతాను. దాన్ని విని తట్టుకునే ధృడమైన మనస్సు  నీకు ఉన్నదని నాకు నిర్దారణ అయిన తరువాత.”

          ఇప్పుడు ఆ ఏ.సి. గదిలో వీళ్ళిద్దరూ తప్ప ఎవరూ లేరు.

          “ఉమా! నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా?”

          “ఇది పబ్లిక్ ప్లేస్ ప్లీజ్.”

          “చేతి మీద ముద్దు పెట్టుకోనా?”

          “సరే.”

          అతని పెదవులు మృదువుగా, మెత్తగా ఉన్నాయి.

          “మన పెళ్ళి అయ్యి, పిల్లలు పుట్టాక, మనవలు పుట్టాక, ఏ రోజు పూర్తిగా నీ దగ్గర చెబితే, నువ్వు తట్టుకోగలవో ఆ రోజు అంతా నీ దగ్గర చెప్పేస్తాను. ఆ రోజే…”

          “ఈ రోజే చెప్పండి.”

          ఎలాగైనా సమయం గడపాలి. ఎలాగైనా సంబాషణను పొడిగించాలి.

          “ఈ రోజు ఎంత వరకు చెప్పడానికి వీలవుతుందో, అంత వరకు చెప్పండి. కానీ ఏదైనా చెబుతూనే ఉండండి.”

          “నన్ను చూస్తే నీకు ఏమని అనిపిస్తోంది ఉమా?”

          “ఏమని అనిపిస్తోందా? అందరి లాగా మీరూ ఒక మనిషి.”

          (క్రింద పడిన కాగితం ముక్కని గల్లా పక్కన టేబిల్ దగ్గర కాఫీ తాగుతున్న వ్యక్తి గమనించాడు.“అయ్యా! ఏదో పేపరు క్రింద పడింది” అంటూ దాన్ని తీసి యజమాని దగ్గర ఇవ్వగా….)

          “ఉమా! నా లాగా ఒంటరి తనాన్ని అనుభవించిన వాళ్ళు ఈ లోకంలో ఎవరూ ఉండరు. ఆరోఏడు వచ్చినప్పటి నుంచి నేను హాస్టల్లో, నాన్న గారు జర్మనీలో ఉండే వాళ్ళం. ఎప్పుడూ బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉండే వారు.”

          “మీ అమ్మ గారు?” ఉమ అడిగింది.

          కానీ మనసులోనే తిట్టుకుంది. ఇతని అమ్మ ఎలా పోతే నాకేం? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండీ. ఇతని చేతోలో ఆయుధం ఏమైనా ఉందేమో?

          “మా అమ్మ. నా వరకు ఒకే ఒక ఒక ఫోటో మాత్రమే. ఆమె బ్రతికుండగా చూసినట్లు నాకు జ్ఞాపకం లేదు. నా రెండో ఏట, గుర్తు తెలియక ముందే ఆమె చనిపోయింది. ఆమె ఫోటో మాత్రమే నా దగ్గర ఉంది. చూస్తే నువ్వు ఆశ్చర్య పడతావు.”

          (గల్లాలో ఉన్నతను ఆ కాగితంలో వ్రాసి ఉన్న దాన్ని చదివి అర్థం కాక మరోసారి చదివాడు. “దీన్నిఎవరు పెట్టారయ్యా?”)

          “దేన్నిసార్?”

          “రెండు కాఫీలు. ఎనిమిది రూపాయలు బిల్లు.“

          “మేడ మీద ఏ.సి. గదిలో సార్.”)

          ఉమ ఆ ఫోటోను  కొంచెం సేపు చూసింది. చాలా ఏళ్ళుగా పర్సులోనే ఉన్న కారణం వల్ల కాస్త పాత బడింది. అమ్మ అని చెప్పలేం. ఫోటోలో చాలా చిన్న వయస్సులా కనిపించింది.

          ఉమ దాన్ని అతని చేతికి తిరిగి ఇచ్చింది.“చాలా అందంగా ఉన్నారు.”

          “ఫోటోను సరిగ్గా చూశావా?” అడిగాడురాకేష్.

          “ఎందుకు?”

          “మా అమ్మ ఎవరిలా ఉందో చూశావా?”

          “ఎవరిలాగానా? ఇటు ఇవ్వండి. మరో సారి చూస్తాను.”

          రాకేష్ చిరునవ్వుతో మళ్ళీ చూపించాడు. ఎక్కడో చూసిన ముఖంలాగే అనిపిం చింది.

          “ఎవరిలాగా ఉంది తను?”

          “ఆలోచించండి. నీకు చాలా బాగా తెలిసిన, పరిచయమైన ముఖం ఇది.”

          మళ్ళీ ఫోటోను నిశితంగా చూసింది. చూసి ఉలిక్కి పడింది.“ఓ మై గాడ్! ఇదినాలాగే ఉంది. పోలికలు ఉన్నాయి.”

          (పోలీసు కంట్రోలు రూమ్ లో ఫోన్ మోగింది.)

          (“సార్! నాపేరు ప్రసాద్. మైలాపూరు నుంచి మాట్లాడుతున్నాను. న్యూ శారదా రెస్టారెంట్ మేనేజర్ని. ఇక్కడ విచిత్రమైన ఒక చీటీ దొరికింది. మేడ మీది ఏ.సి. రూమ్ లో ఒక అమ్మాయి, అబ్బాయి కాఫీ త్రాగారు. ఆ అమ్మాయి ఒక నోట్ వ్రాసి యాభై రూపాయిల నోటు మడతలో పెట్టి పంపింది.”)

          “ఓ మై గాడ్! నమ్మశక్యం కావడం లేదు. చాలా పోలికలు కనబడుతున్నాయి.”

          “ఇప్పుడైనా అర్థం అయ్యిందా ఉమా? నీ మీద నాకు అంత ప్రేమ ఏర్పడడానికి కారణం? నువ్వు రూపంలో మా అమ్మలాగే ఉన్నావు. అచ్చు అలాగే. మా అమ్మే మరో జన్మ ఎత్తి వచ్చినట్లు.”

          (“ఏం పేరు చెప్పారు?”)

          “ఉమామూర్తి అని సంతకం ఉంది. చూస్తే ఇద్దరూ చిన్నవయస్సులాగానే ఉన్నారు. ఇదేదో ఆకతాయి పని కూడా అయి ఉండవచ్చు.”

          “లేదండీ. ఉమామూర్తి కేసు మాకు పూర్తిగా తెలుసు. బెంగళూరులో ఎంక్వయిరీ చేస్తున్నారు. రాకేష్ అనే వ్యక్తి కనబడితే వెంటనే అరెస్ట్ చేయమని మాకు మెసేజ్ ఇచ్చారు. మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మేము వెంటనే బయలు దేరి వస్తున్నాము. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారా?”)

          “మా అమ్మని నేను కోల్పోయినపుడు నాకు ఏమీ తెలియని వయస్సు. ఆమెను ఫోటో లోనే చూసుకున్నాను. నిన్నుమొదటిసారి క్రికెట్ మ్యాచ్ లో చూసినప్పుడు షాక్ తగిలినట్లు అయ్యింది. ఆ తరువాత నాకు అంతానువ్వే. సోఫకిల్స్ ఎప్పుడైనా చదివారా?’

          “ఇడిప్పస్ రెక్స్.”

          “ఫరవాలేదే. చదివారే” అన్నాడు రాకేష్ నవ్వుతూ.

          ఉమ మౌనంగా ఉండి పోయింది. ఆ కాగితం ముక్క ఎక్కడో పడిపోయి ఉంటుంది. లేకపోతే ఈ పాటికివచ్చి ఉండరా?

          “దానికీ దీనికీ ఏం సంబంధం?” ఉమ అడిగింది.

          “ఉంది ఉమా! అందులో విధివశాత్తూ కొడుకు తల్లినే పెళ్ళి చేసుకుంటాడు. ఇక్కడ కూడా విధిప్రకారం కొడుకు తల్లి పోలికలు ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడు.”

          “ఎప్పుడు పెళ్ళి?” ఉమ అంది.

          “ఈ రోజు రాత్రే.”

          “జోక్ చేయకండి. నా దుఃఖం కొంచమైనా పోవాలంటే ఇంకా కొన్ని రోజులైనా గడవాలి.”

***

          మాధవరావు ఫోన్ తీసుకున్నారు.“హలో రాజపాండియన్! ఏమిటి విషయం? చెప్పండి.”

          “ మీరు వెతుకుతున్న పక్షి! రాకేష్ ఇక్కడే ఉన్నాడు.”

          “మీరు పట్టుకున్నారా?”

          “లేదు. ఒక హోటల్లో ఆ అమ్మాయి ఉమతో ఉన్నట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే హోటల్ కి బయలు దేరుతున్నాను. కేసు సాలిడ్ గానే ఉంది కదా?”

          “ఏమిటి అలా అంటున్నారు? అతడే హంతకుడు. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. ఇంతకీ అతనేనని ఖచ్చితంగా తెలిసిందా?”

          “ఆ అమ్మాయి ట్రిక్ గా ఒక నోట్ పంపించింది. చదువుతాను వినండి.“అర్జంట్! చాలా అర్జంట్! నేను ఒక హంతకుడి దగ్గర చిక్కుకున్నాను… ఉమామూర్తి.”

          “అతనే… ముమ్మాటికీ అతనే. రాజ పాండియన్! వెంటనే అరెస్ట్ చేయండి.”

          “మా స్టేట్ లో ఈ  కేసులేదు మరి.”

          “అవన్నీ తరువాత చూసుకుందాం. మీ సహకారం కావాలి మాకు. ప్రొసీజర్స్ నేను వచ్చి చూసుకుంటాను.”

          “వెంటనే వస్తున్నారా?”

          “ఇప్పుడు గంట 6:45 అయ్యింది.  ఆరున్నరకి ఒక ఫ్లైట్ ఉంది. నేరుగా ఎయిర్ పోర్ట్ కి వెళతాను. ఆ ఫ్లైట్ కనక డిలే అయితే వచ్చేస్తాను. లేకపోతే రాత్రికి రాత్రే కారులో వచ్చేస్తాను. పాండియన్! కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. తొందర పడవద్దు. అతను కొంచెం వయలెంట్ గా ప్రవర్తించవచ్చు.”

          “మీరు వర్రీ కాకండి. కోడిపిల్లను గంపతో కప్పెసినట్లు కప్పేస్తాం. మీరు వచ్చి చార్జ్ తీసుకుని అతన్ని తీసుకు వెళితే సరే.”

***

          “మీ అమ్మను చూసిన జ్ఞాపకమే లేదా మీకు?’

          “ఇదిగో… ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా ఉమా. వెళదామా.”

          “ఉండండి రాకేష్! మీతో మాట్లాడుతూ ఉంటే చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది.”

          అతని కళ్ళు ఆమెను అనుమానంగా చూశాయి.

          “అంతే కాదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే, మీతో మాట్లాడుతూ ఉంటే ఒక రిలీఫ్! ఎప్పుడూ అత్తగారి ముఖాన్ని చూస్తూ ఉంటే పాత సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. మిమ్మల్ని చూస్తే…”

          “నన్ను చూస్తే?”

          “భవిష్యత్తు కనబడుతోంది. నమ్మకం వస్తోంది.”

          “ఎవరూ లేరు కదా ఉమా. ఇంకాస్త దగ్గరగా కూర్చోనా?”

          “అంత సాన్నిహిత్యం మన మధ్య ఇంకా ఏర్పడ లేదనుకుంటాను.”

          “మనం ఇద్దరం సన్నిహితులమే. ఈ క్షణంనించి నీ విధి, నా విధి కలిసి ఒకే బాటలో పయనిస్తున్నాయి. ఇంకా ఎందుకు మనం వేరు వేరుగా ఉండాలి. ఎందుకు ఉమా? నాతో వచ్చేయి. ఈ రోజు నుంచి నువ్వూ నేను భార్యా భర్తలం. రాత్రే హనీమూన్ సెలెబ్రేట్ చేసుకుందాం. చెప్పు ఉమా. ఎక్కడికి వెళదాం?”

          “మరీ అంత స్పీడ్ కూడదు రాకేష్.”

          రాకేష్ ఆమెకి దగ్గరగా జరిగాడు. ఆమె కాస్త ఎడంగా జరిగింది. రాకేష్ కూర్చున్న కుర్చీకి ఎదురుగా కిటికీ ఉంది. ఏ.సి. గది అవడం వల్ల గాజు తలుపులు బిగించి ఉన్నాయి. బైటి నుంచి శబ్దం ఏ మాత్రమూ వినపడదు. రాకేష్ కళ్ళకి సైలంట్ మూవీ లాగా వీధిలో వచ్చీ పోయే జనం కనబడుతున్నారు. పోలీస్ జీప్ వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక పోలీసు అధికారి దిగారు. ఆయన తన క్రాఫ్ ను చేసుకుంటూ ఉండగా హోటల్ మేనేజర్ దగ్గిరికి వచ్చి ఏదో చెబుతూ పై అంతస్థు వైపు చెయ్యి చూపించడం అన్నీ చూశాడు.

          “ఏమిటి చూస్తున్నారు రాకేష్?”

          “వాళ్ళు వచ్చేశారు.” చిరునవ్వుతో అన్నాడు రాకేష్.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.