రాత్రి పుట్టపర్తికి వెంకటసుబ్బయ్య ఇంట్లోనే పడక.
బాగా అలసిపోయిన పుటపర్తి స్వామి భోజనం తరువాత మంచం మీద అలా వాలీ వాలగానే నిద్రలోకి జారుకున్నారు. పక్కనే కూర్చుని విసన కర్రతో వారికి గాలితగిలేలా మెల్లగా విసురుతున్న వెంకటసుబ్బయ్యకు వీరు రేపేగదా మళ్ళీ కడపకు వెళ్ళిపోతారన్న సంగతి గుర్తుకు వచ్చి, ఏదో వెలితి ఏర్పడబోతున్నదన్న భావం కలిగింది.
ఊహూ..కాకూడదు. ఈ సరస్వతీపుత్రునితో తన పరిచయమిక్కడే ముగియ కూడదు. జీవితాంతం కొనసాగాలి, దీనికి తానేమైనా చెయ్యాలి. ఎలా? అని ఆలోచనలో పడ్డాడు.
ఆలోచనల్లోనే తెల్లవారటం, పుట్టపర్తిని తిరిగి కడపకు బస్సెక్కించే సమయమూ అయ్యింది. వెంకటసుబ్బయ్య బస్సెక్కించి సెలవు తీసుకుంటూ ఉంటే పుట్టపర్తి ఆప్యాయంగా తలమీద చేయిపెట్టి ఆశీర్వదించి అన్నారు, ‘బాగా చదువుకోవలె! ప్రాచీనమూ, ఆధునికమూ – అన్నీ!ఇంగ్లీషూ బాగ చదువు. అక్కడెన్నెన్నో ప్రయోగాలు చేశారు కవిత్వంలో! అన్నీ చదివితే గానీ, నీ మార్గమేమిటో నిర్ధారించుకోలేవు. అన్ని కాలాల్లోనూ మంచీ చెడూ అన్నీ ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోవడంలోనే నీ బుద్ధి కుశలత పనిచేస్తుంది. ఇంకా చిన్న వయసే కదా! ఇంకా చాలా సమయముందిలే! ఒక వేళ రాయాలనుకున్నావనుకో, కలానికి పని చెప్పేముందు నువ్వు చెప్పే విషయం మీద నీకెంత పట్టూ ఉందో సరిగ్గా అంచనా వేసుకోవలె! అప్పుడే ఆ రచన నిలబడుతుంది! ఇంక పోయిరాలే! బస్సు బయలుదేరుతున్నట్టుంది.’ వెంకటసుబ్బయ్య వంగి పాదాలకు నమస్కరించాడు. కాసేపటికి బస్సు బయలుదేరింది.
***
మళ్ళీ ఇంటికి చేరుకున్న వెంటనే, అక్కడిచ్చిన డబ్బు తన శ్రీమతి కనకమ్మకు అందజేసి, మళ్ళీ తన లోకంలోకి వెళ్ళిపోయారు పుట్టపర్తి.
మిద్దె మీద తన గదిలోకి వెళ్ళి, అక్కడ కింద తాను అలవాటుగా కూర్చునే చోట కరణం బల్ల దగ్గరికి జరుపుకుని కూర్చున్నారాయన. కుడి వైపు చేతికి దగ్గరగా అమర్చు కున్న చిన్న బుక్ రాక్ లోని పుస్తకాలు చూస్తున్నారు, సంగీతానికి సంబంధించిన పుస్తకాలూ, తాను స్వంత దస్తూరీలో వ్రాసుకున్న జతులూ, తిల్లానాలూ, అన్నమయ్య కృతులూ! సంగీతాన్ని తలచుకుంటే, మనసు హరివిల్లైపోతుంది తనకు! అసలు సంగీతాన్నే తన ప్రధాన అంశంగా తీసుకుని ఉంటే, యీ పాటికి తాను పెద్ద విద్వాంసుడై పోయి ఉండేవాడేమో! ఈ సాహిత్యంలో ఎంతకీ తీరని దాహం! ఎన్ని భాషలు …ఎంత సాహిత్యం, ఎన్ని వైవిధ్యాలు! అన్నిటికీ మించి పైకి రావటానికెన్నో అవాంతరాలు. ఈర్ష్యాసూయలు! ప్రాంతీయాభిమానాలు ! పైగా రాయలసీమ ఒక చీకటి ఖండమని ఉత్తరాది వాళ్ళకు చులకన. ఇక్కడివాళ్ళెవరికీ పొట్ట కోస్తే అక్షరం ముక్క ఉండదనీ, అందరూ నిరక్షర కుక్షులేననీ వాళ్ళ విశ్వాసం. వీలైనప్పుడల్లా చులకనగా చూడటం వాళ్ళ అలవాటు. కనీసం సంగీతానికి ఇటు వంటి ఎల్లలు లేవు ప్రస్తుతానికి. కాకపోతే తమిళులకున్నంత సంగీతాభిమానం తెలుగు వాళ్ళలో కనిపించదు. త్యాగరాజును వాళ్ళు సొంతం చేసేసుకున్నారెప్పుడో! కనీసం అన్నమయ్యనైనా మనవాడిగా చెప్పుకు నేంతగా ఆయన సాహిత్యాన్ని పైకి తీసుకుని వస్తే, సీమ గౌరవం నిలబడుతుంది.’ పుట్టపర్తి దృష్టి వరసాగ్గా పేర్చుకున్న అన్నమయ్య సంకీర్తనా సాహిత్యం వైపుకు మళ్ళింది.
1936 లో ప్రచురితమైన తాళ్ళపాక కవుల కీర్తనలు రెండవ భాగం పలుకరించింది. రావు బహద్దూర్ సీతారామా రెడ్డి గారు ప్రకాశకులు. అప్పట్లో వారు దేవస్థానం కమిషనర్. విజయ రాఘవాచార్యులు గారు, ఆదినారాయణ నాయుడు గారలు సంపాదకులు. పుటలు తిరగేస్తూ వెళ్తున్నారాయన. సాళంగ నాట రాగంలో ఒక కృతి దగ్గర దృష్టి ఆగింది.
శునక శుకరాదులు సుకమంది పొందినట్టు
ఘనము గానక మరి కస్తూరాయెను నేడు..
చూడగానే తెలిసిపోయింది అచ్చు తప్పు దొర్లిందని. వెంటనే దిద్దారు తన బుక్ లో ఇలా.
శునక సూకరాదులు సుకమంది పొందినట్టు
ఘనము గానక మరి కస్తూరాయెను నేడు..
ఆ తరువాత చరణాల్లోనూ చిన్న చిన్న తప్పులు సరిజేసి ఒకసారి చదువుకుంటే అన్నమయ్య పదకవితా పితామహుడెలా అయ్యాడో అవగతమైపోతుందెవరికైనా!శునకము (కుక్క) సూకరము (పంది) సుఖాన్నెలా పొందుతాయో, అలాగే నాకూ యీ ప్రాపంచిక సుఖమనే మసే కస్తూరయింది కదా!! బ్రహ్మానందమంటే అసలెరుగని వాడిని నేను. కాబట్టి యీ పాపపు హేయమైన బ్రతుకే సుఖమన్న భ్రాంతి కలుగుతుంది. శ్రీహరి భక్తి చాయలనెరుగని వాడనుగాన ఇక్కడి కర్మములే (పనులే) గొప్పవిగా అనిపిస్తాయి. నా అజ్ఞనాన్ని నమ్మని వాడిని కదా, అందుకే యీ మాయపు సంసారమంటే ఎంతో మరులు. శ్రీవేంకటేశుని ధ్యానం అసలు చేయను కనుక దేవతల ఊసే లేదు. కానీ ఆయనే నన్ను మన్నించి నన్నీ విధంగా పుట్టించాడు కనుక, ఈ జన్మ ఎంతో పావనము నాకు!’
ఇంకా పుటలు తిరగేస్తూ వెల్తుంటే, బౌళి రాగ కీర్తన దగ్గర దృష్టి ఆగిపోయింది. అసలు పల్లవే వింతగా కొత్తగా ఉంది.
అనుచు రావణసేనలటు భ్రమయుచు వీగె
ఇనకుల చంద్ర నేడిదిగో నీ మహిమ ..
ఆ పదం చదువుతూ ఉంటే నవ్వే వచ్చింది పుట్టపర్తికి.
దదదద దదదద దశరథ తనయా
కదిశితింగ కకకకావలె
అదే వచ్చె బాణాలు హానాథహానాథ
పదపద పదపద పరరో పవుజులు..
రాముని సైన్యాన్ని ఎదుర్కొనలేక రావణుని సైన్యం తత్తరపాటును పదాల్లో పలికిం చిన వైనం అద్భుతం. మాటలు పలకటానికీ తడుముకోవలసి వస్తూంది పాపం ఆ సైన్యం లోని వాళ్ళకు! మమ్ము మన్నించండి కపులారా! సమరాన చావకుండా రక్షించండి!మేము కూడా మీవారమే! మీకు మొక్కుతున్నాము చూడండి. లంకకు వేరే దిక్కేలేదు. ఎక్కడా దాక్కునేందుకే లేదు. స్రీ వేంకటగిరి రఘునాథుడే మా ఏలుబడి ఇంక!’ ఈ మాటలు చెప్పేందుకే ఎంత తత్తరపాటో, ఎన్ని నత్తి మాటలో! ఒక్క అన్నమయ్యకే ఇటు వంటి ప్రయోగం చేయటం సాధ్యం’.
మరికొన్ని పుటలు తిరగేసి, తృప్తిగా ఆ పుస్తకాన్ని మూసి, వేరే పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నారాయన. తాను స్వీయ దస్తూరీలో వ్రాసుకున్న సంస్కృత, ఆంగ్ల, తమిళ, మలయాళ పదకోశాలు పలకరించాయి.
కేరళలో తను పని చేసింది కొద్ది సంవత్సరాలే ఐనా, అక్కడి విలక్షణ సంస్కృతి చాలా ఆకట్టుకుంది తనను! మలయాళం చాలా వరకూ సంస్కృత పదాలతో నిండి ఉంటుంది. కొద్దిగా కర్త, కర్మ, క్రియాపదాలూ, వ్యాకరణాంశాలు ఒంటబట్టించుకుంటే మెల్లి మెల్లిగా భాష అర్థమౌతుంది. అదీ కాక ఆ భాష వాడకంలోని ఒక తూగు చాలా నచ్చుతుంది తనకు! సాహిత్యపరంగా కూడా విలక్షణ వైఖరుల సమాహారం. మళయాళ సాహిత్యంలో చంద్రోత్సవం కావ్యంలోని మణిప్రవాళ శైలి గురించి భారతికి చక్కటి వ్యాసం వ్రాశాడు తాను. ఇక కథాకళి నృత్యరీతుల గురించి చాలా వివరణాత్మక వ్యాసం భారతిలోనే వచ్చింది. అతి చిత్రమైనదీ నృత్య శైలి. వాళ్ళ మేకప్ కే కొన్ని గంటలు తీసుకుంటారు. ఇక హావభావ ప్రదర్శన సంగతి అద్భుతం. నూనె దీపాల వెలుగులో బయలాట పద్ధతిలో కొన్ని గంటల పాటు సాగే యీ నృత్యం, భారతీయ నృత్యాల్లో తలమానికమనవచ్చు. అన్నట్టు మళయాళం నుండీ కొన్ని నాటకాలనూ తెలుగులోకీ, బూర్గులవారి కోరిక మీద విశ్వనాథ ఏకవీరనూ మలయాళంలోకీ అనువదించటమైంది. ఇంతకూ తన కావ్య రచన సంగతేమిటి?’ ఆలోచనలు ఇటుమళ్ళే సరికి తాను మొదలు పెట్టిన రామాయణంగుర్తుకు వచ్చింది పుట్టపర్తి వారికి!
*****
(సశేషం)