“కలిసుందామా!” కథా సంపుటి పై సమీక్ష

– శృంగవరపు రచన

 

          ఎన్నోసార్లు సమాజం మనిషిని అనేక రూపాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. వ్యక్తి గా సమాజంలో భాగం అయ్యే మనిషి తన జీవితంలో సమాజ ప్రభావం వల్ల సంతోషం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉందని గమనించిన నాడు ఆ సమాజాన్ని లెక్క చేయకుండా బ్రతికితే తన జీవితం బాగుంటుందన్న భావనలో ఉంటాడు.అనేక సామాజిక సమస్యలు తలెత్తినప్పుడు మనిషి వాటిని ఎదుర్కునే క్రమంలో ఈ పద్ధతినే అవలంబించాడు. కానీ వ్యక్తికి సమాజాన్ని ఎదురీదే శక్తి ఎంత ఉన్నది అన్నదే ఆ అది దీర్ఘ కాలంలో ఆశయంగా నిలుస్తుందో లేకపోతే ఆ వ్యక్తిని సమాజమే మూకుమ్మడిగా నిర్వీర్యుడు అయ్యేలా చేస్తుందో అన్న విషయాన్ని నిర్ణయిస్తుంది. ఆ సమాజంలో పురుషుడితో సమానంగా స్త్రీ కూడా గుర్తింపు పొందుతున్నా స్త్రీ కూడా అనేక సందర్భాల్లో తన జీవితాన్ని, అలవాట్లను, అభిరుచులను, ఆలోచనలను ప్రశ్నిస్తూ, వాటి మీద తన జడ్జ్ మెంట్స్ ద్వారా  నియంత్రించే  విధానాన్ని గుర్తించిన క్రమంలో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్న తపనలో పురుషుడితో సంబంధాన్ని కేవలం ఇష్టం తప్ప బాధ్యత లేని పద్ధతిలో నిశ్చయించుకుంటూ, దానిలో తన వ్యక్తిత్వ ఉనికి నిలబడిన సంతృప్తిని పొందే ప్రయత్నం చేస్తున్న సంస్కృతి కొంత నేడు ప్రబలి ఉంది. దాన్ని సహజీవనమని అనుకున్నా, సన్నిహితులైన వారిపై హక్కులను ఆశించే మనస్తత్వాన్ని వీడలేని సగటు భారతీయ తత్వాన్ని అవలంబించే ఎందరో స్త్రీలు నేడు అటు స్వేచ్చను అనుభవించ లేక, ఇటు ఏమి పట్టనట్టు ఉండలేని మనస్తత్వాన్ని వదలలేని ఊగిసలాటలో నేటి స్త్రీలు అనుభవించే కష్టాలను గురించి ఎంతో సున్నితంగా లలితా వర్మ గారు తన ‘కలిసుందామా?’ నవలలో స్పష్టం చేశారు.
 
          “సంప్రదాయాలను సదాచారాలను అర్ధం చేసుకుని ఆచరించండి. వాటిని దురాచారాలుగా మార్చకండి. విసిగిపోయిన నేటి యువత విదేశీ పోకడలలో పడకుండా చూడండి. దేశకాల పరిస్థితులను బట్టి సనాతన ధర్మాలను బట్టి ఏర్పడిన సంస్కృతీ సాంప్రదాయాలు ఏ దేశీయులకైనా ఆచరణీయాలే. అలా కాదని పరులను అనుకరిస్తే అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుంటుంది” అని రచయిత్రి ఈ నవల ముందు మాటలో ఈ నవలా ఉద్దేశ్యాన్ని స్పష్టం చేశారు.
 
          ఈ నవలలో ముఖ్య పాత్రలు మధులత, అశ్విన్ ,పలక్, కవితా బహేటి, వనజ. వనజ బాల్యం నుండే తన కాబోయే భర్త అందం గురించి కలల్లో బ్రతికింది. అందానికి ప్రాధాన్య త ఇచ్చి తల్లిదండ్రులు, తోబుట్టువుల మాటను కాదని అందగాడు అయ్యి బాధ్యత లేని వ్యక్తిని వివాహం చేసుకుంది. తర్వాత ఆ భర్త బాధ్యతారాహిత్యం, అత్త పెట్టే కష్టాల వల్ల ఎన్నో బాధలు అనుభవించి, కుటుంబాన్ని తానే పోషిస్తూ ఉన్న క్రమంలో ఆమె భర్త మరణించడంతో కూతురు మధులత, కొడుకు భరత్ బాధ్యతలు తాను ఒక్కడే చూసు కోవాల్సిన భారం ఆమె పై పడుతుంది. ఆ క్రమంలో ఆమె తాను వివాహ విషయంలో చేసింది తప్పని గ్రహిస్తుంది. ఇక్కడ వనజ తన ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వడం అన్నది ఆమె ఇష్టానికే తప్ప ఆమెలో లోతైన ఆలోచనల వల్ల కలిగింది కాదు. పిల్లలను పెంచే క్రమంలో తన తోబుట్టువుల సహకారంతో తన పిల్లలు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిర పడేలా చేయగలిగింది. ఇక్కడ వనజ తనకు సమాజం తోడుగా ఉండటం వల్ల తాను తప్పు చేసినా తన జీవితాన్ని చక్కదిద్దుకోవటంలో తోడ్పడిందని అర్ధం చేసుకుంది. దానికి కారణం ఆమెది వివాహ బంధం కనుక. వివాహ బంధం సమాజం ధృఢపరుస్తుంది అందుకే ఆ బంధం మీద గౌరవం వల్ల సమాజం వనజ కూడా ఆ బంధాన్ని గౌరవించడం వల్ల, ఆ అభిప్రాయంలోని సామీప్యత వల్ల వనజకు సమాజం అండగా ఉంది.
 
          తల్లి జీవితాన్ని చూసిన మధులత ఆర్థికంగా స్థిరపడటం వల్ల భర్తతో వచ్చే అభిప్రాయ భేదాలు, ఆ బంధం ఎలా ఉంటుందో తెలియకుండానే కట్నం-వివాహం జరిపే క్రమంలో లక్షలు ఖర్చు పెట్టడం, ఆ తర్వాత భర్తతో బాధలు ఉన్నా భరించాల్సి రావడం వంటి వాటి వల్ల వివాహం పట్ల విముఖత పెంచుకుంది. అందుకనే అదే భావాలు ఉన్న అశ్విన్ తో సహజీవనం చేయడానికి నిశ్చయించుకుని, తల్లికి ఇష్టం లేకపోయినా ఆమె అతనితో సహజీవనం చేస్తుంది.
 
          సహజీవనం వల్ల ఒకరి మీద ఒకరి అనవసర పెత్తనాలు ఉండవని, ఎవరి స్వేచ్చ వారికి ఉంటుందని భావించిన ఈ జంట ఆ అభిప్రాయ సామీప్యత వల్లే కలుస్తారు. మధులత పైకి సహజీవనం మీద మక్కువ ఏర్పరచుకోవడానికి ప్రధాన కారణం తల్లి జీవితాన్ని చూడటం వల్ల  కావచ్చు.స్త్రీ అంటే వివాహ బంధంలో రాజీ పడకూడదు అన్న భావనతో ఆమె వివాహం మీద విముఖత పెంచుకుని ఉండవచ్చు. అలా విముఖత ఆమెలో కలిగినా తను ప్రేమించిన వ్యక్తి మీద తన హక్కును మాత్రం వదులుకునే స్థితిలో లేదు. అందువల్లే అశ్విన్ ఎప్పుడైతే తన కొలీగ్ ను తన బండి పై ఎక్కించుకోవడం చూసిందో అప్పుడే అతన్ని అనుమానించింది. తెలియకుండానే అతని పట్ల తనకు హక్కు ఉన్నట్టు భావించింది.
 
          మధులత సహజీవనం చేయడం వల్ల వనజ బంధువుల్లో అవమానించబడటం అన్న అంశాన్ని రచయిత్రి స్పష్టం చేయడానికి కారణం కూడా, సమాజాన్ని ఎదురీది వెళ్ళే క్రమంలో తలెత్తే సోషల్ ఐసోలేషన్ ను, సోషల్ క్రిటిసిజంను ఊహించి, ఆ దాడిని ఎదిరించే ధైర్యంతో ముందుకు సాగాలే తప్ప సమాజంలో ఉంటూ సమాజానికి దూరంగా బ్రతకడం వల్ల తాము చేసే పని పట్ల తమకే ఎక్కడో తెలియకుండా ఉన్న అనుమానాన్ని స్పష్టం చేస్తుంది. మధులత స్నేహితురాలు పలక్ కూడా ప్రేమించిన వాడిని వివాహం చేసుకుని బాధలు పడటం కూడా మధులత తన జీవితం పట్ల స్పష్టత తెచ్చుకోవడానికే అయ్యి ఉండవచ్చు. అలాగే అశ్విన్ మీద తాను పెంచుకున్న పొసెసివ్ నెస్ వల్ల అతన్ని అనుమానించడం కూడా మధులతలో వివాహాన్ని ధిక్కరించే స్వభావం కేవలంఅందులో వచ్చే బాధల నుండి తప్పుకోవడానికే తప్ప దాని వల్ల వచ్చే భద్రత, ప్రేమ, అనుబంధా లను వదులుకునే తత్వం మాత్రం లేదు. చివరకు కవితా బహెటిలో ఉన్న నిస్వార్ధ ప్రేమ కోణాన్ని, భర్త మరణించినా, అత్తామామలను, భర్త తమ్ముడిలా ఆదరించిన వ్యక్తిని కూడా తన కుటుంబంలా భావించి, వారందరి బాధ్యతా తీసుకోవడం మధులతను, అశ్విన్ ను ప్రభావితం చేస్తాయి.
 
          ఆన్ సైట్ ప్రాజెక్ట్ మీద మూడు నెలలు అమెరికా వెళ్ళిన మధులత అక్కడ అమెరికన్ రిచార్డ్ భారతీయురాలిని వివాహం చేసుకోవడం, భారతీయ వివాహ పద్ధతిని, అందులో ఉన్న ఆచారాలని అర్ధం చేసుకుని ఆచరించడం, మధులతకు వివాహం పట్ల దృక్కోణాన్ని మారుస్తుంది. ఆమెకు వివాహం  పట్ల విముఖత  తల్లి జీవితం వల్ల కలిగితే , ఆ అభిప్రాయంలో మార్పు రావడానికి రిచార్డ్  దంపతుల పాత్రలను నిర్మించడం వల్ల వివాహం గొప్పదన్న అంశాన్ని పిడివాదంగా కాకుండా, అర్ధవంతంగా ఋజువు చేశారు.
 
          వివాహం ఎంత గొప్పది అయినా, కాల క్రమంలో ఆ వివాహ ఉద్దేశ్యాలను వ్యక్తులు తమ స్వార్ధానికి మార్చుకుంటూ, దాని అర్ధాన్ని ఓ పవిత్ర బంధం నుండి వ్యాపారంగా మార్చడం వల్ల, నేటి యువత అసహనానికి గురవుతూ, తమ జీవితాన్ని నాశనం చేసుకు నే క్రమాన్ని రచయిత్రి ఈ నవలలో స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. వివాహమనే  సదాచారం నేడు కొందరికి దురాచారంగా మారడం అన్నది వ్యక్తుల స్వార్ధం వల్లే తప్ప, ఆ బంధం వల్ల కాదని రచయిత్రి ఈ నవల ద్వారా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఓ సున్నిత అంశాన్ని సూటిగా, స్పష్టంగా రాసిన రచయిత్రికి అభినంద నలు.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.